గౌరీ లంకేష్ (పాత చిత్రం)
ఏడాదిక్రితం ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేష్ ను ఆమె నివాసం వద్ద ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. ఈ హత్యోదంతాన్ని ఛేదించడానికి నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) సాగించిన వేట తుది ఘట్టానికి చేరుకుంది. ఏడాదిపాటు సాగిన ఈ దర్యాప్తు ఫలితంగా గౌరీ లంకేష్ హంతకులనే కాదు ఇప్పటికీ అనేక హత్యలు చేసి, మరికొన్నింటికి వ్యూహం పన్నిన ఒక అజ్ఞాత సనాతన సంస్థ కుట్రను ఛేదించింది. రాజీవ్‌గాంధీ హత్యను పరిశోధించడానికి అప్పట్లో కార్తికేయన్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ సాగించిన దర్యాప్తు స్థాయిలో సాగిన కర్నాటక సిట్ విచారణ వూహించని మలుపులు తిరిగి చివరకి దేశంలో అనేక మంది ప్రముఖ ప్రజాస్వామిక వాదులను మట్టుపెట్టడానికి కుట్ర పన్నిన రహస్య ముఠా గుట్టు రట్టు చేయగలిగింది. మందకొడిగా మొదలయి దేశవ్యాప్తంగా నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుని ఒకరికొకరు తెలియకుండా ’స్లీపర్‌సెల్’ మాదిరిగా పనిచేస్తున్న ఈ ముఠా బండారం బట్టబయలు చేసే వరకూ సాగిన ఈ దర్యాప్తు వివరాలు ఇలా ఉన్నాయి.
సీసీ ఫుటేజ్‌తో మొదలు...
గౌరీలంకేష్ హంతకులను పట్టుకునేందుకు సిట్‌కు లభించిన ఏకైక ఆధారం హత్యచేస్తున్నప్పుడు రికార్డు అయిన సీసీ ఫుటేజీ. అయితే మొహం కనిపించకుండా హెల్మట్లు ధరించి ఉన్న హంతకులను గుర్తించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దర్యాప్తుని కొనసాగించడం కోసం సిట్ హత్య జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో రికార్డయిన ఫోన్ కాల్స్‌ను పరిశీలించడం మొదలు పెట్టింది. ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న సెల్ టవర్స్ ద్వారా సాగిన దాదాపు పది లక్షల ఫోన్ కాల్స్‌ను పరిశీలించింది. అయినా ఫలితం దక్కలేదు.
పిస్టల్ ఒకటే.
గౌరీ లంకేష్ శరీరంలో దిగిన బుల్లెట్ ను పరిశీలించిన పోలీసులకు అది 7.65 ఎంఎం పిస్టల్‌దేనని తెలిసింది. అంతకుముందు కర్ణాటకలో హత్యకు గురైన హేతువాది నరేంద్ర దబోల్కర్‌ను హత్యచేయడానికి కూడా ఇదే పిస్టల్‌ని వాడినట్లు కనుగొన్నారు. అయితే ఈ రెండు హత్యలకు సంబంధం ఏమిటి? హంతకులు ఎవరు? అన్న విషయంలో ఆధారాలు దొరకలేదు.
కీలక ఆధారం దొరికింది..
సిట్ దర్యాప్తు ఎటూ సాగక దాదాపు నిలిచిపోయే దశలో ఆసక్తికరమైన సమాచారం లభించింది. ఆ సమాచారమే సిట్ తరువాత జరిపిన పరిశోధనకు కీలకమయ్యింది. స్థానికంగా పనిచేసే ఇంటలిజెన్స్ పోలీసుల నుంచి వచ్చిన సమాచారం ఏమిటంటే గౌరీ లంకేస్ హత్య జరిగిన తరువాత నుంచి స్థానికంగా నివసించే కె.టి.నవీన్ కుమార్ అనే వ్యక్తి కనిపించడం లేదని. నవీన్ కుమార్ వివరాలు సేకరించిన సిట్ అతను మాండ్యా జిల్లా మద్దూర్ గ్రామానికి చెందినవాడని తెలిసింది. అతని ఆచూకీ కోసం శోధించగా అతను చిక్కమంగుళూరు జిల్లాలోని ఓ గ్రామంలో ఉంటున్నట్టు తెలిసింది. అతనికి తెలియకుండా పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. వారి ప్రయత్నం ఫలించింది. నవీన్ కుమార్ తరచూ కాయిన్ ఫోన్లతో ఎవరితోనో మాట్లాడుతుండడం గమనించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లోని దాదాపు 128 పబ్లిక్ ఫోన్ల నుంచి ఎవరికో ఫోన్ చేస్తుండడం గమనించారు. అందులో ఎక్కువగా ఉపయోగిస్తున్న ఆరు ఫోన్లను టాప్ చేయటం మొదలుపెట్టారు. ఈ సంభాషణల ద్వారా గౌరీ లంకేష్ హత్య గురించి నవీన్‌కు స్పష్టంగా తెలుసునని, అంతేకాకుండా మరొకరి హత్యకు కూడా కుట్ర జరుగుతోందని దర్యాప్తు బృందానికి అర్థం అయ్యింది. ఈ ఏడాది ఫిబ్రవరి 18న పోలీసులు నవీన్ కుమార్‌ను అరెస్టు చేశారు. అతనివద్ద మారణాయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.
రెండవ అరెస్టు...
నవీన్ కుమార్ ఫోన్‌లో మాట్లాడుతున్న వ్యక్తి సుజిత్ కుమార్ అని పోలీసులు పసిగట్టారు. శికారి పురాకు చెందిన సుజిత్‌కు ప్రవీణ్ అనే పేరు కూడా ఉందని తేలడంతో మే 20న అతన్ని కూడా అరెస్టు చేశారు. సుజిత్ కుమార్‌ను ఇంటరాగేట్ చేసిన తరువాత అసలు కుట్రదారుల గుట్టు బయటపడింది.
వ్యూహకర్త అమోల్ కాలే..
గౌరీ లంకేష్ హత్యకు కుట్రపన్నింది అమోల్ కాలే అలియాస్ భాయ్‌సాబ్, అమిత్ దిగ్వేకర్. బెంగుళూరుకు చెందిన 37 ఏళ్ళ అమోల్ ఇంజనీరు. అతని దగ్గర లభించిన డైరీ సాయంతో ఈ ముఠా సంగతి, వారు సాగించిన హత్యోదంతాలు, నిందితుల వివరాలన్నీ ఇందులో లభించాయి. అయితే కోడ్ భాషలో ఉన్న ఈ డైరీని అర్థం చేసుకోవడానికి సిట్ బృందానికి కొంత సమయం పట్టింది. సనాతన ధర్మాన్ని విమర్శించేవారు, ప్రజాస్వామిక వాదులు అనేక మందిని మట్టుపెట్టడానికి ఈ ముఠా పన్నిన వ్యూహం మొత్తం బట్టబయలు అయ్యింది. వీరితో పాటు పనిచేసిన రెండో వ్యక్తి మహారాష్ట్రకి చెందిన 38 ఏళ్ళ అమిత్ దిగ్వేకర్ అలియాస్ ప్రదీప్ మహాజన్. ఈ మొత్తం కుట్ర వీరిద్దరికి మాత్రమే తెలుసు. ఇందులో పాల్గొన్న మిగిలిన వారికి ఒకరి గురించి ఒకరికి తెలియదు. సుజిత్ కుమార్ వెల్లడించిన విషయాల ఆధారంగా బృందం అమోల్‌కాలే, అమిత్ దిగ్వేకర్‌లను అరెస్టు చేసింది. వీరితో పాటు కర్ణాటకలోని విజయపుర కి చెందిన మనోహర్ ఎడవెను కూడా అరెస్టు చేసారు. గౌరీ లంకేష్ హంతకులను రిక్రూట్ చేసింది ఈ మనోహరే. అతని పని కర్ణాటక కేంద్రంగా ఈ ముఠాకు అవసరమైన వారిని రిక్రూట్ చేయడమే. మహారాష్ట్రలో అమోల్‌కాలే తో పాటు మరళి అనే వ్యక్తి, కర్ణాటకలో మనోహర్ ఎడవె, సుజిత్ కుమార్‌లు ఈ సంస్థ రిక్రూట్‌మెంట్లకు బాధ్యులు.
మోహన్ నాయక్, 50. రెక్కీ నిర్వహణ, బెంగుళూరులో స్థావరాలు, వాహనాలు సరఫరా...
అనుకున్న ప్లాన్ ప్రకారం హత్యచేసేందుకు వీలుగా బెంగుళూరులోనే హంతకులు మకాం వేసారు. మోహన్ నాయక్ బెంగుళూరులో ఇల్లు అద్దెకు తీసుకుని, హంతకులకు అవసరమైన వాహనాలు సరఫరా చేసేవాడు. రెక్కీ నిర్వహణ, షెల్టర్లు ఏర్పాటు చేయడం, వాహనాల సరఫరా బెంగుళూరుకి చెందిన 50 ఏళ్ళ మోహన్ నాయక్ పని. వృత్తి రీత్యా ఇతను ఆక్యుపంక్చరిస్ట్. మోహన్ నాయక్‌తో కాలే అనునిత్యం టచ్‌లో ఉంటాడు. ఈ లాజిస్టిక్ టీంలో హుబ్లీకి చెందిన అమిత్ బడ్డీ 27, బెలగాంకి చెందిన 37 ఏళ్ళ భరత్ కుర్నే, కె.టి.నవీన్ కుమార్ ఉన్నారు. మోహన్ నాయక్ తో సహా వాఘ్మేర్, మిస్కిన్, అమిత్ బడ్డిలను పోలీసులు జూలై 18న అరెస్టు చేసారు.
ఆయుధ శిక్షణ రాజేష్ బంగేర...
పేరులేని హంతక సంస్థలోకి వ్యక్తులను రిక్రూట్ చేసుకున్న తర్వాత వారికి ఆయుధ శిక్షణనిచ్చింది కర్నాటక లోని మడికేరికి చెందిన 38 ఏళ్ళ రాజేష్ బంగేర. ఇతనికి సనాతన్ సంస్థకి చాలా కాలంగా సంబంధం ఉందని భావిస్తున్నారు. ఇతనికి కరాటేలో బ్లాక్ బెల్టు ఉంది. ఇతని వద్ద రెండు లైసెన్స్‌డ్ తుపాకీలున్నాయి. ఆయుధ శిక్షణనివ్వడంతో పాటు హత్యలకు అవసరమైన తూటాలను సరఫరా చేసింది కూడా ఇతనే.
కాల్పులు జరిపింది పరుశురాం వాఘ్మేర్...
గౌరీ లంకేష్ హత్య సందర్భంగా రికారై్డన సీసీటీవీ ఫుటేజ్, ఇతర ఆధారాలను ఒకచోట చేర్చి గుజరాత్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపగా అసలు గౌరీ లంకేష్‌ని హత్యచేసింది పరుశురాం వాఘ్మేర్ అని ఫోరెన్సిక్ రిపోర్ట్ తేల్చి చెప్పింది. చిట్టచివరకు బెంగుళూరు ప్రత్యేక దర్యాప్తు బృందం గౌరీ లంకే ష్‌ని హత్య పరుశురాం వాఘ్మేర్ అనే 26 ఏళ్ళ హంతకుడిని పట్టుకుంది. ఇతను కర్నాటకలోని విజయపురలో వ్యాపారి అని తేలింది. ఇతను చాలాకాలంగా సనాతన్ సంస్థ సభ్యుడు. హేతువాది నరేంద్ర దబోల్కర్ హత్య కేసులోనూ, గోవింద్ పన్సారీ హత్యకేసులోనూ, ఎంఎం కల్‌బుర్గీ హత్య కేసులోనూ, గౌరీ లంకేష్ హంతకులతోనూ ఈ సంస్థకు సంబంధాలున్నట్టు బెంగుళూరు ప్రత్యేక దర్యాప్తు బృందం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment