ఆకాశానికి ఎదిగిన గిరి | Girish Karnad is no more | Sakshi
Sakshi News home page

ఆకాశానికి ఎదిగిన గిరి

Published Tue, Jun 11 2019 5:21 AM | Last Updated on Tue, Jun 11 2019 10:26 AM

Girish Karnad is no more - Sakshi

ప్రఖ్యాత నటుడు, నాటకకర్త, దర్శకుడు గిరిష్‌ కర్నాడ్‌ (81) సోమవారం బెంగళూరులో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబం తెలిపింది. కర్నాడ్‌ భార్య సరస్వతి గణపతి వైద్యురాలు. కుమారుడు రఘు రచయిత, జర్నలిస్టు. కుమార్తె షల్మలి ఆరోగ్యరంగంలో పని చేస్తున్నారు. మహారాష్ట్రలోని మాథెరన్‌ (ముంబైకి సమీపంలో ఉండే హిల్‌స్టేషన్‌)లో జన్మించిన కర్నాడ్‌ బాల్యం పూణెలో కౌమారం కర్నాటకలోని ధార్వాడ్‌లో గడిచింది. ఇంట్లో మరాఠి, కన్నడ... రెండు భాషలు మాట్లాడేవారు. బిఎస్సీ మేధమేటిక్స్‌ చదివినప్పటికీ కళారంగంలో తన అభిరుచిని గమనించిన కర్నాడ్‌ నాటకాల ద్వారా, సినిమాల ద్వారా గుర్తింపు పొందారు. జానపద, పౌరాణిక పరంపరను ఆధునికతతో సమ్మిళతం చేసి కొంత మార్మిక ధోరణిలో సాగిన కర్నాడ్‌ నాటక శైలి విశేష ఖ్యాతి సాధించి పెట్టింది. ప్రఖ్యాత కన్నడ రచయిత బి.వి.కారంత్‌తో కలిసి నాటకాల్లో, సినిమాల్లో కర్నాడ్‌ విశేష కృషి చేశారు.

పారలల్‌ సినిమాలు ఊపందుకోవడంలో ముఖ్యపాత్ర పోషించారు. శ్యాం బెనగళ్‌ దర్శకత్వంలో హైదరాబాద్‌ నేపథ్యంలో సాగే ‘అంకుర్‌’ కథలో కర్నాడ్‌ కనిపిస్తారు. ‘నిషాంత్‌’, ‘మంథన్‌’, ‘స్వామి’ ఆయన నటించిన ఇతర సినిమాలు. కర్నాడ్‌ చేసిన కృషికి ఎన్నో పురస్కారాలు అందాయి. 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్‌ గౌరవాన్ని పొందారు. 1998లో ఆయనకు సాహిత్యంలో ప్రకటించే సర్వోన్నత పురస్కారం ‘జ్ఞానపీuŠ‡’ దక్కింది. కర్నాడ్‌ మృతి వార్త వెలువడిన వెంటనే కర్నాటక ప్రభుత్వం సోమవారం రోజు ప్రభుత్వ సెలవును ప్రకటించింది. మూడురోజుల సంతాప దినాలను పాటించాలని కోరింది. కర్నాడ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని భావించినా కర్నాడ్‌ చివరి కోరిక మేరకు కర్నాడ్‌ కుటుంబం సున్నితంగా తోసిపుచ్చింది. అభిమానులు, సెలబ్రిటీలు భారీగా తరలిరావడానికి కూడా అంగీకరించలేదు. కొంతమంది నాటకరంగ మిత్రులు మాత్రమే అంతిమ నివాళి అర్పించినవారిలో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్‌ దహనవాటిక ద్వారా గిరిష్‌ కర్నాడ్‌ అంతిమ సంస్కారాలు ముగిశాయి.

నటుడుగా, నాటకకర్తగా, దర్శకుడిగా, చైతన్యకారునిగా, బుద్ధిజీవిగా తన కాలపు తరాలకే కాదు రాబోవు తరాలకు కూడా గిరిష్‌ కర్నాడ్‌ స్ఫూర్తిమంతంగా నిలిచాడు.81 సంవత్సరాల వయసులో జూన్‌ 10న ఆయన ప్రపంచమనే ఈ నాటకరంగాన్నిశాశ్వతంగా విడిచిపెట్టి అభిమానుల నుంచి వీడ్కోలు తీసుకున్నాడు.

తెలుగువారికి నటుడుగా పరిచయం కావడానికి ముందే గిరిష్‌ కర్నాడ్‌ తెలుగు సినిమాల కోసం పని చేశాడు. శ్యామ్‌ బెనగళ్‌ దర్శకత్వం వహించిన ‘అనుగ్రహం’ సినిమాకు బెనగళ్‌తో పాటు ఆయన కూడా స్క్రీన్‌ ప్లే రాశాడు. వాణిశ్రీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను అభిరుచి ఉన్న ప్రేక్షకులు నేటికీ మర్చిపోలేదు. నిజానికి కర్నాడ్‌– తాను నాటకం రాయగలడని, నటించగలడని, దర్శకత్వం వహించగలడని తెలియకుండా ఆయా దారుల గుండా ప్రయాణించి, అత్యుత్తమ ప్రతిభ కనపరిచి, ఎత్తులకు ఎదిగాడు.

కర్నాడ్‌కు ఇంగ్లిష్‌ కవి కావాలని ఉండేది. లండన్‌ తన శాశ్వత నివాస నగరి అని చదువుకునే రోజుల్లోనే అనుకున్నాడు. లండన్‌లో చదువుకోవడానికి  స్కాలర్‌షిప్‌ రావడం చాలా పెద్ద విషయం కనుక ఎక్కువ మార్కులు పొందడం ఒక్కటే మార్గం అనుకుని, తనకు పెద్దగా ఇష్టం లేని గణితంలో డిగ్రీ చేసి ఆశించినట్టుగా స్కాలర్‌షిప్‌ పొందాడు. అయితే తల్లిదండ్రులు ఇద్దరూ నాటక రంగంతో పరిచయం ఉన్నవారు కావడం వల్ల తెలియకుండానే పుస్తకాల పట్ల, కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఉత్తర కర్ణాటకకు సాంస్కృతిక క్షేత్రమైన ‘ధార్వాడ్‌’లో ఇంటర్, డిగ్రీ చదవడం వల్ల, ఆ సమయంలో అక్కడికి వచ్చే ప్రఖ్యాత సాహిత్యకారులతో పరిచయం ఏర్పడటం వల్ల కర్నాడ్‌కు సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. ఆ రోజుల్లో ఊరూరా తిరిగి యక్షగానాలను ప్రదర్శించే బృందాలతో ప్రభావితం చెందాడు. సి.రాజగోపాలచారి మహాభారతానికి రాసిన వ్యాఖ్యాన ఉద్గ్రంథం చదివాక ఒకరోజు హటాత్తుగా ఉద్ధృతిగా ఆయన రాసిన తొలి నాటకమే ‘మానిషాద’. కాలేజీ ముగిశాక లండన్‌ వెళ్లే ముందు ఈ కన్నడ నాటకం రాసి, దాని సంగతి వదిలి, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుతూ అక్కడి ఇంగ్లిష్‌ కార్యకలాపాలలో మునిగాడు కర్నాడ్‌. ఇంగ్లిష్‌ కవిగా, నాటకకారునిగా గుర్తింపు పొందాలని తపన పడుతున్నప్పుడు ‘మా నిషాద’ కన్నడలో అచ్చయ్యి పేరు తెచ్చింది. లండన్‌కు పంపుతూ తండ్రి ‘నువ్వు తిరిగి వచ్చి మమ్మల్ని చూసుకోవాలి’ అని షరతు పెట్టడం గుర్తొచ్చి, భారతంలో ‘యయాతి’ కూడా తన కుమారులకు ‘మీ యవ్వనం ఇవ్వండి’ అని షరతు పెట్టాడు కదా అనుకుని లండన్‌లో ఉండగానే రాసిన మరో నాటకం ‘యయాతి’. కన్నడంలో రాసిన ఆ నాటకం గిరిష్‌ కర్నాడ్‌కు చాలా ఖ్యాతి తెచ్చిపెట్టింది. దాంతో కర్నాడ్‌ ‘ఇక ఇంగ్లిష్‌ నేలకు సెలవు... నా సాధనంతా నా మాతృభాషలో చేసుకుంటాను... నా సాహిత్యకృషి అంతా నా దేశంలోనే సాగాలి’ అనుకుని ఇక్కడకు వచ్చేశాడు.

భారతదేశానికి వచ్చి  ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ ప్రెస్, మద్రాసు శాఖలో పని చేస్తూ ఉండగా ప్రఖ్యాత అనువాదకుడు ఏ.కె.రామానుజన్‌ కర్నాడ్‌కు షికాగో యూనివర్సిటీలో విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా పని చేసే అవకాశం కల్పించాడు. అంతే కాదు ఒక తాజా నాటకం రాయమని కర్నాటక ప్రాంతంలో ఉన్న ఒక జానపద కథను సూచించాడు. ఆ కథ ఆధారంగా కర్నాడ్‌ రాసిన నాటకమే ‘నాగమండల’. తనను పట్టించుకోని మొగునికి మందు పెడదామని ఒక ఇల్లాలు అనుకుని పాలల్లో మందు కలిపితే పొరపాటున ఆ పాలు వొలికి పుట్టలో పడతాయి. వాటిని తాగిన పుట్టలోని పాము రోజూ ఆమె భర్త రూపు దాల్చి ఇల్లాలితో కూడుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందనేది కథ. ఈ నాటకమే కాదు చరిత్ర పట్ల, చరిత్రను చూడాల్సిన చూపు పట్ల అవగాహన ఉన్న కర్నాడ్‌ ‘తుగ్లక్‌’, ‘టిప్పు సుల్తాన్‌’ నాటకాలు రాసి దేశంలో, విదేశాలలో గుర్తింపు పొందాడు.

వద్దనుకుంటే పుట్టిన బిడ్డ
గిరిష్‌ కర్నాడ్‌ తల్లికి మొదటి భర్త నుంచి ఒక కొడుకు ఉన్నాడు. రెండవ పెళ్లి తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. గిరిష్‌ కర్నాడ్‌ కడుపులో పడినప్పుడు ఇప్పటికే ముగ్గురు ఉన్నారు కదా, అబార్షన్‌ చేయించుకుంటాను అని అనుకుందట తల్లి. అబార్షన్‌ కోసం ఒక డాక్టరమ్మ క్లినిక్‌కు కూడా వెళ్లిందట. అయితే అదృష్టవశాత్తు ఆ డాక్టరమ్మ ఆ రోజు క్లినిక్‌కు రాలేదు. లీవు పెట్టింది. మధ్యాహ్నం వరకూ కూచున్న కర్నాడ్‌ తల్లి విసుగొచ్చి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఆమెకు అబార్షన్‌ చేయించుకోవాలనే మూడ్‌ పోవడంతో కర్నాడ్‌ పుట్టాడు. ‘ఈ సంగతి తెలిసి ఆశ్చర్యపోయాను. నేను పుట్టకుండా ఈ లోకం ఎలా ఉంటుంది ఎలా ఉండేది అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే’ అని నవ్వుతాడు కర్నాడ్‌.

సారస్వత బ్రాహ్మణులు
గిరిష్‌ కర్నాడ్‌ కుటుంబం సారస్వత బ్రాహ్మణ కుటుంబం. పూర్వం సరస్వతి నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన బ్రాహ్మణులు కనుక తాము సారస్వత బ్రాహ్మణులు అని వీరు అంటారు. వీరు ఆది నుంచి ఉన్నత విద్యావంతులు. బ్రిటిష్‌ హయాంలో మంచి హోదాలలో పని చేశారు. కర్నాటకలోని ధర్వాడ్‌ సమీపంలో ఉన్న సారస్వత్‌పూర్‌లో 1950లలోనే యాభై బంగళాలలో సారస్వత బ్రాహ్మణులు ఒక అగ్రహారంగా జీవించేవారు. కర్నాడ్‌కు అక్కడ ఒక సొంత బంగ్లా ఉంది. కర్నాడ్‌ తల్లి కృష్ణాబాయి. తండ్రి డాక్టర్‌ రఘునాథ్‌ కర్నాడ్‌. తల్లి బాల వితంతువు కాగా ఆమె నర్సుగా పని చేస్తూ డాక్టర్‌ అయిన రఘునాథ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఆమె పెద్ద కొడుకు తన సవతి కొడుకని చాలా ఏళ్ల వరకూ తెలియకుండా తల్లి తమను పెంచిందని కర్నాడ్‌ చెప్పారు. 

కన్నడంలో సంచలనం సృష్టించిన నవల ‘సంస్కార’ (రచన: యు.ఆర్‌.అనంతమూర్తి) ఆధారంగా తీస్తున్న సినిమాలో మొదటిసారి ప్రధానపాత్రలో నటించాడు కర్నాడ్‌. దీనికి దర్శకత్వం వహించిన పఠాభి తెలుగువాడు కనుక కర్నాడ్‌ను స్క్రీన్‌ ఆర్టిస్ట్‌ను చేసిన ఘనత తెలుగువారిది అని సంతోషించాలి. ఆ తర్వాత శ్యాం బెనగళ్‌తో ఏర్పడిన పరిచయం త్వరత్వరగా కర్నాడ్‌ను హిందీ భాషల్లో ఇతర భారతీయ భాషల్లో వ్యాప్తి చెందేలా చేసింది. దేశంలో క్షీర విప్లవం తెచ్చిన కురియన్‌ అనుభవాల ఆధారంగా బెనగళ్‌ తీసిన ‘మంథన్‌’లో కర్నాడ్‌ హీరోగా నటించి చాలామందికి గుర్తుండిపోయాడు. జంధ్యాల దర్శకత్వంలో ‘ఆనందభైరవి’లో నటించి ‘శంకరాభరణం’ జె.వి.సోమయాజులు తర్వాత అంతటి పేరు పొందిన నటుడు కర్నాడ్‌. తనకు వచ్చిన నాట్యానికి వారసులు లేకుండా పోతారేమోనన్న చింతలో ఉండే నాట్యాచారునిగా, పట్టిన పట్టు కోసం చివరకు కపాలమోక్షం చేసుకునే ఆత్మాభిమానిగా కర్నాడ్‌ నటన తెలుగువారిని కట్టిపడేసింది.

సాహిత్యం తెలిసినవాడు సినిమాల్లోకి వెళితే ఏం చేస్తాడో గిరిష్‌ కర్నాడ్‌ కూడా అదే చేశాడు. కన్నడంలో ఎస్‌.ఎల్‌.ౖభైరప్ప రాయగా విఖ్యాతమైన నవల ‘వంశవృక్ష’ను తొలిసారిగా డైరెక్ట్‌ చేశాడు. ఆ తర్వాత భైరప్పే రాసిన మరో నవల ‘గోధూళి’ని, మరో నవల ‘కాడు’ను సినిమాలుగా తీశాడు. ‘కాడు’ సినిమా ‘క్షత్రియ పుత్రుడు’ తీయడానికి తనకు ఇన్‌స్పిరేషన్‌గా పని చేసిందని కమల హాసన్‌ ఒక సందర్భంలో చెప్పాడు. ఇక శూద్రకుడు రాసిన విఖ్యాత సంస్కృత నాటకం ‘మృచ్ఛకటికం’ను హిందీలో ‘ఉత్సవ్‌’ పేరుతో తీశాడు కర్నాడ్‌. శశికపూర్‌ నిర్మించిన ఈ సినిమా రేఖ, శేఖర్‌ సుమన్‌లకు చాలా పేరు తెచ్చి పెట్టింది. తన ఆసక్తికి తగిన పనులు చేస్తూ భుక్తికి కమర్షియల్‌ సినిమాలలో నటించాడు. శంకర్‌ దర్శకత్వంలోని ‘ప్రేమికుడు’లో ఆయన పోషించిన గవర్నర్‌ పాత్ర అందరికీ గుర్తు. ‘ధర్మచక్రం’లో వెంకటేశ్‌కు, ‘శంకర్‌ దాదా ఎం.బి.బి.ఎస్‌’లో చిరంజీవికి కర్నాడ్‌ తండ్రిగా నటించాడు. హిందీలో ఇటీవల ‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందాహై’లలో సల్మాన్‌ ఖాన్‌ బాస్‌గా ముఖ్యపాత్ర పోషించాడు.

గిరిష్‌ కర్నాడ్‌ నటుడే కాదు నటగురువు కూడా. పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రిన్సిపాల్‌గా ఉంటూ నసిరుద్దిన్‌ షా వంటి నటులకు పాఠాలు చెప్పాడు. విద్యార్థిగా ఉన్న నసిరుద్దీన్‌ షా ప్రిన్సిపాల్‌గా ఉన్న కర్నాడ్‌ మీద తోటి విద్యార్థులతో కలిసి సమ్మెకు దిగడం ఆనాటి ఒక ముచ్చట. పూణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒక గొప్ప ఇన్‌స్టిట్యూట్‌గా ఖ్యాతి గడించడానికి కర్నాడ్‌ స్థిరం చేసిన ప్రమాణాలే కారణం. కొత్త టాలెంట్‌ను గమనించే కర్నాడ్‌ తన సినిమాల ద్వారా  విష్ణువర్థన్, శంకర్‌నాగ్‌లను ఇంట్రడ్యూస్‌ చేశాడు. ఇవాళ్టి విఖ్యాత ఆర్ట్‌ డైరెక్టర్‌ సాబు సిరిల్‌ని కూడా కర్నాడే పరిచయం చేశాడు. 

అయితే సృజనకారుడు సృజన చేసి ఊరుకుంటే సరిపోదని అతనికి సామాజిక బాధ్యత ఉండాలని భావించినవాడు కర్నాడ్‌. భారతదేశం వెయ్యేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే మతం, కులం అంటూ కొట్టుకుంటూ ఉందని ఆవేదన చెందుతాడు. మతతత్వం దేశానికి ఏ మాత్రం మంచిది కాదని బాహాటంగా కర్నాడ్‌ వేదికలెక్కి మాట్లాడాడు. సమాజాన్ని చైతన్యపరిచే ఇంటలెక్చువల్స్‌ని ‘అర్బన్‌ నక్సలైట్‌’లుగా ప్రభుత్వ ఏజెన్సీలు వ్యాఖ్యానిస్తుంటే అలాగైతే నేను కూడా అర్బన్‌ నక్సలైట్‌నే అంటూ మెడలో కార్డు వేలాడేసుకుని తిరిగినవాడు కర్నాడ్‌. బెదిరింపులు, హేళనల మధ్య తన నిరసన తెలిపే హక్కును కోల్పోని ధైర్యవంతుడు కర్నాడ్‌.

నాటకశాలలో దీపాలు ఆరిపోయాక స్టేజ్‌ మీద దీపం వెలగాలి. అది బుద్ధికి దారి చూపాలి. సాహిత్యం, సినిమా కూడా చేయాల్సింది అదే. కాని ఇవాళ వెలుతురు ఇవ్వాల్సిన అన్ని కళలకు, సాహిత్య రూపాలకు, ప్రశ్నించే మాధ్యమాలకు నిర్బంధం ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని, నోరున్నా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని కర్నాడ్‌ ఆవేదన చెందుతాడు.

ధైర్యం లేని జాతి మానసిక సంకుచితానికి గురికాక తప్పదని భావించే కర్నాడ్‌లాంటి సృజనకారులను స్మరించుకుంటూ ఉండాలంటే సదా వివేచనతో హేతువుతో ప్రజాస్వామిక విలువలతో ముందుకు సాగాలి.అలా చేయగలగడమే ఆయనకు అసలైన నివాళి.
– కె

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement