బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకేసులోని నిందితుల హిట్‌లిస్టులో ప్రముఖ నటుడు, నిర్మాత గిరీశ్ కర్నాడ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత లలితా నాయక్, నిదుమామిడి మఠం పీఠాధిపతి వీరభద్ర చన్నమల్లస్వామి, హేతువాది సీఎస్ ద్వారకనాథ్‌లకు కూడా వారి నుంచి ముప్పు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్వాధీనం చేసుకున్న ఓ డైరీలో ఈ వివరాలున్నట్లు పేర్కొన్నారు. హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న ఈ ప్రముఖులను వారు లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. డైరీలో కొంత సమాచారం సంకేత భాషలో ఉందని, దాని అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు, సిట్ మంగళవారం అరెస్ట్ చేసిన 26 ఏళ్ల పరశురామ్ వాగ్మారే అనే యువకుడు లంకేశ్‌ను కాల్చి చంపాడని వార్తలు వచ్చాయి. అయితే వాటిని సిట్ అధిపతి బీకే సింగ్ కొట్టిపారేశారు. లంకేశ్‌ను వాగ్మారే హత్యచేసినట్లు తమ విచారణలో ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ ఆరుగురిని అరెస్ట్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment