
బనశంకరి: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కేసులో ప్రధాన నిందితులు పరశురామ్ వాగ్మారే, అమోల్ కాలే ఒక పోలీస్ అధికారి ఇంటిని అద్దెకు తీసుకుని హత్యకు పథకం రచించినట్లు ప్రత్యేక విచారణ బృందం(సిట్) విచారణలో వెలుగుచూసింది. బెంగళూరు మాగడి రోడ్డులోని కడబనగర క్రాస్‌లో నివాసముండే ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌కు చెందిన ఇంట్లో నిందితులు సురేశ్ అనే పేరుతో అద్దెకు దిగారు. ఆ ఇంట్లోనే లంకేశ్ హత్యకు కుట్ర రచించారు. దీనిపై ఆ ఇంటి యజమాని పోలీస్ అధికారి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో సిట్ అధికారులు ఆయనను విచారిస్తున్నారు. తన బంధువులకు ఆ ఇంటి బాధ్యతను అప్పగించాననీ, బాడుగకుఉండే వారి వివరాలు తనకు తెలియదని ఆయన సిట్‌కు చెప్పినట్లు సమాచారం. ఈ కేసు నిందితుల్లో కొందరికి ఇంటిని అద్దెకు ఇవ్వడానికి సాయం చేశారనే ఆరోపణలపై మంగళూరుకు చెందిన మోహన్‌నాయక్ అనే వ్యక్తిని సిట్ అరెస్టు చేసింది. అతడిచ్చిన సమాచారం ఆధారంగా హుబ్లీకి చెందిన ఇద్దరిని, మడికెరికి చెందిన ఒకరిని సిట్ అరెస్టు చేసి ప్రశ్నిస్తోంది.