న్యూఢిల్లీ: క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలన్న పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. రాజకీయాలు నేరమయం కాకుండా చూడాల్సిన బాధ్యత పార్లమెంటుదేనని, అందువల్ల తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్న వ్యక్తులు రాజకీయాల్లోకి ప్రవేశించకుండా చట్టం చేయాలని సూచించింది. నేర చరిత్ర ఉన్న అభ్యర్థుల్ని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా ప్రకటించేందుకు సుప్రీం నిరాకరించింది.
ఈ విషయంలో తాము ‘లక్ష్మణ రేఖ’ను దాటి జోక్యం చేసుకోలేమని, అయితే రాజ్యాంగ పరిరక్షకులుగా నేరమయ రాజకీయాలపై తాము చట్టం చేయాల్సిందిగా పార్లమెంట్‌ను కోరవచ్చని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం తీర్పునిచ్చింది. ఎన్నికల్లో పార్టీ టికెట్‌పై పోటీ చేసే అభ్యర్థుల నేర చరిత్రను ఆయా పార్టీలు ప్రజలకు తెలియజేయాలని.. ఆయా పార్టీలు తమ వెబ్‌సైట్లలో ఆ వివరాలను అందుబాటులో ఉంచాలని, స్థానిక పత్రికలు, చానెళ్లలో కూడా ప్రచారం చేయాలని ఆదేశించింది.
నేరమయ రాజకీయాల్ని చూస్తూ ఊరుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం చేతులు కట్టేశారని, ఈసీకి సాధికారతను కల్పించే విషయంలో పార్లమెంట్ స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. నేర అభియోగాలు ఎదుర్కొంటున్న అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హులుగా ప్రకటించాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారిమన్, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ ఇందూ మల్హోత్రల ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
ప్రజస్వామ్యం వెన్నులో వణుకు
దోషిగా తేలేవరకు ఏ వ్యక్తినైనా నిర్దోషిగానే భావించాల్సి ఉంటుందని, ప్రజామద్దతుతో గెలిచిన వ్యక్తి ఆరోపణలు ఎదుర్కొంటున్నా అతను చట్టసభ సభ్యుడు కాకుండా ఏదీ అడ్డుకోలేదన్న అటార్నీ జనరల్ వాదనలతో తాము ఏకీభవించడం లేదని సుప్రీం పేర్కొంది.
‘అందువల్లే తీవ్ర నేరాలు చేశారన్న ఆరోపణలున్న వారు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిరోధించేందుకు చట్టం చేయాలని ప్రభుత్వానికి కోర్టు సూచిస్తోంది. నేరమయ రాజకీయాలు అత్యంత ఘోరమైన, ఆందోళన చెందాల్సిన విషయం. కలవరం కలిగించేలా రోజు రోజుకూ విస్తరిస్తున్న ఈ ధోరణి ప్రజాస్వామ్యం వెన్నులో వణుకు పుట్టించగలదు. రాజకీయాల్ని ప్రక్షాళన చేసే చట్టం కోసం దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది’ అని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
చట్టం చేయాల్సిన సమయమొచ్చింది
నేరమయ రాజకీయమనే అనే ఈ పుండుకు చికిత్స ఉందని.. అది ప్రజాస్వామ్యానికి ప్రాణాంతకంగా మారకముందే వీలైనంత త్వరగా చికిత్స అవసరమని జస్టిస్ మిశ్రా ధర్మాసనం తెలిపింది. నేరమయ రాజకీయం ప్రజాస్వామ్య పునాదుల్ని కదిలిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ‘తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు రాజకీయ స్రవంతిలోకి రాకుండా చూసే బాధ్యతను పార్లమెంటుకే వదిలిపెడుతున్నాం. కలవరం కలిగించేలా రోజు రోజుకూ మన దేశంలో పెరుగుతున్న నేరమయ రాజకీయాలు రాజ్యాంగ విలువలకు భంగం కలిగించేలా ఉన్నాయి.
రాజ్యాంగంలో పూర్తి రక్షణ కల్పించినప్పటికీ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో నేర సంస్కృతి క్రమంగా పెరుగుతూ, అది రాజకీయాలకు విస్తరిస్తోంది. తీవ్రమైన క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారు రాజకీయ స్రవంతిలోకి ప్రవేశించకుండా తప్పకుండా చట్టం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత రాజకీయాలు అవినీతితో అపవిత్రం కాకుండా చూడాల్సిన బాధ్యత రాజ్యాంగంపై ప్రమాణం చేసినవారిపై ఉంది’ అని పేర్కొంది. రాజకీయ ప్రత్యర్థులు ఇతర అభ్యర్థులపై తప్పుడు కేసులు వేయడం వాస్తవమేనని, ఈ విషయంలో పార్లమెంట్ తగిన చట్టం చేయవచ్చని సూచించింది.
రాజకీయాల్ని నేర రహితంగా మార్చే లక్ష్యంతో కోర్టు ఆదేశాలు జారీచేసింది. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాప్‌లు వంటి క్రూరమైన, దారుణమైన నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి సభ్యత్వాన్ని రాజకీయ పార్టీలు రద్దు చేయడం తప్పనిసరి చేసేలా పటిష్టమైన చట్టాన్ని తీసుకురావాలని పార్లమెంటుకు సూచించింది. పార్లమెంటు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో వారు భాగం కాకుండా చూడాలంది.
1. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు (రాజకీయ పా ర్టీకి చెందినా, చెందకపోయినా) వారి నేరమయ చరిత్రకు సంబంధించిన సమాచారాన్ని ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘానికి సమర్పించే పత్రాల్లో పొందుపరచాలి. అభ్యర్థి తన నేరచరిత్రకు సంబంధించిన పూర్తి వివరాలను పెద్ద అక్షరాల్లో రాయాలి.
2. ఒకవేళ అభ్యర్థి ఫలానా రాజకీయ పార్టీ తరఫున పోటీ చేస్తుంటే.. తనపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాల్ని ఆ పార్టీకి తెలియచేయాలి.
3. అభ్యర్థి గత నేర చరిత్ర వివరాల్ని రాజకీయ పార్టీ తన వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఆ ప్రాంతంలో ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న వార్తాపత్రికలు, ఎలక్ట్రానిక్‌మీడియాలో అభ్యర్థుల నేరచరిత్రపై డిక్లరేషన్ ఇవ్వాలి.
4. ఏ పార్టీ టికెట్‌ను ఆశిస్తున్నారో ఆ పార్టీకి కూడా అభ్యర్థులు పెండింగ్ కేసుల గురించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వాలి. అభ్యర్థి గురించి తెలుసుకుని ఎవరికి ఓటు వేయాలో ఓటరు నిర్ణయించుకునేందుకు ఇవి దోహదపడతాయి.
నేరచరిత్ర ఉన్నవారిని పార్టీలు బహిష్కరించాలి
నేర చరిత్రగల రాజకీయ నేతలు దేశానికి ఇబ్బంది అని.. అలాంటి వాళ్లు అధికారంలో ఉండటం ప్రజాస్వామ్య మూలాలకే ప్రమాదమని సుప్రీం హెచ్చరించింది. ‘ఇది స్వీయ వినాశక వ్యాధి.. యాంటీబయాటిక్స్‌కు కూడా లొంగట్లేదు. రాజకీయాల్లో నేర ప్రవృత్తి స్థాయిలు క్రమంగా, పెరుగుతున్నాయి. కలుషితమైన రాజకీయాల్ని ప్రక్షాళన చేసేందుకు నేరచరిత్ర ఉన్న వారిని బహిష్కరిస్తూ తగిన చర్యల్ని చేపట్టాలి. అప్పుడు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన కూడా వారు చేయరు.
రాజకీయాల్లోకి ప్రవేశించేవారు, చట్ట సభ్యులు తీవ్రమైన నేర ఆరోపణలకు అతీతంగా ఉండటం తప్పనిసరి’ అని చెప్పింది. ప్రస్తుత ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం దోషిగా తేలితే అతను ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులు. అయితే, నేర అభియోగాలు ఎదుర్కొంటున్న వారిని కూడా అనర్హుల్ని చేయాలని పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది.
చట్టానికి లోబడే ఈసీకి అధికారాలు
ఎన్నికల సంఘం(ఈసీ)కు సంపూర్ణాధికారాలు ఉన్నప్పటికీ పార్లమెంటు చేసిన చట్టానికి లోబడే అది పనిచేయాల్సి ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘ఈసీకి పూర్తి అధికారాలు ఉన్నాయన్నది నిస్సందేహం. దేశంలో స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీకి అధికారం ఉంది. అయితే ఆ అధికారానికి ఓ పరిమితి ఉంది. పార్లమెంటు చేసిన చట్టానికి లోబడి ఈసీ పనిచేయాలి. ఆ పరిమితిని అది ఉల్లంఘించజాలదు’ అని సీజేఐ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
ఆ తీవ్రత 1993లో తెలిసొచ్చింది
రాజకీయాలు నేరమయమైతే ఏర్పడే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయనేది 1993లో ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల ద్వారా బాగా తెలిసొచ్చిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాజకీయాలు నేరమయమవడంపై అధ్యయనం చేసిన ఎన్‌ఎన్ వోహ్రా కమిటీ నివేదికను ధర్మాసనం ప్రస్తావించింది. ‘భారత్‌లో రాజకీయాలు నేరమయం కావడం కొత్తదేమీ కాదు. కానీ దానివల్ల ఎంతటి తీవ్ర పరిణామాలుంటాయో ముంబై వరుస బాంబు పేలుళ్ల ఘటన స్పష్టంగా తెలిపింది.
నేర ముఠాలు, పోలీసులు, కస్టమ్స్ అధికారులు, రాజకీయ నేతలు ఒక్కటవ్వడం వల్లే ఈ పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్లు దేశాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. అనంతర ఆందోళనల కారణంగానే రాజకీయ పార్టీలు నేరస్తులతో నిండిపోవడం, నేరస్తులకు–రాజకీయ నేతలకు మధ్య ఉన్న సంబంధాలపై అధ్యయనం చేసేందుకు ఎన్‌ఎన్ వోహ్రా కమిటీని ఏర్పాటు చేశారు. నేర ముఠాలు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నాయని సీబీఐ, ఐబీ, రా తదితర సంస్థలు చెప్పిన విషయాన్ని వోహ్రా కమిటీ నివేదిక తెలిపింది’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు.
నేరస్తులదే మెజారిటీ
ఎన్నికల్లో నేరచరితులపై న్యాయకమిషన్ తీసుకొచ్చిన ఓ నివేదికను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. 2004 నుంచి 2014 మధ్య జాతీయ, రాష్ట్రాల స్థాయుల్లో పోటీ చేసి గెలిచిన వారిలో.. ఎలాంటి నేరారోపణలూ లేని వారికన్నా వివిధ కేసులు ఎదుర్కొంటున్న వారి శాతమే ఎక్కువగా ఉందని ఆ నివేదికలో ఉంది. ఏ కేసులూ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో సగటున 12 శాతం మందే గెలవగా.. కేసులను ఎదుర్కొంటూ పోటీ చేసిన వారిలో సగటున 23 శాతం మంది గెలిచారని నివేదిక వెల్లడించింది.
కొన్ని సందర్భాల్లో పార్టీలు నేరస్తులకే టికెట్లు కేటాయిస్తుండగా, మరికొన్నిసార్లు నేతలు ఎన్నికల్లో గెలుపొందాక నేరస్తులుగా మారుతున్నారంది. ఉత్తరప్రదేశ్ శాసనసభలో ఏకంగా 47 శాతం మంది ఎమ్మెల్యేలపై అనేక నేరాలకు సంబంధించి కేసులు ఉన్నట్లు నివేదికలో ఉండటాన్ని కోర్టు ప్రస్తావించింది. అదే రాష్ట్రంలోని ఓ నియోజకవర్గ ఎమ్మెల్యేపై 36 కేసులుండగా వాటిలో 14 కేసులు హత్యలకు సంబంధించినవని నివేదిక పేర్కొంది.
ప్రస్తుత లోక్‌సభ సభ్యుల్లోనూ 162 మంది ఎంపీలపై నేరాలకు సంబంధించిన కేసులుండగా వారిలో 76 మందిపై అత్యంత తీవ్రమైన నేరారోపణలున్నాయంది. నిబద్ధత, నైతికత ఉన్న వారితో కూడిన.. స్వేచ్ఛాయుతంగా, పారదర్శకంగా ఎన్నికైన ప్రభుత్వం ఉండటం రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన అంశమని కోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి ప్రజలకు అవకాశం కల్పించడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమంది.
కొత్త చట్టం తెస్తే మద్దతిస్తాం: కాంగ్రెస్
సుప్రీంకోర్టు తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. రాజకీయాలను ప్రక్షాళన చేసి నేరస్తులను ఏరివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త చట్టం తీసుకువస్తే అందుకు తాము మద్దతిస్తామని వెల్లడించింది. కాంగ్రెస్ నేత కపిల్ సిబల్ మాట్లాడుతూ నేరస్తులెవ్వరూ రాజకీయాల్లో ఉండకూడదనీ, నేరచరితులపై నిషేధం విధించేలా కేంద్రం చట్టం తెస్తే తమ మద్దతు తప్పక ఉంటుందన్నారు.
అయితే కొత్త చట్టం తీసుకొస్తే ఒక్క లోక్‌సభలోనే వంద మంది బీజేపీ ఎంపీలు అనర్హులయ్యి ఆ పార్టీకి ఆధిక్యం లేకుండా పోతుంది కాబట్టి కేంద్రం చట్టం తీసుకొస్తుందని తాము అనుకోవడం లేదన్నారు. నేరస్తులతో నిండిపోయిన రాజకీయాలను ప్రక్షాళన చేసే చట్టం తీసుకురావాలా వద్దా అన్న విషయాన్ని సుప్రీంకోర్టు పార్లమెంటుకే వదిలేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పైవిధంగా స్పందించింది.
మరోవైపు సుప్రీంకోర్టును, కోర్టు తీర్పును తాము గౌరవిస్తామని బీజేపీ తెలిపింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ ‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైనా.. ఆ తీర్పు చెప్పింది భారత అత్యున్నత న్యాయస్థానం కాబట్టి మేం గౌరవిస్తాం’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment