shedule community
-
రాజ్యాంగాన్ని మోసగించడమే
న్యూఢిల్లీ: కేవలం రిజర్వేషన్ ఫలాలు దోచేయాలనే దుర్భుద్దితో మతం మారిన విషయాన్ని దాచిపెట్టిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని మోసగించడంతో సమానమని అభివర్ణించింది. క్రైస్తవమతంలోకి మారిన తర్వాత కూడా ఒక మహిళ షెడ్యూల్ కులం సర్టిఫికేట్ కోసం తాను ఇంకా హిందువునేనని వాదించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. హిందువు అయిన సి.సెల్వరాణి క్రైస్తవమతం పుచ్చుకుంది. అయితే రిజర్వేషన్ లబ్ది పొందేందుకు, ఉద్యోగి సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు తాను ఇంకా హిందువునేనని నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే ఆమె నిజంగా క్రైస్తవ మతంలోకి మారిందని, తరచూ చర్చికి వెళ్తూ, క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ, పూర్తి విశ్వాసంతో క్రైస్తవమతాన్ని ఆచరిస్తోందని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో రిజర్వేషన్ కోసం ఆ మహిళ తన మతాన్ని దాచిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘బాప్టిజం పూర్తయ్యాక ఇంకా తాను హిందువును అని మహిళ చెప్పుకోవడంలో అర్థంలేదు. మతం మారాక కూడా రిజర్వేషన్ ప్రయోజనాలే పరమావధిగా ఇలా వ్యవహరించడం రిజర్వేషన్ లక్ష్యాలకే విఘాతం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న రిజర్వేషన్ల విధానం ఇలాంటి వారితో ప్రమాదంలో పడుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. సెల్వరాణి తండ్రి హిందువుకాగా తల్లి క్రైస్తవురాలు. అయితే సెల్వరాణి చిన్నతనంలోనే బాప్టిజం తర్వాత క్రైస్తవురాలిగా మారారు. అయితే 2015లో పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం పొందేందుకు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించారు. సెల్వరాణి తండ్రి వల్లువాన్ కులానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఈ కులం వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ సెల్వరాణి తండ్రి సైతం దశాబ్దాలక్రితమే క్రైస్తవమతం స్వీకరించారు. దీంతో తల్లిదండ్రులు క్రైస్తవులుకాగా తాను మాత్రం హిందువును అని ఈమె చేసిన వాదనల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది. -
పార్టీల ‘పహాడీ’ రాజకీయాలు
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తేల్చడంలో ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారి ఓట్లే కీలకంగా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్లో ప్రబల శక్తిగా ఎదిగేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాల ఫలితంగా స్థానిక రాజకీయాల్లో ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ స్థానాలదే మున్ముందు కీలక పాత్రగా మారవచ్చని అంటున్నారు. జమ్మూ కశ్మీర్లో దశాబ్ద కాలం అనంతరం అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ ఒకటో తేదీల్లో మూడు విడతల్లో పోలింగ్ జరగనుంది. జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను, ఆ ప్రాంతానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేశాక జరుగుతున్న తొలి ఎన్నికలివి. దాంతో ఫలితాలపై అందరి దృష్టి నెలకొని ఉంది. ఈ పదేళ్లలో స్థానిక రాజకీయ ముఖచిత్రం సమూలంగా మారిపోయిందనే చెప్పాలి. కాంగ్రెస్ మాజీ దిగ్గజం గులాం నబీ ఆజాద్ డీపీఏపీతో పాటు పీపుల్స్ కాన్ఫరెన్స్, అప్నీ పార్టీ వంటి నయా రాజకీయ పక్షాలు పుట్టుకొచ్చాయి. 2022లో చేపట్టిన నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా అసెంబ్లీ స్థానాల సంఖ్య 87 నుంచి 90కి పెరిగింది. ఇదేమీ పెద్ద పెరుగుదలగా కనిపించకపోయినా, ముస్లిం మెజారిటీ కశ్మీర్‌తో పోలిస్తే హిందూ ప్రాబల్య జమ్మూ ప్రాంతంలో ఎక్కువ సీట్లు పెరిగేలా మోదీ సర్కారు జాగ్రత్త పడింది.మొత్తం 90 అసెంబ్లీ స్థానాల్లో 9 ఎస్సీలకు, 7 ఎస్టీలకు రిజర్వ్ చేశారు. దాంతో జమ్మూ కశ్మీర్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే గుజ్జర్లు, పహాడీ తదితర సామాజిక వర్గాల ప్రాధాన్యం మరింత పెరిగింది. గత ఫిబ్రవరిలో దాదాపు 16 లక్షల మంది పహాడీ జాతులను కొత్తగా ఎస్టీ జాబితాలో చేరుస్తూ మోదీ సర్కారు వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంది. ఇది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ లబ్ధి కోసం చేపట్టిన ఫక్తు రాజకీయ చర్య అని విపక్షాలు అప్పుడే విమర్శించాయి. ఎందుకంటే సంచార పశు పోషక జాతులైన గుజ్జర్లూ, బాకర్వాల్లు సాంప్రదాయికంగా కాంగ్రెస్ మద్దతుదారులు. వారిని తనకేసి తిప్పుకోవడం సులువు కాదన్నది బీజేపీ భావన. అందుకే ఉరీ, కర్నాహ్, బారాముల్లా వంటి ప్రాంతాల్లో సంఖ్యాధికులైన పహాడీల ఓట్లపై పార్టీ కొంతకాలంగా కన్నేసింది. వీరు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) వంటి స్థానిక పక్షాలను బలపరుస్తుంటారు. ఎస్టీ జాబితాలో చేరిన కారణంగా వాళ్లకిప్పుడు బుధాన్, సూరజ్ కోటే, రాజౌరీ వంటి ఎస్టీ రిజర్వుడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం కలిగింది. ఇది వారి ఓట్లను తమవైపు మళ్లిస్తుందని బీజేపీ ఆశ పడుతోంది. పహాడీలతో పాటు వాల్మీకి తెగవారిని తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. వాల్మీకులకు తాజాగా ఎస్టీ హోదా కల్పించారు. ప్రతి ఓటూ కీలకమే అయిన జమ్మూ కశ్మీర్లో ఏ అవకాశాన్నీ వదలరాదని బీజేపీ పట్టుదలగా ఉంది. 9 ఎస్టీ స్థానాల్లో ఐదు పీర్ పంజల్ బెల్ట్‌లోని రాజౌరీ – పూంచ్ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇవన్నీ తన ఖాతాలోనే పడతాయని అంచనా వేస్తోంది.గుర్రుగా గుజ్జర్లుపహాడీ, వాల్మీకి జాతులకు ఎస్టీ హోదా ఇవ్వడంతో గుజ్జర్లలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. 15.6 లక్షలకు పైగా ఉన్న వీరు ఇప్పటిదాకా జమ్మూ కశ్మీర్లో 10 శాతం ఎస్టీ రిజర్వేషన్లకు పూర్తి హక్కుదారులు. వాటినిప్పుడు పçహాడీ, వాల్మీకులతో పంచుకోవాల్సి వస్తుండటంపై వారిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలాగని ఈ వర్గాలు నమ్ముకున్న కాంగ్రెస్ కూడా 16 లక్షల జనాభా ఉన్న పçహాడీ, వాల్మీకులను కాదని వీరికి మద్దతుగా పూర్తిస్థాయిలో గళం విప్పే పరిస్థితుల్లో లేదు. మారిన రిజర్వేషన్ల అనంతరం జమ్మూకశ్మీర్ రాజకీయాలపై ఎస్సీ, ఎస్టీల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో తేటతెల్లం కానుంది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: మథువాల మద్దతెవరికో!
