ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా | Supreme Court Verdict On SC/ST Sub-Classification Today | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా

Published Thu, Aug 1 2024 10:20 AM | Last Updated on Thu, Aug 1 2024 12:11 PM

Supreme Court Verdict On SC/ST Sub-Classification Today

ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై చరిత్రాత్మకమైన తీర్పు

ఉపవర్గీకరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం

కోటాలో సబ్‌ కోటా తప్పు కాదు: సుప్రీం కోర్టు

ఉప వర్గీకరణ సాధ్యం కాదు: జస్టిస్‌ బేలా త్రివేది

6:1 మెజారిటీతో తీర్పు ఇచ్చిన సీజేఐ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం

రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేయొద్దని గతంలో ఇచ్చిన తీర్పు కొట్టివేత

వర్గీకరణకు అనుకూలమని ఇప్పటికే కోర్టుకు తెలిపిన కేంద్రం

తీర్పుపై సర్వత్రా హర్షాతిరేకాలు

ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది.   ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. 

తాజా చారిత్రక తీర్పులో.. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఒక్క జస్టిస్‌ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పును ఇచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6-1 తేడాతో తుది తీర్పు వెలువడింది. 

కేసు ఏంటంటే..
వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చింది. అయితే ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ’ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. 

అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది.  కోఆర్డినేట్‌ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని.. దీనిపై పునస్సమీక్షించాలని పేర్కొంటూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. 

ఫిబ్రవరిలో..
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిటిషన్‌ కూడా ఉంది. వీటిపై మూడురోజులపాటు వాదనలు జరగ్గా.. ఫిబ్రవరి 8వ తేదీన తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు బెంచ్‌ ప్రకటించింది. ఇప్పుడు.. ఐదు నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో ఇప్పుడు వెల్లడించింది.

కేంద్రం వాదనలు
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు వినిపించింది. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని, రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. వెనుకబడిన వర్గాలు/కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం (ప్రభుత్వం) లక్ష్యం అని, వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయని వాదనలు వినిపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement