sheduled tribes
-
పార్టీల ‘పహాడీ’ రాజకీయాలు
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చడంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారి ఓట్లే కీలకంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో ప్రబల శక్తిగా ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా స్థానిక రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ స్థానాలదే మున్ముందు కీలక పాత్రగా మారవచ్చని అంటున్నారు. జమ్మూ కశ్మీర్లో దశాబ్ద కాలం అనంతరం అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ ఒకటో తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేశాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. దాంతో ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ పదేళ్లలో స్థానిక రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయిందనే చెప్పాలి. కాంగ్రెస్ మాజీ దిగ్గజం గులాం నబీ ఆజాద్ డీపీఏపీతో పాటు పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ వంటి నయా రాజకీయ పక్షాలు పుట్టుకొచ్చాయి. 2022లో చేపట్టిన నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా అసెంబ్లీ స్థానాల సంఖ్య 87 నుంచి 90కి పెరిగింది. ఇదేమీ పెద్ద పెరుగుదలగా కనిపించకపోయినా, ముస్లిం మెజారిటీ కశ్మీర్‌తో పోలిస్తే హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో ఎక్కువ సీట్లు పెరిగేలా మోదీ సర్కారు జాగ్రత్త పడింది.మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 9 ఎస్సీలకు, 7 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దాంతో జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే గుజ్జర్లు, పహాడీ తదితర సామాజిక వర్గాల ప్రాధాన్యం మరింత పెరిగింది. గత ఫిబ్రవరిలో దాదాపు 16 లక్షల మంది పహాడీ జాతులను కొత్తగా ఎస్టీ జాబితాలో చేరుస్తూ మోదీ సర్కారు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి కోసం చేపట్టిన ఫక్తు రాజకీయ చర్య అని విపక్షాలు అప్పుడే విమర్శించాయి. ఎందుకంటే సంచార పశు పోషక జాతులైన గుజ్జర్లూ, బాకర్వాల్లు సాంప్రదాయికంగా కాంగ్రెస్ మద్దతుదారులు. వారిని తనకేసి తిప్పుకోవడం సులువు కాదన్నది బీజేపీ భావన. అందుకే ఉరీ, కర్నాహ్, బారాముల్లా వంటి ప్రాంతాల్లో సంఖ్యాధికులైన పహాడీల ఓట్లపై పార్టీ కొంతకాలంగా కన్నేసింది. వీరు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) వంటి స్థానిక పక్షాలను బలపరుస్తుంటారు. ఎస్టీ జాబితాలో చేరిన కారణంగా వాళ్లకిప్పుడు బుధాన్, సూరజ్ కోటే, రాజౌరీ వంటి ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కలిగింది. ఇది వారి ఓట్లను తమవైపు మళ్లిస్తుందని బీజేపీ ఆశ పడుతోంది. పహాడీలతో పాటు వాల్మీకి తెగవారిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. వాల్మీకులకు తాజాగా ఎస్టీ హోదా కల్పించారు. ప్రతి ఓటూ కీలకమే అయిన జమ్మూ కశ్మీర్లో ఏ అవకాశాన్నీ వదలరాదని బీజేపీ పట్టుదలగా ఉంది. 9 ఎస్టీ స్థానాల్లో ఐదు పీర్ పంజల్ బెల్ట్‌లోని రాజౌరీ – పూంచ్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవన్నీ తన ఖాతాలోనే పడతాయని అంచనా వేస్తోంది.గుర్రుగా గుజ్జర్లుపహాడీ, వాల్మీకి జాతులకు ఎస్టీ హోదా ఇవ్వడంతో గుజ్జర్లలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. 15.6 లక్షలకు పైగా ఉన్న వీరు ఇప్పటిదాకా జమ్మూ కశ్మీర్లో 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లకు పూర్తి హక్కుదారులు. వాటినిప్పుడు పçహాడీ, వాల్మీకులతో పంచుకోవాల్సి వస్తుండటంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగని ఈ వర్గాలు నమ్ముకున్న కాంగ్రెస్ కూడా 16 లక్షల జనాభా ఉన్న పçహాడీ, వాల్మీకులను కాదని వీరికి మద్దతుగా పూర్తిస్థాయిలో గళం విప్పే పరిస్థితుల్లో లేదు. మారిన రిజర్వేషన్ల అనంతరం జమ్మూకశ్మీర్ రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లం కానుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్
‘‘ఎస్సీ, ఎస్టీ వర్గాలు అంతర్గత వివక్ష కారణంగా అభివృద్ధి చెందలేకపోతున్నాయి. అందుకే ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసుకోవడానికి రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కూడా ఒక వర్గంలో ఉప వర్గాలను ఏర్పాటు చేసేందుకు అనుమతిస్తోంది. ఈ క్రమంలో 2004 నాటి ఈవీ చిన్నయ్య కేసులోని తీర్పును వ్యతిరేకిస్తున్నాం. అయితే ఉప వర్గీకరణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏదో ఒక సబ్ క్లాస్‌కు మొత్తం రిజర్వేషన్‌ను కేటాయించ కూడదు. అంతేగాకుండా ఏయే ఉప వర్గాలు రిజర్వేషన్ ఫలాలు అందుకోలేక పోతున్నాయన్న డేటా ఆధారంగా వర్గీకరణ జరగాలి’’ – సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. దీనితో విద్య, ఉద్యోగాలలో అమలవుతున్న ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను సబ్క్లాస్లుగా వర్గీకరించి.. ఆయా వర్గాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు మార్గం సుగమం కానుంది. 25 ఏళ్లుగా నానుతున్న వర్గీకరణ!దేశంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను ఆయా వర్గాల్లోని కొన్ని కులాల వారే పొందుతున్నారని.. అందువల్ల ఈ రిజర్వేషన్లను వర్గీకరించాలని చాలా కాలం నుంచి డిమాండ్లు ఉన్నాయి. దీనికి సంబంధించి 2000వ సంవత్సరంలో ఉమ్మడి ఏపీలో చేసిన రిజర్వేషన్ల చట్టం, దానిని కొట్టివేస్తూ 2004లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన రిజర్వేషన్ల చట్టాన్ని ఈ తీర్పు ఆధారంగా పంజాబ్–హరియాణా హైకోర్టు కొట్టివేయడం తదితర పరిణామాలతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది.తొలుత దీనిపై (పంజాబ్ వర్సెస్ దేవీందర్‌సింగ్ కేసు) విచారణ జరిపిన ఐదుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం.. పూర్తిస్థాయిలో పునర్విచారణ నిమిత్తం చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసింది. ఈ ధర్మాసనం ‘‘రాజ్యాంగం నిర్దేశించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయడం 14, 15, 16 ఆర్టికల్‌లకు భంగం కలిగిస్తుందా? షెడ్యూల్డ్ కులాలు/తెగలు సజాతీయమేనా (ఒకేవర్గం కింద పరిగణించవచ్చా?) లేక భిన్నమైన వర్గాల సమూహమా? ఆర్టికల్ 341కు ఇవి భిన్నమా? ఉప వర్గీకరణ పరిధిలో ఏమైనా పరిమితులు ఉన్నాయా?’’ అన్న అంశాలను లోతుగా పరిశీలించింది. ఈ కేసుకు సంబంధించి అన్ని వర్గాల వాదనలు విని.. ఈ ఏడాది ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేసింది. తాజాగా గురువారం తీర్పు వెలువరించింది.నెహ్రూ వ్యాఖ్యలను కోట్ చేస్తూ..‘‘మతపరంగా, కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కొనసాగితే భారతదేశం రెండో లేదా మూడో గ్రేడ్ దేశంగా మారుతుంది. ఈ మార్గం మూర్ఖత్వం మాత్రమే కాదు. విపత్తు కూడా. కానీ వెనుకబడిన వర్గాలకు అన్ని విధాలుగా సహాయం చేయాల్సి ఉంది..’’ అన్న మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వ్యాఖ్యలను ధర్మాసనం తమ తీర్పులో ఉటంకించింది.మన తొలితరాల వారు, న్యాయమూర్తులతోపాటు మాజీ ప్రధాని కూడా.. ఏ వర్గం లేదా కులానికి చెందినవారికి పూర్తిగా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని వ్యతిరేకించారని.. మెరిట్ ప్రాతిపదికన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకున్నారని పేర్కొంది. ఈ విధమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ వెనుకబడిన తరగతుల్లో కొంతమంది ముందుకుసాగడంలో ఇబ్బంది పడుతున్నారని.. వారికి చేయూతనివ్వడం ఎంతో అవసరమని తెలిపింది. ఈ నేపథ్యంలోనే రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు ధర్మాసనం అనుమతిస్తోందని వెల్లడించింది. ఈ మేరకు 565 పేజీల తీర్పు వెలువరించింది. ఈ తీర్పునకు అనుగుణంగా రాష్ట్రా లు తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవచ్చని సూచించింది.ఆరుగురు అనుకూలం.. ఒకరు వ్యతిరేకంఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశంపై ఏడుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ ఉన్నారు. వీరిలో జస్టిస్ బేలా త్రివేదీ వర్గీకరణను విభేదించగా.. మిగతా ఆరుగురు న్యాయమూర్తులు సమర్థించారు. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రా కలిపి ఒకే తీర్పు ఇవ్వగా, మిగతా జడ్జీలు వేర్వేరుగా తమ తీర్పులు ఇచ్చారు. దీనితో మొత్తం ఆరు తీర్పులు వెలువడ్డాయి. మెజారిటీ న్యాయమూర్తులు అనుకూలంగా ఉండటంతో.. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు ధర్మాసనం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు అయింది.కేంద్ర ఉద్యోగాలు, విద్యాసంస్థలకు ‘వర్గీకరణ’ వర్తించనట్లే!సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్రాల పరిధిలోని విద్యా సంస్థలు, ఉద్యోగాలు, పదోన్నతులకు మాత్రమే వర్తిస్తుందని న్యాయ నిపుణులు, ఎమ్మార్పీస్ నేతలు చెప్తున్నారు. సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వ, కేంద్ర సంస్థల్లోని ఉద్యోగాలు, విద్యా సంస్థలపై ప్రభావం చూపదని అంటున్నారు. రాష్ట్రాలు చేసిన చట్టాలపైనే సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. కోర్టు కూడా రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చనే దానిపైనే తాజా తీర్పు ఇచ్చిందని వివరిస్తున్నారు.ఇందులో జాతీయ స్థాయిలో, కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించిన అంశమేదీ లేదని స్పష్టం చేస్తున్నారు. అంతేగాకుండా రాష్ట్రాల వారీగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు, కులాలు, తెగలు విభిన్నంగా ఉంటాయని.. వాటిని కేంద్ర స్థాయిలో వర్గీకరించడం సాధ్యమయ్యే పనికాదని అభిప్రాయపడుతున్నారు. కాగా.. ఎస్సీల్లోని మాదిగ వర్గం కేంద్ర సంస్థల్లో రిజర్వేషన్ల వర్గీకరణ గురించి ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్ చేయలేదని, దేశవ్యాప్తంగా ఎలాంటి ఉద్యమం జరగలేదని తెలంగాణ రాష్ట్ర ఎమ్మార్పీస్ అధ్యక్షుడు నరేశ్ చెప్పారు. కేంద్ర ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో వర్గీకరణపై ఇప్పటివరకు తాము దృష్టి పెట్టలేదన్నారు.వెనుకబాటు ఆధారంగా ఉప వర్గీకరణ‘‘షెడ్యూల్డ్ కులాలు సజాతీయ తరగతి (ఒకే వర్గానికి చెందిన సమూహం) కాదని సూచించే చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద పొందుపరిచిన సమానత్వ సూత్రాన్ని గానీ.. ఆర్టికల్ 341(2)ను గానీ ఉల్లంఘించదు. ఆర్టికల్ 15, ఆర్టికల్ 16లలో కూడా రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేయకుండా రాష్ట్రాలను నిరోధించేది ఏమీ లేదు.ఉప వర్గీకరణ అయినా, మరేదైనా నిశ్చయాత్మక చర్య అయినా.. వాటి లక్ష్యం వెనుకబడిన తరగతులకు సమాన అవకాశాలు కల్పించడమే. కొన్ని కులాలకు తగిన ప్రాతినిధ్యం లేకపోవడం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఉప వర్గీకరణ చేయవచ్చు. అయితే ఏదైనా కులం/ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడానికి దాని వెనుకబాటుతనమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకోవాలి. ఆ కులం/ ఉప వర్గానికి ప్రాతినిధ్యం అందకపోవడంపై డేటాను సేకరించాలి. అందుకు అనుగుణంగా ఉప వర్గీకరణ చేయాలి..’’ – జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ మనోజ్ మిశ్రారిజర్వేషన్లు ఒక తరానికే పరిమితం చేయాలిఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణను సమర్థిస్తున్నాను. అయితే ఏ రిజర్వేషన్లు అయినా మొదటి తరానికి లేదా ఒక తరానికి మాత్రమే వర్తింపజేయాలి. కుటుంబంలోని ఏదైనా తరం రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థితిని సాధిస్తే.. రిజర్వేషన్ల ప్రయోజనం లాజికల్‌గా రెండో తరానికి అందుబాటులో ఉండరాదు. రిజర్వేషన్‌ను సద్వినియోగం చేసుకుని సాధారణ వర్గంతో కలసిన కుటుంబాలను.. తర్వాత రిజర్వేషన్లు పొందకుండా మినహాయించడానికి కాలానుగుణ కసరత్తు చేపట్టాలి. – జస్టిస్ పంకజ్ మిత్తల్క్రీమీలేయర్ వర్తింపజేయాలివెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం రాష్ట్రాల విధి. ఎస్సీ, ఎస్టీ కేటగిరీలో కొద్ది మంది మాత్రమే రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు. ఈ విషయంలో క్షేత్రస్థాయి వాస్తవాలను తిరస్కరించలేం. శతాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న కులాలు ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో ఉన్నాయి. అయితే ఉప వర్గీకరణ సమయంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల్లోని క్రీమీలేయర్ (అధికాదాయం ఉన్నవారిని) గుర్తించాలి. నిజమైన సమానత్వం సాధించాలంటే ఇదొక్కటే మార్గం.ఇందుకోసం రాష్ట్రాలు ఒక విధానాన్ని రూపొందించాలి. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల క్రీమీలేయర్ మినహాయింపు ప్రమాణాలు ఇతర వెనుకబడిన కేటగిరీలకు వర్తించే ప్రమాణాలకు భిన్నంగా ఉండవచ్చు. ఈవీ చిన్నయ్య వర్సెస్ ఏపీ ప్రభుత్వం కేసులో ప్రాథమిక లోపం ఏమిటంటే.. ఆర్టికల్ 341 రిజర్వేషన్లకు ప్రాతిపదిక అని అర్థం చేసుకొని ముందుకు వెళ్లడమే! ఆర్టికల్ 341 అనేది రిజర్వేషన్ల ప్రయోజనాల నిమిత్తం కులాల గుర్తింపు కోసం మాత్రమే. – జస్టిస్ బీఆర్ గవాయిఉప వర్గీకరణకు అనుకూలంషెడ్యూల్డ్ కులాల్లో ఉప వర్గీకరణకు అనుమతి వీలుకాదన్న ‘ఈవీ చిన్నయ్య’ కేసులోని తీర్పు సరికాదన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను. క్రీమీలేయర్ విధానాన్ని కూడా అమలు చేయడం మరింత సమానత్వానికి తోడ్పడుతుంది. – జస్టిస్ విక్రమ్నాథ్తగిన డేటా సేకరించి అమలు చేయాలిరిజర్వేషన్ల ఉప వర్గీకరణకు రాజ్యాంగ చెల్లుబాటు ఉందన్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ బీఆర్ గవాయిల అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నాను. రాష్ట్రాలు తగిన డాటా సేకరించి ఉప వర్గీకరణ అవసరాన్ని నిర్ధారించాలి. ఇందు లో క్రీమీలేయర్ గుర్తింపునకు కూడా ఆవశ్యకత ఉండాలి. – జస్టిస్ సతీశ్చంద్రరాష్ట్రాలకు ఉప వర్గీకరణ అర్హత లేదుఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ అర్హత రాష్ట్రాలకు లేదు. షెడ్యూల్డ్ కులాల పరిణామ చరిత్ర, నేపథ్యానికి తోడు రాజ్యాంగంలోని 341 కింద ప్రచురించిన రాష్ట్రపతి ఉత్తర్వులు కలసి షెడ్యూల్డ్ కులాలు ఒక సజాతీయ తరగతిగా మారాయి. దీని ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, జాతులు లేదా తెగలను విభజించడం /ఉప వర్గీకరణ చేయడం/ పునర్విభజన చేయడం తద్వారా నిర్దిష్ట కులం/కులాలకు రిజర్వేషన్లు కల్పించడానికి చట్టాన్ని రూపొందించే శాసన అధికారం రాష్ట్రాలకు లేదు.రిజర్వేషన్లు కల్పించే ముసుగులో, బలహీనవర్గాలకు మంచి చేస్తున్నామన్న నెపంతో రాష్ట్రాలు రాష్ట్రపతి జాబితాను మార్చకూడదు, ఆర్టికల్ 341తో విభేదించకూడదు. రాష్ట్ర ప్రభుత్వ చర్య సదుద్దేశంతో ఉన్నా, రాజ్యాంగంలోని నిర్దిష్ట నిబంధనలను ఉల్లంఘించినట్లయితే.. ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని ఉపయోగించి ధ్రువీకరించడం కుదరదు. సదుద్దేశ చర్య, చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ రెండూ సమసమాజం లక్ష్యంగా ఉన్నా.. న్యాయబద్ధత, రాజ్యాంగ బద్ధతను పాటించాలి. – జస్టిస్ బేలా ఎం త్రివేది -
30 ఏళ్ల మా పోరాటం.. ధర్మమే గెలిచింది: మందకృష్ణ
న్యూఢిల్లీ, సాక్షి: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై మందకృష్ణ మాదిగ స్పందించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని నిరూపితమైంది. ఈ పోరాటంలో చాలా మంది అసువులబాశారు. సుప్రీం కోర్టులో న్యాయం గెలిచింది. ఈ విజయం కోసం 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. ఎన్ని కష్టాలు ఎదురైనా అంకిభావంతో జాతి పోరాడింది. వర్గీకరణ పోరాటాన్ని నీరుగార్చుందుకు యత్నించారు. ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు. ఈ తీర్పుతో తెలంగాణలో 11శాతం, ఆంధ్రప్రదేశ్‌లో ఏడు శాతం మాదిగలకు రిజర్వేషన్ దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ వెంటనే చేయాలి. ... విద్యాసంస్థల్లో కూడా వర్గీకరణకు అనుకూలంగా రిజర్వేషన్ చేయాలి. ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయి. కొంతమంది వెన్నుపోటు పొడిచారు. సమాజం యావత్తు మాదిగల వైపు నిలబడింది. ఎన్నో రాజకీయ పార్టీలు, వ్యక్తులు మా వైపు నిలబడ్డారు. న్యాయాన్ని, ధర్మాన్ని బతికించడం కోసం మా వైపు నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు. సమాజంలో పెద్దలు, మీడియాకు కృతజ్ఞతలు. అణగారిన వర్గాల వైపు, పేద వర్గాల వైపు న్యాయం నిలబడింది. ప్రధాన న్యాయమూర్తుల తో పాటు, ఇతర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు. మాకు అండగా నిలబడ్డ ప్రధాని మోదీ, అమిత్ షా, భుజాన వేసుకుని మా వైపు ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు కృతజ్ఞతలు. సుప్రీంకోర్టు తాజా తీర్పును తెలుగు రాష్ట్రాల్లో విద్యా, ఉద్యోగ నియామకాల్లో అమలు చెయ్యాలి. ప్రభుత్వాల దగ్గర ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉద్యోగ నియామకాల్లో కూడా అమలు చెయ్యాలి’’ అని అన్నారు.వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అసెంబ్లీలో స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిఎస్సీ వర్గీకరణకు మాదిగ, మాల ఉప కులాలకు వర్గీకరణకు వాయిదా తీర్మానం ఇస్తే గత ప్రభుత్వం సంపత్ కుమార్‌ను సస్పెండ్ చేసింది.2023 డిసెంబర్ 23న ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, దామోదర రాజనర్సింహ అడ్వకెట్ జనరల్‌ను సుప్రీంకోర్టుకు పంపించారు.వర్గీకరణపై సుప్రీంకోర్టులో న్యాయ నిపుణులతో వాదనలు వినిపించారు.తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రయత్నం ఫలించింది.వర్గీకరణపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుతున్నా.సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది.ఇప్పుడు అమలులో ఉన్న ఉద్యోగ నోటిఫికేషన్లో కూడా మాదిగ, మాల ఉప కులాలకు రెజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతుంది.ఇందుకోసం అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తాం. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: కేటీఆర్మొదటి నుంచి ఈ అంశంపై బీఆర్ఎస్ చిత్తశుద్ధితో కృషి చేసింది.ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అసెంబ్లీలో తీర్మానం చేశాం.మా పార్టీ అధినేత కేసీఆర్ గారు సీఎం హోదా వర్గీకరణకు మద్దతుగా ప్రధాని లేఖ ఇచ్చారు ఎస్సీ వర్గీకరణ పై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పును స్వాగతిస్తున్నాం: హరీష్ రావు మాజీ మంత్రిగొప్ప తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా.ఎస్సీ వర్గీకరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని తెలంగాణ ఉద్యమం నుంచే బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది.ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఆనాడే ఎస్సీ వర్గీకరణ కోసం డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం అందరికి విదితమే.ఎస్సీ వర్గీకరణ చేయాలని 16మే, 2016 నాడు ప్రధాని మోదీని స్వయంగా కలిసి లేఖ ఇచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చిందికాబట్టి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆ దిశగా చర్యలు తీసుకోవాలని, తద్వారా విద్య, ఉద్యోగ అవకాశాల్లో యువతకు అవకాశం కల్పించాలని కోరుతున్నాను.ఎస్సీ వర్గీకరణ తీర్పు చారిత్రాత్మకం: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దళితుల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకునే పార్టీలకు ఈ తీర్పు చెంపపెట్టుప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలుఅట్టడుగునున్న వర్గాలకు కూడా ప్రభుత్వ ఫలాలు అందాలన్నదే బీజేపీ అంత్యోదయ సిద్ధాంతం1997లోనే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా బీజేపీ తీర్మానంహైదరాబాద్ ఎన్నికల సభలోనూ ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రధాని ఉద్ఘాటనఎన్నికల అనంతరం ఎస్సీ వర్గీకరణపై కేంద్ర కేబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీని నియమించాంఆ కమిటీ నివేదిక ఆధారంగానే సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలుసుప్రీం తీర్పుతో కోట్లాది మంది దళితుల చిరకాల స్వప్నం నెరవేరబోతోందిమంద కృష్ణ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ కోసం కొనసాగిన 3 దశాబ్దాల పోరాటాలు ఫలించాయిఎస్సీ వర్గీకరణతో ఎవరికైనా నష్టం జరుగుతుందని భావిస్తే వారికి కేంద్రం న్యాయం చేసేందుకు సిద్ధంకోర్టు తీర్పుపై అపార్ధాలకు తావివ్వకుండా దళితులంతా కలిసి మెలిసి ఉండాలని వేడుకుంటున్నారాజకీయ లబ్ది కోసం తీర్పును చిలువలు చేసి సమాజాన్ని చీల్చే కుట్రలు చేయొద్దని కోరుతున్నా30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది: మంత్రి దామోదర రాజనర్సింహఎస్సి, వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ‘అణగారిన వర్గాలకు న్యాయం జరిగింది. ఇవాళ న్యాయం, ధర్మం గెలిచింది. మా ప్రభుత్వం ఎస్సిల అభ్యున్నతికి కట్టుబడి ఉంది. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం గెలిచింది. ఇన్ని ఏళ్ల ఉద్యమ కాలంలో ఎంతోమంది అమరులు అయ్యారు’అన్నారు.అసెంబ్లీ లాబీలో మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి వేముల వీరేశం, కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామేలు.కడియం శ్రీహరి కామెంట్లు..అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాలు అందరికి అందాలనే మా కల సాకారం అయింది.సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాము.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర రాజనర్సింహను ఢిల్లీకి పంపి అక్కడ అడ్వకేట్‌ను పెట్టారు.అనుకూలమైన తీర్పు రావడానికి మా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర పాత్ర ఉంది.ప్రతి ఒక్క దళిత సోదరీ సోదరీమణులకు శుభాకాంక్షలు. -
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా
ఢిల్లీ: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణల్లో వర్గీకరణకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊపింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం చారిత్రక తీర్పు ఇచ్చింది. విద్యాసంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ క్రమంలో గతంలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టేసింది. తాజా చారిత్రక తీర్పులో.. ఏడుగురు న్యాయమూర్తుల్లో ఒక్క జస్టిస్ బేలా త్రివేది మాత్రం విరుద్ధమైన తీర్పును ఇచ్చారు. ఉపవర్గీకరణ సాధ్యం కాదని బేలా త్రివేది తన తీర్పులో పేర్కొన్నారు. దీంతో 6-1 తేడాతో తుది తీర్పు వెలువడింది. కేసు ఏంటంటే..వాల్మీకీలు, మఝాబీ సిక్కులకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ పంజాబ్ ప్రభుత్వం తెచ్చిన నిబంధనను కొట్టివేస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు 2010లో ఇచ్చింది. అయితే ఈ తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎస్సీ కేటగిరీలో వర్గీకరణలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కు విరుద్ధమని 2004లో ’ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్’ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు మేరకు పంజాబ్ సర్కారు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. అయితే.. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2011లో పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. 2020లో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల ధర్మాసనం ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీం ఇచ్చిన తీర్పును తప్పుబట్టింది. కోఆర్డినేట్ ధర్మాసనం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించవలసిన అవసరం ఉందని.. దీనిపై పునస్సమీక్షించాలని పేర్కొంటూ ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి కేసును బదిలీ చేసింది. ఫిబ్రవరిలో..ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా? లేదా? అనే అంశంపై దాఖలైన 23 పిటిషన్లను ఈ ఏడాది ఫిబ్రవరిలో సీజేఐ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. ఇందులో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ వేసిన పిటిషన్ కూడా ఉంది. వీటిపై మూడురోజులపాటు వాదనలు జరగ్గా.. ఫిబ్రవరి 8వ తేదీన తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు బెంచ్ ప్రకటించింది. ఇప్పుడు.. ఐదు నెలల తర్వాత ఆ తీర్పు ఏంటో ఇప్పుడు వెల్లడించింది.కేంద్రం వాదనలుఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గీకరణ ద్వారానే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని, తద్వారా సరైన పథకాలు రూపొందించేందుకు ప్రభుత్వాలకు వీలు కలుగుతుందని వాదనల సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. వర్గీకరణ ద్వారా అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న లక్ష్యం నెరవేరుతుందని ఈ ఏడాది ఫిబ్రవరిలో వాదనలు వినిపించింది. రిజర్వేషన్ల అసలైన లక్ష్యం చేరుకోవాలంటే కోటాను హేతుబద్ధీకరించడం చాలా ముఖ్యమని, రిజర్వేషన్ ప్రయోజనాలను విస్తరించాల్సిన అవసరం ఉందని, అప్పుడే వెనుకబడిన వర్గాల్లో అట్టడుగున ఉన్న వారికి లబ్ధి చేకూరుతుందని తెలిపింది. వెనుకబడిన వర్గాలు/కులాలకు సమానత్వం, సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగం, రాజ్యం (ప్రభుత్వం) లక్ష్యం అని, వర్గీకరణ చేపట్టడం ద్వారా అవసరం ఉన్నవారికి ఈ ప్రయోజనాలు అందుతాయని వాదనలు వినిపించింది. -
వర్గీకరణకు జాతీయ విధానం అవసరం
సుప్రీంకోర్టు 27 ఆగస్టు 2020న సంచలన తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల వర్గీకరణను సమర్థిస్తూ సమస్య పరిష్కారానికి ఏడుగురు జడ్జీల ధర్మాసనానికి బదిలీ చేయాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ రవీందర్ సింగ్ కేసులో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను సమర్థించింది. ఈ తీర్పులో మూడు అంశాలపై స్పష్టత నిచ్చింది. (1) పంజాబ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతుల చట్టం 2006, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చెల్లుతుందా, లేదా? (2) రాష్ట్ర ప్రభుత్వాలకు షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించి చేసే రిజర్వేషన్ల అమలుపై అధికారం ఉందా, లేదా? (3) ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు 2004లో ఇచ్చిన ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు తీర్పును పునఃసమీక్షించాలా, లేదా? సుప్రీంకోర్టు ప్రధానంగా భారతదేశం ఫెడరల్ స్ఫూర్తి కల్గిన దేశం అని పేర్కొంటూ ఆర్టికల్ 15(4), 16(4) ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు విద్యా, ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యం లేనట్లయితే రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వానికి ఎంత అధికారం ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అవే సర్వాధికారాలు ఉన్నాయని తెలుపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలిపింది. కానీ ఏదైనా కులాన్ని/తెగను ఎస్సీ/ఎస్టీ జాబితాలో చేర్చడం లేదా తొలగించే అధికారం మాత్రం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్డు కులాల జాబితాను, ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డు తెగల జాబితాను, ఆర్టికల్ 342ఎ ప్రకారం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితాలను పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం 2006 రిజర్వేషన్ చట్టం ద్వారా ఎస్సీలను వర్గీకరించి విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్ల అమలుకు ముందడుగు వేసింది. కానీ సదరు చట్టాన్ని పంజాబ్ – హర్యానా హైకోర్టు బెంచ్ కొట్టివేస్తూ దానికి కారణంగా ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ ఎస్సీ, ఎస్టీల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదని తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం 2000 సంవత్సరంలో షెడ్యూల్డు కులాలను నాలుగు గ్రూపులుగా ప్రత్యేక చట్టం ద్వారా వర్గీకరించి 15 శాతం రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టింది. సదరు చట్టాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మల్లెల వెంకట్రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 4:1 మెజారిటీ తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టానికి ఆమోదం తెలిపింది. వెంటనే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అందుకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 2004లో ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో తీర్పునిస్తూ ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని కొట్టివేస్తూ ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా తేల్చిచెప్పింది. సామాజిక రిజర్వేషన్లకు సంబంధించి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు తీర్పులో సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 6:3 మెజారిటీ తీర్పులో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ ఓబీసీల వర్గీకరణకు కూడా ఆమోదం తెలిపింది. కానీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వేరుగా చూడాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నేటి వరకు 1,206 కులాలను ఎస్సీలుగా, 701 తెగలను ఎస్టీలుగా, 2,643 కులాలను ఓబీసీలుగా గుర్తించి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఇందులో ఓబీసీ జాబితాలలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కొద్దిపాటి తేడాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణ కోసం 2017లో జస్టిస్ రోహిణి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక సమర్పణ కాలాన్ని జనవరి 2021 వరకు పొడిగించింది. అనేక రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ విద్యా ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నప్పటికీ, అమలు చేస్తున్న రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగిం చాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఏ కులాలు/ తెగలు విద్యలో ముందుంటాయో లభిస్తున్న కాస్త రిజర్వేషన్లు వారే అనుభవించడం సహజం. కాబట్టి వర్గీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలుపరిచి ఆయా కులాలకు/తెగలకు న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. లేనట్లయితే ఆయా కులాల/తెగల మధ్య వైరుధ్యాలు పెరిగి సమైక్యతకు భంగం వాటిల్లుతుంది. కోడెపాక కుమార స్వామి -వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 94909 59625 -
గిరిజనులకు మాత్రమే హక్కుంది..
ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనులకు మాత్రమే భూములపై హక్కు ఉందని, వారి దగ్గరి నుంచి ఎవరైనా గిరిజనేతరులు భూములు అక్రమంగా ఆక్రమించుకుంటే నేరమని ఐటీడీఏ పీఓ వీపీ.గౌతమ్ పేర్కొన్నారు. నగరంలోని టీటీడీసీ సమావేశ మందిరంలో ఎల్టీఆర్(ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్) కేసు భూములకు సంబంధించి తహసీల్దార్లతో మండలాలవారీగా బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ మాట్లాడుతూ గిరిజనుల నుంచి ఆక్రమించుకున్న భూములను గుర్తించి, ఎల్టీఆర్ ద్వారా పరిష్కారమైన భూములను వారికి అప్పగించాలన్నారు. గిరిజనులకు భూములను అప్పగించే సమయంలో గిరిజనేతరులు వినకుంటే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. కోర్టు ఆదేశాలు ఉన్న గిరిజనులకు వెంటనే పంచనామా చేసి.. ఆ భూములను అందేలా చూడాలన్నారు. మండలాల్లో ఎక్కడైనా ప్రభుత్వ భూములు ఉంటే గుర్తించి.. పంచనామా చేసి ప్రతిపాదనలు పంపించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అనురాగ్ జయంతి, ట్రెయినీ కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఇన్చార్జ్ డీటీడీఓ అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇంనీరింగ్ అధికారులపై ఆగ్రహం.. కాగా.. అధికారులతో సమీక్ష సమావేశం అనంతరం ఖమ్మం నగరంలోని నయాబజార్ కళాశాల ఎదుట నిర్మిస్తున్న మహిళా వసతి గృహాన్ని పీఓ పరిశీలించారు. వసతి గృహ నిర్మాణం ఆలస్యంపై ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భవన నిర్మాణం ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం పూర్తికాకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. నిర్లక్ష్యం చేస్తున్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రెండు నెలల్లో భవన నిర్మాణం పూర్తి కావాలని, 15 రోజులకు ఒక ఫ్లోర్ నిర్మాణం జరగాలని ఆదేశించారు. భవన నిర్మాణంలో ఎలాంటి అలసత్వం వహించినా సంబంధీకులపై చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో డీఈ మురళి, ఏఈ ప్రసాద్ పాల్గొన్నారు. -
అజిత్ జోగి ఎస్టీ కాదు: తేల్చిచెప్పిన కమిటీ
రాయ్‌పూర్: చత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, జనతా కాంగ్రెస్ అధ్యక్షుడు అజిత్ జోగి ఎస్టీ కాదంటూ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ తేల్చి చెప్పింది. అజిత్ జోగి వద్దనున్న కుల ధ్రువీకరణ పత్రాలు, ఎస్టీ హోదాతో లభించిన ప్రయోజనాలను వెనక్కి తీసుకొని ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బిలాస్పూర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. కేసు పూర్వాపరాలు : 2001లో బీజేపీ సీనియర్ నాయకుడు, జాతీయ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ నందకుమార్ సాయి, సంత్ కుమార్ నేతంలు కలిసి అజిత్ జోగి ఎస్టీ కాదంటూ హైకోర్టులో కేసు వేశారు. కానీ ఒక వ్యక్తి కులాన్ని ధృవీకరించడానికి జాతీయ కమిషన్‌కు ఎలాంటి హక్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. తీర్పును సంత్‌కుమార్ సుప్రీం కోర్టులో సవాల్ చేశారు. దీంతో సుప్రీం కోర్టు, ఒక హైపవర్ కమిటీ వేసి విచారించాలని చత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని 2011లో ఆదేశించింది. ప్రభుత్వం నియమించిన కమిటీ 2017లో అజిత్ జోగి ఎస్టీ కాదంటూ నివేదిక ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ అజిత్‌జోగి 2018లో హైకోర్టుకు వెళ్లగా, కోర్టు కమిటీ సభ్యులను మార్చింది. కొత్తగా ఏర్పాటైన కమిటీ కూడా మునుపటి నివేదికనే ఇవ్వడంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అజిత్‌జోగి ప్రస్తుతం రిజర్వుడ్ అసెంబ్లీ స్థానం మార్వాహి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ వ్యవహారంపై అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగి స్పందిస్తూ.. ఇదంతా రాజకీయ కుట్రలో భాగంగానే జరుగుతుందన్నారు. కమిటీ ఎలాంటి ప్రాథమిక న్యాయ సూత్రాలను పాటించకుండా ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకు ఆయన కోరుకున్న విధంగానే నివేదిక ఇచ్చిందని ఆరోపించారు. నా తండ్రి కలెక్టర్‌గా సెలెక్ట్ అయినపుడు రాని సమస్య ఇప్పుడు ఎలా వచ్చిందని మండిపడ్డారు. ఈ విషయంపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. -
'వాల్మీకులను ఎస్టీల్లో చేర్చాలి'
బి.కొత్తకోట (చిత్తూరు): వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చకుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని వాల్మీకి సేవాదళం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనారాయణ హెచ్చరించారు. చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఆదివారం జరిగిన వాల్మీకుల సదస్సులో పాల్గొన్న ఆయన ముందుగా.. ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తామని.. సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని బలంగా వినిపించాలని.. లేకపోతే అధికార పార్టీ ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. -
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం!
-
వాల్మీకులను ఎస్టీల్లో చేరుస్తాం!
• మా ప్రభుత్వం వచ్చిన వెంటనే తీర్మానం చేస్తాం • ఏపీలో ఐదోరోజు రైతు భరోసా యాత్రలో వైఎస్ జగన్ అనంతపురం: ‘‘కర్ణాటకలో వాల్మీకులు(బోయ)లు ఎస్టీలు. ఇక్కడ బీసీలుగా చూస్తున్నారు. పిల్లలకు మంచి చదువులు, ఉద్యోగాలు రావాలంటే ఎస్టీ జాబితాలో చేర్చాలని వాల్మీకులు అడుగుతున్నారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయగానే వాల్మీకులను ఎస్టీల్లో చేర్చేలా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతాం’’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధినేత వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఏపీలోని అనంతపురం జిల్లాలో మూడో విడత రైతు భరోసాయాత్రలో ఐదోరోజు శనివారం జగన్ పెనుకొండ, మడకశిర నియోజకవర్గాల్లో పర్యటించారు. మడకశిరలో వాల్మీకి విగ్రహానికి పూలమాల వేసి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. హంద్రీ-నీవా ప్రాజెక్టు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉందని అందరికీ తెలుసు. ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ రోజు ప్రాజెక్టు 85 శాతం పూర్తయిందంటే అది దివంగత సీఎం వైఎస్సార్ చలువే! చంద్రబాబు మాత్రం ‘అనంత’కు వచ్చినప్పుడల్లా తానే నీళ్లు ఇచ్చానని చెప్పుకుంటున్నారు. ఆయన సీఎం అయి ఏడాది దాటింది. కేవలం రూ.200 కోట్ల నిధులు కేటాయించారు. ఇవి కరెంటు బకాయిలకు కూడా సరిపోవు. వైఎస్ చిత్తశుద్ధితో ప్రాజెక్టును నిర్మించారు కాబట్టే 85% పూర్తయింది. ఈరోజు చంద్రబాబు కుళాయి తిప్పి నీళ్లు వదులుతున్నారు. ప్రాజెక్టు తక్కిన పనులు బాబు పూర్తి చేయలేరు. అధికారంలోకి రాగానే దాన్ని కూడా పూర్తి చేసి ‘అనంత’లోని ప్రతీ ఎకరాకు సాగునీరు ఇస్తాం. బాబుది మోసపూరిత పాలన: బాబు గురించి నాలుగు మాటల్లో చెప్పొచ్చు... రుణమాఫీ చేస్తానని రైతుల్ని, డ్వాక్రా మహిళల్ని మోసం చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని నిరుద్యోగులను... ఉద్యోగం ఇవ్వలేకపోతే నెలకు రూ.2వేల భృతి ఇస్తామని నిరుద్యోగులనూ మోసం చేశారు. గుడిసెలు లేకుండా పక్కా ఇళ్లను నిర్మిస్తామని ప్రజల్ని మోసం చేశారు. రేషన్‌కార్డులు ఇచ్చేవారు లేరు. ఉన్నవి కూడా తీసేస్తున్నారు. రాష్ట్ర ప్రజల్ని చంద్రబాబు మోసం చేశారు. ఈ మోసాన్ని వదిలేది లేదు. అందరం ఒక్కటి కావాలి. ప్రభుత్వంపై పోరాడాలి. రాహుల్ గురించి మాట్లాడాల్సిన పని లేదు రాహుల్ ఎప్పుడు ఇండియాలో ఉంటారో, ఎప్పుడు విదేశాల్లో ఉం టారో తెలీదు. ఏపీలో ఎప్పుడు, ఎక్కడ, ఏం జరిగినా తక్షణం స్పందించేది వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే! ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. రాహుల్‌గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. లక్ష్మన్నది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు? రొద్దం మండలం పి.కొత్తపల్లికి చెందిన లక్ష్మన్న ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటిదాకా ఎవ్వరూ ఈ కుటుంబ స్థితిగతులు తెలుసుకోలేదు. దమ్మిడీ సాయం చేయలేదు. లక్ష్మన్నకు బ్యాంకులో రూ.1,90 లక్షలు అప్పుంది. తీసుకున్న అప్పుకు రూ.20 వేలు వడ్డీ అయింది. రూ.19 వేలు మాఫీ అయింది. వడ్డీకి కూడా సరిపోని విధంగా బాబు రుణమాఫీ అమలు చేశారు. వడ్డీలేని రుణాలు తీసుకునే రైతులు 14 శాతం అపరాధవడ్డీ చెల్లిస్తున్నారు. తాకట్టుపెట్టిన బంగారం బ్యాంకుల్లోనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉసురు తీసుకున్న లక్ష్మన్నది ఎందుకు రైతు ఆత్మహత్య కాదు. రూ.5 లక్షల పరిహారం ఎందుకు ఇవ్వరు? పబ్లిసిటీ వచ్చే చోట మాత్రమే పరిహారం ఇస్తారా? ‘అనంత’ రైతులు బతకలేక బెంగళూరుకు వలసెళ్లుతున్నారు. అప్పుల బాధ భరించలేక ఆత్మహత్యలకు తెగిస్తున్నారు. అయినా చంద్రబాబు మాత్రం రైతులు సుఖసంతోషాలతో ఉన్నారని అంటున్నారు. -
వడ్డెరలను ఎస్టీల్లో చేర్చాలి
- ఓట్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వెంకటేశ్ మౌర్య డిమాండ్ సాక్షి, హైదరాబాద్: బాలకృష్ణ రణకే కమిషన్ నివేదికను వెంటనే అమలు చేయాలని.. వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చాలని ఓట్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు వెంకటేశ్ మౌర్య డిమాండ్ చేశారు. ఆదివారం రవీంద్రభారతిలో తెలంగాణ వడ్డెర్ల మహాసభను నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మౌర్య మాట్లాడుతూ 2005లో కేంద్రం బాలకృష్ణ రణకే కమిషన్ నియమించి వడ్డెరల జీవనస్థితులు అధ్యయనం చేసి కమిటీ 2008లో తన నివేదికను సమర్పిస్తూ.. వడ్డెరలతో సహా విముక్త సంచార జాతులను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేసిందని తెలిపారు. వడ్డెర్లను ఎస్టీల్లో చేర్చేందుకు కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. మిషన్ కాకతీయలో వడ్డెర్లకు 33 శాతం పనులు కేటాయించాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. వడ్డెరల బతుకుల గురించి ఆలోచించే పాలకులు కరువయ్యారని ఓసీసీఐ చైర్మన్ శంకర్‌లాల్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లోని పాలకులు వడ్డెరల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని ఓసీసీఐ జనరల్ సెక్రటరీ లాల్‌చంద్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎల్పీ నేత కె.లక్ష్మణ్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, విమలక్క కార్యక్రమంలో పాల్గొని వడ్డెర్లకు మద్దతు ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర వడ్డెర్ల మహాసభ జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేశ్, జాతీయ గౌరవాధ్యక్షుడు రూపాని లోకనాథం, జాతీయ ప్రధాన కార్యదర్శి కుంచాల ఏడుకొండలు, రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు మొగిలి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి మారయ్య, ఓసీసీఐ నేత మనోహర్ ముగోల్కర్ తదితరులు పాల్గొన్నారు.