బన్గావ్. పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ సరిహద్దులోని లోక్‌సభ స్థానం. ఈ ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గంలో మథువాల ప్రాబల్యం ఎక్కువ. ఇక్కడ పారీ్టల గెలుపోటములను నిర్ణయించేది వాళ్లే. దాంతో బీజేపీ, తృణమూల్ రెండూ మథువా సామాజిక వర్గానికి చెందిన వారినే బరిలోకి దించాయి. గత ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజారిటీతో గెలుపొందిన శంతను కుమార్ బీజేపీ నుంచి మళ్లీ పోటీ చేస్తున్నారు. అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి బిశ్వజిత్ దాస్ రంగంలో ఉన్నారు...బన్గావ్ లోక్‌సభ స్థానం 2009లో ఏర్పడింది. స్వాతంత్య్రానంతరం, 1971లో బంగ్లాదేశ్ విమోచన యుద్ధ సమయంలో హిందూ శరణార్థులు భారీగా బన్గావ్ ప్రాంతానికి వచ్చి స్థిరపడ్డారు. వీరిలో అత్యధికులు మథువాలే. బన్గావ్ ఓటర్లలో 67 శాతం దాకా వాళ్లే ఉన్నారు. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) నేపథ్యంలో వీరు సహజంగానే బీజేపీకి మద్దతిస్తున్నారు. బన్గావ్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల ఆరు బీజేపీ చేతిలోనే ఉన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ బన్గావ్ నుంచి బెంగాల్ ప్రచారాన్ని ప్రారంభించారు. మథువా సామాజికవర్గానికి పౌరసత్వం ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో వారి ఓట్లు అత్యధికంగా బీజేపీకే పడ్డాయి. అలా ఇక్కడ తొలిసారి బీజేపీ విజయం సాధించింది. శంతను లక్షకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచి కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా బన్‌గావ్‌లో సీఏఏ ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తూ ఎన్నికల ముందు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేయడం తెలిసిందే. అయితే ఆన్లైన్ దరఖాస్తుల్లో బంగ్లాదేశ్‌లో ఉన్నప్పటి చిరునామా, నివాస పత్రాల వివరాలను చాలామంది సమర్పించలేదు. ఇది సమస్యలకు దారి తీయడంపై ఇక్కడి మథువాలు అసంతృప్తితో ఉన్నారు. తప్పుదారి పట్టిస్తున్నారు: టీఎంసీ సీఏఏను తృణమూల్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఇది మథువా వర్గాన్ని తప్పుదోవ పట్టించేందుకు బీజేపీ చేస్తున్న కుట్రగా అభివరి్ణస్తోంది. మథువాలు ఇప్పటికే భారతీయులని, వారికి ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు ఉన్నాయని తృణమూల్ అధినేత్రి మమత అంటున్నారు. ‘‘ఈ దేశ పౌరులు కాకుంటే ఇన్నేళ్లు వారు ఓటెలా వేశారు? ప్రజాప్రతినిధులుగా పార్లమెంటుకు, బెంగాల్ అసెంబ్లీకి ఎలా వెళ్లారు?’’ అని ప్రశి్నస్తున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో బన్‌గావ్‌లో ఘోర పరాజయం తర్వాత గతేడాది పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ దుమ్ము రేపింది. బోరో కుటుంబానిదే ఆధిపత్యం... బన్గావ్ రాజకీయాలను బోరో మా (బీనాపాణి దేవి) కుటుంబమే శాసిస్తోంది. 1947లో బీనాపాణి దేవి, ఆమె భర్త ప్రమథ్ రంజన్ ఠాకూర్ బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చి దక్షిణ కోల్‌కతాలోని బల్లిగంజ్‌లో స్థిరపడ్డారు. ప్రమథ్ నామశూద్ర (ఎస్సీ) కమ్యూనిటీకి చెందిన ప్రముఖ నాయకుడు. మథువాల హక్కుల కోసం పోరాడారు. తమలా వలస వచి్చన వారికి ఆశ్రయం కోసం స్థానిక ఠాకూర్నగర్లో భూమి కొనుగోలు చేశారు. ‘ఠాకూర్బరీ ల్యాండ్ అండ్ ఇండస్ట్రీస్’ పేరుతో కొన్న ఆ స్థలంలో శరణార్థుల కోసం తొలి ప్రైవేట్ కాలనీ నిర్మించారు. ప్రమథ్ 1962లో కాంగ్రెస్ అభ్యరి్థగా హన్స్‌ఖాలీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచారు. కుమారుడు కపిల్ కృష్ణ ఠాకూర్ 2014లో ఎంపీ అయ్యారు. ఆయన మరణానంతరం భార్య మమత 2015 ఉప ఎన్నికలో గెలిచారు. చిన్న కుమారుడు మంజుల్ కృష్ణ ఠాకూర్ టీఎంసీ ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత బీజేపీలో చేరారు. బీజేపీ అభ్యర్థి శంతను ఆయన రెండో కుమారుడే. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Karnataka assembly elections 2023: కర్ణాటక ‘సెంట్రల్’ ఎవరివైపు..!
సాక్షి,బెంగళూరు: సెంట్రల్ కర్ణాటకలో గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీయే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. లింగాయత్‌ల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బీజేపీ హవా నడుస్తూ వస్తోంది. బీజేపీతో విభేదాలతో ఆ పార్టీ దిగ్గజ నాయకుడు యడియూరప్ప కర్ణాటక జనతా పార్టీ పేరుతో వేరు కుంపటి పెట్టి ఎన్నికల బరిలో దిగిన 2013లో మినహాయిస్తే మిగిలిన ఎన్నికల్లో బీజేపీదే పై చేయి. దావణగెరె, శివమొగ్గ, చిత్రదుర్గ, తుమకూరు జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో లింగాయత్‌లతో పాటు ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువే. మొత్తం 32 స్థానాల్లో 8 సీట్లు ఎస్సీ, ఎస్టీకి రిజర్వ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ సారి లింగా యత్లతో పాటు ఎస్సీ, ఎస్టీ ఓట్లు తమకేనని అందుకే ఈ సారి ఈ ప్రాంతంలో తమ పార్టీ దూసుకు పోతుందన్న అంచనాలతో ఉంది. మలేనాడు, మధ్య కర్ణాటక జిల్లాల నుంచి రాష్ట్రానికి ఇప్పటికి ఐదు మంది ముఖ్యమంత్రులు వచ్చారు. దీంతో కర్ణాటక లోని ఈ ప్రాంతంపై ఆయా రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. అయిదుగురు మాజీ ముఖ్యమంత్రుల్లో కడిదాళ్ మంజప్ప, ఎస్.బంగారప్ప, జేహెచ్ పటేల్, బీఎస్ యడియూరప్ప వంటి నేతలు అవిభజతి శివమొగ్గ జిల్లాకు చెందిన వారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ప్రాంతంపై పట్టుకు బీజేపీ,కాంగ్రెస్ శ్రమిస్తున్నాయి. కేవలం తుముకూరు జిల్లాలో మాత్రమే పట్టు ఉన్న జేడీ(ఎస్) ఈ సారి అన్ని జిల్లాలకు విస్తరించడానికి వ్యూహాలు పన్నుతోంది. అవకాశాలను అందిపుచ్చుకున్న బీజేపీ.. గతంలో కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతం కాల క్రమేణ బీజేపీ వశం అయింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో కాంగ్రెస్, బీజేపీకి మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. 2004 నుంచి హిందూ ఓట్లను క్రోడికరించడంలో బీజేపీ సఫలీకృతమైంది. అప్పటి నుంచి నెమ్మదిగా పుంజుకుంటూ మధ్య కర్ణాటకలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. బీజేపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న లింగాయత్‌లు శివమొగ్గ, దావణగెరె జిల్లాల్లో అధిక సంఖ్యలో ఉండడం అధికార పార్టీకి కలసి వచ్చింది. సీట్లను పెంచుకునే వ్యూహంలో కాంగ్రెస్ స్థానికంగా ఉన్న సమస్యల్ని ఎత్తి చూపుతూ కాంగ్రెస్ పార్టీ తనకు అను కూలంగా ప్రచారంలో మలుచుకుంటోంది. ఎక్కడిక్కడే హామీలు గుప్పిస్తూ ఈ సారి మధ్య కర్ణాటకలో అత్యధిక స్థానాలను దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. గత ఏడాది కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య 75వ పుట్టిన రోజు వేడుకల్ని దావణగెరెలో భారీగా నిర్వహించి ఎన్నికల సమరశంఖాన్ని పూరించింది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సెంట్రల్ కర్ణాటకలో అత్యధికంగా ర్యాలీలు నిర్వహిస్తూ వస్తున్నారు. జేడీ(ఎస్) తుముకూరు ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి పంచరత్న యాత్రని వినియోగించుకున్నారు. మొత్తమ్మీద సెంట్రల్ ఓటరు ఎవరిని కరుణిస్తారో వేచి చూడాలి. స్థానిక అంశాలపై బీజేపీ దృష్టి లింగాయత్ ఓట్లతో పాటుగా స్థానిక సమస్యల పరిష్కారంపై బీజేపీ దృష్టి సారించింది. శివమొగ్గ జిల్లాలో బగర్‌హుకుం భూ స్వాధీనం, శరావతి ప్రాజెక్టు పునరావాసం, విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ కర్మాగారం మూసివేత వంటి సమస్యలు బీజేపీకి తలనొప్పిగా మారాయి. చిక్కమగళూరు జిల్లాలో వర్షాల వల్ల కాఫీ సాగుదారులు తీవ్రంగా నష్టపో యారు. భద్రా ఎత్తిపోతల ప్రాజెక్టు చిత్రదుర్గ జిల్లాలో ఎన్నికల్లో కీలకాంశంగా మారింది. కేంద్రం ఈ ప్రాజెక్టు కోసం బడ్జెట్లో రూ. 5,300 కోట్లు ప్యాకేజీ ప్రకటించింది. ఈ అంశం బీజేపీకి అనుకూ లంగా మారింది. ఇక ధరాభారం, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కూడా ఎన్నికల్లో ప్రభావం చూపనుంది. ఎస్సీ వర్గీకరణపై బీజేపీ ఇంకా ఎటూ తేల్చకపోవడంతో ఈ వర్గం వారు అధికార పార్టీపై గుర్రుగా ఉన్నారు. -
మత మార్పిడి చేసుకున్న వారికి ఎస్సీ హోదాపై కేంద్రం అధ్యయనం
న్యూఢిల్లీ: వేరే మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని తేల్చేందుకు కేంద్రం సమాయత్తమైంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వం అధ్యయనం చేయనుంది. ఇందుకోసం మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న మతాల్లోకి కాకుండా వేరే మతాల్లోకి మారిన వారికీ ఎస్సీ హోదా ఇవ్వొచ్చా లేదా అనే విషయాన్ని ఈ కమిషన్ తేల్చనుంది. మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యురాలు సుష్మా యాదవ్‌లతో ఈ త్రిసభ్య కమిషన్‌ను కొలువుతీరుస్తూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం ఒక నోటిఫికేషన్ విడుదలచేసింది. రాజ్యాంగంలోకి 341 ఆర్టికల్ ప్రకారం గతంలో పలు సందర్భాల్లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను, ప్రస్తుత పరిస్థితులను కమిషన్ పరిశీలించనుంది. వేరే మతం వారికి ఎస్సీ హోదా ఇస్తే ఇప్పటికే ఎస్సీ హోదా లబ్ధిపొందుతున్న వారి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక వివక్ష, పేదరికం వంటి అంశాలపై ఏ మేరకు ప్రభావం పడుతుంది అనే అంశాలనూ కూలంకషంగా కమిషన్ అధ్యయనం చేయనుంది. -
ప్రకృతి సేద్యం.. ఎస్సీ రైతులకు ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రకృతి సేద్యం చేస్తున్న ఎస్సీ రైతులకు ప్రోత్సాహం అందించేందుకు కార్యాచరణ ఖరారైంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 71,560 మంది ఎస్సీ రైతుల ఎంపిక పూర్తయింది. వారందరికీ కనీసం రూ.50 వేల చొప్పున సబ్సిడీ రుణాలు అందించేందుకు కసరత్తు మొదలైంది. ఆ మొత్తంలో రూ.10 వేలు సబ్సిడీ, రూ.40 వేలు రుణంగా ఇవ్వనున్నారు. సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఏడాది మార్చి నెలాఖరులోగా మూడు విడతల్లో ఎస్సీ రైతులకు ఈ రుణాలను పంపిణీ చేయనున్నారు. తొలి విడతలో 8,198 మందికి, రెండో విడతలో 34,100 మందికి, మూడో విడతలో 29,262 మందికి అందించనున్నారు. ఆ మొత్తాలను ఎస్సీ రైతులు ప్రకృతి సేద్యానికి పెట్టుబడిగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ రైతు కుటుంబంలో మహిళల పేరిట రుణాలు మంజూరు చేస్తారు. ఎస్సీ కౌలు రైతులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. శిక్షణతోపాటు పరికరాలూ ఇస్తాం ఎస్సీ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ కె.హర్షవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. రైతు సాధికార సంస్థ, ఎన్ఎస్ఎఫ్డీసీ, గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సమన్వయంతో కార్యాచరణకు సహకరిస్తాయని తెలిపారు. సబ్సిడీ రుణాలే కాకుండా ప్రకృతి సేద్యంలో శిక్షణ ఇస్తామన్నారు. పంట రవాణా, మార్కెటింగ్ సదుపాయాల కోసం వినియోగించే వాహనాలను రాయితీలపై అందిస్తామని వివరించారు. -
వర్గీకరణకు జాతీయ విధానం అవసరం
సుప్రీంకోర్టు 27 ఆగస్టు 2020న సంచలన తీర్పునిచ్చింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతుల వర్గీకరణను సమర్థిస్తూ సమస్య పరిష్కారానికి ఏడుగురు జడ్జీల ధర్మాసనానికి బదిలీ చేయాలని ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఐదుగురు జడ్జీలతో కూడిన సుప్రీం ధర్మాసనం స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ రవీందర్ సింగ్ కేసులో పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణను సమర్థించింది. ఈ తీర్పులో మూడు అంశాలపై స్పష్టత నిచ్చింది. (1) పంజాబ్ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు మరియు వెనుకబడిన తరగతుల చట్టం 2006, షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ చెల్లుతుందా, లేదా? (2) రాష్ట్ర ప్రభుత్వాలకు షెడ్యూల్డ్ కులాలను వర్గీకరించి చేసే రిజర్వేషన్ల అమలుపై అధికారం ఉందా, లేదా? (3) ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు 2004లో ఇచ్చిన ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసు తీర్పును పునఃసమీక్షించాలా, లేదా? సుప్రీంకోర్టు ప్రధానంగా భారతదేశం ఫెడరల్ స్ఫూర్తి కల్గిన దేశం అని పేర్కొంటూ ఆర్టికల్ 15(4), 16(4) ద్వారా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు విద్యా, ఉద్యోగాలలో వారి ప్రాతినిధ్యం లేనట్లయితే రిజర్వేషన్ల కల్పనకు కేంద్ర ప్రభుత్వానికి ఎంత అధికారం ఉందో రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా అవే సర్వాధికారాలు ఉన్నాయని తెలుపుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలను వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలిపింది. కానీ ఏదైనా కులాన్ని/తెగను ఎస్సీ/ఎస్టీ జాబితాలో చేర్చడం లేదా తొలగించే అధికారం మాత్రం రాష్ట్రాలకు లేదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 341 ప్రకారం షెడ్యూల్డు కులాల జాబితాను, ఆర్టికల్ 342 ప్రకారం షెడ్యూల్డు తెగల జాబితాను, ఆర్టికల్ 342ఎ ప్రకారం సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడిన తరగతుల జాబితాలను పార్లమెంటు ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేస్తారు. పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం 2006 రిజర్వేషన్ చట్టం ద్వారా ఎస్సీలను వర్గీకరించి విద్యా, ఉద్యోగాలలో రిజర్వేషన్ల అమలుకు ముందడుగు వేసింది. కానీ సదరు చట్టాన్ని పంజాబ్ – హర్యానా హైకోర్టు బెంచ్ కొట్టివేస్తూ దానికి కారణంగా ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పును ఉదహరిస్తూ ఎస్సీ, ఎస్టీల వర్గీకరణను కేంద్ర ప్రభుత్వం చేయాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయకూడదని తెలిపింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ ఫలితంగా ప్రభుత్వం 2000 సంవత్సరంలో షెడ్యూల్డు కులాలను నాలుగు గ్రూపులుగా ప్రత్యేక చట్టం ద్వారా వర్గీకరించి 15 శాతం రిజర్వేషన్ల అమలుకు శ్రీకారం చుట్టింది. సదరు చట్టాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. సుదీర్ఘ వాదనలు విన్న హైకోర్టు మల్లెల వెంకట్రావు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 4:1 మెజారిటీ తీర్పునిస్తూ ఎస్సీ వర్గీకరణ చట్టానికి ఆమోదం తెలిపింది. వెంటనే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. అందుకు ఐదుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 2004లో ఇ.వి.చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో తీర్పునిస్తూ ఎస్సీల వర్గీకరణ చట్టాన్ని కొట్టివేస్తూ ఎస్సీ, ఎస్టీల వర్గీకరణ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశంగా తేల్చిచెప్పింది. సామాజిక రిజర్వేషన్లకు సంబంధించి ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసు తీర్పులో సుప్రీంకోర్టు తొమ్మిది మంది జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం 6:3 మెజారిటీ తీర్పులో 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లను ఆమోదిస్తూ ఓబీసీల వర్గీకరణకు కూడా ఆమోదం తెలిపింది. కానీ ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను వేరుగా చూడాలని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నేటి వరకు 1,206 కులాలను ఎస్సీలుగా, 701 తెగలను ఎస్టీలుగా, 2,643 కులాలను ఓబీసీలుగా గుర్తించి రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఇందులో ఓబీసీ జాబితాలలో కేంద్రానికి, రాష్ట్ర ప్రభుత్వాలకు కొద్దిపాటి తేడాలున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణ కోసం 2017లో జస్టిస్ రోహిణి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ నివేదిక సమర్పణ కాలాన్ని జనవరి 2021 వరకు పొడిగించింది. అనేక రాష్ట్రాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయాలని ఉద్యమాలు జరుగుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వ విద్యా ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నప్పటికీ, అమలు చేస్తున్న రిజర్వేషన్ల ఫలాలు అందరికీ సమానంగా అందాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా లంబాడాలను ఎస్టీ జాబితా నుండి తొలగిం చాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు. ఏ కులాలు/ తెగలు విద్యలో ముందుంటాయో లభిస్తున్న కాస్త రిజర్వేషన్లు వారే అనుభవించడం సహజం. కాబట్టి వర్గీకరణ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అమలుపరిచి ఆయా కులాలకు/తెగలకు న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. లేనట్లయితే ఆయా కులాల/తెగల మధ్య వైరుధ్యాలు పెరిగి సమైక్యతకు భంగం వాటిల్లుతుంది. కోడెపాక కుమార స్వామి -వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 94909 59625 -
ఎస్సీల ఇంటి స్థలాలకు ఇక్కడ అనుమతి లేదు
సాక్షి, పూతలపట్టు: పూతలపట్టు మండలం పాలకూరు గ్రామ సమీపంలో ఎస్సీలకు ఇంటిస్థలాలు ఇవ్వకూడదని బుధవారం ఆ గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు గొడవకు దిగారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాలకూరు గ్రామానికి సంబంధించి రెవెన్యూ అధికారులు లబి్ధదారులకు ఇంటిస్థలాలు ఇచ్చేందుకు స్థానికంగా సిద్ధం చేశారు. అక్కడ రాళ్లు నాటి లేఅవుట్లు కూడా వేశారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎస్సీలకు ఇంటి స్థలాలు ఇవ్వకూడదని బుధవారం సాయంత్రం పట్టుపట్టారు. లబ్ధిదారులకు కేటాయించిన స్థలంలో హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నట్లు ఏకంగా బోర్డు నాటడం, నాటిన రాళ్లను పీకేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. అడ్డొచ్చిన ఎస్సీలపై వారు ఎదురు దాడికి పాల్పడేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. ఘర్షణకారులను చెదరగొట్టారు. దీనిపై తహసీల్దార్ విజయ భాస్కర్‌నును వివరణ కోరగా అది ప్రభుత్వ భూమి అని, అందులో బోర్డు నాటడం, రాళ్లు పీకేయడం చట్టరీత్యా నేరమని, వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. -
‘ఇందిరా’ భవనాల ఖాళీలో ఉద్రిక్తత
► పోలీసులు, ఆక్రమిత గిరిజనుల మధ్య వాగ్వాదం ► గిరిజనులను అదుపులోకి తీసుకుని భవనాలకు సీజ్ అశ్వారావుపేటరూరల్: ఇందిరాసాగర్ ప్రాజెక్టుకు ఖాళీ భవనాలను ఆక్రమించుకొని నివాసం ఉంటున్న నిరుపేద గిరిజనులను ఖాళీ చేయించే క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గిరిజనుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా అడ్డుతగిలిన మహిళలను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మండల పరిధిలోని తిరుమలకుంట పంచాయతీలో గల బండారుగుంపు సమీపంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇందిరాసాగర్(రుద్రంకోట) పంప్ హౌస్ సిబ్బందికి 2009లో 18 భవనాలను నిర్మించింది. భవన నిర్మాణాలు పూర్తయినప్పటికీ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం నిలుపుదల చేయడంతో ఖాళీగానే ఉంటున్నాయి. ఐదురోజుల క్రితం బండారుగుంపు, రెడ్డిగూడెం, సుద్దగోతులగూడెం, తిరుమలకుంట కాలనీలకు చెందిన 18 మంది గిరిజన కుటుంబాలు ఈ భవనాలను ఆక్రమించుకొని నివాసం ఉంటున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు తక్షణమే భవనాలను ఖాళీ చేయించి స్వాధీనం చేసుకోవాలని తహసీల్దార్ యలవర్తి వెంకటేశ్వరరావును ఆదేశించారు. పోలీస్, రెవెన్యూ, అటవీ సిబ్బందితో తహసీల్దార్ భవనాలను ఖాళీ చేయించేందుకు వచ్చారు. అశ్వారావుపేట సీఐ రవికుమార్ ఎస్ఐ కృష్ణ, సురేష్, ప్రవీణ్, చరణ్, ఉదయ్ కుమార్లతోపాటు 80మంది పోలీస్ సిబ్బంది, 20 మంది అటవీ శాఖ సిబ్బంది ఉదయం 8 గంటలకే బండారుగుంపు గ్రామానికి చేరుకున్నారు. మహిళలతో తహసీల్దార్, సీఐ మాట్లాడి ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకోవడం చట్ట రీత్యా నేరమని, తక్షణమే ఖాళీ చేసి ప్రభుత్వానికి అప్పగించాలని సూచించారు. తమకు వేరే ప్రాంతంలో స్థలాలు ఇస్తే ఖాళీ చేస్తామని పట్టుబట్టారు. అడ్డుపడుతున్న మహిళలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకొని జీపుల్లో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. సీపీఐ ఎంఎల్(న్యూడెమోక్రసీ) పార్టీ నాయకులు గోగినపల్లి ప్రభాకర్, కంగాల కల్లయ్య, ధర్ముల సీతారాములతోపాటు 13 మందిని పోలీసులు అరెస్ట్ చేసి దమ్మపేట, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. వీరిపై సీతారామ ప్రాజెక్టు డీఈఈ రాంబాబు ఫిర్యాదు మేరకు బైండోవర్ కేసులు నమోదు చేయగా తహసీల్దార్ ఎదుట హాజరు పరిచి సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఖాళీ చేసిన భవనాల సీజ్.. గిరిజనులను బలవంతంగా పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించిన తర్వాత ఇందిరాసాగర్ భవనాల్లో ఉన్న గిరిజనుల సామగ్రిని రెవెన్యూ సిబ్బంది బయటపెట్టి భవనాలకు తాళాలు వేసి సీజ్‌చేశారు. తహసీల్దార్ విలేకరులతో మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు భవనాలను ఖాళీ చేయించి ఇరిగేషన్‌శాఖకు అప్పగిస్తున్నట్లు తెలిపారు.