జీవన కాలమ్
కారుణ్య మరణాన్ని అంగీకరించడం ద్వారా మనం నైతిక, చట్టపరమైన ‘మానవీయత’కు మరింత మెరుగయిన స్థానాన్ని ఇస్తున్నాం. ఇది మానవాళి కర్తవ్యంగా తలవంచి, ‘జీవా’న్ని సృష్టించిన శక్తికి క్షమాపణ చెప్పుకుంటున్నాం.
1981 ప్రాంతంలో హాలీవుడ్‌లో ఓ విభిన్నమయిన చిత్రం వచ్చింది. ‘హూజ్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీవే?’ గొప్ప చిత్రం. ఆలోచింపజేసే చిత్రం. ఓ గొప్ప పెయింటరు లారీ యాక్సిడెంటులో దెబ్బతింటాడు. మెడ దగ్గర్నుంచి కాలి వరకు స్పర్శ పోయింది. ఇది భయంకరమైన శాపం. మెదడు ఆలోచించగల అన్ని ఆలోచనలూ స్పష్టంగా చేయగల అమూల్యమైన సాధనం య«థాతథంగా పోయింది. కాలిమీద వాలిన ఈగని తోలుకునే ఆస్కారం లేదు. మనిషి సంపూర్ణంగా జీవించడానికి ఏది గుర్తు? మంచి బతుక్కి ఆలోచనా మంచి ఆచరణా?
అతను కేవలం ఒక అప్రయోజనమైన జీవితాన్ని గడుపుతున్నానని, తనకి స్వచ్ఛందంగా చచ్చిపోయే హక్కుని ప్రసాదించాలని న్యాయవాదుల బృందం ముందు వాదిస్తాడు. చివరికి వారు అతని కోరికని అంగీకరించక తప్పలేదు. డాక్టరు నిస్సహాయంగా అతని ప్రాణాన్ని నిలిపే ద్రావకాన్ని ఆపేస్తూ ‘‘మూడు నిమిషాలలో నీ కోరిక తీరుతుంది. ఈ లోగా నీ మనసు మార్చుకుంటే నేను సహకరించగలను’’ అంటాడు. సజావుగా జీవించలేని వ్యక్తి తన నిస్సహాయతను సహేతుకంగా నిరూపించి చచ్చిపోయే హక్కు ఉన్నదని రుజువుచేసి, మృత్యువుని ఆహ్వానించే కథ ఇది. ఇది ఎథునీసియా (కారుణ్య మరణం). దీనిని ఎవరు అంగీకరించాలి? న్యాయస్థానం.
మృత్యువు వ్యక్తికున్న పవిత్రమైన హక్కు. మనం ప్రతీ రోజూ హత్యలూ, మారణహోమాలూ వింటుం టాం కానీ, నీతిపరంగా, న్యాయపరంగా మరొకరి ప్రాణం తీసే హక్కు, ధైర్యం ఎవరికుంది? కొన్ని వందల దేశాలు, కొన్ని వందలసార్లు ఈ ‘పవిత్రమైన’ చెలియకట్టను దాటే ధైర్యం చేయలేక మ«థనపడి మ«థ నపడి ఆ పనిని మానుకున్నాయి.
ఒక రోగి, సంవత్సరాలుగా మంచం పట్టాడు. బాగుపడే ఆస్కారం ఏ మాత్రం లేదని వైద్య రంగం చెయ్యి ఎత్తేసింది. అతని ప్రాణాన్ని నిలపాలంటే ఆ కుటుంబానికి ఖర్చు. వారికి రోగి బాగుపడడన్న ముగింపు తెలుసు. ఇప్పుడతనికి చచ్చిపోయే హక్కు ఉందా? న్యాయస్థానం ‘మృత్యువు’కి అంగీకరిస్తుం దా? నిర్ణయం తీసుకోవడానికి న్యాయవ్యవస్థ వణికిపోయింది. తను ఇవ్వలేని ప్రాణాన్ని ఏ కారణంగానయినా తుంచేసే హక్కు తనకేం ఉన్నది? 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ రోగి ఊపిరి సజావుగా పీల్చగలిగితే?
