దేశంలోనే కర్ణాటక తొలి రాష్ట్రంగా రికార్డు
సాక్షి బెంగళూరు: తీవ్ర అనారోగ్యానికి గురై ఎలాంటి చికిత్సకు స్పందించక, వ్యాధి నయం కాని రోగులకు కారుణ్య మరణ హక్కును కల్పిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలనుసారం కర్ణాటకలో ఈ చారిత్రక చట్టాన్ని అమలు చేస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో, కారుణ్య మరణాన్ని అమలు చేయనున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక అవతరించింది.
మొండి వ్యాధి బాధితులు, మరణాంతక రోగగ్రస్తులు లేదా కోమా స్థితిలో ఉన్న వారికి, ఎలాంటి చికిత్స అందించినా బతకడం అసాధ్యం అనే వారికి ఈ ఆదేశాల ద్వారా గౌరవప్రదమైన మరణానికి అవకాశం లభించింది. కారుణ్య మరణానికి అవకాశం కల్పించేందుకు వైద్యులతో కూడిన బోర్డును ఏర్పాటు చేయనున్నారు. ఈ వైద్యులు కారుణ్య మరణానికి ఆ రోగి అర్హుడా కాదా అనే విషయాన్ని ధ్రువీకరిస్తారు.
అలాగే జిల్లా స్థాయిలో కూడా వైద్య నిపుణులతో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ తొలుత సంబంధిత రోగి ఎలాంటి చికిత్స అందించినా ఫలితం ఉండబోదని ధ్రువీకరించిన తర్వాతే కారుణ్య మరణానికి అవకాశం కల్పిస్తారు. అయితే ఆ రోగి కుటుంబ సభ్యుల వినతి మేరకు మాత్రమే వైద్యుల బృందం ఈ పని చేయాల్సి ఉంటుంది. కోర్టు అనుమతించాక రోగి లైఫ్ సపోర్టు సిస్టమ్‌ను తొలగిస్తారని ఆరోగ్య శాఖ మంత్రి దినేశ్ గుండూరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment