కులతత్వం బందీఖానాలో మగ్గుతున్న మన జైళ్లకు ఎట్టకేలకు ‘విముక్తి’ లభించినట్టే! రాజ్యాంగం అమల్లోకొచ్చి 74 యేళ్లవుతున్నా మనుస్మృతిని మించి ఆలోచించని మన కారాగారాల దివాంధ త్వాన్ని ఎండగడుతూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలిచ్చింది. ఖైదీల పుట్టుక ఆధారంగా వారిపై వివక్ష ప్రదర్శించటం, పనులు అప్పజెప్పటం రాజ్యాంగ విరుద్ధమనీ, ఈ దురాచా రాన్ని మూడు నెలల్లో కట్టిపెట్టి ఆ సంగతి తెలియజేస్తూ నివేదికలు దాఖలు చేయాలనీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం రాష్ట్రాలనూ, కేంద్ర పాలిత ప్రాంతాలనూ ఆదేశించటం హర్షించదగ్గ పరిణామం.
జైళ్లు సంస్కరణాలయాలంటారు. నేరాలకు పాల్పడుతూ సమాజానికి తలనొప్పిగా మారిన వ్యక్తులను సంస్కరించటం ధ్యేయంగా కారాగారాలు ఏర్పడ్డాయి. కానీ అక్కడా బయటి సమాజంలాగే కులం కుళ్లు నిండివుందనీ, దాని ఆధారంగా భయంకరమైన వివక్ష కొనసాగుతున్నదనీ... రాజ్యాంగ అధికరణలను ఉల్లంఘిస్తూ జైళ్లలో అంట రానితనం, వెట్టిచాకిరీ రాజ్యమేలుతున్నాయనీ ఆంగ్ల వెబ్‌సైట్ ‘ది వైర్’లో పనిచేస్తున్న పాత్రికేయు రాలు సుకన్యా శాంత నాలుగేళ్ల క్రితం పరిశోధనాత్మక కథనం రాశారు.
దాని ఆధారంగా నిరుడు సుప్రీంకోర్టులో ఆమె ప్రజాప్రయోజన వ్యాజ్యం కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్ పర్యవసానంగానే తాజా తీర్పు వెలువడింది. వలస పాలకుల హయాంలో ఎప్పుడో 1894లో రూపొందిన కారా గారాల చట్టం ఆధారంగా తయారైన మాన్యువల్‌లోని అంశాలే అన్ని జైళ్లలో అమలవుతున్నాయి. వాటిని పాలకులెవరూ పట్టించుకోలేదని కాదు. 2016లో కేంద్రం నమూనా మాన్యువల్‌ను తీసు కొచ్చింది. నిరుడు నమూనా జైళ్ల చట్టం కూడా రూపొందింది. కానీ జైళ్లు, మాన్యువల్స్ ఏమాత్రం మారలేదు. కానీ అడిగేదెవరు?
నిర్బంధానికీ పుట్టకకూ, నిర్బంధానికీ నిరక్షరాస్యతకూ, నిర్బంధానికీ నిస్సహాయతకూ మధ్య అవినాభావ సంబంధం ఉన్నదని మన దేశంలో పదే పదే రుజువవుతోంది. జైలు శిక్షలు అనుభవిస్తు న్నవారు మాత్రమే కాదు, విచారణలో ఉన్న ఖైదీల్లో సైతం అత్యధికులు నిరుపేదలూ, నిరక్ష రాస్యులూ, అట్టడుగు కులాలవారూ, ఆదివాసీలూ ఉండటం యాదృచ్ఛికం కాదు. ఈ వర్గాలవారు దాదాపు 65 శాతం వరకూ ఉంటారు. ప్రపంచ దేశాల్లో ఈ వర్గాల సగటు 32 శాతానికి మించదని అనేక నివేదికలు చెబుతున్నాయి.
యూపీఏ ఏలుబడిలో చేయని నేరానికి అరెస్టయి తొమ్మిదేళ్లపాటు ఢిల్లీ, మహారాష్ట్ర జైళ్లలో మగ్గిన పౌరహక్కుల నాయకుడు ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఇటీవల నిర్దోషిగా విడుదలయ్యాక మీడియా సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించింది జైళ్లలోని కుల వివక్ష గురించే. జైళ్లలో కుల వ్యవస్థ అమలవుతోందనీ, ఖైదీలకు కులాన్నిబట్టి పనులు ఇవ్వాలని మాన్యువల్‌లో సైతం ఉన్నదనీ ఆయన చెప్పినప్పుడు అందరూ నివ్వెరపోయారు.
స్వాతంత్య్రం వచ్చి 77 యేళ్లవుతున్నా ఈ దురాచారాలు అమలవుతున్నాయంటే బయటి సమాజంలో ఉండేవారు నమ్మలేరు. ఇవే దురాచారాలు సాధారణ పౌరులు పాటిస్తే వాటి పర్యవ సానాలు తీవ్రంగా ఉంటాయి. కఠిన శిక్షలు పడతాయి. కానీ ఎంతో నాగరికంగా కనబడే రాజ్యమే కారాగారాల్లో ఈ దారుణాలు అమలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఉదాహరణకు దారి దోపిడీలు, ఇతరేతర నేరాలు చేస్తున్నవారు ఫలానా జాతులవారు గనుక వారిపై ‘నేరస్త జాతులు’ అనే ముద్రవేశారు వలసపాలకులు. రాజ్యాంగం అమల్లోకొచ్చాక అలాంటి దురాచారం రద్దయింది. కానీ ఇప్పటికీ జైళ్లలో సంచార, నేరస్త జాతులకు చెందినవారిగా కొందరిని వర్గీకరించి వారిని విడిగా ఉంచుతున్నారనీ, వారితో అమానవీయమైన పనులు చేయిస్తున్నారనీ సుప్రీంకోర్టు నిర్ధారించింది.
అలాగే జైలు రిజిస్టర్‌లో కులం గురించిన కాలమ్ ఉండటం, ఖైదీలను కులాలవారీగా విభజించటం, అట్టడుగు కులాలవారితో మరుగుదొడ్లు శుభ్రం చేయించటం, ఇతర పారిశుద్ధ్య పనులు అప్పగించటం యధేచ్ఛగా కొనసాగుతున్నదని ధర్మాసనం గుర్తించింది. పుట్టుక ఆధారంగా వివక్ష ప్రదర్శించరాదని రాజ్యాంగంలోని 15(1) అధికరణ చెబుతోంది. 17వ అధికరణ అంటరానితనం నేరమంటున్నది. వెట్టి చాకిరీ చేయించరాదని 23వ అధికరణ అంటున్నది. ఇంకా 14వ అధికరణ పౌరులందరినీ సమానంగా చూడాలని, 21వ అధికరణ జీవించే, స్వేచ్ఛగా మసలే హక్కు కల్పించాలని నిర్దేశిస్తోంది. ఇవన్నీ ప్రాథమిక హక్కులు. ఈ హక్కులను రాజ్యమే ఉల్లంఘించటం ఎంత అపచారం!
మహారాష్ట్ర మాన్యువల్ ‘నేరస్త మహిళలు, వ్యభిచార మహిళలు, తార్పుడుగత్తెలు, యువ మహిళా ఖైదీలు’ అంటూ విభజించిందట.‘సాధారణ జైలుశిక్ష పడిన ఖైదీలు కిందికులాల వారైతే తప్ప తక్కువ స్థాయి పనులు అప్పగించరాదని ఉత్తరప్రదేశ్ మాన్యువల్ చెప్తోంది. ఫలానా కులస్తు లను మాత్రమే పారిశుద్ధ్య పనికి వినియోగించాలనీ, కిందిస్థాయి కులాలవారు వండిన ఆహారాన్ని ఆధిపత్య కులాల ఖైదీలు నిరాకరించవచ్చనీ మరో మాన్యువల్ ప్రవచిస్తోంది.
వివక్ష వెనక కుల,మత విశ్వాసాలుంటే పట్టించుకోరాదని బెంగాల్ మాన్యువల్ సుద్దులు చెబుతోంది. ఇవన్నీ చూస్తే జైళ్లలో మనకు తెలియని, మన రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే మరో సమాంతర వ్యవస్థ అమల వుతున్నదని అర్థమవుతుంది. ఒక సమాజ నాగరికత స్థాయిని అక్కడి జైలుని చూసి చెప్పవచ్చని విఖ్యాత రచయిత దాస్తోవిస్కీ అన్నాడు. ఇన్ని దశాబ్దాలుగా మన మధ్యే కొనసాగుతూ వచ్చిన ఈ అధమస్థాయి వ్యవస్థ మూడు నెలల్లోపు కాదు, తక్షణం రద్దు కావాలని మానవీయతగల ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.
Comments
Please login to add a commentAdd a comment