jeevana column
-
పిన్నల కోసం..
జీవన కాలమ్ నేను విరివిగా సినీమాలు చేస్తున్న రోజుల్లో ఒకసారి మా ఆవిడతో ఊరు వెళ్లడానికి తెల్లవారు జామున మద్రాసు ఎయిర్‌పోర్టులో ఉన్నాను. ఎవరో నా భుజం తట్టారు. తిరిగి చూస్తే ఖాదర్ ఖాన్. మా ఇద్దరికీ మందు పరిచయం లేదు. కానీ ఆయన నా పాత్రలు చాలా చేస్తున్నారని విన్నాను. ఆయన హార్థికంగా పలకరించి ‘నేను ఖాదర్ ఖాన్. హిందీలో మీ పాత్రలు చేస్తున్నాను’ అన్నారు. నేను పులకించాను. ‘మీరు గొప్ప నటులు, నా పాత్రలు చెయ్యడం నాకు గొప్ప’ అన్నాను. అలా ఒక్కసారే నేనూ ఆయనా కలిశాం. ఆయన నాకంటే ఒక్క సంవత్సరం పెద్ద. చాలా రోజులుగా చాలా ఇబ్బందికరమైన రుగ్మతలతో బాధపడుతున్నారు. పిల్లలు కెనడాలో ఉన్నారు. అక్కడే ఏడు నెలలు ఆసుపత్రిలో ఉండి కన్నుమూశారు. మొన్న ఆయన జీవిత దృశ్యాలను చూపుతూ కెనడా ఆసుపత్రి బయట పోర్టికోలో ఒంటి మీద కేవలం ఓవర్ కోటు ఉన్న నిస్సహాయుడైన ఖాదర్‌ఖాన్‌ని కొడుకులు, సన్నిహితులూ దింపుతున్నారు. ఆయన దిగ లేక దిగలేక కాలు నేల మీదకి మోపుతున్నాడు. నాకు చర్రున కళ్లనీళ్లు తిరిగాయి. ఆయన్ని చూసికాదు. ఆయన పిల్లలు తండ్రిని అంత భద్రంగా, పువ్వులాగ చూసుకుంటున్నందుకు. నేనక్కడే ఉంటే ముందుకు ఒంగి ఆ పిల్లలకు పాదాభివందం చేసేవాడిని. ఓసారి ప్లేన్‌లో అమెరికాలో పనిచేస్తున్న తెలుగు అభిమాని నా పక్కన కూర్చున్నాడు. ‘సాయంకాలమైంది’ నవల కథ చెప్పాను. అతని తల్లిదండ్రులు ఇండియాలో ఉన్నారు. అతను అమెరికాలో. చాలాసార్లు వచ్చి చూసి పోతూంటాడు. అమెరికా డాలర్లు వస్తూంటాయి. కానీ ఏం లాభం? విమానం దిగే సమయానికి అతని కళ్లనిండా నీళ్లు నిండాయి. చాలా సంవత్సరాల కిందటి మాట. నా ‘సాయంకాలమైంది’ నవల చదివి లక్ష్మీకాంత శర్మ అనే ఒక ఐటీ టెక్నోక్రాట్ ఫోన్ చేశారు తన్మయత్వంతో. నా ‘సాయంకాలమైంది’ నవలని తిరుపతి వెళ్లి కొని తెచ్చుకున్నాడట. వరంగల్లు దగ్గర కాళే శ్వరం అనే గ్రామంలో అతని తండ్రి అర్చకుడు. నవల చదివాక తల్లిదండ్రులతో ఉండాలని విదేశాలలో ఉద్యోగాలు వచ్చినా వదులుకుని ఇండియాలో ఉండిపోయాడు. మహాభారతంలో ఓ కథ. తపస్సు చేసి అపూర్వ శక్తులు సంపాదించిన ఓ తపస్వి గర్వపడుతూ సభ్య ప్రపంచంలోకి వచ్చాడు. భర్తకి సేవ చేస్తున్న ఓ ఇల్లాలు నవ్వి ఆ మూల దుకాణం నడుపుతున్న వ్యక్తి దగ్గరకు వెళ్లి ఈ అపూర్వ శక్తుల్ని ధిక్కరించే వైభవాన్ని చూసి రమ్మంది. అది ధర్మవ్యాధుడి మాంసం దుకాణం. జంతువుల్ని నరికి, కోసి అమ్ముకుంటున్నాడు. ఇతనికీ, ధర్మానికీ సాపత్యమేమిటి? నిర్ఘాంతపోయాడు తపస్వి. తీరా వ్యాపారం ముగిశాక ధర్మ వ్యాధుడు ఆయన్ని ఇంటికి తీసుకువెళ్లాడు. ఇంట్లో ముదుసలి తల్లిదండ్రులు. వారికి నిష్టతో సేవ చేస్తున్నాడు. ‘ఇదే నాకు తెలిసిన ధర్మ రహస్యం’ అన్నాడు ధర్మవ్యాధుడు. మతాన్ని పాతగుడ్డల్లో చుట్టి అటక మీద పారేసిన మేథావులున్న ఈ దేశంలో మతం దేవుళ్లు, పురాణాల రూపేణా మోక్షాన్ని ‘ఎర’గా చూపిందిగానీ, పరోక్షంగా సామాజిక జీవనానికి బంగారు బాటలు వేసింది. పండరీపురంలో పాండురంగ విఠల్ ప్రాశస్త్యానికీ మూల సూత్రమదే. ఈ మాట నాకు పండరీపురంలో ఓ పేరు, భాషా తెలీని భక్తుడు చెప్పాడు. విఠల్ అంటే మహారాష్ట్ర భాషలో ‘ఇటుక’ అని అర్థం (ట). పాండురంగడు మహా దైవ భక్తుడు. తల్లిదండ్రుల్ని సేవిస్తున్న కొడుకు. తీరా దేవుడు అతని పిలుపు విని వచ్చాడు. ఆ సమయానికి పాండురంగడి ఒడిలో తల్లదండ్రుల పాదాలున్నాయి. దేవుడు ‘నేను వచ్చానయ్యా’ అన్నాడు. పాండురంగడు ఆనం దించి చుట్టూ చూశాడు. ఓ ఇటుక కనిపించింది. ఆ ఇటుకని దేవుడివేపు గిరాటేసి ‘ధన్యుణ్ణి స్వామీ, అమ్మానాన్నకి సేవ చేస్తున్నాను. కాస్సేపాగండి. ఈ ఇటుక మీద విశ్రమించండి. సేవ ముగించుకు వస్తాను’ అన్నాడుట. స్వామి ఇటుక మీద కూర్చోలేదు. భక్తుడి తల్లిదండ్రుల సేవ ముగిసే వరకూ ఆ ఇటుక మీద నిలబడే ఉన్నాడట. ఇది కథో, ఇతిహాసమో నాకు తెలీదు. కానీ ఆముష్మికాన్నీ, దేవుడినీ జీవనానికి సంధించిన అపూర్వమైన కాన్సెప్ట్. తమిళ సినీ రచయిత కన్నదాసన్ ఒక అద్భుతమైన పాట రాశారు. ‘జీవితంలో అందరికీ అన్ని విధాలా రుణం తీర్చుకోగలను. కానీ, నేను పోయాక నన్ను శ్మశానానికి మోసుకుపోయే ఆ నలుగురి ఉపకారానికీ ప్రతిక్రియ చెయ్యలేను. వారికి నా ప్రణామాలు’ అంటారు. గొప్ప రచయిత, గొప్ప నటుడి గొప్ప జీవితం ప్రపంచం చప్పట్లని ఓ జీవితకాలం సంపాదించు కుంది. కానీ వృద్ధాప్యంలో కెనడా ఆసుపత్రి ముందు దిగే ఓ నిస్సహాయుడికి ఆసరా ఇచ్చే బిడ్డల చేతులు ఓ సమాజ సంస్కారానికీ, ఓ వ్యవస్థ నివాళికీ–వెరసి అతను సంపాదించుకున్న వరం. Life is an achievement but old age is a gift. నిస్సహాయతకు చెయ్యి సాయం సంస్కారం. చెయ్యి యోగం. గొల్లపూడి మారుతీరావు -
మృత్యువు
జీవన కాలమ్ కారుణ్య మరణాన్ని అంగీకరించడం ద్వారా మనం నైతిక, చట్టపరమైన ‘మానవీయత’కు మరింత మెరుగయిన స్థానాన్ని ఇస్తున్నాం. ఇది మానవాళి కర్తవ్యంగా తలవంచి, ‘జీవా’న్ని సృష్టించిన శక్తికి క్షమాపణ చెప్పుకుంటున్నాం. 1981 ప్రాంతంలో హాలీవుడ్లో ఓ విభిన్నమయిన చిత్రం వచ్చింది. ‘హూజ్ లైఫ్ ఈజ్ ఇట్ ఎనీవే?’ గొప్ప చిత్రం. ఆలోచింపజేసే చిత్రం. ఓ గొప్ప పెయింటరు లారీ యాక్సిడెంటులో దెబ్బతింటాడు. మెడ దగ్గర్నుంచి కాలి వరకు స్పర్శ పోయింది. ఇది భయంకరమైన శాపం. మెదడు ఆలోచించగల అన్ని ఆలోచనలూ స్పష్టంగా చేయగల అమూల్యమైన సాధనం య«థాతథంగా పోయింది. కాలిమీద వాలిన ఈగని తోలుకునే ఆస్కారం లేదు. మనిషి సంపూర్ణంగా జీవించడానికి ఏది గుర్తు? మంచి బతుక్కి ఆలోచనా మంచి ఆచరణా? అతను కేవలం ఒక అప్రయోజనమైన జీవితాన్ని గడుపుతున్నానని, తనకి స్వచ్ఛందంగా చచ్చిపోయే హక్కుని ప్రసాదించాలని న్యాయవాదుల బృందం ముందు వాదిస్తాడు. చివరికి వారు అతని కోరికని అంగీకరించక తప్పలేదు. డాక్టరు నిస్సహాయంగా అతని ప్రాణాన్ని నిలిపే ద్రావకాన్ని ఆపేస్తూ ‘‘మూడు నిమిషాలలో నీ కోరిక తీరుతుంది. ఈ లోగా నీ మనసు మార్చుకుంటే నేను సహకరించగలను’’ అంటాడు. సజావుగా జీవించలేని వ్యక్తి తన నిస్సహాయతను సహేతుకంగా నిరూపించి చచ్చిపోయే హక్కు ఉన్నదని రుజువుచేసి, మృత్యువుని ఆహ్వానించే కథ ఇది. ఇది ఎథునీసియా (కారుణ్య మరణం). దీనిని ఎవరు అంగీకరించాలి? న్యాయస్థానం. మృత్యువు వ్యక్తికున్న పవిత్రమైన హక్కు. మనం ప్రతీ రోజూ హత్యలూ, మారణహోమాలూ వింటుం టాం కానీ, నీతిపరంగా, న్యాయపరంగా మరొకరి ప్రాణం తీసే హక్కు, ధైర్యం ఎవరికుంది? కొన్ని వందల దేశాలు, కొన్ని వందలసార్లు ఈ ‘పవిత్రమైన’ చెలియకట్టను దాటే ధైర్యం చేయలేక మ«థనపడి మ«థ నపడి ఆ పనిని మానుకున్నాయి. ఒక రోగి, సంవత్సరాలుగా మంచం పట్టాడు. బాగుపడే ఆస్కారం ఏ మాత్రం లేదని వైద్య రంగం చెయ్యి ఎత్తేసింది. అతని ప్రాణాన్ని నిలపాలంటే ఆ కుటుంబానికి ఖర్చు. వారికి రోగి బాగుపడడన్న ముగింపు తెలుసు. ఇప్పుడతనికి చచ్చిపోయే హక్కు ఉందా? న్యాయస్థానం ‘మృత్యువు’కి అంగీకరిస్తుం దా? నిర్ణయం తీసుకోవడానికి న్యాయవ్యవస్థ వణికిపోయింది. తను ఇవ్వలేని ప్రాణాన్ని ఏ కారణంగానయినా తుంచేసే హక్కు తనకేం ఉన్నది? 20 సంవత్సరాల తర్వాత మళ్లీ ఆ రోగి ఊపిరి సజావుగా పీల్చగలిగితే? మానవతా విలువలు అతి క్రూరమైనవి. ‘రేపు’ మానవతా విలువలకి అందని అమూల్యమైనది. మనమెవరం మనిషి ప్రాణాన్ని హఠాత్తుగా తుంచెయ్యడానికి? నువ్వు ప్రాణాన్ని పోయగలవా? మరో క్షణం పొడిగించగలవా? ఒక్క క్షణం ఆపగలవా? నైతిక, మానవీయ, చట్టపరమైన పరిధుల్లో ఎన్నో సంవత్సరాలు న్యాయమూర్తులు ఈ ఆలోచనకే వణికిపోయారు. నిజంగా ‘స్వచ్ఛంద మరణం’ ఇచ్చే అర్హతలున్న ఎన్నో కేసులు చూసి. అర్థం చేసుకునే న్యాయమూర్తులు మూగగా ఉండిపోయారు. పాసివ్ ఎథునీసియా అంటే స్థూలంగా వైద్య సహాయానికి లొంగక, లొంగదని నిర్ధారణ అయ్యాక, ఎన్నాళ్లయినా రోగి పరిస్థితి ఇంతేనని తేల్చిన వారు తెలిసి తెలిసీ హుందాగా మరణాన్ని ఆహ్వానించడం. మానవీయ విలువలను దృష్టిలో పెట్టుకుని, వాస్తవాన్ని ఎరిగి, నైతిక బాధ్యతని వహించి న్యాయస్థానం అట్లాంటి వ్యక్తులు క్రమంగా ప్రాణాన్ని కోల్పోవడానికి అనుమతిని ఇస్తుంది. ఏ విధంగానూ జీవించే అవకాశం లేని రోగిని నానాటికీ పురోగమిస్తున్న వైద్య విధానాల దృష్ట్యా జీవితాన్ని ఒక విధంగా ఆ రోగి హుందాగా మరణించే అవకాశాన్ని దోచుకోవడం అవుతుందనే నిర్ణయానికి వచ్చింది. ఇదంతా రోగికి వైద్యం చేసే డాక్టర్లు రోగి మానసిక స్థితి, ఆరోగ్య స్థితి, రోగం స్థితి ఇన్నిటిని నిర్ణయించి– ముఖ్యంగా రోగి ఇష్టాయిష్టాలను ఎరిగి అప్పుడు రికమెండు చేస్తుంది. ఈ చర్యని చట్టాన్ని చెయ్యడంలో ఎక్కడ ‘మరణయాతన’ చచ్చిపోయే వ్యక్తి డిగ్నిటీని దోచుకొంటోందో వివరించింది. ప్రధాన న్యాయమూర్తి ఒక మాట అన్నారు. పాసివ్ ఇథునీసియాని అంగీకరించడం ద్వారా మనం మన చేతులోలేని, నిస్సహాయమైన, నిస్సందేహంగా పరిష్కారాన్ని– నైతిక, చట్టపరమైన ‘మానవీయత’కు మరింత మెరుగయిన స్థానాన్ని ఇస్తున్నాం. అంతే. అదీ వణుకుతూనే. ఇది మానవాళి కర్తవ్యంగా తలవంచి భగవంతునికి– పోనీ ఆయన లేకపోతే ‘జీవా’న్ని సృష్టించిన శక్తికి సవినయంగా క్షమాపణని చెప్పుకుంటున్నాం. ఈ వ్యక్తికి బకుకుతాడన్న ఆశలేదు. చచ్చిపోతాడన్న రూఢి లేదు. ఎంతకాలం బతుకుతాడో, ఎలా బతుకుతాడో, అసలు బతుకుతాడో బతకడో చెప్పే మార్గం లేదు– వైద్యం చేతులెత్తేసింది కనుక. తరాలు, దశాబ్దాల తరబడి మేధావులు, విద్యావేత్తలు, తత్వవేత్తలు, న్యాయనిపుణులు చర్చించి తనకి శక్తి లేని, సృష్టించడానికి శక్తి చాలని– ఆ నిస్సహాయుడికి బతికే క్రూరత్వం కంటే కన్నుమూసిన సౌలభ్యం ఒక ‘విముక్తి’ అనే భావనకి వచ్చారు. అదీ పాసివ్ ఇథునీసియా (కారుణ్య మరణం). - గొల్లపూడి మారుతీరావు -
రచ్చకెక్కిన ‘రచ్చబండ’
జీవన కాలమ్ చీఫ్ జస్టిస్ స్థాయిలో పరిపాలనా సరళిలో కొన్ని మర్యాదలు పాటించలేదని అనుకున్నప్పటికీ... దేశమంతా నెత్తిన పెట్టుకునే, గౌరవించే, ఒకే ఒక్క గొప్ప వ్యవస్థని ‘బజారు’న పెట్టవలసిన అగత్యం లేదని చాలామంది పెద్దల భావన. బీచిలో ఓ అమ్మాయి ఎప్పుడూ కనిపిస్తూంటుంది. బాగా చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి లక్ష్యం చక్కగా పెళ్లి చేసుకుని భర్తకి వండిపెడుతూ సుఖంగా గడపాలని. తర్వాత ఆ అమ్మాయికి పెళ్లయింది. లక్షణంగా తాళిబొట్టుతో, పసుపుతాడుతో, భర్తతో కనిపించింది. ఆమె కల సాకా రమౌతున్నందుకు ఆనందం కలిగింది. కొన్ని నెలలు గడిచాయి. భార్యాభర్తల మధ్య పొర పొచ్చాలు ప్రారంభమయ్యాయి. భర్తమీద కారాలూ, మిరియాలూ నూరింది. నేను ఆమె పాత కలని గుర్తు చేసి, కాస్త సంయమనాన్ని పాటించమని హితవు చెప్ప బోయాను. భర్త అనుచిత ప్రవర్తనను ఏకరువుపెట్టి– హితవు చెప్పిన నామీదే కోపం తెచ్చుకుని వెళ్లి పోయింది. దరిమిలాను భార్యాభర్తల మధ్య ‘వార’ పెరి గింది. ఇప్పుడు పోలీసు డిపా ర్టుమెంటులో పనిచేస్తున్న ఆమె తండ్రి అల్లుడిని రెండు రోజులు జైల్లో పెట్టించాడు. ముందు ముందు సామరస్యం కుదిరే అవకాశాన్ని ఆ విధంగా శాశ్వ తంగా మూసేశాడు. ఆమె కలలు గన్న వ్యవస్థ– ఆమె తండ్రి సహాయంతో పూర్తిగా కూలి పోయింది. కాళ్లు కడిగి కన్యా దానం చేసిన మామ తన అల్లు డిని జైలుకి పంపితే ఆ అల్లుడు ఇక ఏ విధంగానూ జైలు శిక్షని మరిచిపోయి– ఆమెని జీవితంలోకి ఆహ్వానిస్తాడనుకోను. వ్యవస్థను గౌరవించే గాంభీర్యం, పెద్ద రికాన్ని పెద్దలే వదులుకున్నప్పుడు– ఆ వ్యవస్థ ‘పెద్ద రికానికి’ మాలిన్యం అంటుతుంది. ఈ కథకీ మొన్న నలుగురు మేధావులయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు– పత్రికల ముందుకు రావడానికీ పోలికలున్నాయని నాకనిపిస్తుంది. ఈ దేశంలో గత 70 సంవత్సరాలుగా అత్యున్నత న్యాయ వ్యవస్థగా నిలిచిన ప్రధాన న్యాయస్థానంలోని ‘అభి ప్రాయ భేదాలు’ ఒక్కసారి ప్రజల మధ్యకి రావడం దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దేశంలో న్యాయాధిపతులే అరిగించుకోలేకపోతున్నారు. ‘‘సుప్రీంకోర్టు పరిపాలనా సరళిని ఏ విధంగా పత్రికా సమావేశం సంస్కరిస్తుంది? ప్రజాభిప్రాయ సేకరణ చేసి– సుప్రీంకోర్టు నిర్వహణ సరిౖయెనదో కాదో ప్రజలు నిర్ణయించాలని ఈ సమావేశం ఉద్దేశమా?’’ అని జస్టిస్ శోధీ అన్నారు. మరో న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ హెగ్డే ‘‘ఈ నలుగురి పెద్దల ఉద్దేశం ఏమిటి? ప్రజల్ని ఈ అవ్య వస్థలో జోక్యం చేసుకుని తీర్పు చెప్పాలనా? సవరణ జరపాలనా? సలహాలివ్వాలనా? ప్రధాన న్యాయ మూర్తిని బోనులో నిలబెట్టాలనా?’’ సోలీ సొరాబ్జీ, కె.టి.ఎస్. తులసి, జస్టిస్ ముకుల్ ముద్గల్ వంటివారు షాక్ అవడమే కాకుండా చాలా బాధపడ్డారు. ఒక ప్రముఖ పత్రిక– ఈ పత్రికా సమావేశం భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం అని పేర్కొంది. విచిత్రం ఏమిటంటే గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలోని అత్యంత ప్రముఖమైన కేసులన్నీ యాదృ చ్ఛికంగానో, కాకతాళీయంగానో జూనియర్ బెంచిలకే వెళ్లాయని ఇదే పత్రిక పతాక శీర్షికలో మరునాడు పూర్తి వివరాలతో పేర్కొంది. మరి ఇన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో తమ విధులను నిర్వహిస్తున్న ఈ గౌరవ న్యాయమూర్తులకు పత్రికలకు తెలిసేపాటి నిజానిజాలు తెలియవా? తెలిస్తే రచ్చకెక్కడానికి ఇప్పు డెందుకు ముహూర్తం పెట్టినట్టు? ఇందులో వృత్తిప రమైన, రాజకీయ పరమైన కోణాలేమైనా ఉన్నాయా? ఒకానొక రాజకీయ నాయకుడు ఒకానొక న్యాయ మూర్తి తలుపు తట్టడం వెనుక ఈ ఛాయలు తెలు స్తున్నాయా? ఇవీ ప్రశ్నలు. లేని తీగెని లాగి ఓ గొప్ప వ్యవస్థని ‘డొంక’గా రూప కల్పన చేసిన దయనీయమైన పరిస్థితిగా దీనిని భావించాలా? అని మేధావి వర్గాలు బుగ్గలు నొక్కుకుంటు న్నాయి. అయితే– ప్రధాన న్యాయ మూర్తి స్థాయిలో పరిపాలనా సరళిలో కొన్ని మర్యాదలు పాటించనప్పుడు, జరుగుతు న్నది సబబు కాదని మేధావులైన న్యాయమూర్తులు భావిస్తున్నప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేసినా చేయ లేకపోయినా దేశమంతా నెత్తిన పెట్టుకునే, గౌరవించే, నిర్ణయాలకు భేషరతుగా తలవొంచే, మార్గదర్శకత్వా నికి ఎదురుచూసే– ఒకే ఒక్క గొప్ప వ్యవస్థని ‘బజా రు’న పెట్టవలసిన అగత్యం లేదని చాలామంది పెద్దల భావన. ఇలా రచ్చకెక్కడంవల్ల దేశంలో అడ్డమైనవారూ (వారిలో నేనూ ఉన్నాను)– రాజకీయ పార్టీలు సరేసరి – నోరు పారేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు అవు తుందని సంతోష్ హెగ్డే అన్నారు. ప్రతీ దిన పత్రికలోనూ సంపాదకునికి లేఖలు కోకొల్లలు. ఈ సంక్షోభాన్ని ఎవరి అవసరాలకు వారు అన్వయించు కుంటున్నారు. సంయమనం, మేధస్సు, విచక్షణ, అపూర్వమైన గాంభీర్యమూ చూపే వ్యవస్థ– అలక, కించిత్తు అస హనమూ, కోపమూ– చూపనక్కరలేని, చూపినా ఉప యోగం లేని, చూపకూడని స్థితిలో రచ్చకెక్కడం– తొందరపాటుతో ఒకటి రెండు మెట్లు దిగి వచ్చిందని, ఆ మేరకు ‘వ్యవస్థ’ పరపతి– దిగజారిందని భావిం చడంలో ఆశ్చర్యం లేదు. -గొల్లపూడి మారుతీరావు -
కీర్తి హెచ్చరిక
♦ జీవన కాలమ్ కీర్తి హెచ్చరిక. కీర్తి భయంకరమైన బాధ్యత. 24 గంటలూ కంటిమీద కునుకు లేకుండా కాపాడు కోవలసిన, దుర్మార్గమైన ఆస్తి. సజ్జనుడికి అది అలవోక. వ్యసనపరుడి మనసు ఏ మాత్రం బెసికినా– ఆమూ లాగ్రం కబళించే వికృత శక్తి. పుష్య బహుళ పంచమి. త్యాగరాజస్వామి నిర్యాణం. త్యాగరాజ ఆరాధనోత్సవాల ప్రారంభం. త్యాగరాజు ఒక అపూర్వమైన పంచరత్న కీర్త నని రచించారు–గౌళ రాగంలో –‘దుడుకుగల నన్నే దొరకొ డుకు బ్రోచురా’ అంటూ. భక్తి పారవశ్యంతో దాదాపు 200 సంవత్సరాలు ప్రాణం పోసుకు నిలిచిన అపూర్వ సంగీత రత్నాలను సృష్టించిన వాగ్గేయకారుడు తనది ‘దుడుకుగల’ జీవనం అని చెప్పుకున్నాడు. దుడుకుతనా నికి తననే ప్రధాన పాత్రని చేసుకుని– ఇవ్వాళ్టికీ కని పించే దుడుకుతనానికి ప్రాణం పోశాడు. ఇదేమిటి? ఈ ‘దొరకొడుకు’ ఎవరు? అనిపించేది కీర్తన విన్నప్పుడల్లా. కల్లూరి వీరభద్ర శాస్త్రిగారు సమాధానం చెప్పారు. కోపంతోనో, నిస్పృహతోనో మాట్లాడినప్పుడు– ‘నీ తాత కొడుకు ఎవడు తీరుస్తాడురా నీ ఇక్కట్లు’ అనడం గ్రామీణ ప్రజల నానుడి. సరే. ఈ ‘దుడుకు’ ఏమిటి? పరధన పరకాంతా చింతనతో పొద్దుపుచ్చుతూ చపలచిత్తుడై బతికాడట. ‘సతులకు కొన్నాళ్లాస్తికై సుతులకు కొన్నాళ్లు ధన తతులకై’ తిరిగాడట. తమిళంలో ఒక సామెత ఉంది: ‘ఆస్తికి ఒరుప య్యన్ అరిమికి ఒరు పొణ్ణు’ అని. ఆస్తిని కూడబెట్టి ఇవ్వ డానికి కొడుకు, ప్రేమని పంచుకోడానికి కూతురు. త్యాగ రాజు తిరువయ్యారులో రచన సాగించాడు కనుక తమిళ నానుడి వారి రచనలో తొంగి చూడటం ఆశ్చర్యం కాదు. దాదాపు 200 సంవత్సరాలు మానవ నైజంలో నిలదొక్కు కున్న జబ్బును– ఇవ్వాళ్టికి చెక్కు చెదరకుండా వర్తించే టట్టు ఆనాడే సూచించిన ద్రష్ట త్యాగబ్రహ్మం. ‘భక్తి’ ఆనాటి ఆలంబన. సృష్టిలో, సమాజ పరిణామ శీలంలో విచిత్రం ఏమిటంటే త్యాగ రాజు వెళ్లిపోయిన (1847) మరు సటి సంవత్సరమే ఒకాయన పుట్టాడు. ఆయన కందుకూరి వీరేశ లింగం. మరో 14 ఏళ్లకి పుట్టిన మరో మహానుభావుడు గురజాడ. మరుసటి సంవత్సరమే మరో వ్యక్తి జన్మించాడు– గిడుగు రామమూర్తి. వీరు ముగ్గురూ భక్తికి దూరంగా జరిగి సమాజ హితానికి చెరగని ఉద్యమాలుగా నిలిచారు. గురజాడ ‘కన్యాశుల్కం’ ఇప్పటికీ సమాజ రుగ్మతకు అద్దం పట్టే కళాఖండంగా ప్రాణం పోసు కుంది. అటు త్యాగరాజూ చిరంజీవిగా ఈనాటికీ దక్షి ణాది సంగీత ప్రపంచంలో విశ్వరూపం దాల్చాడు. వీటి జీవ లక్షణానికి పెట్టుబడి ‘సామాజికమైన రుగ్మత’ను ఎండగట్టడమే. ఒకాయన– త్యాగరాజు– ఆర్తిని కీర్తిని చేసుకున్నాడు. తర్వాతి తరంవారు మనిషి దుర్వ్యసనాలను ఎండగట్టడానికి అక్షర రూపం ఇచ్చారు. అమెరికాలో ఒకావిడ కవితలు రాసింది. రాసిన ఏ కవితనూ ప్రచురించలేదు. ఆమె వెళ్లిపోయాక ఆమె సోదరి ఆ కవితల్ని చూసి ఆశ్చర్యపడి ప్రచురించింది. ఆ కవయిత్రి అమెరికాలో cult figure అయింది– ఎమిలీ డికిన్సన్. ఆమె కవిత – Fame is a bee / It has a song / It has a sting/ Ah, it has a wing! కీర్తి తేనెటీగ లాంటిది. అలరిస్తుంది. ఆదమరిస్తే కాటేస్తుంది. కాపాడుకోలేకపోతే రెక్కలు విదిలించి ఎగిరి పోతుంది. దాదాపు 55 సంవత్సరాల కిందటి చిత్రం ‘ఎక్రాస్ ది బ్రిడ్జ్’. రాడ్ స్టీగర్ ముఖ్య పాత్ర. ఓ గొప్ప వ్యాపారి. ఓ గోడకి నిలువునా ఆయన చిత్రాన్ని పరిచయం చేశారు. ప్రజాధనాన్ని దోచుకున్నాడు. దేశం నుంచి పరారి అయ్యాడు. రైల్లో మరొకరి పాస్‌పోర్టుని దొంగి లించి, అతణ్ణి రైల్లోంచి తోసేశాడు. అతనికి ఓ కుక్క. రైలు ప్రయాణీకుడు నేరస్తుడు. ఒక దేశంలో మోసగాడు ఇప్పుడు ఈ దేశంలో నేరస్తుడ య్యాడు. కుక్కతోపాటు పుల్లి విస్తరా కుల్లో ఆహారం తిన్నాడు. కుక్కతో ఆత్మీయత పెరిగింది. ఇతన్ని పట్టుకో జూసిన తన దేశపు రక్షక భటులు– తమ దేశానికీ పొరుగు దేశానికీ మధ్య గల పొలిమేరకు కుక్కని దాటించే ప్రయత్నం చేశారు. కుక్క కోసం ఈ వ్యాపారి పరుగు తీశాడు. కుక్కతో పాటు స్వదేశపు పొలిమేర హద్దుమీద రక్షకభటుల కాల్పులకి ప్రాణం వది లాడు. డబ్బుమీద వ్యామోహం ఒక నాడు తరిమింది. కుక్కమీద వ్యామోహం ఈనాడు కట్టిపడేసింది. హద్దుమీద ‘కుక్కచావు’ చచ్చాడు. ఒకదేశంలో కీర్తికీ పొరుగు దేశంలో తనది కాని కుక్కతో పుల్లి విస్తరాకుల్లో తిండి తినడానికీ– ఇంతకంటే మానవ పతనానికీ నిదర్శనం లేదనుకుంటాను. కీర్తి హెచ్చరిక. కీర్తి భయంకరమైన బాధ్యత. 24 గంటలూ కంటిమీద కునుకు లేకుండా కాపాడు కోవలసిన, దుర్మార్గమైన ఆస్తి. సజ్జనుడికి అది అలవోక. వ్యసనపరుడి మనసు ఏ మాత్రం బెసికినా– ఆమూ లాగ్రం కబళించే వికృత శక్తి. మరి మహాత్ముల, సత్పురుషుల మాట? కీర్తి వారి సత్ప్రవర్తన పరిమళం. దుర్వ్యసన పరుడి కీర్తి కేవలం జిడ్డు. దాన్ని చిన్న తప్పటడుగు అవలీలగా చెరిపేస్తుంది. వెనక్కి తిరిగి చూసుకునేలోగా అధఃపాతాళానికి తొక్కేస్తుంది. కీర్తి వరం– సత్పురుషులకి. కీర్తి కేవలం ఆర్జన– వ్యసనపరులకి. గొల్లపూడి మారుతీరావు -
ఖాండవ దహనం
విశ్లేషణ కాలిపోయిన ఆయా కీలక విభాగాల ఫైళ్లలో ఎంతమంది మహానుభావుల గోత్రాలు శాశ్వతంగా నేలమట్టమయ్యాయో మనకి తెలీదు. అవినీతికి అవకాశాలెక్కువ. నీతికి విస్తృతి తక్కువ. చాలా సంవత్సరాల కిందట చెన్నై హైకోర్టులో ఒక కేసు నడిచింది. కేసు ఓడిపోతే గవర్నమెంటుకి మేం 30 లక్షలు కట్టాలి. చేతిలో అంత సొమ్ము లేదు. కేసు త్వరగా పరి ష్కారం అయిపోయే సూచనలు కనిపించాయి. నేను కంగారు పడడాన్ని మా న్యాయవాది గ్రహించాడు. కారణం చెప్పాను. ‘‘మరేం ఫర్వాలేదు సార్. కేసుని ఎంతకాలం వాయిదా వేయాలో చెప్పండి’’అన్నాడు. నేను తెల్లబోయాను. ‘‘అదెలా సాధ్యం?’’ అన్నాను. నవ్వాడు న్యాయవాది. ‘‘ఈ దేశంలో కావలసినన్ని సౌకర్యాలు ఉన్నాయి సార్. కేసు ఆరు నెలలు వాయిదా పడాలా? రెండేళ్లు వాయిదా పడాలా? లేక శాశ్వతంగా నిలిచిపోవాలా? ప్రతి పనికీ రేట్లున్నాయి’’ అన్నాడు. ‘‘ఎలా?’’ అని తెల్లబోయాను. ‘‘రెండు నెలలు వాయిదా పడాలంటే – కరెక్టుగా డిపార్టుమెంటులో మీ కేసు ఫైలు మాయమయిపోతుంది. మళ్లీ కావలసినప్పుడు కనిపిస్తుంది. మంచి ధర చెల్లిస్తే శాశ్వతంగానూ మాయమయిపోగలదు’’ అన్నాడు. మరో సరదా అయిన కథ. అలనాటి మద్రాసులో 1985 వరకు రచయితలకు, పరిశోధకులకు, జిజ్ఞాసువులకు ఆటపట్టయిన ఒక మార్కెట్ ఉండేది– ఇప్పటి సెంట్రల్ స్టేషన్‌ని ఆనుకుని. దాని పేరు మూర్ మార్కెట్. అక్కడ పుస్తకాల షాపుల్లో – ఆరోజుల్లో దొరకని పుస్తకం లేదు. ఆ షాపుల వాళ్లు తమిళులు. అయినా సంవత్సరాల తరబడి – అనుభవం వల్ల– చాలా విజ్ఞతనార్జించినవారు. వారికి ముద్దుపళని ‘రాధికా సాంత్వనము’ తెలుసు. ‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ తెలుసు. నార్ల వెంకటేశ్వరరావు గారిని తెలుసు. ఆరుద్రని తెలుసు. డి. ఆంజనేయులు గారిని తెలుసు. బులుసు వెంకట రమణయ్య గారిని తెలుసు. వీరందరికీ ఆ మార్కెట్ విజ్ఞాన భాండాగారం. అలాగే సైన్స్, ఖగోళ ఇతర విభాగాల ప్రముఖులూ అక్కడ ప్రతిదినం కనిపించేవారు. అదొక విజ్ఞాన కూడలి. దరిమిలాను సెంట్రల్ స్టేషన్లో రద్దీ పెరిగి, దాని విస్తృతి చేయవలసిన అవసరం ఏర్పడింది. ఈ మూర్ మార్కెట్‌ని తొలగించాలని గవర్నమెంట్ నిర్ణయించుకుంది. మేధావులు హాహాకారాలు చేశారు. సంపాదకుని లేఖలు రాశారు. మేయర్‌కి హెచ్చరికలు చేశారు. గవర్నమెంటుకి వారి కిటుకులు వారికి ఉన్నాయి. అప్పటికి కిమ్మనకుండా నోరు మూసుకుంది. 1985 మే 30వ తేదీ అర్థరాత్రి – నగరం నిద్రిస్తున్నప్పుడు మూర్ మార్కెట్లో మంటలు చెలరేగాయి. కోట్ల విలువయిన పుస్తకాలు, షాపులు నేలమట్టమయ్యాయి. అందరూ నిశ్చేష్టులయ్యారు. తెల్లవారే సరికి మూర్ మార్కెట్ లేదు. ఆ మధ్య హుద్‌హుద్ జల ప్రళయం పెట్టుబడిగా ఎంత మంది రెవెన్యూ అధికారులు ఎన్ని ఫైళ్లను నీటిపాలు చేశారో, తత్కారణంగా ఎంతమంది భూబకాసురులకు కలసి వచ్చిందో ఇప్పుడిప్పుడే కథలు బయటికి వస్తున్నాయి. చాలామంది రెవెన్యూ అధికారుల గోత్రాలు రోజూ పత్రికల్లో వెల్లివిరుస్తున్నాయి. ఎంతోమంది తాసీల్దారుల లీలలు చదువుకుంటున్నాం. దేశంలో ఒక పక్క నితీశ్ కుమార్‌గారి హఠాత్ మానసిక పరివర్తన, నవాజ్ షరీఫ్ సాహెబ్‌గారి హఠాత్ పదవీ చ్యుతి వంటి ‘రుచి’కరమయిన వార్తలు చదువుకుంటున్న నేపథ్యంలో – వార్తాపత్రికల్లో ఆరవ పేజీలో అంగుళం మేర ఒక వార్త ప్రచురితమయింది. చాలామంది చూసి ఉండరు. చూసినా పట్టించుకుని ఉండరు. అది– ఢిల్లీ ఖాన్ మార్కెట్లోని లోక్‌నాయక్ భవన్లో ఘోర అగ్నిప్రమాదం. 26 అగ్ని మాపక దళాలు ఆ మంటల్ని ఆర్పడానికి ప్రయత్నించాయి. అంటే ఆ అగ్నిప్రమాదం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. ఏమిటి ఈ అగ్నిప్రమాదంలో విశేషం? ఆ లోక్‌నాయక్ భవన్లో మన సీబీఐ, ఎన్ఫోర్సుమెంట్ విభాగం (అంటే రాబడి పన్ను నిఘా విభాగం), రాబడి పన్ను విభాగం ఉన్నాయి. ఇవన్నీ ఈ దేశపు అవినీతి నిరోధానికి కీలక విభాగాలు. ఈ అగ్ని ప్రమాదంలో ఎన్ని ముఖ్యమయిన ఫైళ్లు నాశనమయిపోయాయి?ఎన్ని దొంగ లెక్కల ఫైళ్లు అగ్నికి ఆహుతయ్యాయి? ఎంతమందికి ఈ ‘ప్రమాదం’ ప్రమోదాన్ని ఇవ్వగలదు? మనకు తెలియదు. ఏ పెద్ద మనుషులు ఈ చక్కని ప్రమాదాన్ని ఎంత ఖర్చుతో నిర్వహించారు? మనదాకా రాదు. పోనీ, నిజంగా ఎవరి ప్రమేయం లేకుండానే ఈ ప్రమాదం జరిగిందనుకుందాం! రేపు–అతి నిజాయితీపరుడయిన ఏ ఖేమ్కా గారో పెద్ద కుర్చీలో కూర్చుని ‘‘ఫలానా మాల్యాగారి ఫైలు పట్రావయ్యా!’’ అంటే, గుమాస్తా చిరునవ్వు నవ్వి, ‘‘అది ఆ మధ్య జూలైలో జరిగిన అగ్ని ప్రమాదంలో కాలిపోయింది సార్!’’ అని సెలవివ్వగలడు. ఇచ్చినందుకు ఆయన ఇంటికి ఆ రాత్రి ఓ పెద్ద పార్సిలు మాల్యా గారి శుభాకాంక్షలతో చేరగలదు. ఇది కేవలం నమూనా ఊహ. కాలిపోయిన ఆయా కీలక విభాగాల ఫైళ్లలో ఎంతమంది మహానుభావుల గోత్రాలు శాశ్వతంగా నేలమట్టమయ్యాయో మనకి తెలీదు. అవినీతికి అవకాశాలెక్కువ. నీతికి విస్తృతి తక్కువ. అందుకనే హిట్లర్ కనిపించినంతగా శిబి చక్రవర్తి వదాన్యత కనిపించదు. గొల్లపూడి మారుతీరావు -
జైలు వైభవం
విశ్లేషణ ఆవిడ ఆనందంగా ఉన్నందుకు కాదు, 2 కోట్లు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిందని చెప్పిన పోలీసు డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ డి. రూపని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగారు బదిలీ చేశారు. ఇది కాంగ్రెసు ఘనత. జైళ్లు మనకు దేవాలయాలు. మన దేవుడు జైల్లో పుట్టాడు. ఆనాటి మహానుభావులంతా జైళ్లలో ఉన్నారు. ఒక్క పూనా యెరవాడ జైలులోనే మహాత్మా గాంధీ, నెహ్రూ, తిలక్, సుభాశ్చంద్ర బోస్, సావర్కర్ ప్రభృతులు ఉన్నారు. ఇప్పుడూ ఆ వైభవం కొనసాగుతోంది. ప్రస్తుతం ఓం ప్రకాశ్చౌతాలా గారు, పండిత్ సుఖ్రాంగారు జైల్లో ఉన్నారు. మొన్నటిదాకా లాలూగారు, అంతకు ముందు కనిమొళిగారు, ఏ. రాజా గారు ఉండి వచ్చారు. అది నిజంగా శిక్షా? లేక విశ్రాంతా? లేక భోగమా? మనకి తెలీదు. అదే ఆయా పెద్దమనుషులకు పెట్టుబడి. అవినీతి ఆఫీసర్లకు రాబడి. ఇలాంటి సౌకర్యాలు లోగడ అనుభవించినవారున్నారు. జెస్సికా లాల్‌ని కాల్చి చంపిన మనూశర్మకి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. కాని వారు చుట్టపు చూపుగానే జైలుకి వెళ్లి, మిగతా సమయాల్లో బయటే ఉన్నారు. వారి తల్లికి ఆరోగ్యం బాగాలేదనే మిషతో బయటికి వచ్చారు. కాని వారి తల్లిగారు చండీగఢ్‌లో మహిళా క్రికెట్ జట్టుతో గడుపుతూండగా, మనూశర్మగారు ఢిల్లీలో నైట్‌క్లబ్బుల్లో గడుపుతూ, పోలీసు కమిషనర్‌గారి కొడుకుతో తగాదా పెట్టుకున్న సంగతి వెలుగులోకొచ్చింది. అనుమతి ఇచ్చినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌గారి మీద విమర్శలు వచ్చాయి. జైలు శిక్ష పడగానే ఎటువంటివారికయినా హఠాత్తుగా గుండె నొప్పి వస్తుంది. లేదా కడుపు నొప్పి వస్తుంది. డాక్టర్లు తప్పనిసరిగా ఆసుపత్రికి తరలించాలంటారు. అయిదు నక్షత్రాల ఆసుపత్రిలో, చలువ గదుల్లో, ఇద్దరు ముగ్గురు అందమయిన నర్సులు సేవలు చేస్తూండగా వారు సేదదీర్చుకుంటారు. ఇందుకు గొప్ప ఉదాహరణ– నితీశ్ కటారాను చంపిన వికాస్ యాదవ్, విశాల్ యాదవ్. యావజ్జీవ కారాగార శిక్ష అనుభవించాల్సిన వీరిద్దరూ ఇలాంటి సుఖాల్నే అనుభవించారు. వికాస్ యాదవ్ 98 సార్లు మాత్రమే విడిది చేశారు. విశాల్ యాదవ్ గారి అనారోగ్యం ఇంకా బలమైనది. వారు కేవలం 105 సార్లు మాత్రమే విడిది చేశారు. నిక్షేపం లాంటి కొడుకుని పోగొట్టుకున్న నీలం కటారా ఈసారి కోర్టుని–శిక్ష వేయాలని కాదు, వేసిన శిక్షని అమలు జరపాలని ఆశ్రయించారు. ఆ తల్లి ఆర్తిని గ్రహించిన సుప్రీం కోర్టు ఈసారి మన ఖరీదయిన ‘రోగులకు’ 30 ఏళ్లుగా శిక్షను పెంచింది. ఇవన్నీ మన జైలు ఆఫీసర్ల అవినీతిని ఆకాశంలో నిలిపే కథలు. ప్రస్తుతం జైళ్లలో ఇలాంటి వైభవం కొనసాగుతోందనడానికి నిదర్శనం శశికళగారు రాజభోగాలతో కర్ణాటక జైల్లో ఉండడం. అందుకు వారు కేవలం 2 కోట్లు ఖర్చు చేశారని మనకు తెలిసింది. వారు నలుగురిలాగా సాదాసీదా ఖైదీ. అయినా ఆవిడకి 5 వరస గదుల వసతిని జైలు పెద్దలు కల్పించారు. మధ్య గదిలో ఉంటూ మిగతా గదుల్లో ఆమె సరంజామా పెట్టుకుంటారు. ప్రత్యేకమైన వంటలు అమెకి చేయిస్తారు. హాయిగా నైటీలు వేసుకుంటారు. ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు సిల్కు దుస్తులు– చుడీ దార్లు వేస్తారు. టేపుల దుకాణం నడుపుకునే ఆవిడకు ఇంత డబ్బు ఎక్కడిది? జయలలిత డబ్బు ఆవిడ ఖాతాలోకి ఎంత చేరింది? పదవుల కోసం కొట్టుకుంటున్న ప్రస్తుత పార్టీ నాయకులకు ఇది పిడకల వేట. ఏతావాతా–ఆవిడ ఆనందంగా ఉన్నందుకు కాదు, 2 కోట్లు ఇచ్చినందుకు కాదు, ఇచ్చిందని చెప్పిన పోలీసు డిప్యూటీ ఇనస్పెక్టర్ జనరల్ డి. రూపని కాంగ్రెస్ ముఖ్యమంత్రిగారు బదిలీ చేశారు. ఇది కాంగ్రెసు ఘనత. ఎన్నోసారి? గత 17 సంవత్సరాలలో 26వ సారి. అంటే ప్రతీ ఏడెనిమిది నెలలకి ఒక్కో ట్రాన్స్ ఫర్ జరిగింది. లోగడ ఇలాంటి అడ్డదిడ్డమయిన ‘నీతి’ని పట్టుకు వేలాడినందుకు ఒకానొక ఐయ్యేయస్ ఆఫీసరు–ఖేమ్కాగారిని కాంగ్రెసు నాయకత్వమే బదిలీలు చేసి చేతులు కడుక్కుంది. ఎన్నిసార్లు? 27 సంవత్సరాలలో 47 సార్లు. ఆ మధ్య దుర్గా నాగ్‌పాల్ అనే సరికొత్త ఐయ్యేయస్‌కి ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్ ప్రభుత్వం అధికారం ‘రుచి’ని చూపి నోరు మూయించిన కథ మనం చదువుకున్నాం. ఈ దిక్కుమాలిన నీతిపరులు మరీ శ్రుతి మించితే? ఏం జరుగుతుందో లోగడ ధనంజయ్ మహాపాత్రా గారి ద్వారా అవినీతిపరులు నిరూపించారు. చివరిగా డి. రూప అన్నమాట: ‘అవినీతి జరిగినప్పుడు–నోరు విప్పకపోతే–ఆ అవినీతికి పరోక్షంగా మనం మద్దతు ఇచ్చినట్టే.’ వ్యవస్థని ఎదిరించడానికి దమ్ము కావాలి. చిత్తశుద్ధి కావాలి. అకళంకమైన శీల సంపద కావాలి. అడ్డదారిన డబ్బో, పదవో దక్కించుకోవాలనే దేబ రింపు గల అవకాశవాదులకు ఇవన్నీ గగన కుసుమాలు. ఖేమ్కాలు, రూపలు, ధనంజయ్లూ అరుదుగా కనిపిస్తారు. దుర్గా నాగ్‌పాల్‌లు తొలిరోజుల్లోనే మూగపోతారు. ప్రతీ తరానికీ మహాత్ముడు పుట్టడు. నీతి నిప్పు. పాటించిన వారికి అది వెలుగు. తేజస్సునిస్తుంది. పాటించని వారిని కాలుస్తుంది. - గొల్లపూడి మారుతీరావు -
ఒక అమెరికా భక్తుడి ఉవాచ
♦ జీవన కాలమ్ ప్రపంచంలో ఇండియా ఇప్పుడిప్పుడే తనదైన స్థానంలో నిలదొక్కుకుంటోంది. ఆ స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకోవాలంటే గుజరాత్ టీకొట్టు మనిషే మీకు గట్టి దన్ను. నేను బీజేపీ కార్యకర్తని కాను. ఈ దేశంలో అందరిలాంటి పౌరుడిని. తమిళనాడులో కస్టమ్స్ శాఖ అత్యధిక ఉన్నత న్యాయస్థానం (ట్రిబ్యునల్)కు న్యాయాధికారిగా పనిచేసి రిటైరైన 86 సంవత్సరాల ప్రముఖ రచయిత నాకు ఒక అమెరికా భక్తుడి (జాసన్. కె.) వ్యాసాన్ని పంపారు. నలుగురూ చదివితే బాగుంటుందనిపించింది. కాలమ్ పరిమితి దృష్ట్యా సంక్షిప్తంగా చెబుతాను: అమెరికా ఇస్తున్న నిధులతో పనిచేసే ప్రాజెక్టుల కోసం భారతదేశం నలుమూలలా తిరుగుతూ ఉంటాను. పేదల్నీ, నిరుపేదల్నీ కలుస్తూంటాను. భారతదేశంలో ఉన్న కొన్ని అపప్ర«థల్ని తొలగించాలన్నదే నా ప్రయత్నం. అమెరికా మిత్రులు, కొందరయినా భారతీయులు దీన్ని చదువుతారని ఆశిస్తాను. మీకు నచ్చినా, నచ్చకపోయినా భారతదేశంలో గ్రామీణ రంగం మోదీగారి వెనుక ఉంది. వాళ్లని మీరు భక్తులన్నా, అనుచరులన్నా వాళ్లకి వెంట్రుక ఊడదు (ఇంతకన్న ముతక మాట అన్నాడు). మొట్టమొదటిసారిగా మూడేళ్ల పాలనలో ఒక్క కుంభకోణమూలేని పార్టీ నాయకుడు వారికి దక్కాడు. అనూహ్యమైన కుంభకోణాలతో మురిగిన దేశం ఒక ప్రధాని మూగతనాన్ని వేళాకోళం చేసే స్థాయికి చేరుకొన్న నేపథ్యంలో ఇది గొప్ప, వాంఛనీయమైన పరిణామం. ముస్లింలు మోదీని ద్వేషించటం లేదు. చదువుకున్న హిందూ మేధావులు ఆయన్ని ద్వేషిస్తున్నారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో వారు అతి మెళకువగా, శ్రద్ధగా ప్రజాభిప్రాయాన్ని వంకర తోవ పట్టించడానికి చేసిన కృషిని ఆయన గంగలో కలిపాడు కనుక. సరదాగా టీ సేవిస్తూ పత్రికల్లో రాజకీయాలను చర్చించే ‘బాతాఖానీ’మేధావుల నడ్డి మీద ఆయన ఒక తాపు తన్నాడు కనుక. నాకనిపిస్తుంది చాలామంది భారతీయులు మోదీని వ్యతిరేకించడాన్ని ఒక స్టేటస్ సింబల్‌గా భావిస్తూ, తద్వారా తాము మేధావులం, మతాతీత శక్తులమని నిరూపించుకోజూస్తున్నారని. వారికి అదొక ఫేషన్. ఒక్క ఉదాహరణ ఢిల్లీ ముఖ్యమంత్రి– కేజ్రీవాల్. ఆయన మోదీ విద్యార్హతల్ని ప్రశ్నిం చారు. విశ్వవిద్యాలయం సాధికారికంగా సమర్థించే సరికి పూర్తిగా జారిపోయాడు. ఇది అతి నీచమైన ‘spit and run-' రాజకీయం. ఇలా కక్కగా కక్కగా ఏదో మురికి ఆయనకు అంటుకోక మానదని కొందరి ఆశ. ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక స్థాయిగల దేశం 86 శాతం కరెన్సీని ఉపసంహరించడం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆర్థిక శాస్త్రాన్ని చదువుకున్నవాడిగా ఇది సరైన పని అని నేను అనుకోవడం లేదు. కానీ దేశం తలవొంచినట్టు తోస్తోంది. అయితే ‘అవినీతి’ చరిత్రలేని మోదీ చేపట్టిన ఈ చర్య చెల్లుబాటు కావడం ద్వారా ఆయన నిజాయితీపట్ల విశ్వాసం ప్రజల్లో మరింత పెరిగింది. అమెరికాలో ట్రంపుని పదవిలో కూర్చోపెట్టిన మమ్మల్ని చూసి భారతదేశంలో మేధావులు నవ్వుకోవచ్చు. అయినా సాహసం చేసి ఒక మాటంటాను. ఈయనకి మరో చాన్సు ఇవ్వండి. ఆయన సరైన కృషి చేస్తున్నాడు. అందుకు ఆయనకి దమ్ము, వెన్నుబలం ఉన్నాయి. ఒక్క కాశీలో ఆయన జరిపిన బహిరంగ ఊరేగింపు చాలు– అందుకు నిదర్శనంగా ఉదహరించడానికి. కెన్నెడీ హత్య ఇంకా మా మనస్సుల్లో పచ్చిగా ఉంది. ఒక్క పిచ్చివాడి చేతిలో తుపాకీ చాలు, మీ దేశాన్ని అవ్యవస్థలో పడేసేది. ఆయన్ని వెనకేసుకొచ్చేవారిని వెక్కిరించే షోకుని విడిచిపెట్టండి. అలా చేయడం సరదాగా ఉండొచ్చుకానీ– అందువల్ల మీకే నష్టం. దేశంలో ఎక్కువమంది ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఆయన సిద్ధాంతాలను వ్యతిరేకించేవారితో మీరు ఏకీభవిస్తున్నకొద్దీ వారి అనుచరుల సంకల్పబలం పెరుగుతుంది. ఆయనతో ఏకీభవించని ప్రత్యర్థి ఎవరయినా– సహేతుకంగా ఆలోచించగా నేను చూడలేదు. కాగా ఆయన్ని విమర్శించిన చాలామంది తమ మనస్సులు మార్చుకోవడం నేనెరుగుదును. దురదృష్టం. భారతీయ సైన్యం చేసిన దాడులనీ కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించాయి. మాకు ట్రంపు ఉన్నాడు. అమెరికాని సమర్థించే ఆయన ఏ చర్యనయినా బొత్తిగా చదువురాని అమెరికన్ కూడా సమర్థించాడు. మీ సైన్యం చర్యలనే మీరు ఖండించే స్థితికి వస్తే– మీలో ఏదో సీరియస్ లోపం ఉన్నట్టే లెక్క. నక్షత్రాల జాతీయ పతాకం అమెరికాకు తలమానికం. కానీ మీ త్రివర్ణ పతాకం మీకు అలా కాకపోవడం దురదృష్టకరం. మీకిది వింతగా కనిపించవచ్చుకానీ నేను మీ దేశాన్ని, మీ ప్రజలని ప్రేమిస్తున్నాను. ప్రపంచంలో ఇండియా ఇప్పుడిప్పుడే తనదైన స్థానంలో నిలదొక్కుకుంటోంది. ఆ స్థానాన్ని సుస్థిరంగా నిలుపుకోవాలంటే గుజరాత్ టీకొట్టు మనిషే మీకు గట్టి దన్ను. రాహుల్ గాంధీ అనే ఆ శాల్తీని కాక ఈయన్ని మళ్లీ ఎన్నుకోడానికి మరో ఎన్నిక మీకు అవసరమనిపిస్తే మిమ్మల్ని ఆ దేవుడే రక్షించుగాక! గొల్లపూడి మారుతీరావు -
లెజెండ్ నిష్ర్కమణ
జీవన కాలమ్ ఆమెని ‘లేడీ శివాజీ గణేశన్’ అని గుండెలకు హత్తుకున్నారు ప్రేక్షకులు. 1500 చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కి ప్రపంచ చరిత్రను తిరగరాసింది. ‘ఆమె కేవలం నటికాదు. ద్రవిడ ఉద్యమం’ అన్నారు ఆమెతో కలిసి పనిచేసిన కరుణానిధి. ప్రముఖ నటీమణి మనోరమ కన్నుమూసిన వార్త తెలియ గానే మిత్రుడు, దర్శకుడు కోడి రామకృష్ణకి ఫోన్ చేశాను. 1996లో ఒకే ఒక్కసారి మనోరమ నా భార్యగా నటించింది. నిజానికి ఇలా చెప్పడం మర్యా దకాదు. నేను ఆమె భర్తగా నటించాను. సినీమా పేరు ‘లాఠీచార్జ్’. నా కెరీర్లో కనీసం 30 మందికి పైగా నా భార్య పాత్రలో చేశారు. కాని మనోరమ ఎందుకు? కోడి చెప్పాడు. నా పాత్ర గాంధీ అనుయాయుడు. అతని స్పృహ అలనాటి స్వాతంత్య్ర సమరం రోజుల్లోనే నిలిచి పోయింది. ఎప్పుడూ గాంధీ నిన్న మొన్న ఉన్నట్టే మాట్లాడతాడు. కష్టమల్లా తెలిసి తెలిసే ఆ ‘అవాస్తవాన్ని’ నిజమని నమ్మించే, నమ్మించాల్సిన పాత్ర నా భార్య. అదీ మనోరమ. ఇతను ‘గాంధీగారు ఉప్పు సత్యాగ్రహమంటున్నారు. దేశమంతా తరలివస్తోంది. వెళ్లాలి’ అన్నాడనుకోండి. ‘అవునండీ. వెళ్లి తీరాలి. ఆయన వెనుక దేశ ప్రజలంతా ఒకటిగా నిలబడాలి కదా? బయలుదేరండి’ అనే పాత్ర భార్యది. తీరా అవి నీతిమయమయిన ఈ వర్తమాన సమాజంలోకి అతని మెదడు సర్దుకుంటుంది. కాని ఈ సమాజ పతనం అతన్ని హింసిస్తుంది. ఈసారి కోరుకుని అతను గతం లోకి పారిపోతాడు. విశేషమేమిటంటే భార్య అతని ప్పుడు నమ్మే అవాస్తవాన్ని ‘వాస్తవ’మని సమర్థించే పాత్రని మళ్లీ వహిస్తుంది! ఇది చాలా క్లిష్టమయిన పాత్రీ కరణ-నాదీ, మనోరమదీ. ఆశ్చర్యపడేటంత అవలీలగా - అంత గొప్ప టైమింగ్‌తో చేసింది. (కనీసం 50 ఏళ్ల కిందట యూజిన్ అయొనెస్కో ‘ది చైర్స్’ అనే నాటిక స్ఫూర్తితో ‘ కాలం వెనక్కు తిరిగింది’ అనే నాటిక రాశాను. ఎగ్జిస్టెన్సియలిజం దాని మూలసూత్రం. ఒక్క మాటలో చెప్పాలంటే We are condemned to live. రాజమండ్రి లలిత కళానికేతన్ పోటీలలో ఆ సంవత్సరం ఆ ఒక్క నాటికతోనే పోటీ నిర్వహించారు. కనీసం పది ట్రూపులు నటించాయి. అదొక చరిత్ర.) మనోరమ విలక్షణమయిన నటి. నాకంటే రెండేళ్లు పెద్ద. రాత్రి వేళల్లో షూటింగు పెడితే సాధారణంగా తిడు తూంటాను. అప్పుడు నేను కోడి మీద విసుక్కోలేదు. ఆ మాట తెల్లవారు ఝామున 3 గంటలకి నవ్వుతూ గుర్తు చేశాడు కోడి. ‘కారణం- మనోరమ. నాకంటే సీనియర్ నటిస్తూంటే నేను యాగీ చెయ్యడం తప్పు’ అన్న గుర్తు. 49 సంవత్సరాల కిందట చెన్నైలో ఆమె స్టేజీ నాట కం చూశాను. అంత గొప్ప టైమింగ్ ఉన్న నటి చాలా అరుదు. ఆయా భాషల్లో గొప్ప నటీమణులున్నారు. మన భాషలో సూర్యకాంతమ్మ. కాని మనోరమ ప్రత్యే కత ఏమిటంటే- దశాబ్దాల పాటు కడుపుబ్బ నవ్వించే పాత్రల్ని చిరస్మరణీయం చేశాక, తర్వాతి తరం దర్శ కులు, రచయితలు ఆమె ప్రతిభను మరో మలుపు తిప్పారు. ‘చిన్న తంబి’ వంటి ఉదాత్తత, సెంటిమెంటు పండించే పాత్రల వెల్లువ ఆమెకు దక్కింది. అంతే. ఆమె కెరీర్ మరో పెద్ద మలుపు తిరిగింది. హాస్య నటి క్యారెక్టర్ నటి అయితే - ప్రేక్షకుల గుండెల్లోకి దూసుకుపోతుంది. ఎల్లకాలం నవ్వుతూ, నవ్విస్తూ ఉండే పాత్ర హఠాత్తుగా కంటతడి పెట్టుకుంటే ఆ పాత్ర ఆకాశానికి లేస్తుంది. ఇదొక రేంజ్. హాస్యం పాపులారిటీని ఇస్తుంది. ఆర్ద్రత దానికి పదును పెట్టి మన్నికనిస్తుంది. నవ్వు ఆకాశం. కన్నీరు సముద్రం. హాస్యం సర్వజన సమ్మతం. ఆత్మీ యత- సర్వజన వశీకరణ. మరిచిపోలేని ఎన్నో పాత్ర లకు రెండవ దశలో ప్రాణం పోసింది మనోరమ. అయిదుగురు ముఖ్యమంత్రులతో (అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, ఎన్టీ రామారావు) కలసి పని చేసింది. మూడేళ్ల కమల్‌హాసన్‌తో పనిచేసింది. లక్షల హృదయాల్లో తిష్ట వేసుకుంది. ఆమెని ‘లేడీ శివాజీ గణేశన్’ అని గుండెలకు హత్తుకున్నారు ప్రేక్షకులు. 1,500 చిత్రాలలో నటించి గిన్నిస్ బుక్‌లోకి ఎక్కి ప్రపం చ చరిత్రను తిరగరాసింది. ‘ఆమె కేవలం నటికాదు. ద్రవిడ ఉద్యమం’ అన్నారు ఆమెతో కలిసి పనిచేసిన కరుణానిధి. ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలో ఆమె తమిళ చిలకమ్మ. తమిళ చిత్రం చూసిన వారు ఆమె వీరంగం మరిచిపోలేరు. షావుకారు జానకి తెలుగు పాత్రని అంతే చిరస్మరణీయం చేశారు. హాస్యానికి కన్నీరు జోడయితే తయారయ్యే రసా యనం ప్రపంచ చరిత్రలోనే అనితర సాధ్యం. ఎందరో డానీ కేలు, నార్మన్ విస్డమ్లు, లారెల్ హార్డీలు కనిపి స్తారు. కాని ఈ ఒక్క కారణానికే చార్లీ చాప్లిన్ మకుటా యమా నంగా నిలుస్తారు. నట జీవితంలో ఆ రేంజ్‌ని సాధించిన నటీమణి మనోరమ. మొన్న చెన్నై బీచి వేపు నా కారు వెళ్తూంటే ‘ఇటు వెళ్లడం మంచిది కాదు సార్!’ అన్నాడు డ్రైవర్. ‘ఏం’ అన్నాను. మా ఆవిడ సమాధానం చెప్పింది. అంత్య క్రియలకి మనోరమ పార్థివ దేహాన్ని ఊరేగిస్తున్నారట. దారి పొడుగునా వందల వేల మంది పాకల్లో నివసించే బడుగు వర్గాల మనుషులు బారులు తీరారు. తమ జీవితాల్లోకి - ఒక జీవితకాలం పాటు చిరునవ్వునీ, కన్నీటినీ రంగరించి కల్లాపు జల్లిన ఆ ‘తల్లి’కి కృతజ్ఞతని చెప్పుకోడానికి. ఒక క్యారెక్టరు సినీ నటికి దక్కిన అరుద యిన నివాళి అది. మనోరమ చరిత్ర. చాలా కారణాలకి మళ్లీ మళ్లీ పునరావృతం కాని గొప్ప చరిత్ర. గొల్లపూడి మారుతీరావు