
చండీగఢ్ : పంజాబ్ వ్యవహారాల్లో తలదూర్చరాదని, కోవిడ్-19 వ్యాప్తిపై తమ రాష్ట్ర ప్రజల్లో అపోహలు పెంచడం మానుకోవాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ హెచ్చరించారు. కరోనా వైరస్‌తో తాము పోరాడుతున్న సమయంలో సరిహద్దు రాష్ట్రంలో సమస్యలు సృష్టించేందుకు భారత వ్యతిరేక శక్తులు చేస్తున్న కుట్రలో పావుగా మారవద్దని హితవు పలికారు. పంజాబ్‌కు సంబంధించి కేజ్రీవాల్ చేసిన ప్రకటనలు పంజాబ్ ప్రజలను తప్పుదారిపట్టించే భారీ కుట్రలో ఆప్ పాత్రపై సందేహాలు కలిగిస్తున్నాయని సింగ్ ఆరోపించారు. కోవిడ్-19పై నకిలీ వీడియోను వ్యాప్తి చేస్తూ అరెస్ట్ అయిన ఆప్ కార్యకర్తకు ఎవరెవరితో సంబంధాలున్నాయో నిగ్గుతేల్చాలని అమరీందర్ సింగ్ పంజాబ్ డీజీపీని ఆదేశించారు.
గ్రామాల్లో నివసించే ప్రజల ఆక్సిజన్ స్ధాయిలను పరీక్షించాలని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల పంజాబ్‌లో తమ పార్టీ కార్యకర్తలను కోరారు. ఇక పంజాబ్‌లో కోవిడ్-19పై తప్పుదారిపట్టించే రెచ్చగొట్టే నకిలీ వీడియోలు వ్యాప్తి చెందడం కలకలం రేగింది. వీటిలో ఒక వీడియో పాకిస్తాన్ నుంచి వ్యాప్తి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు. ఆప్ కార్యకర్త ఒకరు ఈ వీడియోను పంజాబ్‌లో విస్తృతంగా వ్యాప్తి చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఓ మృతదేహంతో కూడిన ఈ నకిలీ వీడియోను వ్యాప్తి చేయడంపై ఇటీవల పట్టుబడ్డ ఆప్ కార్యకర్తను పంజాబ్ పోలీసులు ప్రశ్నిస్తున్నాయి. మరణించిన కోవిడ్-19 రోగుల అవయవాలను పంజాబ్ ఆరోగ్య శాఖ తొలగిస్తోందనే రీతిలో రూపొందిన ఈ నకిలీ వీడియో ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment