
బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడి అవయవ దానం
వారి ఉదాత్త నిర్ణయాన్ని ప్రశంసించిన స్థానికులు
యలమంచిలి: పుట్టెడు దుఃఖంలోనూ ఉన్నతంగా ఆలోచించారు. ఇక కుమారుడు తమకు దక్కకపోయినా... ఆయన అవయవాలతో మరికొందరికి జీవితం కల్పించవచ్చని భావించారు. వెంటనే సొంత ఖర్చులతో బ్రెయిన్ డెడ్ అయిన కుమారుడిని విశాఖ తరలించి అవయవాలను దానం చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలి మండలం ఇలపకుర్రు పంచాయతీ కుమ్మరిపాలేనికి చెందిన ఎలక్ట్రీషియన్ కాండ్రేకుల శ్రీనివాసరావు(బుల్లియ్య) కుమారుడు పవన్ ఐటీఐ పూర్తి చేసి సౌండ్ సిస్టం కొనుక్కుని ఫంక్షన్స్‌కి అద్దె ప్రాతిపదికన ఏర్పాటు చేస్తూ తండ్రికి చేదోడువాదోడుగా ఉంటున్నాడు. ఈ నెల ఒకటోతేదీన కుమ్మరపాలెంలోని కోదండ రామాలయ వార్షికోత్సవం సందర్భంగా ఏకాహ భజన ఏర్పాటు చేశారు.
దానికి పవన్‌కుమార్ తన స్నేహితుడు కుడక అజయ్‌తో కలసి సౌండ్ బాక్సులను ఏర్పాటుచేశాడు. వారిద్దరూ సౌండ్ బాక్సుల వద్ద ఉండగా ఒక్కసారిగా కొబ్బరి చెట్టు విరిగి ఇద్దరిపైనా పడింది. పవన్ తలకు, భుజానికి బలమైన గాయాలు కాగా, అజయ్ స్వల్పంగా గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే ఆలయ కమిటీ సభ్యులు ఇద్దరినీ పాలకొల్లు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పవన్ తలలో రక్తస్రావం కావడంతో ప్రథమ చికిత్స చేసిన అనంతరం ఉన్నత వైద్యం కోసం భీమవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆరోగ్యశ్రీలో వైద్యం చేసినా... 13వ తేదీన పరిస్థితి విషమించడంతో ఇక బతికే అవకాశం లేదని ఇంటికి తీసుకెళ్లిపోవాలని వైద్యులు చెప్పారు.
చేసేది లేక భీమవరంలోనే మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి బ్రెయిన్‌డెడ్ అయ్యిందని, బతకడని చెప్పడంతో వారంతా హతాశులయ్యారు. పుట్టెడు దుఃఖంలోనూ తమ కుమారుడి అవయవాలు దానం చేయాలని నిర్ణయించుకుని సొంత ఖర్చులతో వైజాగ్ కిమ్స్ హైకాన్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పవన్ శరీరం నుంచి గుండె, కాళ్ల నరాలు, కాలేయం, కిడ్నీలు దానం చేశారు. అనంతరం శనివారం సాయంత్రానికి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ పాలకొల్లు ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరిగోపాలరావు (గోపి), పార్టీ రాష్ట్ర కార్యదర్శి చిలువూరి కుమార దత్తాత్రేయవర్మతో కలసి అక్కడకు వెళ్లి మృతదేహానికి నివాళులరి్పంచారు. అవయవ దానం చేసిన తల్లిదండ్రులను అభినందించారు.