నిషిద్ధ ప్రకటనలంటే ఎలా ఉంటాయి? చెత్త వేయొద్దనో, ఫలానా ప్రాంతంలోకి ప్రవేశించొద్దనో ఉంటాయి. కదా! కానీ దక్షిణ ఇటలీలో ఉన్న కాలాబ్రియా ప్రాంతంలోని చిన్న పట్టణమైన బెల్కాస్ట్రో మాత్రం వింతైన ప్రకటన చేసింది. ఆ పట్టణంలో ప్రజలు అనారోగ్యానికి గురికావడం నిషిద్ధం! అవును!! ‘‘వైద్య సాయం అవసరమమ్యే ఎలాంటి అనారోగ్యానికీ లోనవొద్దు. ముఖ్యంగా అత్యవసర చికిత్స అవసరమయ్యే ఎలాంటి అనారోగ్యం బారినా పడొద్దు’’అంటూ బెలాస్ట్రో మేయర్ ఆంటోనియో టార్చియా ఉత్తర్వులు జారీ చేశారు!
అంతేకాదు.. గృహ ప్రమాదాలను నివారించడానికి హానికారకమైన ఎలాంటి కార్యక్రమాలూ నిర్వహించొద్దని, ఇల్లు విడిచి ప్రయాణాలు చేయొద్దని, ఆటలు నేర్చుకోవద్దని, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవద్దని... ఇలా పలు ఆదేశాలతో ఏకంగా ఆర్డినెన్సే జారీ చేశారు! మరోవైపు పర్యాటకులను తమ పట్టణానికి స్వాగతించారు కూడా. ‘‘మా చిన్న గ్రామంలో ఓ వారం పాటు నివసించండి. సురక్షితంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆరోగ్యం పాడైతే ఎలాంటి వైద్య సేవలు కావాలన్నా 45 కి.మీ. దూరంలోని కాటాంజారో వెళ్లాల్సి ఉంటుంది’’అంటూ వారినీ హెచ్చరించారు!
నగరానికి పెద్ద దిక్కయిన మేయరే ఇలాంటి ఆదేశాలివ్వడం ఆశ్చర్యమే అయినా అందుకు కారణం లేకపోలేదు. 1,300 మంది జనాభా ఉన్న బెల్కాస్ట్రోలో ఉన్నది ఒకే ఒక ఆరోగ్య కేంద్రం. దాన్నీ తరచూ మూసేస్తారు. వైద్యులు ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఎమర్జెన్సీ వస్తే కాటంజారో నగరమే దిక్కు. పరిస్థితులను మార్చేందుకు ఎన్నోసార్లు విఫలయత్నం చేసిన మీదట మేయర్ చివరికిలా వ్యంగ్య ప్రకటన చేశారు! అదీ సంగతి.
సమస్యలను పరిష్కరించేలా ప్రాంతీయ, ఆరోగ్య అధికారులను రెచ్చగొట్టేందుకే ఇలా ఉత్తర్వులిచి్చనట్టు మేయర్ తెలిపారు. పట్టణంలోని ప్రజారోగ్య కేంద్రం క్రమం తప్పకుండా తెరుచుకునేదాకా ఆర్డినెన్స్ అమల్లో ఉంటుందన్నారు. బెలాస్ట్రో ఇటలీలోని అత్యంత పేద ప్రాంతాలలో ఒకటైన కాలాబ్రియా పరిధిలో ఉంటుంది. యువకులు భారీగా నగరాలకు వలస పోతారు. జనాభా క్షీణిస్తుండటంతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో నివసిస్తే డబ్బు చెల్లించడానికి కూడా ప్రభుత్వాలు ముందుకొస్తున్నాయి. అక్కడ అనేక పట్టణాలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment