విద్యార్థి విభాగాన్ని ప్రారంభించిన ఆప్
న్యూఢిల్లీ: గత అసెంబ్లీ ఎన్నికల్లో పురుడు పోసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి ఇప్పటిదాకా విద్యార్థి విభాగమంటూ ఏదీ లేదు. కాగా శుక్రవారం ఛాత్రా యువ సంఘర్ష్ సమితి(సీవైఎస్‌ఎస్) పేరుతో ఆప్ విద్యార్థి విభాగాన్ని ఏర్పా టు చేసింది. దేశంలోని విద్యావ్యవస్థలో పెరిగిపోతున్న వివక్షపూరిత వాతావరణాన్ని రూపుమాపేం దుకు, విద్యావ్యవస్థలో మార్పు తెచ్చేందుకు సీవైఎస్‌ఎస్ పోరాడుతుందని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
విద్యార్థుల మధ్య ధ్వేషభావాన్ని రూపుమాపి స్నేహపూర్వక వాతావరణాన్ని పెంపొందించేందుకు సీవైఎస్‌ఎస్ కృషి చేస్తుందన్నారు. కులతత్వానికి వ్యతిరేకంగా సీవైఎస్‌ఎస్ పోరాడుతుందని, రాజకీయాల్లో కులం, ముఠాల సంప్రదాయాలకు విరుద్ధంగా పోరాటాన్ని కొనసాగిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి, ఎన్నికలకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీపై నమ్మకముంచిన ప్రజలు తొలి ప్రయత్నంలోనే పట్టం కట్టారని, విద్యార్థి విభాగం కూడా అదే లక్ష్యంతో ముందుకెళ్తుందని, విద్యార్థుల విశ్వాసాన్ని చూరగొంటుందని కేజ్రీవాల్ ఆశాభావం వ్యక్తం చేశారు.