Caste Certificate
-
వచ్చేనెల నుంచి కొత్త విధానంలో సర్టిఫికెట్ల జారీ
సాక్షి, అమరావతి: ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీకి వచ్చే నెల నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆయా శాఖల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనుంది. కుల ధ్రువీకరణ పత్రం ఒకసారి తీసుకుంటే అది శాశ్వతమని, అలాగే తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, సంస్థలు లబ్ధిదారులను ఒత్తిడి చేయకూడదని, ఆరు దశల నిర్ధారణ ప్రక్రియను వినియోగించాలని ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కుల ధ్రువీకరణలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సంక్షేమ శాఖలు అప్డేట్ చేయాలని ఆదేశించింది. వీటిపై మండల, జిల్లా స్థాయి అధికారులకు ఈ నెల 26వ తేదీలోపు శిక్షణ ఇవ్వాలని సూచించింది. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏపీ సేవ ద్వారా ఈ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను అమలు చేసేందుకు, విధివిధానాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడం, తల్లిదండ్రులు, తోబుట్టుల వివరాల ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ డేటాబేస్‌ను అనుసంధానించడం వంటి పనులన్నీ ఈ నెల 19వ తేదీకల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు. అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి ఆరు దశల నిర్థారణ ప్రక్రియ విధానాన్ని సంక్షేమ, ఇతర శాఖలు చేసుకునేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయ డేటాబేస్‌తో అనుసంధానించే ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని షెడ్యూల్ రూపొందించారు. 30వ తేదీలోపు ఆయా శాఖల మండల, జిల్లా స్థాయి అధికారులు, అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వేర్వేరుగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. -
కుల ధ్రువీకరణ పత్రాలు రెడీ..
సాక్షి, అమరావతి: పదో తరగతి విద్యార్థులు అడక్కుండానే.. వారికి కుల ధ్రువీకరణ సర్టీఫికెట్లు జారీచేసే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవల్ని అందించే క్రమంలో ఎక్కడా, ఎప్పుడూ లేనివిధంగా సరికొత్తగా రాష్ట్రంలో ఈ విధానాన్ని తీసుకువచ్చారు. సాధారణంగా పదో తరగతి పూర్తయిన విద్యార్థులు.. ఇంటర్, ఆపై చదువుల కోసం తప్పనిసరిగా కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. అంతకుముందు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు తీసుకున్నా.. పదో తరగతి ఉత్తీర్ణులయ్యాక తాజా సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ సర్టిఫికెట్ల కోసం గతంలో మీసేవ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ విద్యార్థులు తిరిగేవారు. దీంతో ఆయా కార్యాలయాలు విద్యార్థులతో కిటకిటలాడేవి. దీనిని గమనించిన ప్రభుత్వం విద్యార్థులు అడక్కుండానే కుల ధ్రువీకరణ పత్రాల జారీని చేపట్టింది. ఇందుకోసం ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసిన 10 లక్షల మంది విద్యార్థుల వివరాల డేటాను విద్యా శాఖ ద్వారా తీసుకున్నారు. ఆ డేటా మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయం డేటాబేస్కు అనుసంధానించారు. వీఆర్వోల ద్వారా తనిఖీ చేయించి.. సేకరించిన డేటాను రెవెన్యూ శాఖ గ్రామాల వారీగా విభజించి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వీఆర్వో లాగిన్లకు పంపించింది. వీఆర్వోలు తమ పరిధిలోని పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి కుల ధ్రువీకరణను పరిశీలించి నివేదికలు రూపొందించారు. విద్యార్థితోపాటు వారి కుటుంబ సభ్యులందరి సామాజిక వర్గాన్ని కూడా నిర్ధారించారు. అంటే ఒక్కో కుటుంబానికి నలుగురు సభ్యుల లెక్కన దాదాపు 40 లక్షల మంది సామాజిక వర్గాన్ని ధ్రువీకరించారు. ఈ సర్టిఫికెట్లు వీఆర్వో లాగిన్ నుంచి తహసీల్దార్లకు పంపించారు. అక్కడి నుంచి సర్టీఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇప్పుడు పదో తరగతి విద్యార్థి ఎవరైనా తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి.. వెంటనే తమ కుల ధ్రువీకరణ పత్రం పొందే అవకాశం కల్పించారు. దరఖాస్తులతో పని లేదు గతంలో మాదిరిగా విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. వెరిఫికేషన్ చేయాల్సిన పని లేకుండా నేరుగా విద్యార్థులకు సర్టీఫికెట్లు జారీ చేస్తారు. ప్రస్తుతం సేకరించిన 40 లక్షల మంది వివరాలు గ్రామ, వార్డు సచివాలయ డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉంటాయి. భవిష్యత్‌లో 40 లక్షల మందిలో ఎవరికైనా కుల ధ్రువీకరణ పత్రం కావాల్సి వస్తే.