playwright
-
ఆకాశానికి ఎదిగిన గిరి
ప్రఖ్యాత నటుడు, నాటకకర్త, దర్శకుడు గిరిష్ కర్నాడ్ (81) సోమవారం బెంగళూరులో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారని కుటుంబం తెలిపింది. కర్నాడ్ భార్య సరస్వతి గణపతి వైద్యురాలు. కుమారుడు రఘు రచయిత, జర్నలిస్టు. కుమార్తె షల్మలి ఆరోగ్యరంగంలో పని చేస్తున్నారు. మహారాష్ట్రలోని మాథెరన్ (ముంబైకి సమీపంలో ఉండే హిల్‌స్టేషన్)లో జన్మించిన కర్నాడ్ బాల్యం పూణెలో కౌమారం కర్నాటకలోని ధార్వాడ్‌లో గడిచింది. ఇంట్లో మరాఠి, కన్నడ... రెండు భాషలు మాట్లాడేవారు. బిఎస్సీ మేధమేటిక్స్ చదివినప్పటికీ కళారంగంలో తన అభిరుచిని గమనించిన కర్నాడ్ నాటకాల ద్వారా, సినిమాల ద్వారా గుర్తింపు పొందారు. జానపద, పౌరాణిక పరంపరను ఆధునికతతో సమ్మిళతం చేసి కొంత మార్మిక ధోరణిలో సాగిన కర్నాడ్ నాటక శైలి విశేష ఖ్యాతి సాధించి పెట్టింది. ప్రఖ్యాత కన్నడ రచయిత బి.వి.కారంత్‌తో కలిసి నాటకాల్లో, సినిమాల్లో కర్నాడ్ విశేష కృషి చేశారు. పారలల్ సినిమాలు ఊపందుకోవడంలో ముఖ్యపాత్ర పోషించారు. శ్యాం బెనగళ్ దర్శకత్వంలో హైదరాబాద్ నేపథ్యంలో సాగే ‘అంకుర్’ కథలో కర్నాడ్ కనిపిస్తారు. ‘నిషాంత్’, ‘మంథన్’, ‘స్వామి’ ఆయన నటించిన ఇతర సినిమాలు. కర్నాడ్ చేసిన కృషికి ఎన్నో పురస్కారాలు అందాయి. 1974లో పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ గౌరవాన్ని పొందారు. 1998లో ఆయనకు సాహిత్యంలో ప్రకటించే సర్వోన్నత పురస్కారం ‘జ్ఞానపీuŠ‡’ దక్కింది. కర్నాడ్ మృతి వార్త వెలువడిన వెంటనే కర్నాటక ప్రభుత్వం సోమవారం రోజు ప్రభుత్వ సెలవును ప్రకటించింది. మూడురోజుల సంతాప దినాలను పాటించాలని కోరింది. కర్నాడ్‌కు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని భావించినా కర్నాడ్ చివరి కోరిక మేరకు కర్నాడ్ కుటుంబం సున్నితంగా తోసిపుచ్చింది. అభిమానులు, సెలబ్రిటీలు భారీగా తరలిరావడానికి కూడా అంగీకరించలేదు. కొంతమంది నాటకరంగ మిత్రులు మాత్రమే అంతిమ నివాళి అర్పించినవారిలో ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు విద్యుత్ దహనవాటిక ద్వారా గిరిష్ కర్నాడ్ అంతిమ సంస్కారాలు ముగిశాయి. నటుడుగా, నాటకకర్తగా, దర్శకుడిగా, చైతన్యకారునిగా, బుద్ధిజీవిగా తన కాలపు తరాలకే కాదు రాబోవు తరాలకు కూడా గిరిష్ కర్నాడ్ స్ఫూర్తిమంతంగా నిలిచాడు.81 సంవత్సరాల వయసులో జూన్ 10న ఆయన ప్రపంచమనే ఈ నాటకరంగాన్నిశాశ్వతంగా విడిచిపెట్టి అభిమానుల నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. తెలుగువారికి నటుడుగా పరిచయం కావడానికి ముందే గిరిష్ కర్నాడ్ తెలుగు సినిమాల కోసం పని చేశాడు. శ్యామ్ బెనగళ్ దర్శకత్వం వహించిన ‘అనుగ్రహం’ సినిమాకు బెనగళ్‌తో పాటు ఆయన కూడా స్క్రీన్ ప్లే రాశాడు. వాణిశ్రీ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను అభిరుచి ఉన్న ప్రేక్షకులు నేటికీ మర్చిపోలేదు. నిజానికి కర్నాడ్– తాను నాటకం రాయగలడని, నటించగలడని, దర్శకత్వం వహించగలడని తెలియకుండా ఆయా దారుల గుండా ప్రయాణించి, అత్యుత్తమ ప్రతిభ కనపరిచి, ఎత్తులకు ఎదిగాడు. కర్నాడ్‌కు ఇంగ్లిష్ కవి కావాలని ఉండేది. లండన్ తన శాశ్వత నివాస నగరి అని చదువుకునే రోజుల్లోనే అనుకున్నాడు. లండన్‌లో చదువుకోవడానికి స్కాలర్షిప్ రావడం చాలా పెద్ద విషయం కనుక ఎక్కువ మార్కులు పొందడం ఒక్కటే మార్గం అనుకుని, తనకు పెద్దగా ఇష్టం లేని గణితంలో డిగ్రీ చేసి ఆశించినట్టుగా స్కాలర్షిప్ పొందాడు. అయితే తల్లిదండ్రులు ఇద్దరూ నాటక రంగంతో పరిచయం ఉన్నవారు కావడం వల్ల తెలియకుండానే పుస్తకాల పట్ల, కళల పట్ల ఆసక్తి ఏర్పడింది. ఉత్తర కర్ణాటకకు సాంస్కృతిక క్షేత్రమైన ‘ధార్వాడ్’లో ఇంటర్, డిగ్రీ చదవడం వల్ల, ఆ సమయంలో అక్కడికి వచ్చే ప్రఖ్యాత సాహిత్యకారులతో పరిచయం ఏర్పడటం వల్ల కర్నాడ్‌కు సాహిత్యం పట్ల ఇష్టం ఏర్పడింది. ఆ రోజుల్లో ఊరూరా తిరిగి యక్షగానాలను ప్రదర్శించే బృందాలతో ప్రభావితం చెందాడు. సి.రాజగోపాలచారి మహాభారతానికి రాసిన వ్యాఖ్యాన ఉద్గ్రంథం చదివాక ఒకరోజు హటాత్తుగా ఉద్ధృతిగా ఆయన రాసిన తొలి నాటకమే ‘మానిషాద’. కాలేజీ ముగిశాక లండన్ వెళ్లే ముందు ఈ కన్నడ నాటకం రాసి, దాని సంగతి వదిలి, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుతూ అక్కడి ఇంగ్లిష్ కార్యకలాపాలలో మునిగాడు కర్నాడ్. ఇంగ్లిష్ కవిగా, నాటకకారునిగా గుర్తింపు పొందాలని తపన పడుతున్నప్పుడు ‘మా నిషాద’ కన్నడలో అచ్చయ్యి పేరు తెచ్చింది. లండన్‌కు పంపుతూ తండ్రి ‘నువ్వు తిరిగి వచ్చి మమ్మల్ని చూసుకోవాలి’ అని షరతు పెట్టడం గుర్తొచ్చి, భారతంలో ‘యయాతి’ కూడా తన కుమారులకు ‘మీ యవ్వనం ఇవ్వండి’ అని షరతు పెట్టాడు కదా అనుకుని లండన్‌లో ఉండగానే రాసిన మరో నాటకం ‘యయాతి’. కన్నడంలో రాసిన ఆ నాటకం గిరిష్ కర్నాడ్‌కు చాలా ఖ్యాతి తెచ్చిపెట్టింది. దాంతో కర్నాడ్ ‘ఇక ఇంగ్లిష్ నేలకు సెలవు... నా సాధనంతా నా మాతృభాషలో చేసుకుంటాను... నా సాహిత్యకృషి అంతా నా దేశంలోనే సాగాలి’ అనుకుని ఇక్కడకు వచ్చేశాడు. భారతదేశానికి వచ్చి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్, మద్రాసు శాఖలో పని చేస్తూ ఉండగా ప్రఖ్యాత అనువాదకుడు ఏ.కె.రామానుజన్ కర్నాడ్‌కు షికాగో యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేసే అవకాశం కల్పించాడు. అంతే కాదు ఒక తాజా నాటకం రాయమని కర్నాటక ప్రాంతంలో ఉన్న ఒక జానపద కథను సూచించాడు. ఆ కథ ఆధారంగా కర్నాడ్ రాసిన నాటకమే ‘నాగమండల’. తనను పట్టించుకోని మొగునికి మందు పెడదామని ఒక ఇల్లాలు అనుకుని పాలల్లో మందు కలిపితే పొరపాటున ఆ పాలు వొలికి పుట్టలో పడతాయి. వాటిని తాగిన పుట్టలోని పాము రోజూ ఆమె భర్త రూపు దాల్చి ఇల్లాలితో కూడుతూ ఉంటుంది. తర్వాత ఏమవుతుందనేది కథ. ఈ నాటకమే కాదు చరిత్ర పట్ల, చరిత్రను చూడాల్సిన చూపు పట్ల అవగాహన ఉన్న కర్నాడ్ ‘తుగ్లక్’, ‘టిప్పు సుల్తాన్’ నాటకాలు రాసి దేశంలో, విదేశాలలో గుర్తింపు పొందాడు. వద్దనుకుంటే పుట్టిన బిడ్డ గిరిష్ కర్నాడ్ తల్లికి మొదటి భర్త నుంచి ఒక కొడుకు ఉన్నాడు. రెండవ పెళ్లి తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. గిరిష్ కర్నాడ్ కడుపులో పడినప్పుడు ఇప్పటికే ముగ్గురు ఉన్నారు కదా, అబార్షన్ చేయించుకుంటాను అని అనుకుందట తల్లి. అబార్షన్ కోసం ఒక డాక్టరమ్మ క్లినిక్‌కు కూడా వెళ్లిందట. అయితే అదృష్టవశాత్తు ఆ డాక్టరమ్మ ఆ రోజు క్లినిక్‌కు రాలేదు. లీవు పెట్టింది. మధ్యాహ్నం వరకూ కూచున్న కర్నాడ్ తల్లి విసుగొచ్చి ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత ఆమెకు అబార్షన్ చేయించుకోవాలనే మూడ్ పోవడంతో కర్నాడ్ పుట్టాడు. ‘ఈ సంగతి తెలిసి ఆశ్చర్యపోయాను. నేను పుట్టకుండా ఈ లోకం ఎలా ఉంటుంది ఎలా ఉండేది అని ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే’ అని నవ్వుతాడు కర్నాడ్. సారస్వత బ్రాహ్మణులు గిరిష్ కర్నాడ్ కుటుంబం సారస్వత బ్రాహ్మణ కుటుంబం. పూర్వం సరస్వతి నది పరివాహక ప్రాంతం నుంచి వచ్చిన బ్రాహ్మణులు కనుక తాము సారస్వత బ్రాహ్మణులు అని వీరు అంటారు. వీరు ఆది నుంచి ఉన్నత విద్యావంతులు. బ్రిటిష్ హయాంలో మంచి హోదాలలో పని చేశారు. కర్నాటకలోని ధర్వాడ్ సమీపంలో ఉన్న సారస్వత్పూర్లో 1950లలోనే యాభై బంగళాలలో సారస్వత బ్రాహ్మణులు ఒక అగ్రహారంగా జీవించేవారు. కర్నాడ్‌కు అక్కడ ఒక సొంత బంగ్లా ఉంది. కర్నాడ్ తల్లి కృష్ణాబాయి. తండ్రి డాక్టర్ రఘునాథ్ కర్నాడ్. తల్లి బాల వితంతువు కాగా ఆమె నర్సుగా పని చేస్తూ డాక్టర్ అయిన రఘునాథ్‌ను వివాహం చేసుకున్నారు. అయితే ఆమె పెద్ద కొడుకు తన సవతి కొడుకని చాలా ఏళ్ల వరకూ తెలియకుండా తల్లి తమను పెంచిందని కర్నాడ్ చెప్పారు. కన్నడంలో సంచలనం సృష్టించిన నవల ‘సంస్కార’ (రచన: యు.ఆర్.అనంతమూర్తి) ఆధారంగా తీస్తున్న సినిమాలో మొదటిసారి ప్రధానపాత్రలో నటించాడు కర్నాడ్. దీనికి దర్శకత్వం వహించిన పఠాభి తెలుగువాడు కనుక కర్నాడ్‌ను స్క్రీన్ ఆర్టిస్ట్‌ను చేసిన ఘనత తెలుగువారిది అని సంతోషించాలి. ఆ తర్వాత శ్యాం బెనగళ్‌తో ఏర్పడిన పరిచయం త్వరత్వరగా కర్నాడ్‌ను హిందీ భాషల్లో ఇతర భారతీయ భాషల్లో వ్యాప్తి చెందేలా చేసింది. దేశంలో క్షీర విప్లవం తెచ్చిన కురియన్ అనుభవాల ఆధారంగా బెనగళ్ తీసిన ‘మంథన్’లో కర్నాడ్ హీరోగా నటించి చాలామందికి గుర్తుండిపోయాడు. జంధ్యాల దర్శకత్వంలో ‘ఆనందభైరవి’లో నటించి ‘శంకరాభరణం’ జె.వి.సోమయాజులు తర్వాత అంతటి పేరు పొందిన నటుడు కర్నాడ్. తనకు వచ్చిన నాట్యానికి వారసులు లేకుండా పోతారేమోనన్న చింతలో ఉండే నాట్యాచారునిగా, పట్టిన పట్టు కోసం చివరకు కపాలమోక్షం చేసుకునే ఆత్మాభిమానిగా కర్నాడ్ నటన తెలుగువారిని కట్టిపడేసింది. సాహిత్యం తెలిసినవాడు సినిమాల్లోకి వెళితే ఏం చేస్తాడో గిరిష్ కర్నాడ్ కూడా అదే చేశాడు. కన్నడంలో ఎస్.ఎల్.ౖభైరప్ప రాయగా విఖ్యాతమైన నవల ‘వంశవృక్ష’ను తొలిసారిగా డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత భైరప్పే రాసిన మరో నవల ‘గోధూళి’ని, మరో నవల ‘కాడు’ను సినిమాలుగా తీశాడు. ‘కాడు’ సినిమా ‘క్షత్రియ పుత్రుడు’ తీయడానికి తనకు ఇన్స్పిరేషన్గా పని చేసిందని కమల హాసన్ ఒక సందర్భంలో చెప్పాడు. ఇక శూద్రకుడు రాసిన విఖ్యాత సంస్కృత నాటకం ‘మృచ్ఛకటికం’ను హిందీలో ‘ఉత్సవ్’ పేరుతో తీశాడు కర్నాడ్. శశికపూర్ నిర్మించిన ఈ సినిమా రేఖ, శేఖర్ సుమన్‌లకు చాలా పేరు తెచ్చి పెట్టింది. తన ఆసక్తికి తగిన పనులు చేస్తూ భుక్తికి కమర్షియల్ సినిమాలలో నటించాడు. శంకర్ దర్శకత్వంలోని ‘ప్రేమికుడు’లో ఆయన పోషించిన గవర్నర్ పాత్ర అందరికీ గుర్తు. ‘ధర్మచక్రం’లో వెంకటేశ్‌కు, ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్’లో చిరంజీవికి కర్నాడ్ తండ్రిగా నటించాడు. హిందీలో ఇటీవల ‘ఏక్ థా టైగర్’, ‘టైగర్ జిందాహై’లలో సల్మాన్ ఖాన్ బాస్‌గా ముఖ్యపాత్ర పోషించాడు. గిరిష్ కర్నాడ్ నటుడే కాదు నటగురువు కూడా. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ప్రిన్సిపాల్‌గా ఉంటూ నసిరుద్దిన్ షా వంటి నటులకు పాఠాలు చెప్పాడు. విద్యార్థిగా ఉన్న నసిరుద్దీన్ షా ప్రిన్సిపాల్‌గా ఉన్న కర్నాడ్ మీద తోటి విద్యార్థులతో కలిసి సమ్మెకు దిగడం ఆనాటి ఒక ముచ్చట. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఒక గొప్ప ఇన్స్టిట్యూట్గా ఖ్యాతి గడించడానికి కర్నాడ్ స్థిరం చేసిన ప్రమాణాలే కారణం. కొత్త టాలెంట్‌ను గమనించే కర్నాడ్ తన సినిమాల ద్వారా విష్ణువర్థన్, శంకర్నాగ్లను ఇంట్రడ్యూస్ చేశాడు. ఇవాళ్టి విఖ్యాత ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్‌ని కూడా కర్నాడే పరిచయం చేశాడు. అయితే సృజనకారుడు సృజన చేసి ఊరుకుంటే సరిపోదని అతనికి సామాజిక బాధ్యత ఉండాలని భావించినవాడు కర్నాడ్. భారతదేశం వెయ్యేళ్ల క్రితం ఎలా ఉందో ఇప్పుడూ అలాగే మతం, కులం అంటూ కొట్టుకుంటూ ఉందని ఆవేదన చెందుతాడు. మతతత్వం దేశానికి ఏ మాత్రం మంచిది కాదని బాహాటంగా కర్నాడ్ వేదికలెక్కి మాట్లాడాడు. సమాజాన్ని చైతన్యపరిచే ఇంటలెక్చువల్స్‌ని ‘అర్బన్ నక్సలైట్’లుగా ప్రభుత్వ ఏజెన్సీలు వ్యాఖ్యానిస్తుంటే అలాగైతే నేను కూడా అర్బన్ నక్సలైట్‌నే అంటూ మెడలో కార్డు వేలాడేసుకుని తిరిగినవాడు కర్నాడ్. బెదిరింపులు, హేళనల మధ్య తన నిరసన తెలిపే హక్కును కోల్పోని ధైర్యవంతుడు కర్నాడ్. నాటకశాలలో దీపాలు ఆరిపోయాక స్టేజ్ మీద దీపం వెలగాలి. అది బుద్ధికి దారి చూపాలి. సాహిత్యం, సినిమా కూడా చేయాల్సింది అదే. కాని ఇవాళ వెలుతురు ఇవ్వాల్సిన అన్ని కళలకు, సాహిత్య రూపాలకు, ప్రశ్నించే మాధ్యమాలకు నిర్బంధం ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయని, నోరున్నా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయని కర్నాడ్ ఆవేదన చెందుతాడు. ధైర్యం లేని జాతి మానసిక సంకుచితానికి గురికాక తప్పదని భావించే కర్నాడ్లాంటి సృజనకారులను స్మరించుకుంటూ ఉండాలంటే సదా వివేచనతో హేతువుతో ప్రజాస్వామిక విలువలతో ముందుకు సాగాలి.అలా చేయగలగడమే ఆయనకు అసలైన నివాళి. – కె -
గిరీష్ కర్నాడ్ కన్నుమూత
సాక్షి, బెంగళూరు: ఐదు దశాబ్దాల పాటు నాటక, సినీ, సాహితీ ప్రపంచంలో తనదైన ముద్రవేసిన బహుభాషా నటుడు, ప్రఖ్యాత నాటక రచయిత, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ (81) కన్నుమూశారు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం బెంగళూరులో లావెల్లీ రోడ్డులోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సరస్వతి, జర్నలిస్టు, రచయిత అయిన కొడుకు రఘు కర్నాడ్, కుమార్తె రాధ ఉన్నారు. తన తండ్రి ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని రఘు తెలిపారు. ఆయన ఉదయం వేళలో మరణించారని, 8.30 సమయంలో ఆయన చనిపోయినట్టుగా తాము గుర్తించామని చెప్పారు. కాగా ప్రముఖులు, అభిమానుల సందర్శనార్ధం గిరీష్ కర్నాడ్ భౌతికకాయాన్ని బయ్యప్పనహళ్లి రోడ్డులోని కల్లహళ్లిలో ఉండే విద్యుత్ శ్మశాన వాటికలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఉంచారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం భావించినా.. కర్నాడ్ కోరిక మేరకు, ఆయన కుటుంబసభ్యుల విజ్ఞప్తితో ఎలాంటి మతపరమైన కార్యక్రమాలు లేకుండా నిరాడంబరంగా అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా కర్నాడ్ మృతికి సంతాప సూచకంగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సెలవు ప్రకటించింది. మరో మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. గిరీశ్ కర్నాడ్ మృతిపై దక్షిణాది చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు ప్రముఖులు, నటులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావు, హెచ్డీ కుమారస్వామి తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక మంత్రులు డీకే శివకుమార్, ఆర్వీ దేశ్‌పాండే, బి.జయశ్రీ, సురేష్ హెబ్లీకార్ తదితర నాటక, సినీరంగ ప్రముఖులు తమ అంతిమ నివాళులర్పించారు. అంత్యక్రియలను తమ వ్యక్తిగత కార్యక్రమంగా నిర్వహించాలని భావిస్తున్నందున, అంతిమ నివాళుర్పించేందుకు నేరుగా స్మశానానికే రావాల్సిందిగా కర్నాడ్ కుటుంబం అంతకుముందు ఆయన అభిమానులకు, ప్రుముఖులకు విజ్ఞప్తి చేసింది. భారత సాహితీ రంగానికి మరింత వన్నె తెచ్చే విధంగా తన సొంత భాష కన్నడలో చేసిన గొప్ప రచనలకు గాను 1998లో ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. రాష్ట్రపతి, ప్రధాని సంతాపం: రంగస్థలంలో గిరీశ్ కర్నాడ్‌ది ప్రత్యేక స్థానమని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సోమవారం తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. ఆయన మృతితో భారత సాంస్కృతిక ప్రపంచం చిన్నబోయిందన్నారు. ‘ఆయన మృతి విచారం కలిగించింది. అన్ని మాధ్యమాల్లో తన విలక్షణ నటన కారణంగా కర్నాడ్ కలకాలం గుర్తుండి పోతారు. ఆయన రచనలకు భవిష్యత్తులోనూ ప్రజాదరణ కొనసాగుతుంది..’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా తామొక సాంస్కృతిక రాయబారిని కోల్పోయామని కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చెప్పారు. వైఎస్ జగన్ సంతాపం గిరీష్ కర్నాడ్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కర్నాడ్ మరణం అటు సినీ రంగానికి, ఇటు సాహితీ రంగానికి తీరని లోటు అని జగన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. కర్నాడ్ కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కేసీఆర్ సంతాపం కర్నాడ్ మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దేశ నాటక, సాహిత్య, సినీ రంగానికి ఆయన చేసిన సేవ అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిందని కొనియాడారు. -
నవ్వులు వెలవెలపోయాయి
తమిళ నాటక రచయిత, హాస్యనటుడు, డైలాగ్ రైటర్ ‘క్రేజీ’ మోహన్ సోమవారం తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో చెన్నైలో ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. 1952 అక్టోబర్ 16న జన్మించిన ‘క్రేజీ’ మోహన్ అసలు పేరు మోహన్ రంగాచారి. కాలేజీ రోజుల్లో నుంచే నాటకాలు రాసి, అందులో నటిస్తుండేవారు. అలా రాసిన ‘గ్రేట్ బ్యాంక్ రోబరీ’ స్కిట్‌కు ఉత్తమ రచయితగా, ఉత్తమనటుడు అవార్డ్‌ను కమల్‌హాసన్ చేతులమీదుగా అందుకున్నారు. ఆయన రాసిన మొదటి నాటకం ‘క్రేజీ థీవ్స్ ఇన్ పాలవాక్కమ్’. ఈ నాటకం సూపర్ హిట్ అవ్వడమే కాకుండా మోహన్ రంగాచారిని, ‘క్రేజీ’ మోహన్‌గా మార్చింది. ఈ నాటకం ఆధారంగా ఓ టీవీ సీరియల్ కూడా స్టార్ట్ చేశారు. తమ్ముడు మధు బాలాజీ డ్రామా ట్రూప్‌కు ఎక్కువగా నాటకాలు రాసేవారు మోహన్. వేరే ప్రొడక్షన్స్ వాళ్లకు చాలా నాటకాలు రాసిన తర్వాత 1979లో సొంతంగా ఓ ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి, దానికి ‘క్రేజీ క్రియేషన్స్’ అని నామకరణం చేశారు. 30కి పైగా నాటకాలు, 6,500 స్టేజిషోలు చేశారు. మోహన్ నాటకాల్లో వాళ్ల అన్నయ్య మధు బాలాజీ హీరోగా నటించేవారు. ‘క్రేజీ’ మోహన్ రచించిన ‘మ్యారేజెస్ ఆర్ మేడిన్ సెలూన్’ నాటకం ఆధారంగా కె. బాలచందర్ ‘పోయికల్ కుదిరై’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాతో డైలాగ్ రైటర్‌గా సినిమాల్లోకి ప్రవేశించారు మోహన్. ఆ తర్వాత తమిళంలో సూపర్ హిట్ కామెడీ సినిమాలకు తనవంతు మాటల సాయం చేశారాయన. ‘క్రేజీ’ మోహన్ ఎక్కువగా కమల్ హాసన్‌తో పనిచేశారు. ‘సతీ లీలావతి, కాదలా కాదలా (నవ్వండి లవ్వండి), మైఖేల్ మదన కామరాజు, విచిత్రసోదరులు, ఇంద్రన్ చంద్రన్ (ఇంద్రుడు–చంద్రుడు), భారతీయుడు, భామనే సత్యభామనే, తెనాలి, పంచతంత్రం, వసూల్ రాజా ఎంబీబీఎస్’ వంటి సినిమాలకు కలసి పనిచేశారు. ‘అరుణాచలం, రక్షకుడు’ సినిమా చేశారు. నటుడిగా కమల్‌హాసన్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లోనూ మెరిశారు మోహన్. తమిళనాడు రాష్ట్రప్రభుత్వం ‘క్రేజీ’మోహన్‌ను ‘కలైమామణి’ అవార్డుతో సత్కరించింది. ఆయన మృతికి పలువురు సినీప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘స్నేహానికి అంతం అనేదే ఉండదు. మనిషి బతికి ఉంటేనే స్నేహం ఉంటుందా? మోహన్ కామెడీ ఆయన సినిమాల ద్వారా ఆయన అభిమానులలో నిలిచే ఉంటుంది. మోహన్లోనాకు బాగా నచ్చే క్వాలిటీ ఆయన చిన్నపిల్లాడిలాంటి మనస్తత్వం. అందరికీ ఉండేది కాదది. ‘క్రేజీ’ అనే టైటిల్ అతనికి సూట్ కాదు. అతనో ‘కామెడీ జీనియస్’’ అని పేర్కొన్నారు కమల్ హాసన్. కమల్ హాసన్, మోహన్ -
రచయిత, నటుడు హరనాథరావు కన్నుమూత
ప్రముఖ సినీ, నాటక రచయిత, నటుడు ఎంవీయస్ హరనాథరావు (69) ఇక లేరు. గుండెపోటు రావడంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ, సోమవారం తుదిశ్వాస విడిచారు. రంగాచార్యులు, సత్యవతీదేవి దంపతులకు 27 జూలై 1948లో హరనాథరావు జన్మించారు. గుంటూరులో చదువుకుంటున్నప్పుడే నాటకాలపై ఉన్న ఆసక్తితో ‘రక్తబలి, జగన్నాథ రథచక్రాలు’ వంటి వాటిలో నటించారాయన. నటునిగా ప్రస్థానం సాగిస్తూనే ఆయన నీలగిరి కాïఫీ, హిమగిరి కాఫీ పొడి విక్రయ షాపులను నిర్వహించారు. నటించడమే కాదు.. పలు నాటకాలు రచించారు. ‘జగన్నాథ రథచక్రాలు, క్షీరసాగర మథనం, కన్యావరశుల్కం, అడవిలో అక్షరాలు, యక్షగానం, రెడ్‌లైట్ ఏరియా వంటి పలు నాటకాలను రచించారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణకు ఇంటర్లో హరనాథరావు సీనియర్. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. టి. కృష్ణ ద్వారానే తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన హరనాథరావు ‘ప్రతిఘటన, భారతనారి, ఇదా ప్రపంచం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, రేపటి పౌరులు, మంచి దొంగ, యుద్ధభూమి, రాక్షసుడు, ధర్మచక్రం వంటి సుమారు 150 సినిమాలకు రచయితగా పనిచేశారు. ‘స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు’ సినిమాలకు కథ, మాటలు అందించిన ఆయన్ను అవార్డులు వరించాయి. ఆ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించి, మెప్పించారాయన. ‘ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం’ సినిమాలకు సాహిత్యం అందించినందుకు నంది పురస్కారాలు అందుకున్నారు. స్వతహాగా హరనాథరావు అభ్యుదయ భావాలున్న వ్యక్తి. అది ఆయన సంభాషణల్లో స్పష్టంగా కనిపించేది. పదునైన సంభాషణలు రాయడంలో దిట్ట. సమాజాన్ని ఆలోచింపజేసే డైలాగులు రాయడంలో సిద్ధహస్తులు. రచయిత మరుధూరి రాజా ఆయన తమ్ముడు. హరనాథరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలూ ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
ప్రధాని వచ్చినా సెక్యూరిటీ ఒక్కరే
‘ఈ నాటక రచయిత ఏ ప్రయోగం చేసినా బాగానే ఉంటుంది, గొప్ప చిత్రకారుడు కూడా కావడం వల్ల దృశ్యాన్ని దర్శనీయంగా చిత్రించే నేర్పు ఉంది. రచన కూడా గొప్పగా ఉంది’ స్వయంగా మహాకవి శ్రీశ్రీతో ఇలాంటి కితాబులందుకున్న ఆ ప్రతిభావంతుడు డాక్టర్ అబ్బూరి గోపాలకృష్ణ. నటుడు, రచయిత, దర్శకుడు, రూపశిల్పి... ఒకటేమిటి.. చిత్రలేఖన, సాహితీ, రంగస్థలం వంటి విభిన్న రంగాల్లో ఉత్కృష్ట స్థాయికి చేరిన బహుముఖీన ప్రజ్ఞాశీలి డాక్టర్ గోపాలకృష్ణ. ఏయూ నాటక శాఖలో విభాగాధిపతిగా చేసి రిటైరైన ఆయన తాను పుట్టి పెరిగిన విశాఖ గురించి ఆనాటి జ్ఞాపకాలను సిటీప్లస్‌తో పంచుకున్నారు. చిన్నంవారి వీధిలో పుట్టాను నేను పుట్టింది విశాఖపట్నం చిన్నంవారి వీధి. నా చిన్నప్పుడే అక్కడి నుంచి వచ్చేశాం. అది నాకు పెద్దగా గుర్తు లేదు. ఆ తర్వాత కొల్లూరు జగన్నాథరావు గారు నన్ను అక్కడికి తీసుకెళ్లి ‘నువ్వు ఇక్కడే పుట్టావు’ అని చూపించారు. మా ఇంటి పక్కనే పింగళి లక్ష్మీకాంతం , రాచకొండ విశ్వనాథ శాస్త్రిగారి ఇళ్లు. అలా ఆ వీధంతా పెద్ద వాళ్ల ఇళ్లు ఉండేవి. జట్కా ఒక్కటే నా చిన్నప్పటికి ఏయూ ఇంకా నిర్మాణంలో ఉంది. వాల్తేరులో ఇళ్లు ఏవీ ఉండేవి కాదు. మొత్తం నిర్మానుష్యంగా ఉండేది. రవాణా సౌకర్యాలు ఏవీ ఉండేవి కాదు. జట్కా బండి ఒక్కటే మార్గం. దానికి కూడా కొంత దూరం నడిస్తే కాని ఉండేది కాదు. గవర్నర్స్ బంగ్లా దగ్గర బాగా ఎత్తుగా ఉండేది. జట్కా అది ఎక్కగలిచేది కాదు. కాబట్టి అందరూ అక్కడ దిగి జట్కాను తోసి మళ్లీ ఎక్కేవారు. జట్కా వాడు ఎంతమంది ఎక్కినా కొంచెం ముందుకు జరగండి అంటూ ఎక్కువమందిని ఎక్కించే వాడు. దానితో వెనుక వైపు బరువు ఎక్కువైపోయి బండి వెనక్కు గాల్లోకి లేచిపోయేది. అందరం ఒకేసారి కింద పడిపోయేవాళ్లం. నాకు తెలిసిన తర్వాత ఇక్కడే మూడే బస్సులు ఉండేవి. ఒకటి ఉదయం పెదవాల్తేరు జంక్షన్ వరకు వచ్చి వెళ్లిపోయేది. తర్వాత మధ్యాహ్నం ఒకటి , సాయంత్రం ఒకటి వచ్చేవి. ఒకే ఒక్క పోలీస్ ఇప్పటి రోజుల్లో ఓ మంత్రి వచ్చారంటే బోలెడంతా సెక్యూరిటీ హడావిడి. మనకు స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో ప్రధాని లాంటి నాయకులు పాల్గొనే కార్యక్రమాలు చాలా సింపుల్‌గా ఉండేవి. 1948లో విశాఖపట్నం హిందుస్థాన్ షిప్‌యార్డ్‌లో నిర్మించిన తొలి నౌక ‘జలఉష’ సముద్ర ప్రవేశ ప్రొగ్రామ్‌కు అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విశాఖపట్నం వచ్చారు. అప్పటి ఏయూ వీసీ సీఆర్ రెడ్డి ఏయూకు రమ్మని ఆహ్వానించారు. అక్కడ ఒక మీటింగ్‌కు అటెండ్ అయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు, డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి పాల్గొన్నారు. ఇంత పెద్ద ప్రొగ్రామ్‌కు కూడా కేవలం ఒకే ఒక్క కానిస్టేబుల్ లాఠీ పట్టుకుని డ్యూటీ చేశాడు. బ్రిటిష్ ఆర్మీ ఇన్ బీచ్ రోడ్ మా నాన్నగారి ఉద్యోగ రీత్యా మేము కొన్నాళ్లు తెనాలిలో ఉన్నాం. తర్వాత 1946లో ఇక్కడకు వచ్చేశాం. ప్రతి ఐదేళ్లకు విశాఖ అభివృద్ధి చెందుతూనే ఉంది. మేమిక్కడకు వచ్చాక చినవాల్తేరులో ఉండేవాళ్లం. అక్కడి నుంచి బీచ్‌కు వె ళ్తే బ్రిటిష్ ఆర్మీవాళ్లు చేసే మార్చ్ ఫాస్ట్లతో బీచ్ అంతా కిటకిటలాడిపోయేది. చాలా రేర్‌గా నీగ్రోలు కనిపించేవారు. వాళ్లను చూస్తేనే మాకు భయం వేసేది. బీచ్ రోడ్లో అంతా యూరోపియన్ భోజనం మాత్రమే దొరికేది. ఇండియన్ భోజనం కావాలి అంటే ఇంట్లో వండుకుని తినాల్సిందే. కూరలు కూడా ఎక్కువగా దొరికేవి కాదు. బియ్యం ఇచ్చేవారు. ఒకవారం అయితే అస్సలు బియ్యం కూడా లేవు. బంగాళదుంపలను పొడుగ్గా కట్ చేసి ఇచ్చేవారు. అవి ఎంత వండినా కూడా గుజ్జులా వచ్చేది తప్ప తినడానికి వీలుగా ఉండేవి కాదు. పాలు కూడా ఇంటికి వచ్చి పితికి ఇచ్చేవారు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ల ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్ అయినా, చుట్టాలు ఎవరైనా ఇంటికి వచ్చినా మిగిలిన వారికి పాలు ఉండేవి కాదు. మొత్తం వాళ్లే కొనుక్కునేవారు. టూత్ బ్రష్ తెలియదు ఆ రోజుల్లో మాకు టూత్ బ్రష్ అంటే ఏమిటో తెలియదు.ఎక్కడో యూరోపియన్లు మాత్రమే బ్రష్‌లు వాడేవారు. మిగిలిన వారు అందరూ పందుం పుల్లలతో పళ్లు తోముకునేవారు. అణాకు కట్ట అని అమ్ముతూ ఉండేవారు. దానికోసం ఊర్లో ఉన్న మా చిన్న పిల్లలం అందరం ఒక 20 మంది కలిసి పెద్ద గ్రూపుగా తయారయ్యేవాళ్లం. పెద్ద డబ్బాలు ఉండేవి. వాటికి తాడు కట్టి ఒక డప్పులా తయారుచేసి వాయిస్తూ ఇప్పుడు ఉషోదయ జంక్షన్ దగ్గరకు వచ్చేవాళ్లం. అప్పట్లో అది కాకులు దూరని కారడవి , చీమలు దూరని చిట్టడవి. అక్కడికి వచ్చి వేప చెట్లు నరికి పుల్లలు కట్టకట్టి తీసుకెళ్లేవాళ్లం. రేగు పళ్లు , తాటి ముంజులు , సీతాఫలాలు ఇలా చాలా రకాల పళ్లు ఎన్ని కావాలంటే అన్ని ఉండేవి. బీచ్ మొత్తం మారిపోయింది నా చిన్నప్పుడు బీచ్ చాలా అందంగా ఉండేది. ఆ బీచ్ ఇప్పుడు లేదు. ఇప్పుడు యూనివర్శిటీ క్వార్టర్స్ ఉన్న ప్రాంతం ఎదురుగా బీచ్ ఉండేది. అక్కడ రెండు ఫుట్ బాల్ ఫీల్డ్స్ పక్క పక్కన పెడితే ఎంత ప్లేస్ ఉంటుందో అంత ఖాళీ ఉండేది. అక్కడ పొలిటికల్ మీటింగులు జరుగుతూ ఉండేవి. దాదాపు 30 వేల మంది అక్కడ కూర్చుని వినేవారు. సముద్రానికి దూరంగా కాబట్టి అలల శబ్దం కూడా వినిపించేది కాదు. అక్కడ మొత్తం ఫారిన్ కల్చర్ ఉండేది. అక్కడికి వెళ్లి రంగురంగుల గవ్వలు ఏరుకునేవాళ్లం. ఇప్పుడు ఆ గవ్వలు లేవు....సముద్రం కూడా చాలా ముందుకు వచ్చేసింది.