Girish Karnad
-
ఆకాశానికి ఎదిగిన గిరి
ప్రఖ్యాత నటుడు, నాటకకర్త, దర్శకుడు గిరిష్ కర్నాడ్ (81) సోమవారం బెంగళూరులో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబం తెలిపింది. కర్నాడ్ భార్య సరస్వతి గణపతి వైద్యురాలు. కుమారుడు రఘు రచయిత, జర్నలిస్టు. కుమార్తె షల్మలి ఆరోగ్యరంగంలో పని చేస్తున్నారు. మహారాష్ట్రలోని మాథెరన్ (ముంబైకి సమీపంలో ఉండే హిల్‌స్టేషన్)లో జన్మించిన కర్నాడ్ బాల్యం పూణెలో కౌమారం కర్నాటకలోని ధార్వాడ్‌లో గడిచింది. ఇంట్లో మరాఠి, కన్నడ... రెండు భాషలు మాట్లాడేవారు. బిఎస్సీ మేధమేటిక్స్ చదివినప్పటికీ కళారంగంలో తన అభిరుచిని గమనించిన కర్నాడ్ నాటకాల ద్వారా, సినిమాల ద్వారా గుర్తింపు పొందారు. జానపద, పౌరాణిక పరంపరను ఆధునికతతో సమ్మిళతం చేసి కొంత మార్మిక ధోరణిలో సాగిన కర్నాడ్ నాటక శైలి విశేష ఖ్యాతి సాధించి పెట్టింది. ప్రఖ్యాత కన్నడ రచయిత బి.వి.కారంత్‌తో కలిసి నాటకాల్లో, సినిమాల్లో కర్నాడ్ విశేష కృషి చేశారు. పారలల్ సినిమాలు ఊపందుకోవడంలో ముఖ్యపాత్ర పోషించారు. శ్యాం బెనగళ్ దర్శకత్వంలో హైదరాబాద్ నేపథ్యంలో సాగే ‘అంకుర్’ కథలో కర్నాడ్ కనిపిస్తారు. ‘నిషాంత్’, ‘మంథన్’, ‘స్వామి’ ఆయన నటించిన ఇతర సినిమాలు. కర్నాడ్ చేసిన కృషికి ఎన్నో పురస్కారాలు అందాయి. 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ గౌరవాన్ని పొందారు. 1998లో ఆయనకు సాహిత్యంలో ప్రకటించే సర్వోన్నత పురస్కారం ‘జ్ఞానపీuŠ‡’ దక్కింది. కర్నాడ్ మృతి వార్త వెలువడిన వెంటనే కర్నాటక ప్రభుత్వం సోమవారం రోజు ప్రభుత్వ సెలవును ప్రకటించింది. మూడురోజుల సంతాప దినాలను పాటించాలని కోరింది. కర్నాడ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని భావించినా కర్నాడ్ చివరి కోరిక మేరకు కర్నాడ్ కుటుంబం సున్నితంగా తోసిపుచ్చింది. అభిమానులు, సెలబ్రిటీలు భారీగా తరలిరావడానికి కూడా అంగీకరించలేదు. కొంతమంది నాటకరంగ మిత్రులు మాత్రమే అంతిమ నివాళి అర్పించినవారిలో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ దహనవాటిక ద్వారా గిరిష్ కర్నాడ్ అంతిమ సంస్కారాలు ముగిశాయి. నటుడుగా, నాటకకర్తగా, దర్శకుడిగా, చైతన్యకారునిగా, బుద్ధిజీవిగా తన కాలపు తరాలకే కాదు రాబోవు తరాలకు కూడా గిరిష్ కర్నాడ్ స్ఫూర్తిమంతంగా నిలిచాడు.81 సంవత్సరాల వయసులో జూన్ 10న ఆయన ప్రపంచమనే ఈ నాటకరంగాన్నిశాశ్వతంగా విడిచిపెట్టి అభిమానుల నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. తెలుగువారికి నటుడుగా పరిచయం కావడానికి ముందే గిరిష్ కర్నాడ్ తెలుగు సినిమాల కోసం పని చేశాడు. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ‘అనుగ్రహం’ సినిమాకు బెనగళ్‌తో పాటు ఆయన కూడా స్క్రీన్ ప్లే రాశాడు. వాణిశ్రీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను అభిరుచి ఉన్న ప్రేక్షకులు నేటికీ మర్చిపోలేదు. నిజానికి కర్నాడ్– తాను నాటకం రాయగలడని, నటించగలడని, దర్శకత్వం వహించగలడని తెలియకుండా ఆయా దారుల గుండా ప్రయాణించి, అత్యుత్తమ ప్రతిభ కనపరిచి, ఎత్తులకు ఎదిగాడు. కర్నాడ్‌కు ఇంగ్లిష్ కవి కావాలని ఉండేది. లండన్ తన శాశ్వత నివాస నగరి అని చదువుకునే రోజుల్లోనే అనుకున్నాడు. లండన్‌లో చదువుకోవడానికి స్కాలర్షిప్ రావడం చాలా పెద్ద విషయం కనుక ఎక్కువ మార్కులు పొందడం ఒక్కటే మార్గం అనుకుని, తనకు పెద్దగా ఇష్టం లేని గణితంలో డిగ్రీ చేసి ఆశించినట్టుగా స్కాలర్షిప్ పొందాడు. అయితే తల్లిదండ్రులు ఇద్దరూ నాటక రంగంతో పరిచయం ఉన్నవారు కావడం వల్ల తెలియకుండానే పుస్తకాల పట్ల, కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఉత్తర కర్ణాటకకు సాంస్కృతిక క్షేత్రమైన ‘ధార్వాడ్’లో ఇంటర్, డిగ్రీ చదవడం వల్ల, ఆ సమయంలో అక్కడికి వచ్చే ప్రఖ్యాత సాహిత్యకారులతో పరిచయం ఏర్పడటం వల్ల కర్నాడ్‌కు సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. ఆ రోజుల్లో ఊరూరా తిరిగి యక్షగానాలను ప్రదర్శించే బృందాలతో ప్రభావితం చెందాడు. సి.రాజగోపాలచారి మహాభారతానికి రాసిన వ్యాఖ్యాన ఉద్గ్రంథం చదివాక ఒకరోజు హటాత్తుగా ఉద్ధృతిగా ఆయన రాసిన తొలి నాటకమే ‘మానిషాద’. కాలేజీ ముగిశాక లండన్ వెళ్లే ముందు ఈ కన్నడ నాటకం రాసి, దాని సంగతి వదిలి, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుతూ అక్కడి ఇంగ్లిష్ కార్యకలాపాలలో మునిగాడు కర్నాడ్. ఇంగ్లిష్ కవిగా, నాటకకారునిగా గుర్తింపు పొందాలని తపన పడుతున్నప్పుడు ‘మా నిషాద’ కన్నడలో అచ్చయ్యి పేరు తెచ్చింది. లండన్‌కు పంపుతూ తండ్రి ‘నువ్వు తిరిగి వచ్చి మమ్మల్ని చూసుకోవాలి’ అని షరతు పెట్టడం గుర్తొచ్చి, భారతంలో ‘యయాతి’ కూడా తన కుమారులకు ‘మీ యవ్వనం ఇవ్వండి’ అని షరతు పెట్టాడు కదా అనుకుని లండన్‌లో ఉండగానే రాసిన మరో నాటకం ‘యయాతి’. కన్నడంలో రాసిన ఆ నాటకం గిరిష్ కర్నాడ్‌కు చాలా ఖ్యాతి తెచ్చిపెట్టింది. దాంతో కర్నాడ్ ‘ఇక ఇంగ్లిష్ నేలకు సెలవు... నా సాధనంతా నా మాతృభాషలో చేసుకుంటాను... నా సాహిత్యకృషి అంతా నా దేశంలోనే సాగాలి’ అనుకుని ఇక్కడకు వచ్చేశాడు. భారతదేశానికి వచ్చి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, మద్రాసు శాఖలో పని చేస్తూ ఉండగా ప్రఖ్యాత అనువాదకుడు ఏ.కె.రామానుజన్ కర్నాడ్‌కు షికాగో యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేసే అవకాశం కల్పించాడు. అంతే కాదు ఒక తాజా నాటకం రాయమని కర్నాటక ప్రాంతంలో ఉన్న ఒక జానపద కథను సూచించాడు. ఆ కథ ఆధారంగా కర్నాడ్ రాసిన నాటకమే ‘నాగమండల’. తనను పట్టించుకోని మొగునికి మందు పెడదామని ఒక ఇల్లాలు అనుకుని పాలల్లో మందు కలిపితే పొరపాటున ఆ పాలు వొలికి పుట్టలో పడతాయి. వాటిని తాగిన పుట్టలోని పాము రోజూ ఆమె భర్త రూపు దాల్చి ఇల్లాలితో కూడుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందనేది కథ. ఈ నాటకమే కాదు చరిత్ర పట్ల, చరిత్రను చూడాల్సిన చూపు పట్ల అవగాహన ఉన్న కర్నాడ్ ‘తుగ్లక్’, ‘టిప్పు సుల్తాన్’ నాటకాలు రాసి దేశంలో, విదేశాలలో గుర్తింపు పొందాడు. వద్దనుకుంటే పుట్టిన బిడ్డ గిరిష్ కర్నాడ్ తల్లికి మొదటి భర్త నుంచి ఒక కొడుకు ఉన్నాడు. రెండవ పెళ్లి తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. గిరిష్ కర్నాడ్ కడుపులో పడినప్పుడు ఇప్పటికే ముగ్గురు ఉన్నారు కదా, అబార్షన్ చేయించుకుంటాను అని అనుకుందట తల్లి. అబార్షన్ కోసం ఒక డాక్టరమ్మ క్లినిక్‌కు కూడా వెళ్లిందట. అయితే అదృష్టవశాత్తు ఆ డాక్టరమ్మ ఆ రోజు క్లినిక్‌కు రాలేదు. లీవు పెట్టింది. మధ్యాహ్నం వరకూ కూచున్న కర్నాడ్ తల్లి విసుగొచ్చి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ చేయించుకోవాలనే మూడ్ పోవడంతో కర్నాడ్ పుట్టాడు. ‘ఈ సంగతి తెలిసి ఆశ్చర్యపోయాను. నేను పుట్టకుండా ఈ లోకం ఎలా ఉంటుంది ఎలా ఉండేది అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే’ అని నవ్వుతాడు కర్నాడ్. సారస్వత బ్రాహ్మణులు గిరిష్ కర్నాడ్ కుటుంబం సారస్వత బ్రాహ్మణ కుటుంబం. పూర్వం సరస్వతి నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన బ్రాహ్మణులు కనుక తాము సారస్వత బ్రాహ్మణులు అని వీరు అంటారు. వీరు ఆది నుంచి ఉన్నత విద్యావంతులు. బ్రిటిష్ హయాంలో మంచి హోదాలలో పని చేశారు. కర్నాటకలోని ధర్వాడ్ సమీపంలో ఉన్న సారస్వత్పూర్లో 1950లలోనే యాభై బంగళాలలో సారస్వత బ్రాహ్మణులు ఒక అగ్రహారంగా జీవించేవారు. కర్నాడ్‌కు అక్కడ ఒక సొంత బంగ్లా ఉంది. కర్నాడ్ తల్లి కృష్ణాబాయి. తండ్రి డాక్టర్ రఘునాథ్ కర్నాడ్. తల్లి బాల వితంతువు కాగా ఆమె నర్సుగా పని చేస్తూ డాక్టర్ అయిన రఘునాథ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఆమె పెద్ద కొడుకు తన సవతి కొడుకని చాలా ఏళ్ల వరకూ తెలియకుండా తల్లి తమను పెంచిందని కర్నాడ్ చెప్పారు. కన్నడంలో సంచలనం సృష్టించిన నవల ‘సంస్కార’ (రచన: యు.ఆర్.అనంతమూర్తి) ఆధారంగా తీస్తున్న సినిమాలో మొదటిసారి ప్రధానపాత్రలో నటించాడు కర్నాడ్. దీనికి దర్శకత్వం వహించిన పఠాభి తెలుగువాడు కనుక కర్నాడ్‌ను స్క్రీన్ ఆర్టిస్ట్‌ను చేసిన ఘనత తెలుగువారిది అని సంతోషించాలి. ఆ తర్వాత శ్యాం బెనగళ్‌తో ఏర్పడిన పరిచయం త్వరత్వరగా కర్నాడ్‌ను హిందీ భాషల్లో ఇతర భారతీయ భాషల్లో వ్యాప్తి చెందేలా చేసింది. దేశంలో క్షీర విప్లవం తెచ్చిన కురియన్ అనుభవాల ఆధారంగా బెనగళ్ తీసిన ‘మంథన్’లో కర్నాడ్ హీరోగా నటించి చాలామందికి గుర్తుండిపోయాడు. జంధ్యాల దర్శకత్వంలో ‘ఆనందభైరవి’లో నటించి ‘శంకరాభరణం’ జె.వి.సోమయాజులు తర్వాత అంతటి పేరు పొందిన నటుడు కర్నాడ్. తనకు వచ్చిన నాట్యానికి వారసులు లేకుండా పోతారేమోనన్న చింతలో ఉండే నాట్యాచారునిగా, పట్టిన పట్టు కోసం చివరకు కపాలమోక్షం చేసుకునే ఆత్మాభిమానిగా కర్నాడ్ నటన తెలుగువారిని కట్టిపడేసింది. సాహిత్యం తెలిసినవాడు సినిమాల్లోకి వెళితే ఏం చేస్తాడో గిరిష్ కర్నాడ్ కూడా అదే చేశాడు. కన్నడంలో ఎస్.ఎల్.ౖభైరప్ప రాయగా విఖ్యాతమైన నవల ‘వంశవృక్ష’ను తొలిసారిగా డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత భైరప్పే రాసిన మరో నవల ‘గోధూళి’ని, మరో నవల ‘కాడు’ను సినిమాలుగా తీశాడు. ‘కాడు’ సినిమా ‘క్షత్రియ పుత్రుడు’ తీయడానికి తనకు ఇన్స్పిరేషన్గా పని చేసిందని కమల హాసన్ ఒక సందర్భంలో చెప్పాడు. ఇక శూద్రకుడు రాసిన విఖ్యాత సంస్కృత నాటకం ‘మృచ్ఛకటికం’ను హిందీలో ‘ఉత్సవ్’ పేరుతో తీశాడు కర్నాడ్. శశికపూర్ నిర్మించిన ఈ సినిమా రేఖ, శేఖర్ సుమన్‌లకు చాలా పేరు తెచ్చి పెట్టింది. తన ఆసక్తికి తగిన పనులు చేస్తూ భుక్తికి కమర్షియల్ సినిమాలలో నటించాడు. శంకర్ దర్శకత్వంలోని ‘ప్రేమికుడు’లో ఆయన పోషించిన గవర్నర్ పాత్ర అందరికీ గుర్తు. ‘ధర్మచక్రం’లో వెంకటేశ్‌కు, ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’లో చిరంజీవికి కర్నాడ్ తండ్రిగా నటించాడు. హిందీలో ఇటీవల ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందాహై’లలో సల్మాన్ ఖాన్ బాస్‌గా ముఖ్యపాత్ర పోషించాడు. గిరిష్ కర్నాడ్ నటుడే కాదు నటగురువు కూడా. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపాల్‌గా ఉంటూ నసిరుద్దిన్ షా వంటి నటులకు పాఠాలు చెప్పాడు. విద్యార్థిగా ఉన్న నసిరుద్దీన్ షా ప్రిన్సిపాల్‌గా ఉన్న కర్నాడ్ మీద తోటి విద్యార్థులతో కలిసి సమ్మెకు దిగడం ఆనాటి ఒక ముచ్చట. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక గొప్ప ఇన్స్టిట్యూట్గా ఖ్యాతి గడించడానికి కర్నాడ్ స్థిరం చేసిన ప్రమాణాలే కారణం. కొత్త టాలెంట్‌ను గమనించే కర్నాడ్ తన సినిమాల ద్వారా విష్ణువర్థన్, శంకర్నాగ్లను ఇంట్రడ్యూస్ చేశాడు. ఇవాళ్టి విఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ని కూడా కర్నాడే పరిచయం చేశాడు. అయితే సృజనకారుడు సృజన చేసి ఊరుకుంటే సరిపోదని అతనికి సామాజిక బాధ్యత ఉండాలని భావించినవాడు కర్నాడ్. భారతదేశం వెయ్యేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే మతం, కులం అంటూ కొట్టుకుంటూ ఉందని ఆవేదన చెందుతాడు. మతతత్వం దేశానికి ఏ మాత్రం మంచిది కాదని బాహాటంగా కర్నాడ్ వేదికలెక్కి మాట్లాడాడు. సమాజాన్ని చైతన్యపరిచే ఇంటలెక్చువల్స్‌ని ‘అర్బన్ నక్సలైట్’లుగా ప్రభుత్వ ఏజెన్సీలు వ్యాఖ్యానిస్తుంటే అలాగైతే నేను కూడా అర్బన్ నక్సలైట్‌నే అంటూ మెడలో కార్డు వేలాడేసుకుని తిరిగినవాడు కర్నాడ్. బెదిరింపులు, హేళనల మధ్య తన నిరసన తెలిపే హక్కును కోల్పోని ధైర్యవంతుడు కర్నాడ్. నాటకశాలలో దీపాలు ఆరిపోయాక స్టేజ్ మీద దీపం వెలగాలి. అది బుద్ధికి దారి చూపాలి. సాహిత్యం, సినిమా కూడా చేయాల్సింది అదే. కాని ఇవాళ వెలుతురు ఇవ్వాల్సిన అన్ని కళలకు, సాహిత్య రూపాలకు, ప్రశ్నించే మాధ్యమాలకు నిర్బంధం ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని, నోరున్నా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని కర్నాడ్ ఆవేదన చెందుతాడు. ధైర్యం లేని జాతి మానసిక సంకుచితానికి గురికాక తప్పదని భావించే కర్నాడ్లాంటి సృజనకారులను స్మరించుకుంటూ ఉండాలంటే సదా వివేచనతో హేతువుతో ప్రజాస్వామిక విలువలతో ముందుకు సాగాలి.అలా చేయగలగడమే ఆయనకు అసలైన నివాళి. – కె -
ధిక్కార స్వరం గిరీష్
నాటక రచయిత, సినిమా నటుడు, ప్రముఖ సామాజికవేత్త గిరీష్ కర్నాడ్ దీర్ఘకాలంగా అనారోగ్య సమస్యని ఎదుర్కొంటూ శరీరంలోని ప్రధాన అవయవాలు పనిచేయకపోవడంతో సోమవారం ఉదయం బెంగళూరులోని ఆసుపత్రిలో మృతిచెందారు. మహారాష్ట్రలో మే 19, 1938లో జన్మించిన గిరీష్ కర్నాడ్ 1958లో కర్ణాటక యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొందారు. 1963లో ఎం.ఏ విద్యాభ్యాసం పూర్తిచేశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్రం, పొలిటికల్ సైన్స్, అర్ధశాస్త్రాలను అభ్యసించారు. సామాజిక విలువల కోసం చివరి వరకు పోరాటం కొనసాగిస్తూ హిందుత్వవాదుల నుంచి నిర్భంధాన్ని ఎదుర్కొన్నారు. కన్నడ సినిమాలో రచయితగా, ఫిలింమేకర్‌గా, సామాజిక ఉద్యమకారుడిగా సమాజంలో తన బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించారు. 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్, 1998లో జ్ఞాన పీఠ అవార్డును స్వీకరించారు. 2017లో ప్రముఖ జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్య అనంతరం ఆ హింసను ఖండించడంలో ముందు వరుసలో నిలబడ్డారు. ఒక గౌరీని హత్య చేస్తే మేమందరం గౌరీలుగా మారతామని ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చారు. గిరీష్ కర్నాడ్ చాలా నాటకాలు రాశారు. 1961లో యయాతి, 1972లో హయ వదన, 1988లో నాగమందాల రచించారు. తెలుగు, కన్నడ సహా పలు భాషల్లోని సినిమాల్లో నటించారు. అంతేకాక పలు హిందీ సినిమాల్లో కూడా నటిం చాడు. దేశంలో 300 సంస్థలతో పుణేలో ఎల్గార్ పరిషత్ ఏర్పడి భీమాకొరేగాంలో దళితులు తమ ఉద్యమ ఆకాంక్షను ప్రకటిస్తే.. దాన్ని అణచివేయడం కోసం హిందుత్వ శక్తులు హింసకు పాల్పడి, ఇద్దరు దళితులను హత్య చేశాయి. హిందుత్వ శక్తులపై చట్టబద్ధ చర్యలు తీసుకోలేని ప్రభుత్వం, దోషులను విడిచిపెట్టి, ప్రజాస్వామిక వాదులైనటువంటి మేధావులను, ప్రొఫెసర్లను, న్యాయవాదులను అక్రమంగా అరెస్టు చేసి ఏడాది కాలంగా బెయిల్ రాకుండా పుణేలోని ఎరవాడ జైల్లో నిర్బంధించారు. ఈ నిర్బంధాల వెనుక ప్రధాన కారణంగా అర్బన్ నక్సల్ అనే పదాన్ని తీసుకువచ్చి అందరిమీద క్రూర నిర్బంధాన్ని అమలుచేస్తోంది. దీన్ని నిరసిస్తూ తానూ అర్బన్ నక్సల్‌నేనని మెడలో బోర్డు వేసుకొని ప్రపంచానికి తెలియజేశారు, ప్రభుత్వాలను సవాల్ చేశారు. ప్రజాస్వామికవాదులపై జరుగుతున్న దాడులను నిలదీయడంలో తనవంతు బాధ్యతను నిర్వహించిన గిరీష్ కర్నాడ్ జీవితం చాలా విలువైనదని భావిస్తున్నాం. అలాగే హక్కుల కోసం పోరాడే ఏ ప్రజాస్వామిక గొంతుకలకైనా మద్దతుగా పౌరహక్కుల సంఘం నిలబడుతుందని తెలియ జేస్తూ గిరీష్ కర్నాడ్లాగా పౌర ప్రజాస్వామిక హక్కుల కోసం మేధావులు, ప్రజాస్వామిక వాదులు ఆయన స్ఫూర్తితో ఉద్యమించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్. నారాయణరావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పౌరహక్కులసంఘం మొబైల్ : 98667 34867 -
గిరీష్ కర్నాడ్ కన్నుమూత
సాక్షి, బెంగళూరు: ఐదు దశాబ్దాల పాటు నాటక, సినీ, సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన బహుభాషా నటుడు, ప్రఖ్యాత నాటక రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ (81) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం బెంగళూరులో లావెల్లీ రోడ్డులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సరస్వతి, జర్నలిస్టు, రచయిత అయిన కొడుకు రఘు కర్నాడ్, కుమార్తె రాధ ఉన్నారు. తన తండ్రి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని రఘు తెలిపారు. ఆయన ఉదయం వేళలో మరణించారని, 8.30 సమయంలో ఆయన చనిపోయినట్టుగా తాము గుర్తించామని చెప్పారు. కాగా ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం గిరీష్ కర్నాడ్ భౌతికకాయాన్ని బయ్యప్పనహళ్లి రోడ్డులోని కల్లహళ్లిలో ఉండే విద్యుత్ శ్మశాన వాటికలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించినా.. కర్నాడ్ కోరిక మేరకు, ఆయన కుటుంబసభ్యుల విజ్ఞప్తితో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు లేకుండా నిరాడంబరంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా కర్నాడ్ మృతికి సంతాప సూచకంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. మరో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. గిరీశ్ కర్నాడ్ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు, నటులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, హెచ్డీ కుమారస్వామి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక మంత్రులు డీకే శివకుమార్, ఆర్వీ దేశ్‌పాండే, బి.జయశ్రీ, సురేష్ హెబ్లీకార్ తదితర నాటక, సినీరంగ ప్రముఖులు తమ అంతిమ నివాళులర్పించారు. అంత్యక్రియలను తమ వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించాలని భావిస్తున్నందున, అంతిమ నివాళుర్పించేందుకు నేరుగా స్మశానానికే రావాల్సిందిగా కర్నాడ్ కుటుంబం అంతకుముందు ఆయన అభిమానులకు, ప్రుముఖులకు విజ్ఞప్తి చేసింది. భారత సాహితీ రంగానికి మరింత వన్నె తెచ్చే విధంగా తన సొంత భాష కన్నడలో చేసిన గొప్ప రచనలకు గాను 1998లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం: రంగస్థలంలో గిరీశ్ కర్నాడ్‌ది ప్రత్యేక స్థానమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మృతితో భారత సాంస్కృతిక ప్రపంచం చిన్నబోయిందన్నారు. ‘ఆయన మృతి విచారం కలిగించింది. అన్ని మాధ్యమాల్లో తన విలక్షణ నటన కారణంగా కర్నాడ్ కలకాలం గుర్తుండి పోతారు. ఆయన రచనలకు భవిష్యత్తులోనూ ప్రజాదరణ కొనసాగుతుంది..’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా తామొక సాంస్కృతిక రాయబారిని కోల్పోయామని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. వైఎస్ జగన్ సంతాపం గిరీష్ కర్నాడ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కర్నాడ్ మరణం అటు సినీ రంగానికి, ఇటు సాహితీ రంగానికి తీరని లోటు అని జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కర్నాడ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేసీఆర్ సంతాపం కర్నాడ్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ నాటక, సాహిత్య, సినీ రంగానికి ఆయన చేసిన సేవ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిందని కొనియాడారు. -
నటుడు మృతిపై పీఎం, సీఎం సంతాపం
సాక్షి, బెంగళూరు : ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న గిరీష్ కర్నాడ్.. సోమవారం ఉదయం బెంగళూరులోని స్వగృహంలో ఆయన తుది శ్వాస విడిచారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆయన మృతి పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. అన్ని భాషల్లోని తన విలక్షన నటనతో ఎప్పటికీ గుర్తుండిపోతారని, ఆయన ఆకస్మిక మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. మహారాష్ట్ర ముఖ్యమంతి దేవేంద్ర ఫడ్నవీస్ గిరీష్ కర్నాడ్ మృతిపై స్పందిస్తూ.. ప్రసిద్ద నటుడు, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఇండియన్ సినిమా, నాటకరంగం ఓ గొప్ప నటుడ్ని కోల్పోయిందన్నారు. ఆయన మరాఠి నాటకాలను కూడా వేశారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢసానుభూతిని తెలియజేశారు. రాజకీయ ప్రముఖులే కాక, సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కమల్ హాసన్, నగ్మ, అనిల్ కపూర్, సిద్దార్థ్, ప్రకాశ్ రాజ్, మాధవన్, సోనమ్ కపూర్, అనిల్ కపూర్ లాంటి సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించారు. -
‘సంస్కార’ సాహసి గిరీష్ కర్నాడ్
సాక్షి, న్యూఢిల్లీ : నారణప్ప అంత్యక్రియలు ఎలా చేయాలనే విషయంలో ఓ బ్రాహ్మణ బృందం తర్జనభర్జనలు పడుతుంటోంది. మద్యం తాగి, మాంసం తినే అలవాటున్న వాడే కాకుండా గుడి కోవెలలోనే చేపలు పట్టిన వాడు, అందులోను ఓ దళిత మహిళతో కలిసి ఉండేందుకు తన బ్రాహ్మణ భార్యను వదిలేసిన వ్యక్తిని ఎలా బ్రాహ్మణుడిగా గుర్తించాలి? బ్రాహ్మణ సంప్రదాయం ప్రకారం ఎలా అంత్యక్రియలు జరపాలన్నది వారి తర్జనభర్జన. ఇంతలో నారణప్ప ప్రేయసి చంద్రి అక్కడికి వస్తుంది. తాను దాచుకున్న, ఒంటికున్న నగలన్నింటిని వలచి ఆ బ్రాహ్మణ బృందం ముందు పడేసి వీటన్నింటిని తీసుకొని నారణప్పకు ఘనంగా అంత్యక్రియలు జరపాలని వేడుకుంటుంది. ఆ బంగారు నగలను చూసి కళ్లు చెదిరిన బ్రాహ్మణులు అసలు విషయాన్ని మరచిపోయి ఆ నగలు ఎవరు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనే విషయమై చర్చ మొదలవుతుంది. నారణప్ప అంత్యక్రియలు ఎలా జరపాలనే విషయం తేలకపోవడంతో బ్రాహ్మణ అగ్రగణ్యుడు, అగ్రహారపు బ్రాహ్మణుడు ప్రణేశాచార్యకు ఆ చిక్కుముడిని విప్పాల్సిన బాధ్యతను అప్పగిస్తారు. 1970లో విడుదలై ఉత్తమ చిత్రంగా జాతీయ అవార్డు అందుకున్న ‘సంస్కార’ కన్నడ భాషా చిత్రంలోని సన్నివేశం ఇది. ఇందులో ప్రణేశాచార్యగా ప్రముఖ బహు భాషా సినీ నటుడు, దర్శకుడు గిరీష్ కర్నాడ్ నటించారు. ఆయన నటించిన మొట్టమొదటి చిత్రం ఇదే. యూఆర్ అనంతమూర్తి 1965లో ఈ ‘సంస్కార’ అనే నవలను రాశారు. అనుకోకుండా ఆ నవలను చదివిన గిరీష్ కన్నాడ్ కదిలిపోయారు. ఎలాగైనా దాన్ని సినిమాగా తీయాలని పట్టుకు తిరిగారు. ఆయనకు సహకరించేందుకు ‘మద్రాస్ ప్లేయర్స్’ థియేటర్ గ్రూప్‌నకు చెందిన సభ్యులు, తిక్కవరపు పట్టాభి రామరెడ్డి ముందుకు వచ్చారు. తాను సినిమాను తీసేందుకు డబ్బును సమకూర్చడంతోపాటు దర్శకత్వం వహించేందుకు రామరెడ్డి సిద్ధపడ్డారు. ఆయనతో కలిసి గిరీష్ కర్నాడ్ ఆ సినిమాకు స్క్రిప్టు రాశారు. అందులో చంద్రిగా పట్టాభి రామిరెడ్డి భార్య స్నేహలతా రెడ్డి నటించారు. జాతీయ అవార్డు, ప్రశంసలు మొదట ఈ సినిమా విడుదలకు అనేక అభ్యంతరాలు వచ్చాయి. బ్రాహ్మణ సామాజిక వర్గం నుంచి ప్రతికూలత వస్తోందని నాటి కర్ణాటక ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. చివరకు ఎలాగో 1970, మే 13వ తేదీన విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అప్పటికే కొనసాగుతోన్న ‘మరో సినిమా’ ఉద్యమానికి ఈ సినిమా కొత్త ఊపిరిని పోసింది. జాతీయ స్థాయిలో దీనికి ‘ఉత్తమ చిత్రం’ అవార్డు వచ్చింది. కర్నాడ్ పాత్ర అంతర్మథనం బ్రాహ్మణ కులాచారాలు తప్పకుండా, అటు అబ్రాహ్మణుడైన నారణప్పకు ఎలా అంత్యక్రియలు జరిపించాలో పాలుపోకా అంతర్మథనపడే పాత్రలో గిరీష్ కర్నాడ్ అద్భుతంగా రాణించారు. ఎలా అంత్యక్రియలు జరపాలో చంద్రిని అడిగి తెల్సుకుందామని ఊరిబయటనున్న ఆమె వద్దకు వెళ్లిన ప్రణేశాచార్య (కర్నాడ్) ఆమె ప్రేమ వలపులో చిక్కుకుంటారు. కులం తక్కువ పిల్లతో లైంగిక సుఖాన్ని అనుభవించిన తనదే కులం ఇప్పుడు ? ఎవరి కులంలో ఏముంది ? అసలు కులాలు ఏమిటీ ? అని తాంత్విక చింతనలో పడిన ప్రణేశాచార్య ఊర్లోకి వస్తారు. అప్పటికే ఊరిలో ‘ప్లేగ్’ విస్తరించడంతో ప్రజలంతా ఊరొదిలి పారిపోతుంటారు. నారణప్ప మతదేహం కుళ్లిపోవడం వల్ల ప్లేగ్ వ్యాపిస్తోంది. నారణప్పకు సకాలంలో అంత్యక్రియలు చేయకపోవడం వల్ల ఊరంటుకుంది అన్న సందేశంతో సినిమా ముగుస్తుంది. పట్టాభి రామిరెడ్డి సాహసం ఓ అగ్రవర్ణంలో సంస్కరణను ఆశిస్తూ ఈ చిత్ర నిర్మాణానికి. దర్శకత్వానికి పట్టాభి రామిరెడ్డి ముందుకు రావడం ఓ సాహసమైతే ఆయన భార్యతోనే చంద్రి పాత్రను వేయించడం ఆయన ఉన్నత సంస్కారానికి నిదర్శనం. అడవిలో చంద్రి, ప్రణేశాచార్య శారీరకంగా కలుసుకునే దశ్యానికి వాస్తవికంగా చూపిస్తానంటూ పంతం పట్టి మరీ ఆ దశ్యాన్ని ఆయన చిత్రీకరించడం కూడా విశేషమే. ఎందుకంటే అప్పటి వర కు స్త్రీ, పురుషులు లైంగికంగా కలుసుకున్నారనడానికి రెండు పుష్పాలు పరస్పరం తాకినట్టో పెనవేసుకున్నట్లో చూపేవారు. కళాకారుడు ఎస్జీ వాసుదేవ్, రచయిత రాణి డే బుర్రా. ఆస్ట్రేలియా చిత్ర దర్శకుడు టామ్ కోవన్ తదితరులు ఈ చిత్ర నిర్మాణానికి సహకరించారు. (ఈరోజు ఉదయం బెంగళూరులో మరణించిన గిరీష్ కర్నాడ్ సంస్మరణార్థం ఈ వ్యాసం) -
ప్రముఖ నటుడు కన్నుమూత
సాక్షి, బెంగళూరు : ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గిరీష్ కర్నాడ్.. సోమవారం ఉదయం బెంగళూరులోని ఆయన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. రంగస్థల నటుడిగా, రచయితగా, సినిమా దర్శకుడిగా, నటుడిగా ప్రసిద్దిగాంచిన ఆయన.. శంకర్ దాదా ఎంబీబీఎస్, ధర్మచక్రం, రక్షకుడు చిత్రాల్లో తనదైన నటనతో ప్రేక్షకుల్లో చెరగని ముద్రవేశారు. 1938 మే 19న మహారాష్ట్రలోని మథేరాలో జన్మించిన కర్నాడ్ సినిమాల్లో నటిస్తూనే.. పలు రచనలు చేసి 1998లో జ్ఞానపీఠ్ అవార్డును అందుకున్నారు. తుఝ, తలిదండ ఆయన కన్నడ ప్రముఖ రచనలు కాగా.. వంశవృక్ష అనే కన్నడ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. -
అర్బన్ నక్సల్స్ అసలు లక్ష్యం!
కొంత కాలం క్రితం బెంగళూరు నగరంలో జరిగిన నిరసన ప్రదర్శనలో బహిరంగంగా సినీ నటుడు రచయిత కవి గిరీష్ కర్నాడ్, స్వామి అగ్నివేశ్ మరికొందరు మేమూ అర్బన్ నక్సల్స్ అంటూ మెడలో ప్లే కార్డులు ధరిం చారు. ‘అర్బన్ నక్సల్స్’, ‘హాఫ్ మావోయిస్ట్స్’ అనే పదాలు నేడు దేశమంతటా ప్రతిధ్వనిస్తున్నాయి. నగర ప్రాంతాలలో స్థావరాల గురించి ఒకటిన్నర దశాబ్దం క్రితం మావోయిస్టులు కన్న కల ఇప్పుడు ఫలిస్తున్నది. ఉగ్రవాద ధోరణులకు జనామోదం సమకూర్చడమే అర్బన్ నక్సల్స్ ప్రథమ కర్తవ్యం. వీరి అర్బన్ పర్స్పెక్టివ్ పత్రం ప్రకారం పట్టణాలలో, నగరాలలో అసంఘటిత రంగ కార్మికులను సంఘటితం చేయాలి. కార్యకర్తలను సేకరించడంతో పాటు, నాయకత్వాన్ని అభివృద్ది చేసే పని జరగాలి. సెక్యులర్ శక్తులను, పీడనకు గురి అవుతున్న అల్పసంఖ్యాక వర్గాలను హిందూ ఫాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఏకం చేయాలి. 2004లో నాటి ఏపీ ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటి నుంచి నగరాలు, పట్టణాలపై దృష్టి కేంద్రీకరించడం కోసం నక్సల్స్ అధినాయకత్వం శ్రమిస్తూనే ఉంది. పథకం ప్రకారం ఎంపిక చేసిన తమ నాయకులను కొందరిని జనజీవన స్రవంతిలో కలిపి దేశవ్యాప్తంగా తమ పోరాట పంథాను మార్చి భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో వివిధ ప్రజా ఉద్యమాలకు నేతృత్వం వహిస్తూ భారత ప్రభుత్వంపై తమ యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. సంఘ పరివార సంస్థలపై అక్కసును వెళ్లగక్కడం అర్బన్ నక్సల్స్ వ్యూహం. రచయితలను, మేధావులను విద్యార్థులను ‘బ్రెయిన్ వాష్’ చేసి అడవులకు పంపే ప్రయత్నంలో అర్బన్ నక్సల్స్ సఫలీకృతం అవుతున్నారా అనిపిస్తోంది. విశ్వవిద్యాలయాల్లో ఒకప్పటి రాడికల్ విద్యార్థి సంఘం పాత్రను అధ్యాపకులు, మేధావుల రూపంలో కొందరు అర్బన్ నక్సల్స్ పోషిస్తున్నారు. నక్సలైట్ల ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రారంభమైన మొదటి రోజుల నుంచే ఇప్పటి అర్బన్ నక్సల్స్ కీలకపాత్ర పోషిస్తూ వచ్చారు. వీరు గతంలో హక్కుల ఉద్యమకారులుగా చెలామణీ అయ్యారు. సకల వ్యవహారాలను చట్టాలకతీతంగా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ముసుగులో కోర్టుల బయట రాజకీయ రచ్చ ద్వారా తేల్చుకుంటామని భావిస్తున్నారు. మరోవైపున చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళే మార్గంలో అర్బన్ నక్సల్స్ సమస్యకు సరైన పరి ష్కారాలు లభిస్తాయని ఆశిద్దాం. -కొట్టె మురళీకృష్ణ, కరీంనగర్ మొబైల్ : 94417 26741 -
సీనియర్ నటుడు గిరీష్ కర్నాడ్‌పై ఫిర్యాదులు
బెంగళూరు: ప్రముఖ నటుడు, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్‌పై వరుస ఫిర్యాదులు నమోదయ్యాయి. గిరీష్ కర్నాడ్‌కు నిషేధిత మావోయిస్టు సంస్థతో సంబంధాలున్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలంటూ ఓ న్యాయవాది, శ్రీరామ సేన కార్యకర్తలు పోలీసులను ఆశ్రయించారు. హత్యకు గురైన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేశ్ ప్రథమ వర్థంతి (సెప్టెంబర్ 5) సందర్భంగా ‘మీ టూ అర్బన్ నక్సల్’ అన్న ప్లకార్డు ధరించడాన్ని తప్పుపడుతూ ఈ కేసు నమోదు చేశారు. వీరిలో గౌరీ లంకేశ్ హత్య కేసులో నిందితుల తరఫున వాదిస్తున్న న్యాయవాది ఎన్పీ అమృతేశ్ ఒకరు కావడం గమనార్హం. హిందూ జన జాగృతి సమితి సభ్యులు కూడా కర్నాడ్‌పై నగర పోలీసు కమిషనర్‌కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. నక్సలిజాన్ని సమర్ధిస్తున్న ఆయనపై చట్టపరమైన చర్య తీసుకోవాలని కోరారు. గిరీష్ కర్నాడ్‌పై హైకోర్టు న్యాయవాది ఎన్పీ అమృతేశ్ విధానసౌదా పోలీస్ స్టేషన్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిషేధానికి గురైన సంస్థ బ్యానర్‌ను ఎవరైనా ఎలా ధరిస్తారు అని ఆయన ప్రశ్నించారు. గిరీష్ కర్నాడ్, అతని అనుచరులకు మావోయిస్టు సంబంధాలున్నారని ఆరోపించారు. ఈ ప్లకార్డును ధరించడం ద్వారా కర్నాడ్ నక్సలైట్ల హింసాత్మక కార్యకలాపాలను ప్రచారం చేశారని, అందుకు ఆయనను అరెస్ట్ చేయాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్బన్ నక్సల్స్ దేశంపై తిరుగుబాటు చేయాలని ప్రచారం చేస్తున్నారన్నారు. కర్నాడ్‌కు మద్దతుగా ప్రకాశ్ రాజ్, స్వామి అగ్నివేష్, జిగ్నేష్ మేవానీ, కన్హయ కుమార్ కూడా ఉన్నారనీ, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. నక్సల్స్‌తో సంబంధాలతోపాటు భీమా కోరెగావ్ కేసులో గిరీష్‌కు ప్రమేయం ఉందని, ఆయనను అరెస్ట్ చేసి విచారణ చేపట్టాలని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ఫిర్యాదుపై గిరీష్ కర్నాడ్ స్పందించారు. ‘ప్రజాస్వామ్య దేశంలో నివసిస్తున్నాం. కేసు దాఖలు చేసే హక్కు అతనికి ఉంది. అలాగే తాననుకున్నది స్వేచ్ఛగా పాటించే హక్కు తనకూ వుంద’ని చెప్పారు. న్యాయాన్యాయాలను చట్టం చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. -
లంకేశ్ హత్య: హిట్ లిస్ట్‌లో ప్రముఖ నటుడు
సాక్షి, బెంగళూరు : ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడు అమోల్ కాలే నుంచి స్వాధీనం చేసుకున్న డైరీలో పలు ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. ఆ డైరీని పరిశీలించిన సిట్ అధికారులు హిట్ లిస్ట్‌లోని పేర్లను చూసి షాక్ తిన్నారు. హిందూత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మంది హిట్ లిస్ట్‌లో ఉన్నట్లు స్పెషల్ ఇన్వెష్టిగేషన్ టీం (సిట్) అధికారులు తెలిపారు. లిస్ట్‌లో మొదటి పేరు కన్నడ ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ఉన్నట్లు సిట్ అధికారులు వెల్లడించారు. రెండో వ్యక్తిగా జర్నలిస్ట్ గౌరి లంకేశ్ ఉన్నట్లు గుర్తించారు. హిందూత్వ భావాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్న ఆరోపణలతో లంకేశ్‌ను గత ఏడాది సెప్టెంబర్ 5న తన ఇంటి సమీపంలోనే కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. రాడికల్ హిందూత్వ గ్రూప్ సభ్యులు ఆమెను హత్య చేసినట్లు పోలీసుల విచారణ తేలింది. అదే ముఠాకి చెందిన కొందరు సభ్యులు కర్ణాటక, మహారాష్ట్రాల్లో హిందుత్వ ధర్మనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న 37 మందిని టార్గెట్‌గా పెట్టుకున్నారు. 2016 నుంచి హిట్ లిస్ట్‌లో ఉన్న వారిపై హత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు డైరీలో వారు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం 50 మంది కరుడుగట్టిన హిందుత్వవాద షూటర్లను కూడా రిక్రూట్మెంట్ చేసుకున్నారు. ఈ విషయాలను డైరీలో కోడ్ భాషలో రాసుకున్నటు సిట్ అధికారులు వెల్లడించారు. హిట్ లిస్ట్‌లో నంబర్ వన్‌గా ఉన్న గిరీష్ కర్నాడ్‌కు కర్ణాటక పోలీసులు గట్టి భద్రత కల్పించారు. -
హిట్‌లిస్టులో 60 మంది
బనశంకరి: బెంగళూరులో ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకేసులో కీలక నిందితులు నివ్వెరపోయే నిజాలను బయటపెడుతున్నారు. తమకు మతం కంటే ఏదీ ఎక్కువ కాదని, మతాన్ని కించపరిస్తే సహించేది లేదని చెబుతున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాలు కలిపి 5 రాష్ట్రాల్లో హిందూ వ్యతిరేకులుగా ఉన్న 60 మంది సాహితీవేత్తలు, సామాజికవేత్తల జాబితాను సిద్ధం చేసి వారిని అంతమొందించటానికి సిద్ధమైనట్లు గౌరీ లంకేశ్ హత్య కేసులో పట్టుబడిన షార్ప్‌షూటర్ పరశురామ్ వాగ్మారే సిట్ ముందు బయట పెట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో వీరందరికీ ప్రాణభయం లేకుండా భారీ భద్రత కల్పించాలని వారికి సాయుధ భద్రత కల్పించాలని, కార్యాలయాలు, ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు అమర్చాలని, వీరు వెళ్లే ప్రాంతాల్లో భద్రత ఏర్పాట్లు చేయాలని సిట్ రాష్ట్ర హోంశాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, నటుడు గిరీష్ కర్నాడ్, సాహితీవేత్తలు కేఎస్.భగవాన్, నరేంద్రనాయక్, నిడుమామిడి మఠం శ్రీ వీరభద్ర చెన్నమల్లస్వామికి భద్రత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ హిట్‌లిస్టులో ప్రముఖ బహుభాషా నటుడు ప్రకాష్‌రాజ్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. -
గిరీష్ కర్నాడ్‌కు భద్రత పెంపు..
సాక్షి, బెంగళూర్ : హిందూ అతివాద సంస్థల హిట్ లిస్ట్‌లో ఉన్న ప్రముఖ నటుడు, రచయిత గిరీష్ కర్నాడ్, హేతువాదులు కేఎస్ భగవాన్, నరేంద్ర నాయక్, నిడుమామిడి మఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామీజీలకు భద్రత కల్పించాలని జర్నలిస్ట్ గౌరీలంకేష్ హత్య కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. ఈ నలుగురికి గన్మెన్లను కేటాయించడంతో పాటు వారి ఇళ్ల వద్ద సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని హోంశాఖకు రాసిన లేఖలో సిట్ కోరింది. హై స్టోరేజ్ సామర్థ్యంతో సీసీటీవీ యూనిట్లను నెలకొల్పాలని, కనీసం ఏడాది పాటు ఫుటేజ్‌ను స్టోర్ చేసే వెసులుబాటు ఉండాలని కోరింది. హిందూ సంస్థల నుంచి ముప్పును ఎదుర్కొంటున్న ఈ నలుగురి కదలికలను, కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని సిట్ అధికారులు సూచించారు. కాగా జర్నలిస్ట్ గౌరీలంకేష్ హత్య కేసులో ఘూటర్గా అనుమానిస్తున్న వ్యక్తితో సహా ఆరుగురు నిందితులను సిట్ అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. గౌరీ లంకేష్ హత్యకు కుట్ర పన్నిన ప్రధాన సూత్రధారితో పాటు షూటర్ పరశురామ్ వాగ్మోర్కు ఆయుధాన్ని అందించిన వారి కోసం గాలిస్తున్నామని సిట్ వర్గాలు తెలిపాయి. -
గౌరీ హంతకుడు పరశురామ్ వాగ్మారే
బెంగళూరు: ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్‌ను పరశురామ్ వాగ్మారే అనే దుండగుడు తుపాకీతో కాల్చిచంపాడని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఈ కేసులో అరెస్ట్ చేసిన ఆరుగురు నిందితుల్లో వాగ్మారే ఒకడన్నారు. హేతువాదులు గోవింద్ పన్సారే, ఎం.ఎం.కల్బుర్గీల హత్యకు వాడిన తుపాకీనే లంకేశ్‌ను చంపేందుకు దుండగులు వినియోగించారని స్పష్టం చేశారు. తుపాకీతో కాల్చినప్పుడు బుల్లెట్ వెనుకభాగంలో ఏర్పడ్డ ఒకేరకమైన గుర్తుల ఆధారంగా దీన్ని నిర్ధారించామన్నారు. ఈ హత్యలకు వాడిన తుపాకీని ఇంకా స్వాధీనం చేసుకోలేదని వెల్లడించారు. లంకేశ్ హత్యకు నిందితులు ఆరు నెలల నుంచి ఏడాది పాటు పథకం రచించారన్నారు. కన్నడ రచయిత కేఎస్ భగవాన్, ప్రముఖ నటుడు గిరీశ్ కర్నాడ్‌ల హత్యకూ ఈ గ్యాంగ్ రెక్కీ పూర్తి చేసిందనీ, ఇంతలోనే పోలీసులు వీరిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. లంకేశ్, కల్బుర్గీ, పన్సారేల హత్య వెనుక అతిపెద్ద గ్యాంగ్ ఉందనీ, దాదాపు 60 మందితో మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ నెట్వర్క్ విస్తరించిఉందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్‌చేసిన ప్రవీణ్ అలియాస్ సుజిత్ కుమార్ హిందూ జాగృతి సమితి, సనాతన సంస్థ వంటి అతివాద హిందుత్వ సంస్థల నుంచి ఈ గ్యాంగ్ సభ్యుల్ని ఎంపిక చేశాడన్నారు. ప్రవీణ్ ఏర్పాటుచేసిన గ్యాంగ్‌కు ఎలాంటి పేరు పెట్టలేదన్నారు. కర్నాడ్‌తో పాటు హిందుత్వ ఎజెండాను వ్యతిరేకిస్తున్న రచయిత బి.టి.లలిత నాయక్, హేతువాది సి.డి.ద్వారకనాథ్, నిడుమామిడి మఠాధిపతి వీరభద్ర చన్నమల్ల స్వామీజీని హతమార్చేందుకు వీరు తయారుచేసిన హిట్‌లిస్ట్ పోలీసుల తనిఖీల్లో లభ్యమైందన్నారు. బెంగళూరులోని స్వగృహంలో లంకేశ్‌ను గతేడాది సెప్టెంబర్ 5న దుండుగులు తుపాకీతో కాల్చిచంపారు. -
కర్నాడ్కూ లంకేశ్ హంతకుల ముప్పు!
బెంగళూరు: ప్రముఖ పాత్రికేయురాలు గౌరీ లంకేశ్ హత్యకేసులోని నిందితుల హిట్‌లిస్టులో ప్రముఖ నటుడు, నిర్మాత గిరీశ్ కర్నాడ్ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా, రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత లలితా నాయక్, నిదుమామిడి మఠం పీఠాధిపతి వీరభద్ర చన్నమల్లస్వామి, హేతువాది సీఎస్ ద్వారకనాథ్లకు కూడా వారి నుంచి ముప్పు ఉన్నట్లు తెలిపారు. నిందితుల నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) స్వాధీనం చేసుకున్న ఓ డైరీలో ఈ వివరాలున్నట్లు పేర్కొన్నారు. హిందుత్వ భావజాలాన్ని వ్యతిరేకిస్తున్న ఈ ప్రముఖులను వారు లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. డైరీలో కొంత సమాచారం సంకేత భాషలో ఉందని, దాని అర్థం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. మరోవైపు, సిట్ మంగళవారం అరెస్ట్ చేసిన 26 ఏళ్ల పరశురామ్ వాగ్మారే అనే యువకుడు లంకేశ్‌ను కాల్చి చంపాడని వార్తలు వచ్చాయి. అయితే వాటిని సిట్ అధిపతి బీకే సింగ్ కొట్టిపారేశారు. లంకేశ్‌ను వాగ్మారే హత్యచేసినట్లు తమ విచారణలో ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ ఆరుగురిని అరెస్ట్ చేసింది. -
గిరీష్ కర్నాడ్‌కు టాటా లిట్ లైఫ్‌టైమ్ అవార్డు
ముంబై: ప్రముఖ నటుడు, నాటక రచయిత గిరీష్ కర్నాడ్‌ను 2017 సంవత్సరానికి గానూ టాటా లిటరేచర్ లైవ్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. ముంబైలోని నారిమన్ పాయింట్ వద్ద ఉన్న నేషనల్ సెంటర్ ఫర్ ద ఫెర్ఫార్మింగ్ ఆర్ట్స్(ఎన్సీపీఏ)లో నవంబర్ 19న జరగనున్న సాహిత్య వేడుకల్లో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. నాటక రచయితగా అవార్డు అందుకోవడం గౌరవంగా భావిస్తున్నానని గిరీష్ తెలిపారు. -
గిరీష్ కర్నాడ్‌ను చంపేస్తామని హెచ్చరిక
ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్‌ను చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయి. కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి టిప్పు సుల్తాన్ పేరు పెట్టాలని డిమాండ్ చేసినందుకు ఆయన్ను చంపేస్తామంటూ కొంతమంది హెచ్చరించారు. తర్వాత.. హిందువులను, వక్కలింగ వర్గాన్ని అవమానిస్తూ సామాజిక సామరస్యాన్ని దెబ్బతీస్తున్నారంటూ బెంగళూరు పోలీసులకు ఓ ఫిర్యాదు కూడా అందింది. మంగళవారం నాడు టిప్పు సుల్తాన్ జయంతి సందర్భంగా గిరీష్ కర్నాడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ఈ వేడుకలను నిరసిస్తూ ప్రదర్శనలు జరిగాయి. వాటిలో కొన్ని హింసాత్మకంగా కూడా మారి, పోలీసు కాల్పుల్లో ఓ వీహెచ్‌పీ కార్యకర్త మరణించాడు. తన వ్యాఖ్యలతో వివాదం రేగడంతో.. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత కూడా అయిన గిరీష్ కర్నాడ్ క్షమాపణలు చెప్పారు. ఎవరైనా తన వ్యాఖ్యల వల్ల ఇబ్బంది పడితే క్షమాపణలు చెబుతున్నానని, అలా చెప్పడం వల్ల తనకేమొస్తుందని అన్నారు. 'ఇన్‌టోలరెంట్ చంద్ర' అనే యూజర్ నేమ్‌తో ట్విట్టర్లో గిరీష్ కర్నాడ్‌ను హెచ్చరిస్తూ పోస్టింగ్ వచ్చిందని, దీనిపై ఏమైనా ఫిర్యాదు అందితే చర్యలు తీసుకుంటామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. -
ఆయన దాహం తీరనిది!
ప్రపంచమొక పద్మవ్యూహం... కవిత్వమొక తీరని దాహం అన్నారు శ్రీశ్రీ. ఇలాంటి కవితా పంక్తులెన్నో కంఠతా వచ్చిన సాహితీప్రియుడైన నటుడు ప్రకాశ్‌రాజ్‌కు మాత్రం నటన ఒక తీరని దాహం. అందుకే, కావచ్చు... వెండితెరపై దక్షిణాది నుంచి ఉత్తరాది దాకా విస్తరించిన ఈ జాతీయ స్థాయి నటుడు విలక్షణంగా రంగస్థలంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కన్నడసీమకు చెందిన ఆయన మరో సీనియర్ నటుడు - సాహిత్యకాడు ఇప్పురుడు గిరీష్ కర్నాడ్ రాసిన కొత్త కన్నడ నాటకంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. నాటకం పేరు - ‘మంత్రపుష్పం’. ‘‘భక్తి, శృంగారం - రెండూ మిళితమైన కథాంశంతో ఈ నాటకం నడుస్తుంది. అందులో నాది కీలకమైన పూజారి పాత్ర’’ అని ప్రకాశ్‌రాజ్ ‘సాక్షి’కి వివరించారు. నిత్యం చేస్తున్న వాణిజ్య తరహా పాత్రలు, చిత్రాల నుంచి ఇది కొంత విశ్రాంతినిస్తుందని ఆయన భావిస్తున్నారు. ‘‘అన్ని భాషల్లోనూ సాహిత్యంలో, రంగస్థలంలో ఇలాంటి ప్రయత్నాలు జరిగితే, ఇటు సాహిత్యానికీ, అటు సమాజానికీ కూడా మరింత మేలు జరుగుతుంది’’ అని ప్రకాశ్‌రాజ్ అభిప్రాయపడ్డారు. మరి, అలాంటి తీరని దాహంతో ముందుకొచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారా? -
‘స్వలింగ సంపర్క’ను... పునః సమీక్షించాలి
= సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ నిరసన = కార్యక్రమానికి నేతృత్వం వహించిన సాహితీవేత్త గిరీష్ కర్నాడ్ సాక్షి, బెంగళూరు : స్వలింగ సంపర్కం నేరమేనంటూ (సెక్షన్-377 ఉటంకిస్తూ) సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఎల్జీబీటీ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గానికి చెందిన వందలాది మంది బెంగళూరులో ఆదివారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసే పలు స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. నగరంలోని టౌన్‌హాల్ ఎదుట మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఆందోళన కార్యక్రమంలో నల్లరిబ్బన్లను ధరించి ఐపీసీ-377 సెక్షన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా గిరీష్ కర్నాడ్ మాట్లాడుతూ...స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఎంతో బాధను కలిగించిందని అన్నారు. తనకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరంటూ చమత్కరించిన గిరీష్ కర్నాడ్ మానవ హక్కులకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రతిఘటనకు నేతృత్వం వహించినట్లు చెప్పారు. భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కొన్ని హక్కులను, స్వాతంత్య్రాన్ని అందజేసిందని తెలిపారు. స్వలింగ సంపర్కం నేరమని పేర్కొనడం వ్యక్తిగత స్వాతంత్య్రానికి భంగం కలిగించడమే అవుతుందని చెప్పారు. తాము ఎవరితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలనే విషయంపై ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని అన్నారు. అందుకే సుప్రీంకోర్టు తన తీర్పును మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.