అత్యంత పరిశుభ్రమైన నగరంగా కర్ణాటకలోని మడికేరి
కాలుష్యం తక్కువగా ఉన్న నగరాల్లో కడప, తిరుపతి, అమరావతి, విజయవాడ, రాజమహేంద్రవరం
అత్యంత కలుషిత నగరాల జాబితాలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్, నోయిడా, ఢిల్లీ
సాక్షి ప్రతినిధి, అనంతపురం : దేశవ్యాప్తంగా వాయు కాలుష్యం తక్కువగా ఉన్న 50 నగరాలను ఎంపిక చేయగా.. అందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవి ఐదు ఉన్నాయి. అవి కడప–52 ఎంజీ (మిల్లీగ్రాములు/క్యూబిక్ మీటర్), అమరావతి 56 ఎంజీ, తిరుపతి 57 ఎంజీ, విజయవాడ 61 ఎంజీ, రాజమహేంద్రవరం 61 ఎంజీలుగా ఉన్నాయి. 2024 సంవత్సరానికి గాను సీఆర్‌ఈఏ (సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్) సంస్థ అధ్యయనంలో ఈ విషయం తేలింది. అలాగే, దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా కర్ణాటకలోని కొడగు జిల్లాలోని మడికేరి నగరం చోటు సంపాదించింది.
ఇక్కడ వార్షిక సగటు కాలుష్యం కేవలం 32 ఎంజీ మాత్రమే. తమిళనాడులోని పాలలైపెరూర్, కర్ణాటకలోని కొప్పల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అత్యంత క్లీనెస్ట్ జాబితాలో ఇంఫాల్, షిల్లాంగ్, అరియాలూర్, రామనగర, విజయపుర, రామనాథపురం ఉన్నాయి. ఇక అత్యంత కలుషిత నగరాల జాబితాలో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ వార్షిక సగటు 236 ఎంజీగా నమోదైంది.
226 ఎంజీతో నోయిడా, 211తో ఢిల్లీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అలాగే, దేశవ్యాప్తంగా 50 అత్యంత కలుషిత నగరాల్లో 15 నగరాలు రాజస్థాన్‌వే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో తొమ్మిది, బిహార్‌లో ఏడు ఉన్నాయి. ఇందులో ఏపీలోని ఏ నగరం కూడా లేనప్పటికీ విశాఖలో మాత్రం 108 ఎంజీగా నమోదైంది.
గత ఏడాది గాలి నాణ్యతా ప్రమాణాల లెక్క వేసినప్పుడు విశాఖపట్నంలో 30 రోజుల వ్యవధిలో ఇలా ఆరుసార్లు కనిపించింది. గత ఏడాది సెప్టెంబరులో విజయవాడలో కూడా ఎక్కువగానే నమోదైంది. కానీ, ఆ తర్వాత గాలి నాణ్యత ప్రమాణాల్లో కాస్త మెరుగుపడింది.
నిధుల వినియోగంలో ఏపీ వెరీపూర్..
ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా కాలుష్య కారకాలను నియంత్రించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్‌సీఏపీ (నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం) కింద నిధులు కేటాయిస్తోంది. ఈ నిధులను వినియోగించుకోవడంలో ఏపీ చాలా వెనుకబడినట్లు సీఆర్‌ఈఏ అధ్యయనంలో వెల్లడైంది. కేటాయించిన నిధుల్లో 35 శాతం మాత్రమే వినియోగించారు. అదే మధ్యప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలు 90 శాతం నిధులను వినియోగించాయి.
Comments
Please login to add a commentAdd a comment