సుప్రీంకోర్టు 27 ఆగస్టు 2020న సంచలన తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల వర్గీకరణను సమర్థిస్తూ సమస్య పరిష్కారానికి ఏడుగురు జడ్జీల ధర్మాసనానికి బదిలీ చేయాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ రవీందర్ సింగ్ కేసులో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను సమర్థించింది. ఈ తీర్పులో మూడు అంశాలపై స్పష్టత నిచ్చింది. (1) పంజాబ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతుల చట్టం 2006, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చెల్లుతుందా, లేదా? (2) రాష్ట్ర ప్రభుత్వాలకు షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించి చేసే రిజర్వేషన్ల అమలుపై అధికారం ఉందా, లేదా? (3) ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు 2004లో ఇచ్చిన ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు తీర్పును పునఃసమీక్షించాలా, లేదా?
సుప్రీంకోర్టు ప్రధానంగా భారతదేశం ఫెడరల్ స్ఫూర్తి కల్గిన దేశం అని పేర్కొంటూ ఆర్టికల్ 15(4), 16(4) ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు విద్యా, ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యం లేనట్లయితే రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వానికి ఎంత అధికారం ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అవే సర్వాధికారాలు ఉన్నాయని తెలుపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలిపింది. కానీ ఏదైనా కులాన్ని/తెగను ఎస్సీ/ఎస్టీ జాబితాలో చేర్చడం లేదా తొలగించే అధికారం మాత్రం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్డు కులాల జాబితాను, ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డు తెగల జాబితాను, ఆర్టికల్ 342ఎ ప్రకారం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితాలను పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం 2006 రిజర్వేషన్ చట్టం ద్వారా ఎస్సీలను వర్గీకరించి విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్ల అమలుకు ముందడుగు వేసింది. కానీ సదరు చట్టాన్ని పంజాబ్ – హర్యానా హైకోర్టు బెంచ్ కొట్టివేస్తూ దానికి కారణంగా ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ ఎస్సీ, ఎస్టీల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదని తెలిపింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం 2000 సంవత్సరంలో షెడ్యూల్డు కులాలను నాలుగు గ్రూపులుగా ప్రత్యేక చట్టం ద్వారా వర్గీకరించి 15 శాతం రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టింది. సదరు చట్టాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మల్లెల వెంకట్రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 4:1 మెజారిటీ తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టానికి ఆమోదం తెలిపింది. వెంటనే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అందుకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 2004లో ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో తీర్పునిస్తూ ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని కొట్టివేస్తూ ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా తేల్చిచెప్పింది. సామాజిక రిజర్వేషన్లకు సంబంధించి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు తీర్పులో సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 6:3 మెజారిటీ తీర్పులో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ ఓబీసీల వర్గీకరణకు కూడా ఆమోదం తెలిపింది. కానీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వేరుగా చూడాలని తెలిపింది.
కేంద్ర ప్రభుత్వం నేటి వరకు 1,206 కులాలను ఎస్సీలుగా, 701 తెగలను ఎస్టీలుగా, 2,643 కులాలను ఓబీసీలుగా గుర్తించి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఇందులో ఓబీసీ జాబితాలలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కొద్దిపాటి తేడాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణ కోసం 2017లో జస్టిస్ రోహిణి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక సమర్పణ కాలాన్ని జనవరి 2021 వరకు పొడిగించింది. అనేక రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ విద్యా ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నప్పటికీ, అమలు చేస్తున్న రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగిం చాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఏ కులాలు/ తెగలు విద్యలో ముందుంటాయో లభిస్తున్న కాస్త రిజర్వేషన్లు వారే అనుభవించడం సహజం. కాబట్టి వర్గీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలుపరిచి ఆయా కులాలకు/తెగలకు న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. లేనట్లయితే ఆయా కులాల/తెగల మధ్య వైరుధ్యాలు పెరిగి సమైక్యతకు భంగం వాటిల్లుతుంది.
కోడెపాక కుమార స్వామి
-వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 94909 59625
Comments
Please login to add a commentAdd a comment