సాక్షి, ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీం కోర్టు మరోసారి స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కన్నెర్ర జేసింది. మార్చి 21 లోపు ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంతెంత నిధులు ఇచ్చిందో ఆల్ఫాన్యూమరిక్ సీరియల్ కోడ్‌తో సహా ఎలక్టోరల్ బాండ్‌లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్‌బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. .
ఎంపిక చేసిన సంస్థల వివరాలు మాత్రమే కాకుండా.. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారందరి మొత్తం వివరాల్ని బహిర్ఘతం చేయాలని స్పష్టం చేసింది. దీపాటు తమ వద్ద ఉన్న ఎలక్టోరల్ బాండ్ల అన్ని వివరాలను బ్యాంక్ బహిర్గతం చేసిందని, ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని సూచిస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్‌బీఐ ఛైర్మన్ దినేష్ ఖేరాను అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది.
‘‘బాండ్ల విషయంలో ఎస్‌బీఐ సెలెక్టివ్‌గా ఉండకూడదు. దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి. దేన్నీ అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని మేం తీర్పు చెప్పాం. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్‌బీఐ ఈసీకి ఇవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహాలకు ఇక తావులేదు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.
సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా ఎస్‌బీఐ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. ఎలక్టోరల్ బాండ్ల సీరియల్ కోడ్‌ను సైతం ఎస్‌బీఐ అందిస్తుందని కోర్టుకు తెలిపారు. ‘మేం ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి మా వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని అందిస్తాం. ఎలాంటి డేటాను ఎస్‌బీఐ తన వద్ద ఉంచుకోదు’ అని సాల్వే చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment