Compassionate death
-
నొప్పి తెలియకుండా విముక్తి
మరొకరి సాయంతో జీవితాన్ని చాలించడాన్ని (అసిస్టెడ్ సూసైడ్) సులభతరం చేసేదే ఈ ‘సార్కో మెషీన్’. నయం కాని వ్యాధులతో బాధపడుతూ... నిత్యం నొప్పిని, మానసిక క్షోభనూ అనుభవిస్తూ అనుక్షణం చచ్చేకంటే... ఎలాగూ బతికే అవకాశాలు లేవు కాబట్టి... పలుదేశాలు స్వీయ సమ్మతితో ప్రాణాలు విడవడాన్ని చట్టబద్ధంగా అనుమతిస్తున్నాయి. అందులో స్విట్జర్లాండ్ ఒకటి. అసిస్టెడ్ సూసైడ్‌కు ఈ సార్కో మెషీన్ ఒక సులువైన, బాధ తెలియనివ్వని సాధనం. స్విట్జర్లాండ్‌లో న్యాయ సమీక్షలో దీనికి ఆమోదముద్ర పడిందని తయారీ సంస్థ ఎగ్జిట్ ఇంటర్నేషనల్ (లాభాపేక్ష లేని సంస్థ. స్వచ్చంద సంస్థ లాంటిది) గతవారం వెల్లడించింది. ఎలా పని చేస్తుందంటే... శవపేటిక ఆకారంలో ఉండే సార్కో త్రీడీ ముద్రిత క్యాప్సుల్. ఎవరైనా ఇందులోకి ప్రవేశించి పడుకొంటే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. సమాధానాలు ఇచ్చాక లోపల ఉండే ఒక బటన్‌ను నొక్కడం ద్వారా దీన్ని పనిచేసేటట్లుగా చేయవచ్చు. ఎప్పుడు ప్రారంభం కావాలనే సమయాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. నైట్రోజన్‌తో నిండిన ఒక పరికరం ఉపరితలంపై దీని నిర్మాణం జరుగుతుంది. బటన్ నొక్కిన వెంటనే క్యాప్సుల్‌లోకి శరవేగంగా నైట్రోజన్ నిండుతుంది. సెకన్లలో ఆక్సిజన్ స్థాయి 21 నుంచి ఒకటికి పడిపోతుంది. క్యాప్సుల్‌లోని వ్యక్తి వినికిడి శక్తిని కొద్దిగా కోల్పోయిన భావన కలుగుతుంది... ఒకరకమైన ఆనందానుభూతిని పొందుతాడు. శరీరంలో ఆక్సిజన్, కార్బన్ డయాౖMð్సడ్ స్థాయిలు పడిపోయి మరణం సంభవిస్తుంది. ఈ మొత్తం ప్రక్రియ 30 సెకన్లలో ముగుస్తుందని దీని రూపకర్త డాక్టర్ ఫిలిప్ నిష్కే తెలిపారు. తీవ్ర భయాందోళనలకు లోనుకావడం, ఊపిరి ఆడని ఫీలింగ్, యాతన... ఇవేవీ ఉండవు. ఆటోమేషన్ చేసే ఆలోచన స్విట్జర్లాండ్‌లో అసిస్టెడ్ సూసైడ్ చట్టబద్ధంగా అనుమతించడం పరోక్షంగా జరుగుతుంది. నేరుగా దీన్ని అనుమతించే చట్టాలు లేవు. ఎవరైనా ఆత్మహత్య చేసుకోవడానికి ఇంకొకరు సహాయపడితే... దాని వెనుకగనక అతనికి స్వార్థపూరిత ఉద్దేశాలు ఉన్నాయని రుజువు చేయగలిగితే శిక్షార్హుడని చట్టం చెబుతోంది. అసిస్టెడ్ సూసైడ్‌కు ఒక ప్రొసీజర్ ఉంటుంది. జీవించే అవకాశాల్లేని రోగి... తనువు చాలించాలని నిర్ణయం తీసుకొనేటపుడు మానసిక సమతౌల్యంతో ఉన్నట్లు సైకియాట్రిస్టు ధ్రువీకరించాలి. తర్వాత రోగి నోటి ద్వారా ద్రవరూపంలో ఉన్న సోడియం పెంటోబార్బిటాల్ తీసుకుంటాడు. 2 నుంచి 5 నిమిషాల్లోపే నిద్రలోకి... ఆపై గాఢ కోమాలోకి వెళ్లిపోతాడు. అనంతరం మరణం సంభవిస్తుంది. చాలాదేశాల్లో అసిస్టెడ్ సూసైడ్ డాక్టర్ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ స్విట్జర్లాండ్‌లో డాక్టర్లు కాని వారు కూడా ఆత్మహత్యలో సహాయపడవచ్చు. సైకియాట్రిస్టు ధ్రువీకరణ కూడా యాంత్రికంగా జరిగేలా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)ని సార్కోకు జోడించే యత్నాలు చేస్తున్నామని డాక్టర్ ఫిలిప్ తెలిపారు. అసిస్టెడ్ సూసైడ్– యుథనేసియా ఒకటేనా! కాదు తేడా ఉంది. యూకే నేçషనల్ హెల్త్ సర్వీసెస్ ప్రకారం యుథనేసియా/మెర్సీకి ల్లింగ్ (కారుణ్య మరణం)లో ఒక వ్యక్తికి భరింపలేని, నిరంతర బాధ నుంచి విముక్తి ప్రసాదించడానికి డాక్టర్ ప్రాణాలు తీసే మందును తానే ఇంజక్ట్ చేస్తాడు. రోగి నిర్ణయం తీసుకోలేని పరిస్థితిల్లో ఉంటే మెర్సీకిల్లింగ్లో అతని లేదా ఆమె బంధువులు కూడా రాతపూర్వకంగా సమ్మతి తెలుపవచ్చు. అసిస్టెడ్ సూసైడ్... ఒక బాధిత రోగి ప్రాణాలు తీసుకోవడానికి వైద్యుడు ప్రిస్కిప్షన్ రాస్తాడు.. రోగి స్వయంగా ఇంజక్షన్ లేదా నోటిద్వారా మందును వేసుకుంటాడు. స్విట్జర్లాండ్‌లో మాత్రమే డాక్టర్లు కాని వారు కూడా అసిస్టెడ్ సూసైడ్‌లో సహాయపడవచ్చు. ఏయే దేశాలు అనుమతిస్తున్నాయి... స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, బెల్జియం, లక్సెంబర్గ్, కెనడా, కొలంబియా, స్పెయిన్, న్యూజిలాండ్ (6నెలలకు మించి బతకడని ఇద్దరు డాక్టర్లు ధ్రువీకరించాలి) దేశాల్లో చట్టబద్ధం. ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోనూ ఇది అమల్లో ఉంది. అమెరికా లోని కాలిఫోర్నియా, కొలరాడో, హవాయి, న్యూజెర్సీ, ఒరెగాన్, వాషింగ్టన్ స్టేట్, డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా, మోంటానా, వెర్మోంట్ల్లో చట్టబద్ధం. ఎవరు అర్హులనే విషయంలో నిబంధనలు మాత్రం వేరుగా ఉన్నాయి. స్విట్జర్లాండ్‌లో రెండు అతిపెద్ద అసిస్టెడ్ సూసైడ్ సంస్థలు... ఎగ్జిట్, డిగ్నిటాస్ల సేవలు ఉపయోగించుకొని 2020లో 1,300 మంది విముక్తి పొందారు. చట్టబద్ధత లేని దేశాల వారు స్విట్జర్లాం డ్ వచ్చి మరీ ప్రాణాలు వదులుతున్నారు. ఇది ‘డెత్ టూరిజం’గా మారుతోందనే విమర్శలున్నాయి. నైతికంగా సబబేనా? జాతస్య మరణం ధృవంః. పుట్టిన వాడు గిట్టక తప్పదు. ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ, ఇక బతికే అవకాశాలేమాత్రం లేనపుడు నొప్పిని భరిస్తూ బతికుండటానికి బదులు తనువు చాలించడమే మేలని భావిస్తారు బాధితులు. శారీరకంగా నొప్పిని భరిస్తూ, మానసిక క్షోభను అనుభవిస్తూ మృత్యువు ఎప్పుడొస్తుందోనని ఎదురుచూడటమనేది అన్నింటికంటే పెద్ద నరకం. అలాంటి జీవికి సాధ్యమైనంత తేలికైన మార్గంలో ముక్తిని ప్రసాదించడమే మేలనేది కొందరి వాదన. అందుకే చట్టాలు దీన్ని అనుమతిస్తున్నాయి. భారత్‌లో ఏంటి స్థితి? అసిస్టెడ్ సూసైడ్, యుథనేసియా/మెర్సీ కిల్లింగ్ రెండూ మనదేశంలో చట్ట విరుద్ధం. నేరం. అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు అరుణా షాన్‌బాగ్ కేసులో 2011లో ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చింది. ముంబైలోని ఒక ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే అరుణా షాన్‌బాగ్‌పై వార్డుబాయ్ 1973లో అత్యాచారం చేశాడు. దాంతో కోమాలోకి వెళ్లిన ఆమె కోలుకోలేదు. 37 ఏళ్లు అలా ఆసుపత్రిలో జీవచ్చవంగా బెడ్‌పై ఉండిపోయిన ఆమె తరఫున 2011లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడో న్యాయవాది. ఆమెకు విముక్తి కల్పించాలని కోరాడు. మెడికల్ లైఫ్‌సపోర్ట్ సిస్టమ్‌ను తొలగించడానికి (పాసివ్ యుథనేసియా) సుప్రీంకోర్టు అనుమతించింది. కానీ అది జరగలేదు. 42 ఏళ్లు కోమాలో ఉన్న తర్వాత 2015లో న్యూమోనియాతో అరుణ మరణించారు. అనంతరం 2018లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం... ఒక వ్యక్తిని వైద్య చికిత్సను నిరాకరించే హక్కు ఉందని రూలింగ్ ఇచ్చింది. ‘వయోజనుడైన ఓ వ్యక్తి మానసిక సమతౌల్యంతో నిర్ణయం తీసుకోగలిని స్థితిలో ఉంటే... ప్రాణాలు నిలిపే పరికరాలను తొలగించడంతో సహా ఎలాం టి వైద్య చికిత్సనైనా నిరాకరించే హక్కు అతను లేదా ఆమెకు ఉంటుంది’ అని స్పష్టం చేసింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
కరుణ చూపండి..మరణం ప్రసాదించండి
మదనపల్లె టౌన్ (చిత్తూరు జిల్లా): ఇద్దరు మగ పిల్లలు.. ఒకరి తర్వాత ఒకరు గతంలో చనిపోయారు. మూడో సంతానంగా ఏడాది క్రితం ఆడ బిడ్డ పుట్టింది. అయితే పుట్టుక నుంచే శరీరంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటం, మూర్చ పోవడం, శ్వాస తీసుకునేందుకు ఆ పాప ఇబ్బందులు పడుతోంది. ఆ చిన్నారి చికిత్సకుగాను శక్తికి మించి ఖర్చుచేశారు. పేదరికం కారణంగా ఇక ఖర్చు పెట్టే స్తోమత లేక, చిన్నారి పడుతున్న నరకయాతన చూడలేక ఆ తల్లిదండ్రులు గుండెల్లో బాధను దిగమింగుకుంటూ ఓ నిర్ణయానికి వచ్చారు. గురువారం మదనపల్లె న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తమ బిడ్డకు కారుణ్యమరణం ప్రసాదించాలంటూ న్యాయమూర్తిని అభ్యర్థించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరు జిల్లా, బి.కొత్తకోట, బీసీ కాలనీలో నివాసం ఉండే బావాజాన్, షబానా దంపతులకు రెక్కాడితే గానీ డొక్కాడదు. సొంతిల్లు కూడా లేని వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. మొదటి, రెండో సంతానంగా ఇద్దరు మగ పిల్లలు జన్మించారు. పుట్టిన రోజుల వ్యవధిలోనే సుగర్ స్థాయి పడిపోయి ఆ ఇద్దరూ చనిపోయారు. మూడో సంతానంగా రెడ్డి సుహానా (1) జన్మించింది. పాపకు ఏడాది వయసు వచ్చినా ఎదుగుదల లేకపోవడంతో కొంతకాలం క్రితం డాక్టర్లకు చూపించారు. ఆ చిన్నారికి సుగర్ లెవల్స్ తక్కువగా ఉన్నాయని డాక్టర్లు చెప్పడంతో.. పాపను కాపాడుకోవడానికి అప్పులు చేసి వైద్యం చేయించారు. అయినా వ్యాధి నయం కాలేదు. ఇకపై వైద్యం చేయించడానికి వారివద్ద చిల్లిగవ్వలేదు. కళ్ల ముందే నరకయాతన పడుతున్న బిడ్డను చూస్తూ బతకలేమని, తమ బిడ్డకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని తల్లిదండ్రులు సెకండ్ జేయంఎఫ్‌సీ కోర్టు న్యాయమూర్తిని ఆశ్రయించారు. తాము ఇందుకు అనుమతించలేమని, జిల్లా జడ్జిని ఆశ్రయించాలని న్యాయమూర్తి సలహా ఇచ్చారని బాధితులు తెలిపారు. రోజుకు రూ. 2,400 ఖర్చు నా బిడ్డకు సుగర్ లెవల్స్ తగ్గడంతో ఆరోగ్యం క్షీణిస్తోంది. పాపకు రోజుకు 4 ఇంజక్షన్లు చేయించాలి. ఒక్కో సూది మందు రూ. 600. ఇలా రోజుకు రూ. 2,400 ఖర్చు చేయాలి. ఇప్పటికే ఉన్నవన్నీ అమ్మేశాం. మా వద్ద ఇంక మిగిలిందేమీ లేదు. ప్రభుత్వం ఆదుకుంటే బిడ్డను కాపాడుకుంటాం. న్యాయస్థానం అనుమతిస్తే బిడ్డ ప్రశాంతంగా అయినా కన్నుమూయాలని మేం కోరుకుంటున్నాం. – బావాజాన్, పాప తండ్రి, బి.కొత్తకోట, బీసీ కాలనీ ఆడబిడ్డ పుట్టిందనుకుంటే.. ఇద్దరు మగబిడ్డలు పుట్టి మాయదారి వ్యాధితో కళ్ల ఎదుటే మరణించారు. మూడో కాన్పులోనైనా ఆడబిడ్డ పుట్టిందనుకుంటే ఆ బిడ్డ ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తోంది.పుట్టిన ప్రతి బిడ్డా మాకు దక్కకుండా పోతున్నారు. – షబాన, పాప తల్లి, బి.కొత్తకోట, బీసీ కాలనీ -
కారుణ్య మరణానికి అనుమతివ్వండి! : రాజీవ్ హంతకురాలు
వేలూరు(తమిళనాడు): మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న పేరరివాలన్ తనకు కారుణ్య మరణానికి అనుమతివ్వాలని తల్లి అర్బుదమ్మాల్ ద్వారా తమిళనాడు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. రాజీవ్‌గాంధీ హత్యకేసులో వేలూరు సెంట్రల్ జైలులో మురుగన్, శాంతన్, పేరరివాలన్, నళినితో పాటు ఏడుగురు శిక్ష అనుభవిస్తున్నారు. ఈ ఏడుగురు 27 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నందున విడుదల చేసేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి నివేదిక పంపింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారి విడు దలను నిరాకరించారు. దీంతో నిరాశ చెందిన పేరరివాలన్ తల్లి జోలార్‌పేటలోని తన నివా సంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాజీవ్ హత్య కేసులో 19 ఏళ్ల వయస్సులో ఉన్న పేరరివాలన్‌ను విచారణకు తీసుకెళ్లి అరెస్ట్ చేశారన్నారు. 27 ఏళ్లుగా చట్ట ప్రకారం విడుదల అవుతాడని ఎదురు చూసినా విడుదల కాలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత సీఎం జయలలిత రాజీవ్ హత్య కేసు నిందితుల విడుదలకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి సిఫారస్సు చేశారన్నారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. కోర్టు నుంచి మంచి తీర్పు వింటామనే ఆశతో ఉన్న ఏడుగురికి నిరాశ మిగిల్చేలా రాష్ట్రపతి నిరాకరణ తెలపడం బాధాకరమన్నారు. మహాత్మాగాంధీ హత్యకేసు నిందితులకు 14ఏళ్లు మాత్రమే శిక్ష విధించి విడుదల చేసిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. పేరరివాలన్‌ను 27 ఏళ్లుగా విడుదల చేయకపోవడంపై కన్నీరు మున్నీరయ్యారు. -
పరదేశంలో ప్రశాంతంగా మృత్యు ఒడిలోకి!
జెనీవా: కారుణ్య మరణం పొందడం తన దేశంలో సాధ్యం కాదని, మరో దేశం వెళ్లి మరీ తనువు చాలించారు ఓ 104 శాస్త్రవేత్త. ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ గుడ్‌ఆల్ అనే శాస్త్రవేత్త స్విట్జర్లాండ్‌కు వెళ్లి కారుణ్య మరణం పొందినట్లు స్విస్ ఫౌండేషన్ వెల్లడించింది. తన జీవితం దుర్భరంగా మారిందని, రోజురోజుకూ ఆరోగ్యం క్షీణిస్తోందని, తాను చనిపోయేందుకు అనుమతివ్వాలని ఆస్ట్రేలియాలో దరఖాస్తు చేసుకోగా అధికారులు తిరస్కరించారు. దీంతో స్విట్జర్లాండ్‌కు వెళ్లి ప్రశాంతంగా కన్నుమూశారు. కారుణ్య మరణం పొందేందుకు డేవిడ్‌కు సహకరించిన ఎగ్జిట్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు ఫిలిప్ నిష్కే ఈ విషయాన్ని ధ్రువీకరించారు. లైఫ్ సైకిల్ అనే ఓ క్లినిక్‌లో నెంబుటాల్ అనే మందును ఇంజెక్షన్ ద్వారా ఎక్కించడంతో డేవిడ్ మరణించారని తెలిపారు. ఆస్ట్రేలియాలోని ఎడిత్ కొవాన్ యూనివర్సిటీలో రీసెర్చ్ ఆసోసియేట్గా డేవిడ్ పనిచేశారు. ‘నా జీవితం ముగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఆస్ట్రేలియాలోనే మరణించడం నాకిష్టం కానీ మరణించే హక్కు కల్పించడంలో అక్కడి చట్టాలు స్విట్జర్లాండ్ కన్నా వెనుక ఉన్నాయి’అని డేవిడ్ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాల్లో కారుణ్య మరణానికి అనుమతి లేదు. అయితే ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో మాత్రం తాజాగా కారుణ్య మరణానికి అనుమతిచ్చినా, అది 2019 జూన్ నుంచి అమల్లోకి రానుంది. కానీ స్విట్జర్లాండ్‌లో మాత్రం కారుణ్య మరణం పొందాలని మనస్ఫూర్తిగా, తెలివితో ఉండి కోరితే ఎవరికైనా అనుమతిస్తారు. -
అల్విదా మేరా దోస్త్..
మరణానికి మరికొన్ని క్షణాలు.. ఓ జాతి అంతరించడానికి మరికొన్ని క్షణాలు.. సూడాన్ శాశ్వత నిద్రకు మరికొన్ని క్షణాలు.. రిజర్వు పార్కు రేంజర్ ముథాయ్ పరుగుపరుగున వచ్చాడు.. మరికొన్ని క్షణాల్లో ఈ లోకాన్ని విడిచివెళ్తున్న తన మిత్రుడికి తుది వీడ్కోలు పలకడానికి.. సూడాన్‌ను చూడగానే ఎప్పుడూ తన మోముపై వికసించే నవ్వు నేడు నేలరాలింది.. రెప్పచాటు ఉప్పెన కట్టలు తెంచుకుంది..అక్కడే అలా కూలబడ్డాడు..సూడాన్‌ను ప్రేమగా నిమిరాడు..చివరిసారిగా... అల్విదా మేరా దోస్త్.. సూడాన్.. ప్రపంచంలోనే ఏకైక మగ నార్తర్న్ వైట్ రైనో(45).. ఒకప్పుడు ఉగాండా, సూడాన్, కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఎక్కువగా ఉండేవి. కొమ్ముల కోసం వేటగాళ్లు ఈ ఖడ్గమృగాలను విచ్చలవిడిగా వధించడంతో అంతరించే దశకు చేరాయి. చివరికి మగ నార్తర్న్ వైట్ రైనోల్లో సూడాన్ ఒక్కటే మిగిలింది. ఆ జాతి అంతరించిపోయే పరిస్థితి ఏర్పడటంతో చెక్ రిపబ్లిక్‌లోని జూలో ఉన్న దీన్ని 2009లో కెన్యా ఫారెస్టు రిజర్వ్ పార్కుకు తెచ్చారు. సూడాన్‌తోపాటు రెండు ఆడ నార్తర్న్ వైట్ రైనోలనూ కూడా తెచ్చి.. సంతానోత్పత్తి చేయించేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో వేటగాళ్ల బారిన పడకుండా ఉండేందుకు సూడాన్‌కు సాయుధ రక్షణను కూడా ఏర్పాటు చేశారు. వాచ్ టవర్స్, డ్రోన్లు, వేట కుక్కలు వంటివాటిని పెట్టారు. దీంతో సూడాన్ ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీ అయింది. లక్షల మంది దీన్ని చూడ్డానికి వచ్చేవారు. అయితే, వీటి సంతతిని పెంచడానికి శాస్త్రవేత్తలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తర్వాత తర్వాత సూడాన్ ఆరోగ్యం క్షీణించింది. కనీసం లేవలేని పరిస్థితి వచ్చింది. దీని బాధను చూడలేక సూడాన్‌కు కారుణ్య మరణం ప్రసాదించినట్లు మంగళవారం రిజర్వు పార్కు ప్రకటించింది. ఓ వైద్యుడు ఇంజెక్షన్ ద్వారా సూడాన్‌కు విముక్తినిచ్చినట్లు తెలిపింది. అది జరడానికి కొన్ని క్షణాల ముందు.. సూడాన్ మృత్యువు ముంగిట ఉన్న సమయంలో తీసిన చిత్రమే ఇది. ప్రకృతి పట్ల, సాటి జీవుల పట్ల మానవుడు చూపుతున్న క్రూర స్వభావానికి నిదర్శనంగా సూడాన్ చరిత్రలో నిలిచిపోతుందని రిజర్వు పార్కు సీఈవో రిచర్డ్ అన్నారు. ‘కేవలం తన జాతికే కాదు.. మానవుడి అక్రమ కార్యకలాపాల వల్ల అంతరించిపోయే దశలో ఉన్న అనేక వేల జంతు, పక్షి జాతులకు ప్రతినిధిగా వ్యవహరించాడు’అని చెప్పారు. మిగిలినవి రెండూ ఆడ ఖడ్గమృగాలు కావడంతో ఇక ఈ జాతి అంతరించినట్లే అని చెబుతున్నారు. అయితే, శాస్త్రవేత్తలు చనిపోయే ముందు సూడాన్ జెనెటిక్ మెటీరియల్‌ను సేకరించారని.. ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఈ జాతిని రక్షించేందుకు తమ ప్రయత్నాలు సాగుతాయని రిచర్డ్ చెప్పారు. -
మృత్యువు
జీవన కాలమ్ కారుణ్య మరణాన్ని అంగీకరించడం ద్వారా మనం నైతిక, చట్టపరమైన ‘మానవీయత’కు మరింత మెరుగయిన స్థానాన్ని ఇస్తున్నాం. ఇది మానవాళి కర్తవ్యంగా తలవంచి, ‘జీవా’న్ని సృష్టించిన శక్తికి క్షమాపణ చెప్పుకుంటున్నాం. 1981 ప్రాంతంలో హాలీవుడ్లో ఓ విభిన్నమయిన చిత్రం వచ్చింది. ‘హూజ్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీవే?’ గొప్ప చిత్రం. ఆలోచింపజేసే చిత్రం. ఓ గొప్ప పెయింటరు లారీ యాక్సిడెంటులో దెబ్బతింటాడు. మెడ దగ్గర్నుంచి కాలి వరకు స్పర్శ పోయింది. ఇది భయంకరమైన శాపం. మెదడు ఆలోచించగల అన్ని ఆలోచనలూ స్పష్టంగా చేయగల అమూల్యమైన సాధనం య«థాతథంగా పోయింది. కాలిమీద వాలిన ఈగని తోలుకునే ఆస్కారం లేదు. మనిషి సంపూర్ణంగా జీవించడానికి ఏది గుర్తు? మంచి బతుక్కి ఆలోచనా మంచి ఆచరణా? అతను కేవలం ఒక అప్రయోజనమైన జీవితాన్ని గడుపుతున్నానని, తనకి స్వచ్ఛందంగా చచ్చిపోయే హక్కుని ప్రసాదించాలని న్యాయవాదుల బృందం ముందు వాదిస్తాడు. చివరికి వారు అతని కోరికని అంగీకరించక తప్పలేదు. డాక్టరు నిస్సహాయంగా అతని ప్రాణాన్ని నిలిపే ద్రావకాన్ని ఆపేస్తూ ‘‘మూడు నిమిషాలలో నీ కోరిక తీరుతుంది. ఈ లోగా నీ మనసు మార్చుకుంటే నేను సహకరించగలను’’ అంటాడు. సజావుగా జీవించలేని వ్యక్తి తన నిస్సహాయతను సహేతుకంగా నిరూపించి చచ్చిపోయే హక్కు ఉన్నదని రుజువుచేసి, మృత్యువుని ఆహ్వానించే కథ ఇది. ఇది ఎథునీసియా (కారుణ్య మరణం). దీనిని ఎవరు అంగీకరించాలి? న్యాయస్థానం. మృత్యువు వ్యక్తికున్న పవిత్రమైన హక్కు. మనం ప్రతీ రోజూ హత్యలూ, మారణహోమాలూ వింటుం టాం కానీ, నీతిపరంగా, న్యాయపరంగా మరొకరి ప్రాణం తీసే హక్కు, ధైర్యం ఎవరికుంది? కొన్ని వందల దేశాలు, కొన్ని వందలసార్లు ఈ ‘పవిత్రమైన’ చెలియకట్టను దాటే ధైర్యం చేయలేక మ«థనపడి మ«థ నపడి ఆ పనిని మానుకున్నాయి. ఒక రోగి, సంవత్సరాలుగా మంచం పట్టాడు. బాగుపడే ఆస్కారం ఏ మాత్రం లేదని వైద్య రంగం చెయ్యి ఎత్తేసింది. అతని ప్రాణాన్ని నిలపాలంటే ఆ కుటుంబానికి ఖర్చు. వారికి రోగి బాగుపడడన్న ముగింపు తెలుసు. ఇప్పుడతనికి చచ్చిపోయే హక్కు ఉందా? న్యాయస్థానం ‘మృత్యువు’కి అంగీకరిస్తుం దా? నిర్ణయం తీసుకోవడానికి న్యాయవ్యవస్థ వణికిపోయింది. తను ఇవ్వలేని ప్రాణాన్ని ఏ కారణంగానయినా తుంచేసే హక్కు తనకేం ఉన్నది? 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ రోగి ఊపిరి సజావుగా పీల్చగలిగితే? మానవతా విలువలు అతి క్రూరమైనవి. ‘రేపు’ మానవతా విలువలకి అందని అమూల్యమైనది. మనమెవరం మనిషి ప్రాణాన్ని హఠాత్తుగా తుంచెయ్యడానికి? నువ్వు ప్రాణాన్ని పోయగలవా? మరో క్షణం పొడిగించగలవా? ఒక్క క్షణం ఆపగలవా? నైతిక, మానవీయ, చట్టపరమైన పరిధుల్లో ఎన్నో సంవత్సరాలు న్యాయమూర్తులు ఈ ఆలోచనకే వణికిపోయారు. నిజంగా ‘స్వచ్ఛంద మరణం’ ఇచ్చే అర్హతలున్న ఎన్నో కేసులు చూసి. అర్థం చేసుకునే న్యాయమూర్తులు మూగగా ఉండిపోయారు. పాసివ్ ఎథునీసియా అంటే స్థూలంగా వైద్య సహాయానికి లొంగక, లొంగదని నిర్ధారణ అయ్యాక, ఎన్నాళ్లయినా రోగి పరిస్థితి ఇంతేనని తేల్చిన వారు తెలిసి తెలిసీ హుందాగా మరణాన్ని ఆహ్వానించడం. మానవీయ విలువలను దృష్టిలో పెట్టుకుని, వాస్తవాన్ని ఎరిగి, నైతిక బాధ్యతని వహించి న్యాయస్థానం అట్లాంటి వ్యక్తులు క్రమంగా ప్రాణాన్ని కోల్పోవడానికి అనుమతిని ఇస్తుంది. ఏ విధంగానూ జీవించే అవకాశం లేని రోగిని నానాటికీ పురోగమిస్తున్న వైద్య విధానాల దృష్ట్యా జీవితాన్ని ఒక విధంగా ఆ రోగి హుందాగా మరణించే అవకాశాన్ని దోచుకోవడం అవుతుందనే నిర్ణయానికి వచ్చింది. ఇదంతా రోగికి వైద్యం చేసే డాక్టర్లు రోగి మానసిక స్థితి, ఆరోగ్య స్థితి, రోగం స్థితి ఇన్నిటిని నిర్ణయించి– ముఖ్యంగా రోగి ఇష్టాయిష్టాలను ఎరిగి అప్పుడు రికమెండు చేస్తుంది. ఈ చర్యని చట్టాన్ని చెయ్యడంలో ఎక్కడ ‘మరణయాతన’ చచ్చిపోయే వ్యక్తి డిగ్నిటీని దోచుకొంటోందో వివరించింది. ప్రధాన న్యాయమూర్తి ఒక మాట అన్నారు. పాసివ్ ఇథునీసియాని అంగీకరించడం ద్వారా మనం మన చేతులోలేని, నిస్సహాయమైన, నిస్సందేహంగా పరిష్కారాన్ని– నైతిక, చట్టపరమైన ‘మానవీయత’కు మరింత మెరుగయిన స్థానాన్ని ఇస్తున్నాం. అంతే. అదీ వణుకుతూనే. ఇది మానవాళి కర్తవ్యంగా తలవంచి భగవంతునికి– పోనీ ఆయన లేకపోతే ‘జీవా’న్ని సృష్టించిన శక్తికి సవినయంగా క్షమాపణని చెప్పుకుంటున్నాం. ఈ వ్యక్తికి బకుకుతాడన్న ఆశలేదు. చచ్చిపోతాడన్న రూఢి లేదు. ఎంతకాలం బతుకుతాడో, ఎలా బతుకుతాడో, అసలు బతుకుతాడో బతకడో చెప్పే మార్గం లేదు– వైద్యం చేతులెత్తేసింది కనుక. తరాలు, దశాబ్దాల తరబడి మేధావులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు, న్యాయనిపుణులు చర్చించి తనకి శక్తి లేని, సృష్టించడానికి శక్తి చాలని– ఆ నిస్సహాయుడికి బతికే క్రూరత్వం కంటే కన్నుమూసిన సౌలభ్యం ఒక ‘విముక్తి’ అనే భావనకి వచ్చారు. అదీ పాసివ్ ఇథునీసియా (కారుణ్య మరణం). - గొల్లపూడి మారుతీరావు -
కారుణ్య మరణానికి ఓకే
న్యూఢిల్లీ: కోలుకునే అవకాశం ఏమాత్రం లేని పరిస్థితుల్లో.. మృత్యువు కోసం ఎదురుచూస్తూ, మంచంపైనే కాలం వెళ్లదీస్తున్నవారికి ఊరటనిచ్చేలా దేశ అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం కీలక తీర్పును వెలువరించింది. మరణం వాయిదా వేయడం మినహా మరే ఆశ లేనప్పుడు, శారీరక బాధను భరించలేని దయనీయ పరిస్థితిలో.. రోగి లేదా అతని తరఫున నమ్మకమైన వ్యక్తి అనుమతితో కారుణ్య మరణం ప్రసాదించవచ్చని పేర్కొంటూ పరోక్ష కారుణ్య మరణానికి(పాసివ్ యుథనేసియా) సమ్మతించింది. గౌరవప్రదమైన మరణం కూడా జీవించే హక్కులో భాగమేనని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ కారుణ్య మరణం అమలుకు సంబంధించి కొన్ని కచ్చితమైన మార్గదర్శకాలను కోర్టు పేర్కొంది. చికిత్స సాధ్యం కాదని, మరణం అనివార్యమని తెలిసినప్పుడు లేక చాన్నాళ్లుగా అచేతన స్థితిలో (కోమా) ఉన్నప్పుడు ఆ రోగి లేదా ఆ వ్యక్తి తరఫున.. కేవలం మరణాన్ని వాయిదా వేసే వైద్య చికిత్స తనకవసరం లేదని, ఆ ప్రాణాధార చికిత్సను నిలిపేయాలని కోరుతూ ‘అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్’ లేదా ‘లివింగ్ విల్’ను ఇవ్వొచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం వివరించింది. కారుణ్య మరణం కోసం ‘అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్’ని చట్టబద్ధం చేయకపోవడం.. ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ద్వారా సంక్రమించిన ప్రశాంతంగా, గౌరవ ప్రదంగా మరణించే హక్కును పట్టించుకోకపోవడమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా చట్టం చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ‘ఈ అంశంపై పార్లమెంటు చట్టం చేసే వరకూ కోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలు అమల్లో ఉంటాయి’ అని సీజేఐ మిశ్రా తెలిపారు. తనతో పాటు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ తరఫున ఆయన తీర్పు వెలువరించగా.. జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్‌లు వేర్వేరుగా తీర్పు వెలువరించారు. చికిత్సకు సంబంధించిన స్వయంగా నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్న రోగికి అన్ని విధాలా దగ్గరివారైన, రోగి మనస్సును అర్థం చేసుకోగలవారైన వ్యక్తికి రోగి కారుణ్య మరణంపై నిర్ణయం తీసుకునే అధికారం అప్పగించడాన్నే మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ లేదా లివింగ్ విల్ లేదా అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్ అంటారు. త్వరగా చట్టం చేయాలి సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా 192 పేజీల తీర్పునిస్తూ ‘బతికే ఆశ లేని పరిస్థితుల్లో లేక కోలుకునే అవకాశం లేకుండా సుదీర్ఘంగా అచేతనంగా(కోమా) ఉన్నప్పుడు.. ఆ వ్యక్తి పడే బాధను తగ్గించే క్రమంలో మరణ ప్రక్రియను వేగవంతం చేయడమంటే గౌరవంగా జీవించే హక్కును కల్పించడమే.. మానవ జీవిత పవిత్రతను ఎంతో గౌరవించాల్సి ఉన్నప్పటికీ.. వారు కోలుకునే ఆశ లేనప్పుడు.. ముందస్తు అనుమతి, సొంత నిర్ణయ హక్కుకు ప్రాధాన్యమివ్వాలి’ అని చెప్పారు. జస్టిస్ చంద్రచూడ్ 134 పేజీల తీర్పును వెలువరిస్తూ.. ‘చావు, బతుకులు విడదీయరానివి.. మరణించడం తప్పనిసరని తెలిసిన పరిస్థితుల్లో కూడా రాజ్యాంగం ప్రసాదించిన గౌరవప్రదంగా జీవించే హక్కు కొనసాగుతుందని తెలుసుకోవడం కోర్టుకు తప్పనిసరి. గౌరవప్రద మరణం కూడా జీవించే హక్కులో భాగం. గౌరవ ప్రదమైన మరణం లేకుండా చేయడమంటే ఒక వ్యక్తికి ఉండే అర్థవంతమైన ఉనికిని లేకుండా చేయడమే. అందుకే మరణించే వరకూ ఒక వ్యక్తి గౌరవప్రదంగా జీవించేందుకు ఉన్న హక్కును రాజ్యాంగం పరిరక్షిస్తుంది’ అని పేర్కొన్నారు. సీజేఐ తీర్పుతో జస్టిస్ సిక్రీ ఏకీభవిస్తూ.. ఈ అంశంపై చట్టసభలు వీలైనంత త్వరగా సమగ్ర చట్టం తీసుకురావాలని సూచించారు. జియాన్ కౌర్ కేసులో ‘గౌరవప్రదంగా మరణించడం రాజ్యంగ హక్కు’ అని 1996లో సుప్రీం ధర్మాసనం చెప్పిన విషయాన్ని తన తీర్పులో జస్టిస్ భూషణ్ పునరుద్ఘాటించారు. 2011లోనే..: 2011లో అరుణా షాన్‌బాగ్ కేసు సమయంలో పరోక్ష కారుణ్య మరణాన్ని సుప్రీంకోర్టు గుర్తించింది. అనంతరం ఇలాంటి సంఘటనలో పరోక్ష కారుణ్య మరణం కోసం రోగి ఇచ్చే లివింగ్ విల్లును గుర్తించాలని కామన్ కాజ్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేయగా.. సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పునిచ్చింది. లివింగ్ విల్ అంటే.. రోగి తన ఆరోగ్య సంరక్షణకు సంబంధించి నిర్ణయాలు తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ బాధ్యతను నమ్మకస్తుడైన మరో వ్యక్తికి కట్టబెట్టే ‘మెడికల్ పవర్ ఆఫ్ అటార్నీ’నే ‘లివింగ్ విల్’ లేదా ‘అడ్వాన్స్ మెడికల్ డైరెక్టివ్’గా పరిగణిస్తాం. ► రోగి స్పృహలో లేనప్పుడు, ఒక నిర్ణయం తీసుకునే తీసుకునే స్థితిలో లేనప్పుడు అతనికి ఎంతకాలం వైద్యం కొనసాగించాలో నిర్ణయించేది ఆ నమ్మకస్తుడైన వ్యక్తే ► సుప్రీం మార్గదర్శకాల ప్రకారం..మానసికంగా ఆరోగ్యవంతుడైన, సరిగా భావ వ్యక్తీకరణ చేసే వయోజనుడు లివింగ్ విల్ రూపొందించుకోవచ్చు. దాని ఉద్దేశం, అమలుచేశాక తలెత్తే పరిణామాలను అతను అర్థం చేసుకొని ఉండాలి. తీర్పులో వివేకానంద, ప్లేటో, షేక్స్పియర్..! తీర్పు సందర్భంగా కోర్టు తత్వవేత్తలు స్వామి వివేకానంద, చార్వాకుడు, ప్లేటో, హిప్పోక్రటస్, ఎపిక్యురస్లను ఉదాహరించింది. వీరితో పాటు విలియమ్ షేక్స్పియర్, అల్ఫ్రెడ్ టెన్నిసన్, ఎర్నెస్ట్ హెమ్మింగ్వే తదితర రచయితలు, కవులు జీవితం, మరణంపై వ్యక్తీకరించిన అభిప్రాయాల్ని తీర్పులో చేర్చారు. సీజేఐ మిశ్రా తీర్పును వెలువరిస్తూ ‘శ్వాసించే మనుషులెవరూ ఇప్పటివరకూ మృత్యువును కోరుకోలేదు’ అని టెన్నిసన్ వ్యాఖ్యలను ఉటంకించారు. ‘ఈ ప్రపంచం ఓ రంగస్థలం. మనం కేవలం పాత్రధారులమే’ అని షేక్స్పియర్మాటల్ని ఉదహరించారు. జస్టిస్ సిక్రీ తీర్పును వెలువరిస్తూ.. ‘ఈ లోకంలోకి ప్రతీ ఒక్కరూ ఏడుస్తూనే వస్తారు. కానీ నవ్వుతూ చనిపోయే వాడే అందరిలోకెల్లా అత్యంత అదృష్టవంతుడు’ అని ఓ హిందీ సినిమా డైలాగ్‌ను తీర్పులో చేర్చారు. ‘ఓ వ్యక్తి పరిపూర్ణం కాని రాజ్యాంగంతో పాటు అనారోగ్యకరమైన అలవాట్లు కలిగిఉంటే ఆ జీవితం వల్ల ఆ వ్యక్తికి, ఇతరులకు ప్రయోజనం శూన్యం’ అని ప్లేటో వ్యాఖ్యలను జస్టిస్ భూషణ్ ఉటంకించారు. ఆ కేసుతోనే కారుణ్య మరణంపై చర్చ అరుణ రామచంద్ర షాన్‌బాగ్.. 1973లో ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ ఆస్పత్రిలో నర్సుగా చేస్తున్న సమయంలో వార్డు బాయ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె మెడకు గొలుసు బిగించి గాయపర్చడంతో అరుణ మెదడుకి రక్తప్రసారం నిలిచిపోయి అచేతన స్థితికి వెళ్లిపోయింది. 