మాటలు రావడం లేదు: సీఎం
సాక్షి, బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు, సామాజిక వేత్త గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు. గౌరి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీయిచ్చారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ కేసులో విచారణ కోసం ఐజీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. హంతకులు హెల్మెట్ ధరించి వచ్చి ఈ కిరాతకానికి పాల్పడ్డారని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారని చెప్పారు. గౌరీ లంకేశ్ ఇటీవలే తనను కలిశారని, ఎటువంటి ప్రాణహాని ఉందని చెప్పలేదన్నారు.
కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించే విషయం డీజీపీకి వదిలిపెట్టామన్నారు. కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కల్బుర్గీ, దభోల్కర్‌లను హత్యలకు... గౌరి హత్య కేసుకు సంబంధం ఉందో, లేదో ఇప్పుడే చెప్పలేమన్నారు. రాష్ట్రంలో అభ్యుదయవాదులందరికీ రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించినట్టు తెలిపారు.
గౌరీ లంకేశ్ హత్య తనకు దిగ్భ్రాంతి కలిగించిందని, ఈ కిరాతకాన్ని ఖండించడానికి మాటలు రావడం లేదని మంగళవారం రాత్రి సిద్ధరామయ్య ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన హత్య. గౌరి మరణంతో కర్ణాటక బలమైన అభ్యుదయ గళాన్ని కోల్పోయింది. నేను స్నేహితురాలిని పోగొట్టుకున్నాన’ని ట్వీట్ చేశారు.