
సాక్షి, బెంగళూరు: సంచలన సృష్టించిన జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసులో కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నిందితులను పోలీసులు హింసిస్తున్నారంటూ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంపై తక్షణమే నివేదిక సమర్పించాల్సిందిగా దిగువ న్యాయస్థానాల మెజిస్ట్రేట్‌లను ఆదేశించింది. ‘ఈ ఆరోపణలను మేం తీవ్రంగా పరిగణిస్తున్నాం. 10 రోజుల్లో ఈ వ్యవహారంపై పూర్తి నివేదిక సమర్పించాలి’ అని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్‌లు(ఏసీఎంఎం) ఇద్దరికీ.. హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. నిందితులలో ఒకడైన అమోల్ కాలే.. కస్టడీలో ఉండగా తనను పోలీసులు హింసించారని, మెజిస్ట్రేట్లు కూడా తన మొరను పట్టించుకోలేదని ఓ అఫిడవిట్ దాఖలు చేయించాడు.
‘నా క్లయింట్‌ని పోలీసులు విచక్షణ రహితంగా హింసించారు. మే 31వ తేదీన ఈ విషయాన్ని థర్డ్ ఏసీఎంఎంకు విన్నవించాం. కానీ, ఆయన పట్టించుకోలేదు. తిరిగి జూన్ 14వ తేదీన ఫస్ట్ ఏసీఎంఎంకు విన్నవించాం. ఆయన వైద్యపరీక్షలకు అనుమతించకుండా నివేదిక రూపొందించారు. ఇది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు ఉల్లంఘించటమే’ అని నిందితుడి తరపు న్యాయవాది అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ‘పైగా కోర్టు ఆదేశాల ప్రకారం రహస్యంగా కాకుండా నిందితుల నుంచి బహిరంగంగా విచారణ చేపట్టి స్టేట్‌మెంట్లు నమోదు చేశారు. నష్టపరిహారంగా బాధితులకు రూ.25 లక్షలు చెల్లించేలా ఆదేశాలిప్పించండి’ అని న్యాయవాది విన్నవించాడు. వాదనలు విన్న న్యాయస్థానం మెజిస్ట్రేట్‌ల నుంచి వివరణ కోరుతూ ఆదేశాలు జారీ చేసింది. (ఏ కుక్క చచ్చిపోయినా.. ఆయనే బాధ్యుడా?)
మరోవైపు నిందితులను హింసించారన్న ఆరోపణల నేపథ్యంలో కర్ణాటక డీజీపీతోపాటు అధికారులకు హైకోర్టు జూన్12న నోటీసులు జారీ చేసింది. సెప్టెంబర్ 5, 2017న గౌరీలంకేశ్ హత్యకు గురికాగా, సిట్ దర్యాప్తు ఆధారంగా నిందితులు అమోల్ కాలే, సుజిత్ కుమార్, మనోహర్ ఎడవే, అమిత్ రామచంద్రలను పోలీసులు అరెస్ట్ చేశారు. ‘ఆపరేషన్ అమ్మ’