MVS Haranatha Rao
-
కన్నీటి వీడ్కోలు
ఒంగోలు కల్చరల్: ప్రముఖ సినీ, నాటక రచయిత ఎం.వి.ఎస్. హరనాథరావు అంత్యక్రియలు మంగళవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల మహాప్రస్థానం శ్మశానవాటికలో హైందవ సంప్రదాయబద్ధంగా జరిగాయి. అంతిమ యాత్రలో కళాకారులు, కళాభిమానులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. హరనాథ«రావుతో ప్రగాఢ అనుబంధం ఉన్న పలువురు కళాకారులు ఇతర జిల్లాల నుంచి కూడా విచ్చేశారు. ప్రజానాట్య మండలి ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న), సినీ నిర్మాత పోకూరి బాబూరావు, వై.ఎస్. కృష్ణేశ్వరరావు, నాయుడు గోపి, గోపరాజు విజయ్, శ్రీగిరి వెంకటేశ్వరస్వామి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఆలూరు వెంకట రమణారావు, డాక్టర్ గంజాం శ్రీనివాసమూర్తి, భుజంగరావు, కెవి రంగారావు , ప్రతిభ కళాశాల నిర్వాహకులు నల్లూరు వెంకటేశ్వర్లు తదితరులు హరనాథరావు భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సినీ రైటర్స్ అసోసియేషన్ పక్షాన బి గోపాల్, కాకర్ల హరనాథరావుకు నివాళులర్పించారు. సినీనాటక రచయిత పాటిబండ్ల ఆనందరావు పూలమాల వేసి నివాళి ఘటించారు. హరనాథరావు ఆకస్మిక మృతిపై సీవీఎన్ రీడింగ్ రూం ప్రత్యేక అధికారి ఈదుపల్లి గుర్నాథరావు, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు చొప్పర జాలన్న తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
రచయిత, నటుడు హరనాథరావు కన్నుమూత
ప్రముఖ సినీ, నాటక రచయిత, నటుడు ఎంవీయస్ హరనాథరావు (69) ఇక లేరు. గుండెపోటు రావడంతో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ, సోమవారం తుదిశ్వాస విడిచారు. రంగాచార్యులు, సత్యవతీదేవి దంపతులకు 27 జూలై 1948లో హరనాథరావు జన్మించారు. గుంటూరులో చదువుకుంటున్నప్పుడే నాటకాలపై ఉన్న ఆసక్తితో ‘రక్తబలి, జగన్నాథ రథచక్రాలు’ వంటి వాటిలో నటించారాయన. నటునిగా ప్రస్థానం సాగిస్తూనే ఆయన నీలగిరి కాïఫీ, హిమగిరి కాఫీ పొడి విక్రయ షాపులను నిర్వహించారు. నటించడమే కాదు.. పలు నాటకాలు రచించారు. ‘జగన్నాథ రథచక్రాలు, క్షీరసాగర మథనం, కన్యావరశుల్కం, అడవిలో అక్షరాలు, యక్షగానం, రెడ్లైట్ ఏరియా వంటి పలు నాటకాలను రచించారు. ప్రముఖ దర్శకుడు టి.కృష్ణకు ఇంటర్లో హరనాథరావు సీనియర్. ఈ ఇద్దరూ మంచి స్నేహితులు. టి. కృష్ణ ద్వారానే తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన హరనాథరావు ‘ప్రతిఘటన, భారతనారి, ఇదా ప్రపంచం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, రేపటి పౌరులు, మంచి దొంగ, యుద్ధభూమి, రాక్షసుడు, ధర్మచక్రం వంటి సుమారు 150 సినిమాలకు రచయితగా పనిచేశారు. ‘స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు’ సినిమాలకు కథ, మాటలు అందించిన ఆయన్ను అవార్డులు వరించాయి. ఆ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించి, మెప్పించారాయన. ‘ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం’ సినిమాలకు సాహిత్యం అందించినందుకు నంది పురస్కారాలు అందుకున్నారు. స్వతహాగా హరనాథరావు అభ్యుదయ భావాలున్న వ్యక్తి. అది ఆయన సంభాషణల్లో స్పష్టంగా కనిపించేది. పదునైన సంభాషణలు రాయడంలో దిట్ట. సమాజాన్ని ఆలోచింపజేసే డైలాగులు రాయడంలో సిద్ధహస్తులు. రచయిత మరుధూరి రాజా ఆయన తమ్ముడు. హరనాథరావుకు భార్య, ముగ్గురు కుమార్తెలూ ఉన్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
బాబాయ్ అనే పిలిచే వ్యక్తి ఇక లేరు: హీరో గోపీచంద్
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్ హరనాథరావు మృతి పట్ల హీరో గోపీచంద్ సంతాపం తెలిపారు. ఆయన మరణం తనను ఎంతగానో బాధించిందన్నారు. ‘ఒక రచయితగా, డైలాగ్ రైటర్గా తెలుగు సినిమాకి ఎంవీఎస్ హరనాథరావు అందించిన విశేషమైన సేవల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన మా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. మా నాన్నగారికి మాత్రమే కాక నాకు కూడా హరనాథరావుతో మంచి సాన్నిహిత్యం ఉండేది. నేను ‘బాబాయ్’ అని పిలుచుకొనే వ్యక్తి నేడు మా మధ్య లేరు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వేడుకొంటున్నాను.’ అని అన్నారు. కాగా హరనాథరావు గుండెపోటుతో సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన ప్రముఖ దర్శకుడు, హీరో గోపీచంద్ తండ్రి టీ కృష్ణ ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయ్యారు. స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు వంటి అవార్డులు గెలుపొందిన సినిమాలకు కథ, మాటలు హరినాథరావు అందించారు. -
ప్రముఖ సినీ రచయిత కన్నుమూత
-
ప్రముఖ సినీ రచయిత కన్నుమూత
సాక్షి, ప్రకాశం: ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్ హరనాథరావు(72) కన్నుమూశారు. గుండెపోటుతో మృతిచెందిన ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తులు ఉన్నారు. 150కు పైగా సినిమాలకు పనిచేసిన ఎంవీఎస్ హరనాథరావు.. ప్రతిఘటన, భారతనారీ, అన్న, అమ్మాయి కాపురం సినిమాలకు సాహిత్యం అందించినందుకు నంది పురస్కారాల్ని గెలుపొందారు. ప్రముఖ దర్శకుడు టీ కృష్ణ ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయిన హరనాథరావు.. స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు వంటి అవార్డులు గెలుపొందిన సినిమాలకు కథ, మాటలు అందించారు. అంతేకాకుండా ఆయన స్వయంకృషి, ప్రతిఘటన వంటి సినిమాల్లో నటించారు. గుంటూరులో చదువుకున్న హరనాథరావుకు చిన్నప్పటినుంచే నాటకాల అంటే అభిమానం. చిన్నప్పుడు నాటకాల్లో పాత్రలు పోషించిన ఆయన.. అనంతరం పలు నాటకాలు రచించారు. కాలేజీలో రోజుల్లో దర్శకుడు టీ కృష్ణ, హరనాథరావు మంచి స్నేహితులు. అనంతరకాలంలో టీ కృష్ణ ద్వారా సినిమాలకు పరిచయం అయిన హరనాథరావు.. ప్రతిఘటన, భరతనారీ, ఇదా ప్రపంచం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, రేపటి పౌరులు, మంచి దొంగ, యుద్ధభూమి, రాక్షసుడు, ధర్మచక్రం వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు.