
చండీగఢ్ : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ అకాలీదళ్ నేతకు క్షమాపణలు చెప్పడంపై పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ శాఖ ఖండించింది. ఈ చర్యతో కేజ్రీవాల్ బలహీనుడయ్యాడని ఆ రాష్ట్ర ఆప్ అధికారి ప్రతినిధి సుఖ్‌పాల్ సింగ్ ఖైరా అభిప్రాయపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..
‘అకాలీదళ్ నేత బిక్రం సింగ్ మజితియాను కేజ్రీవాల్ క్షమాపణలు కోరాడాన్ని పంజాబ్ ఆప్ శాఖ తీవ్రంగా ఖండిస్తోంది. రాష్ట్ర నేతలను సంప్రదించకుండా కేజ్రీవాల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో ఆయన మరింత బలహీనమయ్యారు. అంతే కాకుండా ఆకాలీదల్ నేతలకు ప్రశ్నలతో ఎదురు దాడి చేసే అవకాశమిచ్చారు. మాకు పంజాబ్ ప్రజల శ్రేయస్సే ముఖ్యమని’ ఖైరా పేర్కొన్నారు.
బిక్రం సింగ్ మజితియాపై వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వ స్పెషల్ టాస్క్ ఫోర్స్ హైకోర్టుకు పక్కా ఆధారలను సమర్పించిదని, అయినా కేజ్రీవాల్ క్షమాపణలు తెలపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
ఇప్పటికే పంజాబ్ ఆప్ పార్టీ చీఫ్, ఎంపీ భగవంత్ మన్ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక డ్రగ్స్ మాఫియాలో అకాళీ దళ్ నేత బిక్రం సింగ్ మజితియా హస్తం ఉందంటూ ఆరోపణలు చేసిన కేజ్రీవాల్, పరువు నష్టం దావా వేయడంతో ఆయనకు క్షమాపణలు తెలుపుతూ లేఖ రాసాడు. దీనిపై పంజాబ్ ఆప్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.