మానవతా విలువలు అతి క్రూరమైనవి. ‘రేపు’ మానవతా విలువలకి అందని అమూల్యమైనది. మనమెవరం మనిషి ప్రాణాన్ని హఠాత్తుగా తుంచెయ్యడానికి? నువ్వు ప్రాణాన్ని పోయగలవా? మరో క్షణం పొడిగించగలవా? ఒక్క క్షణం ఆపగలవా? నైతిక, మానవీయ, చట్టపరమైన పరిధుల్లో ఎన్నో సంవత్సరాలు న్యాయమూర్తులు ఈ ఆలోచనకే వణికిపోయారు. నిజంగా ‘స్వచ్ఛంద మరణం’ ఇచ్చే అర్హతలున్న ఎన్నో కేసులు చూసి. అర్థం చేసుకునే న్యాయమూర్తులు మూగగా ఉండిపోయారు.
పాసివ్ ఎథునీసియా అంటే స్థూలంగా వైద్య సహాయానికి లొంగక, లొంగదని నిర్ధారణ అయ్యాక, ఎన్నాళ్లయినా రోగి పరిస్థితి ఇంతేనని తేల్చిన వారు తెలిసి తెలిసీ హుందాగా మరణాన్ని ఆహ్వానించడం. మానవీయ విలువలను దృష్టిలో పెట్టుకుని, వాస్తవాన్ని ఎరిగి, నైతిక బాధ్యతని వహించి న్యాయస్థానం అట్లాంటి వ్యక్తులు క్రమంగా ప్రాణాన్ని కోల్పోవడానికి అనుమతిని ఇస్తుంది. ఏ విధంగానూ జీవించే అవకాశం లేని రోగిని నానాటికీ పురోగమిస్తున్న వైద్య విధానాల దృష్ట్యా జీవితాన్ని ఒక విధంగా ఆ రోగి హుందాగా మరణించే అవకాశాన్ని దోచుకోవడం అవుతుందనే నిర్ణయానికి వచ్చింది. ఇదంతా రోగికి వైద్యం చేసే డాక్టర్లు రోగి మానసిక స్థితి, ఆరోగ్య స్థితి, రోగం స్థితి ఇన్నిటిని నిర్ణయించి– ముఖ్యంగా రోగి ఇష్టాయిష్టాలను ఎరిగి అప్పుడు రికమెండు చేస్తుంది.
ఈ చర్యని చట్టాన్ని చెయ్యడంలో ఎక్కడ ‘మరణయాతన’ చచ్చిపోయే వ్యక్తి డిగ్నిటీని దోచుకొంటోందో వివరించింది. ప్రధాన న్యాయమూర్తి ఒక మాట అన్నారు. పాసివ్ ఇథునీసియాని అంగీకరించడం ద్వారా మనం మన చేతులోలేని, నిస్సహాయమైన, నిస్సందేహంగా పరిష్కారాన్ని– నైతిక, చట్టపరమైన ‘మానవీయత’కు మరింత మెరుగయిన స్థానాన్ని ఇస్తున్నాం. అంతే. అదీ వణుకుతూనే.
ఇది మానవాళి కర్తవ్యంగా తలవంచి భగవంతునికి– పోనీ ఆయన లేకపోతే ‘జీవా’న్ని సృష్టించిన శక్తికి సవినయంగా క్షమాపణని చెప్పుకుంటున్నాం.
ఈ వ్యక్తికి బకుకుతాడన్న ఆశలేదు. చచ్చిపోతాడన్న రూఢి లేదు. ఎంతకాలం బతుకుతాడో, ఎలా బతుకుతాడో, అసలు బతుకుతాడో బతకడో చెప్పే మార్గం లేదు– వైద్యం చేతులెత్తేసింది కనుక. తరాలు, దశాబ్దాల తరబడి మేధావులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు, న్యాయనిపుణులు చర్చించి తనకి శక్తి లేని, సృష్టించడానికి శక్తి చాలని– ఆ నిస్సహాయుడికి బతికే క్రూరత్వం కంటే కన్నుమూసిన సౌలభ్యం ఒక ‘విముక్తి’ అనే భావనకి వచ్చారు. అదీ పాసివ్ ఇథునీసియా (కారుణ్య మరణం).
- గొల్లపూడి మారుతీరావు
Comments
Please login to add a commentAdd a comment