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే తక్షణం జారీ చేస్తారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పల్లె ముంగిటకు వచ్చిన పరిపాలన, సాంకేతికతను అనుసంధానించి సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం సులభతరం చేసింది. తద్వారా 10 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చిపెట్టింది. -
శునకానికి కుల ధృవీకరణ పత్రమా! కంగుతిన్న అధికారులు
బిహార్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. సాధరణంగా అడ్మిషన్ పొందేందుకో లేక ప్రభుత్వ ప్రయోజనాలు పొందడం కోసమే కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకుంటాం. అయితే జంతవుల కోసం దరఖాస్తు చేయడం గురించి ఇప్పటి వరకు విని ఉండం కదా. కానీ ఇక్కడ ఓ కుక్కకి కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశాడు ఒక అపరిచిత వ్యక్తి. దీన్ని చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు అధికారులు. వివరాల్లోకెల్తే..బిహార్‌లోని గయాలో కుల ధృవీకరణ పత్రం కోసం విచిత్రమైన దరఖాస్తు వచ్చింది. టామీ అనే కుక్కకి కుల ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేశారు. అంతేగాదు ఆశ్చర్యపోకండి ఈ టామీకి ఆధార్‌కార్డు కూడా ఉంది అంటూ ఓ ఆధార్ కార్డ్‌ని కూడా జత చేశారు. అందులో టామీ తండ్రి పేరు గిన్ని, పుట్టిన తేది ఏప్రిల్ 14, 2022 అని ఉంది. చిరునామ పందేపోఖర్, పంచాయతీ రౌనా వార్డు నంబర్ 13, గురారు సర్కిల్ అని ఉంది. పైగా ఆ ఆధార్ కార్డుపై 'ఆమ్ కుత్తా కా అధికారం' అని రాసి ఉంది. అందుకు సంబంధించిన ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు గురారు సర్కిల్ ఆఫీసర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ.. దరఖాస్తుపై పేర్కొన్న ఫోన్ నెంబరు ట్రూకాలర్‌లో రాజబాబు అని చూపుతుందని చెప్పారు. ఐతే అధికారులు ఈ విచిత్ర సంఘటనతో కంగుతిన్నారు. ఈ వికృత చేష్టల వెనుక ఉన్న దుండగలను పట్టుకోవడం కోసం పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: అర్థరాత్రి రెండు గంటలకు దాడులు..భయాందోళనలో చిన్నారి పెళ్లికూతుళ్లు..) -
ఖమ్మంలో వినూత్న కార్యక్రమం, స్కూళ్లకే సర్టిఫికెట్లు.. మంత్రి పువ్వాడ ఏమన్నారంటే..
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఖమ్మం జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజయవంతంగా అమలు చేస్తోంది. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల కోసం అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ఎస్సీ విద్యార్థులు పడుతున్న కష్టాలు తీర్చేందుకు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తీసుకున్న చొరవ సత్ఫలితాలిస్తోంది. ఆయా పత్రాల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిన అవసరం లేకుండా నేరుగా స్కూళ్లకే వాటిని పంపుతుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సర్టిఫికెట్లను అందించే కార్యక్రమాన్ని శరవేగంగా పూర్తి చేస్తుండటంతో ఎస్సీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడం సులువవుతోంది. ప్రక్రియ ఇలా... పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ఎస్సీ విద్యార్థుల జాబితాలను హెచ్ఎంలు సిద్ధం చేశాక.. రెవెన్యూ అధికారులు పాఠశాలలకు వెళ్లి సర్టిఫికెట్లు అవసరమైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అలాగే అధికా రులే మీ–సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసి సర్టిఫికెట్లను సిద్ధం చేసి పాఠశాలలకు వెళ్లి నేరుగా విద్యార్థులకు అందజేస్తున్నారు. దీనివల్ల విద్యార్థుల ఇక్కట్లు తీరడమే కాక సమయం కలిసొస్తోంది. పలు పాఠశాలల్లో సర్టిఫికెట్లు అందజేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్.. ఈ విధానాన్ని రాష్ట్రమంతటా అమలుచేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పడం విశేషం. ఇప్పటికే 76 శాతం మందికి.. ఖమ్మం జిల్లాలో 8,446 మంది ఎస్సీ విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఇందులో 5,070 మంది ఈ–పాస్ వెబ్ పోర్టల్‌లో నమోద య్యారు. వారిలో ఇప్పటివరకు 6,434 మందికి కుల, 6,467 మందికి ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అందాయి. మొత్తంగా 76 శాతం మంది విద్యార్థుల కు సర్టిఫికెట్లను పాఠశాలల్లోనే అందించగా.. జిల్లావ్యాప్తంగా మిగిలిన విద్యార్థులకు ఆధార్, చిరునామా సరిగ్గా లేకపోవడంతో సర్టిఫికెట్ల జారీ ఆలస్యమవుతోందని చెబుతున్నారు. విద్యార్థులకు ఉపయోగం ఇది ఎంతో మంచి ప్రక్రియ. దీనివల్ల విద్యార్థులు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే బాధ తప్పింది. ఇప్పుడు వెంటనే సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. – పి.శిరీష, హెచ్ఎం, రఘునాథపాలెం పాఠశాలలో సర్టిఫికెట్లు ఇచ్చారు.. మాకు అవసరమైన సర్టిఫికెట్లను బడిలోనే అందుకోవడం ఆనందంగా ఉంది. గతంలోనైతే ఈ సర్టిఫికెట్లు కావాలంటే బడికి వెళ్లలేకపోయే వాళ్లం. – మేక సాత్రిక, 9వ తరగతి విద్యార్థిని మంచి కార్యక్రమం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కలెక్టర్ గౌతమ్ ఆదేశాల మేరకు కుల, ఆదాయ సర్టిఫికెట్లు అందిస్తున్నారు. ఈ విధానం విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. – ఎస్.యాదయ్య, డీఈఓ, ఖమ్మం -
చర్చికి వెళ్లినంత మాత్రాన.. ఎస్సీ ధ్రువపత్రం రద్దు చేయరాదు
సాక్షి, న్యూఢిల్లీ: గోడలకు శిలువ తగిలించుకోవడం, చర్చికి వెళ్లినంత మాత్రాన... వాటిని కారణాలుగా చూపుతూ ఎస్సీ కుల ధ్రవీకరణ పత్రం రద్దు చేయరాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు హిందు పల్లన్ సామాజికవర్గానికి (ఎస్సీ) చెందిన పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయాలంటూ తీసుకొన్న కింది కోర్టు నిర్ణయాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీబ్ బెనర్జీ, జస్టిస్ ఎం.దురైస్వామిల ధర్మాసనం పక్కనబెట్టింది. ‘‘పిటిషనర్ అయిన మహిళ హిందు పల్లన్ తల్లిదండ్రులకు జన్మించారనడంలో ఎలాంటి సందేహం లేదు. పిటిషనర్‌ను ఓ క్రైస్తవుడు వివాహం చేసుకోవడం.. వారి పిల్లలు భర్త మతానికి చెందిన వారుగా గుర్తించడంతో పిటిషనర్ కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేసినట్లు గుర్తించాం. పిటిషనర్ డాక్టర్ కావడంతో ఆమె క్లినిక్‌ను సందర్శించామని గోడలకు క్రాస్ వేలాడుతూ కనిపించిందని అధికారులు చెబుతున్నారు. ఆ కారణంగా మతాన్ని స్వీకరించారని నిర్ధారణకు రాలేం. పిటిషనర్ తన భర్త, పిల్లలతో చర్చికి వెళ్లినంత మాత్రాన అసలు విశ్వాసాన్ని పూర్తిగా వదిలేశారని భావించలేం’’ అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఊహాజనితంగా నిర్ణయం తీసుకొని కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేయడాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. -
ఎంపీ నవనీత్ కౌర్‌కు సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: మహారాష్ట్రలోని అమరావతి ఎంపీ, సినీ నటి నవనీత్‌కౌర్ రాణాకు భారీ ఊరట లభించింది. ఆమె కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తూ బాంబే హైకోర్టు వెలువరించిన తీర్పుపై సుప్రీంకోర్టు మంగళవారం స్టే విధించింది. ఆమె తప్పుడు డాక్యుమెంట్లను సమర్పించి, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికెట్ పొందారని బాంబే హైకోర్టు ఆక్షేపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సదరు సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ జూన్ 9న తీర్పునిచ్చింది. ఆమెకు రూ.2 లక్షల జరిమానా కూడా విధించింది. చదవండి: ప్రధాని కన్నీళ్లు ప్రజల్ని కాపాడలేవు -
అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ కు సుప్రీం కోర్టులో ఊరట
-
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా: నవనీత్ కౌర్
