బెంగళూరు: కర్ణాటక ప్రభుత్వంపై ప్రధాని నరేంద్రమోదీ ఆరోపణలు చేయడంపై సీఎం సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ ఎక్సైజ్ శాఖ లో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగిందని ప్రధాని చేసిన ఆరోపణలను నిరూపించాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. అవి నిజమని రుజువైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. అయితే వాటిని నిరూపించలేకపోతే ప్రధాని మోదీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ కర్ణాటక ఎక్సైజ్ శాఖలో భారీ కుంభకోణం జరిగిందని, దీని ద్వారా వచ్చిన సొమ్మును కాంగ్రెస్ మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లలో ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తోందని ఆరోపించారు. ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రం కాంగ్రెస్ రాజ కుటుంబానికి డబ్బులు అందించే ఏటీఎంగా మారిపోతుందని మోదీ ఆరోపించారు. కాంగ్రెస్ రాజ కుటుంబానికి ఇప్పుడు తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటకలు ఏటీఎంలుగా మారిపోయాయన్నారు.
మహారాష్ట్రలో ఎన్నికల కోసం తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వసూళ్లకు పాల్పడుతున్నదని, కర్ణాటకలో ప్రభుత్వ వసూళ్లు రెట్టింపయ్యాయని ప్రజలు చెబుతున్నారన్నారు. కర్ణాటకలోని లిక్కర్ వ్యాపారుల నుంచి రూ.700 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయని మోదీ ఆరోపించారు.
తాజాగా ప్రధాని మోదీ ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య ఖండించారు. దేశ ప్రధాని ఇలాంటి అబద్ధాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉన్నదన్నారు. ప్రధానికి తానొక సవాల్ విసురుతున్నానని, ఆయన చేసిన ఆరోపణలను నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేనిపక్షంలో ప్రధాని రాజకీయాల నుంచి తప్పుకోవాలని సిద్ధరామయ్య డిమాండ్ చేశారు.
ఇదిలావుండగా కర్ణాటక వైన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇటీవల ఎక్సైజ్ విభాగంపై తీవ్ర ఆరోపణలు చేసింది. లైసెన్సులు మంజూరు చేసేందుకు ప్రభుత్వం రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకూ వసూలు చేస్తున్నట్టు ఆరోపించింది. గత ఏడాది కాలంలో ఇలా 1000 లైసెన్సులను అక్రమంగా కేటాయించారని, ఫలితంగా రూ. 300-700 కోట్ల కుంభకోణం జరిగిందని వైన్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Maharashtra: తొలిసారి ఆ గ్రామంలో ఎన్నికల పండుగ
Comments
Please login to add a commentAdd a comment