
సాక్షి, ప్రకాశం: ప్రముఖ సినీ రచయిత, నటుడు ఎంవీఎస్ హరనాథరావు(72) కన్నుమూశారు. గుండెపోటుతో మృతిచెందిన ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తులు ఉన్నారు. 150కు పైగా సినిమాలకు పనిచేసిన ఎంవీఎస్ హరనాథరావు.. ప్రతిఘటన, భారతనారీ, అన్న, అమ్మాయి కాపురం సినిమాలకు సాహిత్యం అందించినందుకు నంది పురస్కారాల్ని గెలుపొందారు.
ప్రముఖ దర్శకుడు టీ కృష్ణ ద్వారా తెలుగు సినిమాకు పరిచయం అయిన హరనాథరావు.. స్వయంకృషి, ప్రతిఘటన, సూత్రధారులు వంటి అవార్డులు గెలుపొందిన సినిమాలకు కథ, మాటలు అందించారు. అంతేకాకుండా ఆయన స్వయంకృషి, ప్రతిఘటన వంటి సినిమాల్లో నటించారు.
గుంటూరులో చదువుకున్న హరనాథరావుకు చిన్నప్పటినుంచే నాటకాల అంటే అభిమానం. చిన్నప్పుడు నాటకాల్లో పాత్రలు పోషించిన ఆయన.. అనంతరం పలు నాటకాలు రచించారు. కాలేజీలో రోజుల్లో దర్శకుడు టీ కృష్ణ, హరనాథరావు మంచి స్నేహితులు. అనంతరకాలంలో టీ కృష్ణ ద్వారా సినిమాలకు పరిచయం అయిన హరనాథరావు.. ప్రతిఘటన, భరతనారీ, ఇదా ప్రపంచం, దేశంలో దొంగలు పడ్డారు, దేవాలయం, రేపటి పౌరులు, మంచి దొంగ, యుద్ధభూమి, రాక్షసుడు, ధర్మచక్రం వంటి సినిమాలకు రచయితగా పనిచేశారు.