= సుప్రీంకోర్టు తీర్పును నిరసిస్తూ నిరసన
= కార్యక్రమానికి నేతృత్వం వహించిన సాహితీవేత్త గిరీష్ కర్నాడ్
సాక్షి, బెంగళూరు : స్వలింగ సంపర్కం నేరమేనంటూ (సెక్షన్-377 ఉటంకిస్తూ) సుప్రీంకోర్టు ఇటీవల వెల్లడించిన తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ ఎల్‌జీబీటీ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్) వర్గానికి చెందిన వందలాది మంది బెంగళూరులో ఆదివారం నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమానికి మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసే పలు స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలు మద్దతు తెలిపారు. నగరంలోని టౌన్‌హాల్ ఎదుట మధ్యాహ్నం 3 గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు కొనసాగిన ఆందోళన కార్యక్రమంలో నల్లరిబ్బన్‌లను ధరించి ఐపీసీ-377 సెక్షన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమానికి ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా గిరీష్ కర్నాడ్ మాట్లాడుతూ...స్వలింగ సంపర్కం నేరమంటూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఎంతో బాధను కలిగించిందని అన్నారు. తనకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరంటూ చమత్కరించిన గిరీష్ కర్నాడ్ మానవ హక్కులకు భంగం కలుగుతుందనే ఉద్దేశంతోనే ఈ ప్రతిఘటనకు నేతృత్వం వహించినట్లు చెప్పారు.
భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికీ కొన్ని హక్కులను, స్వాతంత్య్రాన్ని అందజేసిందని తెలిపారు. స్వలింగ సంపర్కం నేరమని పేర్కొనడం వ్యక్తిగత స్వాతంత్య్రానికి భంగం కలిగించడమే అవుతుందని చెప్పారు. తాము ఎవరితో ఎలాంటి సంబంధాలు కలిగి ఉండాలనే విషయంపై ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛ ఉందని అన్నారు. అందుకే సుప్రీంకోర్టు తన తీర్పును మరోసారి సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
‘స్వలింగ సంపర్క’ను... పునః సమీక్షించాలి
Published Mon, Dec 16 2013 2:55 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement