కాంగ్రెస్, బీజేపీలకు కేజ్రీవాల్ ప్రశ్నాస్త్రాలు
ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆమ్ ఆద్మీ పార్టీకి సంపూర్ణ మద్దతు ఇస్తామన్ని ప్రకటించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం లేఖాస్త్రం సంధించారు. సామాన్య పౌరుడిని దృష్టిలో ఉంచుకుని 18 అంశాలతో కూడిన లేఖను శనివారం ఆ రెండు పార్టీల అధ్యక్షులు సోనియా, రాజ్నాథ్ సింగ్లకు లేఖలు రాశారు. ఆ లేఖలోని వివరాలు...దేశరాజధాని న్యూఢిల్లీలో విఐపీ సంస్కృతికి చరమగీతం పాడాలని డిమాండ్ చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు...తదితరులు ఎర్రబుగ్గ కారులు ఉపయోగించ కూడదని, అలాగే పెద్ద పెద్ద అధికార భవనాలు వారికి కేటాయించరాదని ఆ కోరారు. వీటితోపాటు విఐపిలకు కల్పిస్తున్న ప్రత్యేక భద్రతను తొలగించాలని వారికి సూచించారు.
సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కొరినట్లు జనలోక్పాల్ యథాతథంగా ఆమోదించాలని కోరారు.నగరంలోని కాలనీల్లో మోహల్లా సభలు ఏర్పాటు చేసి, ప్రతి కాలనీలల్లో ఆ సభలు నిర్వహించాలని అన్నారు. ఢిల్లీ స్వయంప్రతిపత్తి కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వ పరిధిలోని ఢిల్లీ అభివృద్ధి సంస్థ, పోలీసు వ్యవస్థను న్యూఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాలన్నారు. అలాగే దేశ రాజధానిలోని పలు ప్రవేట్ విద్యుత్ సంస్థలల్లో ప్రత్యేక ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆ సంస్థలల్లో అక్రమాలు వెలుగులోకి వస్తే ఆ సంస్థల గుర్తింపును రద్దు చేయాలని చెప్పారు.
నగరంలోని ప్రతి ఇంట్లో ఉన్న విద్యుత్ మీటర్లను తనిఖీ చేయాలని సూచించారు. ప్రతి రోజూ కనీసం ఓ వ్యక్తికి 220 లీటర్ల మంచినీరు అందజేయాలని చెప్పారు. నగరంలోని పలు కాలనీలను ప్రభుత్వం ఇప్పటికి క్రమబద్దీకరించలేదని, వాటిని వెంటనే క్రమబద్దీకరించాలని ఆయన డిమాండ్ చేశారు.నగరంలోని పలు మురికివాడల్లో నివసిస్తున్నవారికి పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. ఇప్పటికే వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని బీజేపీ, కాంగ్రెస్ వాగ్దానం చేసిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్న ఉద్యోగస్థుల ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని, అలాగే మౌలిక సదుపాయాలను కూడా మొరుగు పరచాలని ఆయన సూచించారు.
రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పన్నుల ప్రవేశానికి తాము వ్యతిరేకమని స్పష్టం చేసింది. న్యూఢిల్లీ పరిధిలోని గ్రామాల్లో నివసించే రైతులకు సబ్సీడీ ఇవ్వాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.ప్రవేట్ పాఠశాల్లో ఫీజులు వసూలు చేస్తున్న వ్యవస్థను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలన్నారు. మెరుగైన వైద్య సదుపాయాలతో ప్రభుత్వ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలన్నారు. మహిళల కోసం ప్రత్యేక భద్రత యూనిట్లను ఏర్పాటు చేసి, మహిళలపై జరుగుతున్న దాడులపై కేసులు నమోదు చేయాలని, మూడు నెలల్లో కేసులు పరిష్కరించాలన్నారు. మరిన్ని కోర్టులను ఏర్పాటు చేసి ఆరు నెలల్లో కేసులు పరిష్కరించేలా న్యాయవ్యవస్థను కొత్త పుంతలు తొక్కించాలన్నారు.