రచ్చకెక్కిన ‘రచ్చబండ’ | gollapudi maruthi rao write jeevana column article | Sakshi
Sakshi News home page

రచ్చకెక్కిన ‘రచ్చబండ’

Published Thu, Jan 25 2018 1:22 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM

gollapudi maruthi rao write jeevana column article - Sakshi

జీవన కాలమ్‌
చీఫ్‌ జస్టిస్‌ స్థాయిలో పరిపాలనా సరళిలో కొన్ని మర్యాదలు పాటించలేదని అనుకున్నప్పటికీ... దేశమంతా నెత్తిన పెట్టుకునే, గౌరవించే, ఒకే ఒక్క గొప్ప వ్యవస్థని ‘బజారు’న పెట్టవలసిన అగత్యం లేదని చాలామంది పెద్దల భావన.

బీచిలో ఓ అమ్మాయి ఎప్పుడూ కనిపిస్తూంటుంది. బాగా చదువుకున్న అమ్మాయి. ఆ అమ్మాయి లక్ష్యం చక్కగా పెళ్లి చేసుకుని భర్తకి వండిపెడుతూ సుఖంగా గడపాలని. తర్వాత ఆ అమ్మాయికి పెళ్లయింది. లక్షణంగా తాళిబొట్టుతో, పసుపుతాడుతో, భర్తతో కనిపించింది. ఆమె కల సాకా రమౌతున్నందుకు ఆనందం కలిగింది. కొన్ని నెలలు గడిచాయి. భార్యాభర్తల మధ్య పొర పొచ్చాలు ప్రారంభమయ్యాయి. భర్తమీద కారాలూ, మిరియాలూ నూరింది. నేను ఆమె పాత కలని గుర్తు చేసి, కాస్త సంయమనాన్ని పాటించమని హితవు చెప్ప బోయాను. భర్త అనుచిత ప్రవర్తనను ఏకరువుపెట్టి– హితవు చెప్పిన నామీదే కోపం తెచ్చుకుని వెళ్లి పోయింది.

దరిమిలాను భార్యాభర్తల మధ్య ‘వార’ పెరి గింది. ఇప్పుడు పోలీసు డిపా ర్టుమెంటులో పనిచేస్తున్న ఆమె తండ్రి అల్లుడిని రెండు రోజులు జైల్లో పెట్టించాడు. ముందు ముందు సామరస్యం కుదిరే అవకాశాన్ని ఆ విధంగా శాశ్వ తంగా మూసేశాడు. ఆమె కలలు గన్న వ్యవస్థ– ఆమె తండ్రి సహాయంతో పూర్తిగా కూలి పోయింది. కాళ్లు కడిగి కన్యా దానం చేసిన మామ తన అల్లు డిని జైలుకి పంపితే ఆ అల్లుడు ఇక ఏ విధంగానూ జైలు శిక్షని మరిచిపోయి– ఆమెని జీవితంలోకి ఆహ్వానిస్తాడనుకోను. వ్యవస్థను గౌరవించే గాంభీర్యం, పెద్ద రికాన్ని పెద్దలే వదులుకున్నప్పుడు– ఆ వ్యవస్థ ‘పెద్ద రికానికి’ మాలిన్యం అంటుతుంది.

ఈ కథకీ మొన్న నలుగురు మేధావులయిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు– పత్రికల ముందుకు రావడానికీ పోలికలున్నాయని నాకనిపిస్తుంది. ఈ దేశంలో గత 70 సంవత్సరాలుగా అత్యున్నత న్యాయ వ్యవస్థగా నిలిచిన ప్రధాన న్యాయస్థానంలోని ‘అభి ప్రాయ భేదాలు’ ఒక్కసారి ప్రజల మధ్యకి రావడం దేశాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దేశంలో న్యాయాధిపతులే అరిగించుకోలేకపోతున్నారు. ‘‘సుప్రీంకోర్టు పరిపాలనా సరళిని ఏ విధంగా పత్రికా సమావేశం సంస్కరిస్తుంది? ప్రజాభిప్రాయ సేకరణ చేసి– సుప్రీంకోర్టు నిర్వహణ సరిౖయెనదో కాదో ప్రజలు నిర్ణయించాలని ఈ సమావేశం ఉద్దేశమా?’’ అని జస్టిస్‌ శోధీ అన్నారు.

మరో న్యాయమూర్తి జస్టిస్‌ సంతోష్‌ హెగ్డే ‘‘ఈ నలుగురి పెద్దల ఉద్దేశం ఏమిటి? ప్రజల్ని ఈ అవ్య వస్థలో జోక్యం చేసుకుని తీర్పు చెప్పాలనా? సవరణ జరపాలనా? సలహాలివ్వాలనా? ప్రధాన న్యాయ మూర్తిని బోనులో నిలబెట్టాలనా?’’ సోలీ సొరాబ్జీ, కె.టి.ఎస్‌. తులసి, జస్టిస్‌ ముకుల్‌ ముద్గల్‌ వంటివారు షాక్‌ అవడమే కాకుండా చాలా బాధపడ్డారు. ఒక ప్రముఖ పత్రిక– ఈ పత్రికా సమావేశం భారతీయ న్యాయ వ్యవస్థ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం అని పేర్కొంది.

విచిత్రం ఏమిటంటే గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలోని అత్యంత ప్రముఖమైన కేసులన్నీ యాదృ చ్ఛికంగానో, కాకతాళీయంగానో జూనియర్‌ బెంచిలకే వెళ్లాయని ఇదే పత్రిక పతాక శీర్షికలో మరునాడు పూర్తి వివరాలతో పేర్కొంది. మరి ఇన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో తమ విధులను నిర్వహిస్తున్న ఈ గౌరవ న్యాయమూర్తులకు పత్రికలకు తెలిసేపాటి నిజానిజాలు తెలియవా? తెలిస్తే రచ్చకెక్కడానికి ఇప్పు డెందుకు ముహూర్తం పెట్టినట్టు? ఇందులో వృత్తిప రమైన, రాజకీయ పరమైన కోణాలేమైనా ఉన్నాయా? ఒకానొక రాజకీయ నాయకుడు ఒకానొక న్యాయ మూర్తి తలుపు తట్టడం వెనుక ఈ ఛాయలు తెలు స్తున్నాయా? ఇవీ ప్రశ్నలు. లేని తీగెని లాగి ఓ గొప్ప వ్యవస్థని ‘డొంక’గా రూప కల్పన చేసిన దయనీయమైన పరిస్థితిగా దీనిని భావించాలా? అని మేధావి వర్గాలు బుగ్గలు నొక్కుకుంటు న్నాయి.

అయితే– ప్రధాన న్యాయ మూర్తి స్థాయిలో పరిపాలనా సరళిలో కొన్ని మర్యాదలు పాటించనప్పుడు, జరుగుతు న్నది సబబు కాదని మేధావులైన న్యాయమూర్తులు భావిస్తున్నప్పుడు ఏం చెయ్యాలి? ఏం చేసినా చేయ లేకపోయినా దేశమంతా నెత్తిన పెట్టుకునే, గౌరవించే, నిర్ణయాలకు భేషరతుగా తలవొంచే, మార్గదర్శకత్వా నికి ఎదురుచూసే– ఒకే ఒక్క గొప్ప వ్యవస్థని ‘బజా రు’న పెట్టవలసిన అగత్యం లేదని చాలామంది పెద్దల భావన. ఇలా రచ్చకెక్కడంవల్ల దేశంలో అడ్డమైనవారూ (వారిలో నేనూ ఉన్నాను)– రాజకీయ పార్టీలు సరేసరి – నోరు పారేసుకునే అవకాశాన్ని కల్పించినట్టు అవు తుందని సంతోష్‌ హెగ్డే అన్నారు. ప్రతీ దిన పత్రికలోనూ సంపాదకునికి లేఖలు కోకొల్లలు. ఈ సంక్షోభాన్ని ఎవరి అవసరాలకు వారు అన్వయించు కుంటున్నారు.

సంయమనం, మేధస్సు, విచక్షణ, అపూర్వమైన గాంభీర్యమూ చూపే వ్యవస్థ– అలక, కించిత్తు అస హనమూ, కోపమూ– చూపనక్కరలేని, చూపినా ఉప యోగం లేని, చూపకూడని స్థితిలో రచ్చకెక్కడం– తొందరపాటుతో ఒకటి రెండు మెట్లు దిగి వచ్చిందని, ఆ మేరకు ‘వ్యవస్థ’ పరపతి– దిగజారిందని భావిం చడంలో ఆశ్చర్యం లేదు.

-గొల్లపూడి మారుతీరావు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement