ముంబై : మహరాష్ట్ర అమరావతి లోక్‌సభ బీజేపీ అభ్యర్ధి ‘నవనీత్ కౌర్’ నామినేషన్ ప్రక్రియ ఓ సినిమాను తలపించింది. ఆమె నామినేషన్ చివరి నిమిషం వరకు ఎదురు చూపులు, ఉత్కంఠత కొనసాగింది. కుల ధృవీకరణ అంశంలో సుప్రీం కోర్టు కౌర్‌కు అనుకూలంగా తీర్పివ్వడంతో విజయ గర్వంతో నామినేషన్ వేశారు.
నవనీత్ కౌర్ అమరావతి లోక్‌సభ అభ్యర్ధిగా గురువారం నామినేషన్ వేశారు. అయితే, నామినేషన్ ముందు ఆమె లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం ప్రశ్నార్ధకంగా మారింది. ఓ వైపు సుప్రీం కోర్టులో కుల ధృవీకరణపై విచారణ, మరోవైపు లోక్‌సభ అభ్యర్ధిగా నామినేషన్ వేసేందుకు చివరి రోజు (ఏప్రిల్4).
ఈ తరుణంలో కౌర్ నామినేషన్ వేసేందుకు ఉదయం బయలు దేరారు. ఆమె అభ్యర్ధిత్వం సుప్రీం కోర్టు కీలకం కావడంతో స్థానిక దసరా గ్రౌండ్‌లో మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవంద్ర ఫడ్నవీస్‌తో పాటు తన మంది మార్బలంతో మధ్యాహ్నాం వరకు ఎదురు చూడాల్సి వచ్చింది.
బాంబే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ
నవనీత్ కౌర్ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేయాలంటూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు గురువారం విచారణ చేపట్టింది. 2021 జూన్ 8న నవనీత్ కౌర్ తప్పుడు కుల ధ్రవీకరణ పత్రాలు ఉపయోగించారంటూ బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. మోసపూరితంగా వ్యవహరించారంటూ రూ.2లక్షల జరిమానా విధించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ కౌర్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
11.58 గంటలకు విచారణ ప్రారంభం
ఈ కేసు విచారణ గురువారం జరిగింది. సరిగ్గా 11:58 గంటలకు న్యాయమూర్తులు జేకే మహేశ్వరి, సంజయ్ కరోల్‌లతో కూడిన ధర్మాసనం ఆసక్తిగా ఎదురుచూస్తున్న తీర్పును ప్రారంభించింది. కౌర్ కుల ధృవీకరణ పత్రంపై బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టి వేసింది. నవనీత్ కౌర్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది.
నవనీత్ కౌర్‌దే విజయం
దీంతో 1100 కిలోమీటర్ల దూరంలో జరిగే సుప్రీం కోర్టు విచారణతో.. అప్పటి వరకు ఆందోళనగా ఉన్న నవనీత్ కౌర్, ఆమె అనుచరులు ఆనందం వెల్లివిరిసింది. చివరి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తూ సాగిన కౌర్‌కు అనుకూలంగా సుప్రీం ప్రకటించింది. ఐదు నిమిషాల వ్యవధిలో దసరా గ్రౌండ్ వేదికపై కెక్కిన ఫడ్నవీస్ కౌర్ విజయం సాధించారంటూ ప్రకటించారు. దీంతో రాణా తన మద్దతుదారులు, బీజేపీ నాయకులతో కలిసి రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వెళ్లి మధ్యాహ్నం 1:42గంటలకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు.
2011లో రాజకీయ రంగ ప్రవేశం
2011లో నవనీత్ కౌర్ బీజేపీ నేత రవి రాణాతో వివాహం అనంతరం రాజకీయాల్లో ప్రవేశించారు. తొలిసారి కాంగ్రెస్, ఎన్సీపీతో పొత్తు పెట్టుకున్న ఆమె 2014లో అమరావతి నుంచి తొలి ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. అయితే 2019లో అమరావతి లోక్‌సభ ఇండిపెండెంట్ అభ్యర్ధిగా కాంగ్రెస్,ఎన్సీపీ మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరారు. అమరావతి లోకసభ అభ్యర్ధిగా బరిలోకి దిగారు.
Comments
Please login to add a commentAdd a comment