
బెంగళూరు: ప్రధాని నరేంద్ర మోదీపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మోదీ తనకంటే పెద్ద నటుడని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జర్నలిస్ట్ గౌరి లంకేశ్ హత్యపై ప్రధాని మోదీ మౌనం వీడాలని డిమాండ్ చేశారు. తనను అనుకరించాలని అభిమానులకు నటుడు చెప్పినట్టుగా మోదీ మౌనం ఉందని పేర్కొన్నారు. దీన్నిబట్టే ఆయన తన కంటే పెద్ద నటుడన్న సంగతి అర్థమవుతోందని అన్నారు. వామపక్ష విద్యార్థి సంఘం డీవైఎఫ్‌ఐ 11వ రాష్ట్ర సమావేశంలో ఆదివారం ఆయన ప్రారంభోపన్యాసం చేశారు.
‘గౌరి లంకేశ్‌ను హత్యచేసిన వారిని పట్టుకోవచ్చు, పట్టుకోలేకపోవచ్చు. కానీ సోషల్ మీడియాలో చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారంతా ఎవరో, వారి సిద్ధాంతం ఏమిటో మనకు తెలుసు. వీరిలో కొంత మందిని నరేంద్ర మోదీ ఫాలో కావడం నన్ను కలవరపెడుతోంది. మోదీ మౌనం ఆందోళన కలిగిస్తోంది. తన మద్దతుదారులు చేసిన దారుణాన్ని సమర్థించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్టుగా కనబడుతోంద’ని ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఇటువంటి దారుణాలపై ప్రధాని మోదీ మౌనం కొనసాగిస్తే తన ఐదు జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేందుకు వెనుకాడబోనని ఆయన ప్రకటించారు.
బెంగళూరులోని తన నివాసంలో గౌరి లంకేశ్‌ను సెప్టెంబర్ 5న ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. గౌరి లంకేశ్ హత్యను ఖండిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి.