ప్రముఖ సినీ, నాటక రచయిత, నటుడు ఎంవీయస్ హరనాథరావు (69) ఇక లేరు. గుండెపోటు రావడంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ, సోమవారం తుదిశ్వాస విడిచారు. రంగాచార్యులు, సత్యవతీదేవి దంపతులకు 27 జూలై 1948లో హరనాథరావు జన్మించారు. గుంటూరులో చదువుకుంటున్నప్పుడే నాటకాలపై ఉన్న ఆసక్తితో ‘రక్తబలి, జగన్నాథ రథచక్రాలు’ వంటి వాటిలో నటించారాయన. నటునిగా ప్రస్థానం సాగిస్తూనే ఆయన నీలగిరి కాïఫీ, హిమగిరి కాఫీ పొడి విక్రయ షాపులను నిర్వహించారు. నటించడమే కాదు.. పలు నాటకాలు రచించారు.
‘జగన్నాథ రథచక్రాలు, క్షీరసాగర మథనం, కన్యావరశుల్కం, అడవిలో అక్షరాలు, యక్షగానం, రెడ్‌లైట్ ఏరియా వంటి పలు నాటకాలను రచించారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణకు ఇంటర్‌లో హరనాథరావు సీనియర్. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. టి. కృష్ణ ద్వారానే తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన హరనాథరావు ‘ప్రతిఘటన, భారతనారి, ఇదా ప్రపంచం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, రేపటి పౌరులు, మంచి దొంగ, యుద్ధభూమి, రాక్షసుడు, ధర్మచక్రం వంటి సుమారు 150 సినిమాలకు రచయితగా పనిచేశారు.
‘స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు’ సినిమాలకు కథ, మాటలు అందించిన ఆయన్ను అవార్డులు వరించాయి. ఆ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించి, మెప్పించారాయన. ‘ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం’ సినిమాలకు సాహిత్యం అందించినందుకు నంది పురస్కారాలు అందుకున్నారు. స్వతహాగా హరనాథరావు అభ్యుదయ భావాలున్న వ్యక్తి. అది ఆయన సంభాషణల్లో స్పష్టంగా కనిపించేది. పదునైన సంభాషణలు రాయడంలో దిట్ట. సమాజాన్ని ఆలోచింపజేసే డైలాగులు రాయడంలో సిద్ధహస్తులు. రచయిత మరుధూరి రాజా ఆయన తమ్ముడు. హరనాథరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలూ ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment