పరమ్‌జిత్ కౌర్
ఆమ్ ఆద్మీ పార్టీలో మరో సంక్షోభం ఏర్పడింది. ఢిల్లీ ఎమ్మెల్యే దేవీందర్ సెహ్రావత్‌పై ఆప్ పంజాబ్ మహిళా విభాగం అధ్యక్షురాలు బల్జీందర్ కౌర్ రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన రాష్ట్రంలో మహిళలను అవమానిస్తున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల కోసం పంజాబ్‌లో టికెట్లు ఇప్పిస్తామంటూ కొందరు మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని సెహ్రావత్ ఇటీవలే పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు లేఖ రాశారు. దీంతో ఈసారి ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న కౌర్ నేతృత్వంలోని బృందం పంజాబ్ మహిళా కమిషన్ అధ్యక్షురాలు పరమ్‌జిత్ కౌర్ లంద్రాను కలిసి సెహ్రావత్‌పై ఫిర్యాదు చేశారు. సెహ్రావత్ లేఖ చూసి తాము చాలా బాధపడ్డామని, పంజాబీ మహిళల పరువు గంగలో కలిపేందుకే ఆయనిలా అంటున్నారని చెప్పారు.
ఆధారాలు ఏమీ లేకుండానే సెహ్రావత్ ఇలా అభాండాలు వేయడం తగదని అన్నారు. కల్నల్ సెహ్రావత్‌కు ఏదో ఒక వంకతో ఆప్ నేతలను విమర్శించే అలవాటు ఉందని బల్జీందర్ కౌర్ అన్నారు. పార్టీ సీనియర్ నాయకులు సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్ అనే ఇద్దరు మహిళలకు టికెట్లు ఇప్పిస్తామని చెప్పి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు కల్నల్ సెహ్రావత్ తన లేఖలో పేర్కొన్నారని పరమ్‌జిత్ కౌర్ అన్నారు. ఆయన చేసిన ఆరోపణల ఆధారంగా.. పంజాబ్ డీజీపీకి కూడా లేఖ రాసినట్లు ఆమె తెలిపారు.