
బనశంకరి: పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్య కుట్రకు నిందితులు ‘ఆపరేషన్ అమ్మ’ అని పేరు పెట్టినట్లు సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) విచారణలో తేలింది. ఆమెను హత్య చేయడానికి రహస్య సంకేతాల ద్వారా కన్నడ, మరాఠీ, హిందీ, తెలుగు భాషల్లో నిందితులు మాట్లాడినట్లు తెలిసింది. సుమారు ఏడాదిపాటు టెలిఫోన్ బూత్‌ల నుంచి మాట్లాడిన నిందితులు హత్య చేయాల్సిన వ్యక్తి పేరును మాత్రం ఎప్పుడూ ఉచ్చరించలేదు. కేవలం ‘ఆపరేషన్ అమ్మ’ అని మాత్రమే మాట్లాడుకున్నట్లు సిట్ గుర్తించింది. గత ఏడాది సెప్టెంబర్ 5న రాత్రి బెంగళూరులో ఇంటి వద్ద ఉన్న ఆమెను కొందరు దుండగులు కాల్చి చంపడం తెలిసిందే. సుదీర్ఘ దర్యాప్తు తరువాత సిట్ అధికారులు కేసును ఛేదించి కీలక నిందితులను పట్టుకోగలిగారు. బీజాపుర జిల్లా సిందగి తాలూకాకు చెందిన పరశురామ్ వాగ్మారే ఈ హత్య కేసులో కీలక నిందితుడిగా తేల్చారు. మిగిలిన ముగ్గురు వ్యక్తులు గౌరి హత్యకు పథకం రూపొందించారు.
చివరివరకు టార్గెట్ తెలియదు
సిట్ అదుపులో ఉన్న పరశురామ్ వాగ్మారే విచారణ సమయంలో గౌరీ లంకేశ్ అంటే తనకు తెలియదని, వారపత్రిక సంపాదకురాలు అని కానీ, సామాజికవేత్త అని కానీ తెలియదన్నాడు. అయితే, తాను ఎప్పుడూ హిందూ మతాన్ని నమ్ముతాననీ, తన మతాన్ని ఎవరైనా విమర్శిస్తే సహించలేనని చెప్పాడు. ‘ఒకరోజు కర్ణాటక–మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో గుర్తుతెలియని ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి ఓ ప్రముఖ వ్యక్తిని హత్య చేయాలని చెప్పాడు. మొదట నేను ఒప్పుకోలేదు. గౌరీ లంకేశ్ హిందూ మతాన్ని కించపరిచేలా పత్రికల్లో రాస్తూ, సభల్లో మాట్లాడుతోందని అతడు తెలపడంతో ఆమెను చంపాలనే నిర్ణయానికి వచ్చా. నీ మతానికి వ్యతిరేకంగా మాట్లాడేవారిని వదలొద్దు. నువ్వు ఈ కార్యం నెరవేర్చడానికి సిద్ధంగా ఉంటే నీకు నేను అండగా ఉంటా’ అంటూ ఆ అపరిచితుడు బ్రెయిన్‌వాష్ చేసినట్లు సిట్ ఎదుట తెలిపాడని సమాచారం.
మొదటిరోజు కుదరలేదు..
గౌరీ లంకేశ్‌ను హత్య చేసేందుకు అంగీకరించిన వెంటనే ఆ అపరిచితుడు తనను బెళగావిలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి ఎయిర్‌గన్‌తో శిక్షణ ఇచ్చాడని వాగ్మారే చెప్పాడు. ఇరవై రోజుల శిక్షణ సమయంలో సుమారు 500 రౌండ్లు కాల్చినట్లు తెలిపాడు. ఆ శిక్షణ అనంతరం ఆ వ్యక్తి ఇచ్చిన మొబైల్ నంబర్‌కు టెలిఫోన్ బూత్ నుంచి ఫోన్ చేసి గౌరీ లంకేశ్ హత్య పథకం గురించి తెలుసుకున్నాడు. అతని సూచన మేరకు సెప్టెంబర్ 3వ తేదీన బెంగళూరుకు వెళ్లి సుంకదకట్టెలోని ఓ ఇంట్లో బస చేశాడు. అదే ఇంట్లో సుజీత్ అలియాస్ ప్రవీణ్ కూడా ఉన్నాడు. సెప్టెంబర్ 4వ తేదీన గౌరీ లంకేశ్‌ను కాల్చి చంపడానికి సిద్ధపడినా, ఆ రోజు ఆమె తొందరగా ఇంట్లోకి వెళ్లిపోవడంతో కుదరలేదు. కానీ, సెప్టెంబర్ 5వ తేదీన గౌరీ ఇంటి సమీపంలోని పార్కుకు వెళ్లి ఎదురుచూశారు. గౌరీలంకేశ్ కారు రాగానే బైక్‌పై వెంబడిస్తూ ఆమె ఇంటి వద్ద కారు దిగి లోపలికి వెళ్తుండగా కాల్పులు జరిపినట్లు వాగ్మారే సిట్‌కు వివరించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment