మతం మారినా రిజర్వేషన్ లబ్ది కోసం ఆ విషయాన్ని దాచిపెట్టడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన సుప్రీం
న్యూఢిల్లీ: కేవలం రిజర్వేషన్ ఫలాలు దోచేయాలనే దుర్భుద్దితో మతం మారిన విషయాన్ని దాచిపెట్టిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని మోసగించడంతో సమానమని అభివర్ణించింది. క్రైస్తవమతంలోకి మారిన తర్వాత కూడా ఒక మహిళ షెడ్యూల్ కులం సర్టిఫికేట్ కోసం తాను ఇంకా హిందువునేనని వాదించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది.
ఈ అంశంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. హిందువు అయిన సి.సెల్వరాణి క్రైస్తవమతం పుచ్చుకుంది. అయితే రిజర్వేషన్ లబ్ది పొందేందుకు, ఉద్యోగి సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు తాను ఇంకా హిందువునేనని నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే ఆమె నిజంగా క్రైస్తవ మతంలోకి మారిందని, తరచూ చర్చికి వెళ్తూ, క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ, పూర్తి విశ్వాసంతో క్రైస్తవమతాన్ని ఆచరిస్తోందని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో రిజర్వేషన్ కోసం ఆ మహిళ తన మతాన్ని దాచిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది.
‘‘బాప్టిజం పూర్తయ్యాక ఇంకా తాను హిందువును అని మహిళ చెప్పుకోవడంలో అర్థంలేదు. మతం మారాక కూడా రిజర్వేషన్ ప్రయోజనాలే పరమావధిగా ఇలా వ్యవహరించడం రిజర్వేషన్ లక్ష్యాలకే విఘాతం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న రిజర్వేషన్ల విధానం ఇలాంటి వారితో ప్రమాదంలో పడుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. సెల్వరాణి తండ్రి హిందువుకాగా తల్లి క్రైస్తవురాలు. అయితే సెల్వరాణి చిన్నతనంలోనే బాప్టిజం తర్వాత క్రైస్తవురాలిగా మారారు. అయితే 2015లో పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం పొందేందుకు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించారు. సెల్వరాణి తండ్రి వల్లువాన్ కులానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఈ కులం వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ సెల్వరాణి తండ్రి సైతం దశాబ్దాలక్రితమే క్రైస్తవమతం స్వీకరించారు. దీంతో తల్లిదండ్రులు క్రైస్తవులుకాగా తాను మాత్రం హిందువును అని ఈమె చేసిన వాదనల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది.
Comments
Please login to add a commentAdd a comment