సాక్షి, అమరావతి: ఒక వ్యక్తి చనిపోతూ ఎనిమిది మందిని బతికించవచ్చు. కానీ ఆ ఎనిమిది మంది బతకాలంటే చనిపోయిన వ్యక్తి ఇచ్చే అవయవాలతో పాటు వైద్యుల సహకారం కావాలి. సాటిమనిషిని బతికించాలన్న మనసు రావాలి. మన పెద్దాసుపత్రుల్లో ఏటా లక్షల మందికి వైద్యం అందుతోంది. మూడు వేల మంది స్పెషలిస్టు వైద్యులున్నారు. అన్నీ ఉన్నా ఆసక్తి లేకపోవడం వల్ల బ్రెయిడ్‌డెడ్ వ్యక్తి నుంచి రావాల్సిన అవయవాలు సేకరించేవారు లేరు. చాలామంది అవయవాల సేకరణ అనేది తమ పరిధిలో లేదని, తమకెందుకులే అని భావిస్తున్నారు.
అదనపు భారంగా భావిస్తున్న వైద్యులు
ప్రభుత్వ పరిధిలో ఉండే బోధనాసుపత్రులకే ఎక్కువ బ్రెయిడ్‌డెడ్ కేసులు వస్తాయి. ఈ కేసులకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులతో మాట్లాడి, అవయవదానంపై అవగాహన కల్పించాలి. సదరు ఆస్పత్రిలో అవయవాలు అవసరం లేకపోయినా అవయవాలను సేకరించి జీవన్‌దాన్ ట్రస్ట్‌కు సమాచారమిస్తే సకాలంలో తీసుకెళ్తారు. యూరాలజీ, నెఫ్రాలజీ, జనరల్ సర్జరీ డాక్టర్లు ఉన్న ప్రతిచోటా ఈ అవయవాలు సేకరించవచ్చు. కానీ చాలా చోట్ల వైద్యులు ఇది అదనపు పని కదా అని భావిస్తూ ఆసక్తి చూపడంలేదు.
ప్రోత్సాహం ఇవ్వాలి..
అవయవాలు సేకరించిన వారికి ఏదైనా ఇన్సెంటివ్‌లు ఇస్తే బాగుంటుందని కొంతమంది వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో జరుగుతున్న ఆవయవ మార్పిడి పరిస్థితిని చూస్తే వేచిచూస్తున్న బాధితులకు 2031 సంవత్సరం వరకు అవయవాలు లభించే పరిస్థితి లేదు. అందువల్ల పెద్దాస్పత్రుల్లోని వైద్యులకు ఇన్సెంటివ్స్ ఇచ్చి, అవయవదానంపై ఆస్పత్రులకు వచ్చే రోగులకు అవగాహన కల్పించి మరింత మందిని బతికించే దిశగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని బాధిత కుటుంబాలు చెబుతున్నాయి.
రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి
వంద పడకలు దాటిన ప్రతి ఆస్పత్రి జీవన్‌దాన్ ట్రస్ట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్పత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోయినా సమాచారమిస్తే అవయవాల సేకరణ జరుగుతుంది. దీంతో మరొకరిని బతికించినట్టు అవుతుంది. కానీ చాలామంది రిజిస్ట్రేషన్‌కు ముందుకు రావడం లేదు. ప్రైవేటు ఆస్పత్రులకు వచ్చే కేసులు కూడా.. తమ ఆస్పత్రిలో రిజిస్ట్రేషన్ చేసుకున్న రోగికి అవసరమైతేనే సేకరిస్తున్నారు. లేదంటే మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తున్నారు.
జీవన్‌దాన్ పరిధిలోకి తేవాలి
అవయవాల సేకరణకు స్పెషలిస్టులు చొరవ చూపితేనే సాధ్యమవుతుంది. ఎన్నో బ్రెయిడ్‌డెడ్ కేసుల విషయంలో అవగాహన లేక వదిలేస్తున్నాం. అన్ని ఆస్పత్రులనూ జీవన్‌దాన్ రిజిస్ట్రేషన్ పరిధిలోకి తీసుకురావాలి. బ్రెయిన్‌డెడ్ కేసుల వివరాలు ఎప్పటికప్పుడు ట్రస్ట్‌కు సమాచారమిచ్చేలా చేస్తే మరింతమందిని బతికించే అవకాశం ఉంటుంది. వచ్చిన ప్రతి బ్రెయిన్‌డెడ్ కేసులోనూ అవయవాలు వాడుకోగలిగితే.. వేలమందిని బతికించవచ్చు. – డా.కె.రాంబాబు, జీవన్‌దాన్ స్టేట్ కోఆర్డినేటర్
ఏ అవయవాన్ని ఎంతసేపు నిల్వ ఉంచవచ్చు
అవయవం- నిల్వ సమయం
కళ్లు- 4 నుంచి 6 గంటలు
గుండె, ఊపిరితిత్తులు- 4 నుంచి 6 గంటలు
కాలేయం- 12 నుంచి 20 గంటలు
క్లోమగ్రంథి (పాంక్రియాస్)- 12 నుంచి 24 గంటలు
మూత్రపిండాలు- 48 నుంచి 72 గంటలు
అవయవాల కోసం వేచిచూస్తున్న బాధితులు
అవయవం- బాధితుల సంఖ్య
కాలేయం- 556
కిడ్నీ- 1,438
గుండె- 33
ఊపిరితిత్తులు- 10
మొత్తం- 2,037
Comments
Please login to add a commentAdd a comment