‘ఆప్‌ను అంతం చేయాలని చూస్తోంది’
న్యూఢిల్లీ: ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి భారతీయ జనతా పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీని అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఢిల్లీలో అధికారంలో ఉన్నా తమ పార్టీ కార్యాలయం కేటాయింపును రద్దు చేశారన్నారు. కాంగ్రెస్‌కు ఐదు ఆఫీసులు, ఒక ప్లాటు ఉన్నాయని, అలాగే బీజేపీకి ఏడు కార్యాలయాలు, ఒక ప్లాటు ఉందని కేజ్రీవాల్ అన్నారు.
అదే ఆప్‌కు ఇచ్చిన ఒకే ఒక్క ఆఫీసును రద్దు చేశారని మండిపడ్డారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని, కార్యాలయం కోసం అడుక్కోమని, ఢిల్లీ వీధుల్లో కూర్చుని అయినా పని చేస్తామని ఆయన అన్నారు. కాగా ఢిల్లీలో ఆప్ కార్యాలయాన్ని సాధ్యమైనంత త్వరగా ఖాళీచేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజాల్ కేజ్రీవాల్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.
తమ ఆఫీస్ ఖాళీ చేయాలని ఆదేశాలు ఇవ్వడం అన్యాయమన్న కేజ్రీవాల్, ఆప్‌కు కార్యాలయం కలిగి ఉండటానికి హక్కు ఉందన్నారు. అదే కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఒక్క సీటు కూడా గెలవలేదని, అలాంటి ఆ పార్టీకి ఇక్కడ అయిదు కార్యాలయాలు ఉన్నాయని కేజ్రీవాల్ ఈ సందర్భంగా ప్రశ్నించారు.
అయితే 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో 67 స్థానాలు గెలుచుకున్న పార్టీకి కార్యాలయం లేకపోవడం దారుణమన్నారు. ఆప్ చేసిన దారుణమేంటని, తమ పాలనకు ప్రతిరోజు అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇవన్నీ తలాతోకలేని చర్యలే అని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ఈనెల 24న జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుంటారని ఆయన హెచ్చరించారు.