42 ఏళ్ల పాటు అలా మంచానికే పరిమితమయ్యారు. ట్యూబులతో ద్వారా వైద్యులు ఆహారం అందించారు. 2009లో సామాజిక కార్యకర్త పింకీ విరాని ఆమె స్థితికి చలించి ట్యూబుల్ని తొలగించి కారుణ్య మరణం ప్రసాదించాలని సుప్రీంలో పిటిషన్ వేశారు. కోర్టు ముగ్గురు ప్రముఖు వైద్యులతో కమిటీ వేయగా.. అరుణ బ్రెయిన్ డెడ్ అవలేదని, యుథనేసియా ఈ కేసుకి వర్తించదని ఆ కమిటీ తెలిపింది. దీంతో విరానీ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఆ తర్వాత అరుణ న్యుమోనియా సోకడంతో 2015, మే 18న మరణించారు. యుథనేసియా రకాలు.. స్వచ్ఛంద(వాలంటరీ): రోగి అంగీకారం, అనుమతి మేరకు అతడికి మరణాన్ని అందించడం. బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్స్‌లో ఈ రకం యూథనేసియా చట్టబద్ధం. స్వచ్ఛందం కాని(నాన్‌వాలంటరీ): రోగి అనుమతి, అంగీకారం తీసుకునే పరిస్థితి లేనప్పుడు నిర్వహించే మరణ ప్రక్రియ ఇది. పసిపిల్లల విషయంలో అరుదుగా ఉపయోగిస్తుంటారు. ఏ దేశంలోనూ ఇది చట్ట సమ్మతం కాదుగానీ.. నెదర్లాండ్స్‌లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం అనుమతిస్తారు. బలవంతపు(ఇన్వాలంటరీ): పేరులో ఉన్నట్లే రోగికి ఇష్టం లేకపోయినా అతడిని చంపేసే ప్రక్రియను ఇన్వాలంటరీ యూథనేసియా అని పిలుస్తారు. పాసివ్, యాక్టివ్: పాసివ్ యుథనేసియాలో రోగికి అందిస్తున్న వైద్యాన్ని ఆపివేయడం ద్వారా మరణించేలా చేస్తారు. యాక్టివ్ యుథనేసియాలో వెంటనే చనిపోయేలా విషపు ఇంజెక్షన్లు ఇస్తారు. సుప్రీం మార్గదర్శకాలు.. కారుణ్య మరణం అమలు కోసం రోగి లేదా అతని తరఫు నమ్మకమైన వ్యక్తి రాసిచ్చే అడ్వాన్స్డ్ మెడికల్ డైరెక్టివ్ లేదా లివింగ్ విల్ విషయంలో కోర్టు పలు మార్గదర్శకాలు నిర్దేశించింది. మెడికల్ డైరెక్టివ్ పూర్తి ఆరోగ్యంతో ఉన్న వయోధికుడు మాత్రమే రాసి ఇవ్వాలి. అనుమతి పత్రం ఉద్దేశం, అమలు అనంతర పరిణామాల పట్ల వారికి అవగాహన ఉండాలి. ఎలాంటి నిర్బంధం లేకుండా స్వచ్ఛందంగా అనుమతి పత్రాన్ని రాసివ్వాలి. ముందుగా ఎలాంటి చికిత్స తీసుకున్నప్పటికీ వ్యాధులు నయంకాని రోగి గురించి చికిత్స చేసే వైద్యుడు ఆస్పత్రి యాజమాన్యానికి తెలియచేయాలి. అనంతరం ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, బంధువులకు చెపుతారు. దీనిపై సంబంధిత విభాగాధిపతితో పాటు జనరల్ మెడిసిన్, కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, అంకాలజీ విభాగాల్లో నిష్ణాతులైన ముగ్గురు వైద్యులతో ఆస్పత్రి యాజమాన్యం ఓ మెడికల్ బోర్డును ఏర్పాటుచేస్తుంది. బంధువుల సమక్షంలో రోగిని ఈ బృందం పరీక్షించి వైద్య సేవల్ని నిలిపివేయాలా? వద్దా? అని నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ రోగికి వైద్యాన్ని నిలిపివేయడానికి బోర్డు అంగీకరిస్తే.. ఈ విషయాన్ని సంబంధిత జిల్లా కలెక్టర్‌కు తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విషయమై కలెక్టర్ మరో మెడికల్ బోర్డును ఏర్పాటుచేసి ఇంతకుముందు ఆస్పత్రి తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షిస్తారు. ఈ కమిటీ ఆస్పత్రి నిర్ణయంపై సంతృప్తి చెందితే కలెక్టర్ రోగిని సందర్శించి పాసివ్ యూథనేసియాకు అనుమతిస్తారు. ఒకవేళ కలెక్టర్ నియమించిన బోర్డు పాసివ్ యూథనేసియాకు ఆమోదం తెలపకుంటే రోగి కుటుంబ సభ్యులు, చికిత్స అందించిన వైద్యుడు, ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ డివిజన్ బెంచ్‌ను ఏర్పాటుచేసి నిర్ణయం తీసుకుంటారు. ముందస్తు వినతి లేని సమయంలో సదరు ఆస్పత్రి యాజమాన్యం మెడికల్ బోర్డును ఏర్పాటుచేస్తుంది. -
‘కారుణ్య’ చిన్నారి శృతిహాసన్ మృతి
చిత్తూరు, కురబలకోట: న్యూరో పైబ్రోమా అనే వ్యాధితో బాధపడుతూ ఇన్నాళ్లు మృత్యువుతో పోరాడిన చిన్నారి శృతి హాసన్ ఓడిపోయింది. బిడ్డను రక్షించుకునేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగులుస్తూ ప్రాణాలు విడిచింది. వివరాలు.. మండలంలోని తెట్టు గ్రామం పుల్లగూరవాండ్లపల్లెకు చెందిన సునీత, రెడ్డెప్పల కుమార్తె శృతిహాసన్ మూడేళ్ల వయసు నుంచి న్యూరోపైబ్రోమాతో బాధపడుతోంది. వ్యాధితో నరకయాతన పడుతు న్న చిన్నారికి తల్లిదండ్రులు తిరుపతి, బెంగళూరుల్లోని పలు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించారు. అయినా ఫలితం కానరాలేదు. ఈ నేపథ్యంలో బిడ్డ కారుణ్యమరణానికి అనుమతి ఇవ్వాలని కోర్టును కూడా ఆశ్రయించారు. దీంతో అయినా ప్రభుత్వం ఆదుకుని చికిత్సలు చేయిస్తుందని వారు ఆశలు పెట్టుకున్నారు. అయినా స్పందన కానరాలేదు. ఈ నేపథ్యంలో ఆస్పత్రులలో చికిత్స పొంది ప్రస్తుతం ఇంట్లో ఉన్న చిన్నారి ఆదివారం ప్రాణాలు విడించింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. శృతిహాసన్ మృతదేహం -
చనిపోతా...అనుమతి ఇవ్వండి
మదనపల్లి(చిత్తూరు జిల్లా) : బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్న తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని తల్లిదండ్రులు న్యాయమూర్తి ఎదుట మొరపెట్టుకున్నారు. ఈ సంఘటన సోమవారం ఉదయం మదనపల్లి రెండవ అదనపు జిల్లా కోర్టులో చోటుచేసుకుంది. మదనపల్లి విజయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న రాయిపేట నారాయణ, శ్యామల దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కూలిపనులు చేసుకుని జీవించేవారు. వీరి రెండవ కుమార్తె రెడ్డిమాధవి ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఏడాది కాలంగా ఆమె బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతోంది. బెంగుళూరు, తిరుపతి, హైదరాబాద్‌లలో పెద్దపెద్ద ఆస్పత్రులలో చూపించినా ప్రయోజనం లేకపోయింది. రెడ్డిమాధవి ఆరోగ్యం నానాటికీ క్షీణిస్తోంది. ఆమె చిక్కిశల్యమైంది. ఇటీవల బెంగుళూరు ప్రైవేటు ఆస్పత్రిలో చూపిస్తే 6లక్షలు ఖర్చు తెస్తే వైద్యం చైస్తామని చెప్పారు. కూలిపనులు చేసుకునే తాము అంతమొత్తం భరించలేమని, ఏ క్షణంలో ఏమి జరుగుతుందోనన్న ఆందోళనతో తాము కాలం గడుపుతున్నామని, అందువల్ల తమ కుమార్తెను చంపుకునేందుకు అనుమతి ఇవ్వాలని వారు న్యాయమూర్తిని అభ్యర్థించారు. ఈ మేరకు న్యాయమూర్తికి లేఖ అందజేశారు. -
చిట్టితల్లీ.. సుఖీభవ
జ్ఞానసాయికి సాయం అందించేందుకు ముందుకొచ్చిన ప్రభుత్వం వరుస కథనాలతో చిన్నారికి అండగా నిలిచిన ‘సాక్షి’ స్పందించిన అనేక మంది దాతలు ములకలచెరువు : మండలంలోని వేపూరికోట పంచాయతీ బత్తలాపురానికి చెందిన జె.రమణప్ప, సరస్యతి దంపతుల కుమార్తె జ్ఞానసాయికి పూర్తిస్థాయి వైద్యసేవందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వివరాల్లోకి వెళితే.. చిన్నారి జ్ఞానసాయికి కాలేయం పూర్తిగా దెబ్బతినడంతో కాలేయ మార్పిడి కోసం రూ. 15 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. దీనిపై బాధితులు సాక్షిని సంప్రదించగా దాతలసాయం కోసం ఈ నెల 16వ తేదీ ‘ పసిమొగ్గకు ప్రాణం పోయండి‘ అనే శీర్షికతో ‘సాక్షి’లో కథనం వెలువడింది. వెంటనే స్పందించిన ములకలచెరువు సీఐ రుషికేశవ్ చిన్నారి కుటుంబ సభ్యులకు రూ.7,500 వేలను నగదు రూపంలో అందించారు. అనంతరం మరుసటి రోజు పుత్తూరుకు చెందిన చిరంజీవి అనే దాత రూ. 3 వేలను చిన్నారి తల్లి జే. సరస్వతి బ్యాంకు ఖాతాలో జమచేశారు. తర్వాత ములకలచెరువు కస్తుర్బా పాఠశాలకు చెందిన టీచర్ నిర్మలమ్మ రూ. వెయ్యి, అదే పాఠశాలకు చెందిన విద్యార్థిణి చందన రూ.500లను బాధితులకు అందించారు. వరుసగా దాతల సహాయంపైన సాక్షిలో కథనాలు వెలబడుతుండడంతో స్థానిక ములకలచెరువుకు చెందిన వ్యాపారస్తుడు నరసింహులు మూడు రోజుల క్రితం బాధితులకు రూ. 5 వేలను చిన్నారి వైద్యం కోసం చేయూత నిచ్చారు. కారుణ్య మరణం కథనంతో వెలుగులోకి.. పేద కుటుంబం కావడంతో చిన్నారి వైద్యం కోసం డబ్బు వెచ్చించే స్థోమత లేదని కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని బాధితులు గురువారం తంబళ్లపల్లె, మదనపల్లె కోర్టులో పటిషన్ వేశారు. ఈ విషయంపై శుక్రవారం పసిమొగ్గకు ఎంతకష్టం శీర్షికతో సాక్షిలో కథనం వెలువడింది. దీనిపై ప్రభుత్వం స్పందించి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చిన్నారికి వైద్యం చేయిస్తామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు చిన్నారి తండ్రి జే.రమణప్పకు శుక్రవారం ఫోను ద్వారా సమాచారం అందించారు. అనంతరం చిన్నారి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని మదనపల్లె సబ్‌కలెక్టర్ కృతికాబాత్రాకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆదేశించినట్లు సమాచారం. సబ్‌కలెక్టర్ ములకలచెరువు తహశీల్దార్ అమరేంద్రబాబుకు చిన్నారి వివరాలు, జబ్బుకు అయ్యే ఖర్చుపై నివేదిక అందివ్వాలని అదేశించడంతో రెవెన్యూ అధికారులు ఒక్కసారిగా బాధితుల ఇంటి వద్దకు ఆగమేఘాలపైన పరుగులు తీశారు. బాధితులు ఇంటి వద్ద లే కపోవడంతో ఫోను ద్వారా వివరాలు సేకరించారు. అనంతరం సబ్క లెక్టర్‌కు నివేదిక పంపించారు. ప్రస్తుతం వైద్య పరీక్షల కోసం చిన్నారిని హైదరాబాద్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించారు. పరీక్షల అనంతరం చిన్నారికి ఆపరేషన్ నిర్వహించి కాలేయం మార్పిడి చేయనున్నారు. తల్లీదండ్రులలో ఒక్కరికి ఆపరేషన్ చేసి వారి నుంచి కొద్దిబాగం కాలేయాన్ని తీసి చిన్నారికి అమర్చనున్నట్లు సమాచారం. వీటి మొత్తానికి సుమారుగా రూ. 25 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు అంచనా చేస్తున్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం దిగిరావడంతో చిన్నారి కుటుం సభ్యుల కళ్లలో ఆనందం కనిపించింది. సాక్షిలో కథనాలకు స్పందన రావడంతో చిన్నారి తల్లిదండ్రులు సాక్షికి కృతజ్ఞతలు తెలిపారు.