
గత మూడేళ్లుగా పెరుగుతున్న అవయవ దాతలు
దేశంలో మూడేళ్లలో 42,040 అవయవ దానాలు
అదే సమయంలో రాష్ట్రంలో 965 అవయవ దానాలు
కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడి
సాక్షి, అమరావతి: మరణించినా అవయవదానం ద్వారా మరికొందరికి ప్రాణం పోస్తున్న వారి సంఖ్య గత మూడేళ్లుగా పెరుగుతోంది. దేశంతో పాటు రాష్ట్రంలోనూ అవయవ దాతల సంఖ్య క్రమంగా పెరుగుతోందని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో 2021 నుంచి 2023 వరకు అవయవదానాల సంఖ్య 42,040కు చేరిందని, అదే సమయంలో రాష్ట్రంలోనూ ఈ సంఖ్య 965కు చేరిందని పేర్కొంది.
అవయవదానాలను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపడుతున్నాయి. మరణించాక అవయవదానం చేయడం వల్ల మరొకరికి ప్రాణం పోసినవారవుతారన్న తరహాలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అవయవదానం నమోదును సులభతరం చేసేందుకు ఆధార్ అనుసంధానంతో డిజిటల్ వెబ్ పోర్టల్‌ను గతేడాది సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రారంభించింది.
మరణించాక తమ అవయవాలను దానం చేస్తామంటూ ఇప్పటి వరకూ రెండు లక్షల మంది ఈ పోర్టల్లో ప్రతిజ్ఞ చేయడం విశేషం. అవయవదానాలపై అవగాహన కల్పించేందుకు ఏటా భారతీయ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. సెమినార్లు, వెబ్‌నార్లు, వర్క్‌షాప్‌ల వంటి ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు.
అవయవాల సేకరణ, మార్పిడి, పంపిణీ కోసం అవసరమైన మౌలిక సదుపాయాల యంత్రాంగాన్ని పటిష్టం చేయడంతో పాటు శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక సంస్థలతో మూడంచెల నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశారు.
జాతీయ స్థాయిలో ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్, ఐదు ప్రాంతీయ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్‌లు, రాష్ట్ర స్థాయిలో 21 రాష్ట్ర అవయవాలు, టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ప్రస్తుతం 900పైగా ఇనిస్టిట్యూషన్లు, ఆస్పత్రులు అవయవాల మార్పిడి, పునరుద్ధరణ నెట్‌వర్క్‌తో అనుసంధానమయ్యాయి.
రూ.10 వేల పారితోషికం
బ్రెయిన్ డెడ్ అయి అవయవదానాలు చేస్తున్న వారి అంత్యక్రియలను గౌరవప్రదంగా నిర్వహించాల్సిందిగా కేంద్ర మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించింది.
అవయవాల సేకరణ అంనతరం భౌతిక కాయాన్ని ఉచిత రవాణా సదుపాయాలతో స్వస్థలాలకు చేర్చడంతో పాటు.. కుటుంబ సభ్యులకు రూ.10 వేల పారితోషికం ఇవ్వాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. అవయవదానం చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులను సత్కరించాలని కూడా ఆ ఆదేశాల్లో పేర్కొంది.