ముంబై: నటి, అమరావతి పార్లమెంట్ సభ్యురాలు నవనీత్ కౌర్‌కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టి కీలక ఉత్తర్వులు వెలువరించింది. పంజాబ్ మూలాలు కలిగిన నవనీత్ కౌర్.. మహారాష్ట్రలో ఎస్సా కేటగిరికి రాదని, ఆమె కులధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేసింది. దీంతోపాటు రూ.2 లక్షల జరిమానా విధించింది. ఆరు నెలల్లోగా కులధ్రువీకరణకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లను కోర్టు ముందుంచాలని నవనీత్ కౌర్‌ను ఆదేశించింది. తాజాగా తన కుల సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు తీర్పుపై నవనీత్ కౌర్ స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆమె చెప్పారు. ‘“నేను ఈ దేశ పౌరురాలిగా బాంబే హైకోర్టు ఆదేశాన్ని గౌరవిస్తాను. నేను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాను, నాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం నాకు ఉంది” అని ఎంపీ నవనీత్ కౌర్ అన్నారు. ఇదిలా ఉండగా మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నవనీత్ కౌర్ విజయం సాధించారు. నవనీత్ భర్త రవి రాణా ప్రస్తుతం అమరావతి జిల్లా బద్నేరా ఎమ్మెల్యేగా ఉన్నారు. చదవండి: ఎంపీ నవనీత్ కౌర్ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు -
ఎంపీ నవనీత్ కౌర్ క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు
ముంబై: మహారాష్ట్రలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సినీనటి నవనీత్ కౌర్ రాణాకు బాంబే హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌ను రద్దు చేయడంతో పాటు 2 లక్షల రూపాయల జరిమానా విధించింది. నవనీత్ కౌర్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, నకిలీ క్యాస్ట్ సర్టిఫికెట్తో ఆమె పోటీచేసి గెలుపొందారని ఆరోపిస్తూ మాజీ ఎంపీ, శివసేన నేత ఆనందరావు అదసూల్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. విదర్భ ప్రాంతంలోని అమరావతి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన నవనీత్ కౌర్.. తొలిసారి ఎంపీగా ఎన్నికైన విషయం తెలిసిందే. బాంబే హైకోర్టు ఇచ్చిన తాజా తీర్పుతో ఆమె లోక్‌సభ సభ్యత్వం ప్రమాదంలో పడినట్లైంది. శివసేన ఎంపీ అరవింద్ సావంత్ పార్లమెంట్ లాబీల్లో తనపై బెదిరింపులకు పాల్పడ్డారంటూ మార్చిలో నవనీత్ కౌర్ గతంలో సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలుకు పంపుతామని అరవింద్ సావంత్ తనను హెచ్చరించారని తెలిపారు. తనపై యాసిడ్ దాడి చేస్తామంటూ ఫోన్ కాల్స్‌తో పాటు శివసేన లెటర్ హెడ్‌తో లేఖలు కూడా వస్తున్నాయంటూ నవనీత్ కౌర్.. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. 2019 ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి ఎస్సీ రిజర్వ్ లోక్‌సభ స్థానం నుంచి నవనీత్ కౌర్ శివసేన అభ్యర్థి ఆనందరావు అదసూల్ పైనే విజయం సాధించారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ అరంగేట్రం చేసిన నవనీత్‌కౌర్.. ఎన్సీపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అమరావతి లోక్‌సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. నవనీత్ కౌర్ పలు తెలుగు చిత్రాలతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, పంజాబీ చిత్రాల్లో కూడా నటించారు. -
ధ్రువపత్రాలు పొందండిలా..
నూతన విద్యా సంవత్సరం ఈనెలలో ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం, అలాగే ఫీజురీయింబర్స్‌మెంట్, ప్రభుత్వ పథకాలు పొందేందుకు ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతాయి. ఐదో తరగతి ఉత్తీర్ణత సాధించి పది, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆపై చదువులకు ప్రవేశాలు పొందే వారికి వి«ధిగా కళాశాలల్లో కుల, నివాస ధ్రువీకరణపత్రాలు అందించాల్సి ఉంటుంది. ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చాక హడావుడిగా వీటి కోసం మీసేవ కేంద్రాలకు, తహసీల్దారు కార్యాలయాలకు పరుగులు తీస్తారు. వారి కోసం సంబంధిత ధ్రువీకరణ పత్రాలను ఎలా పొందాలో తెలుసుకుందాం... – కలసపాడు కుల ధ్రువీకరణపత్రం కుల (క్యాస్ట్) ధ్రువీకరణపత్రం పొందేందుకు దగ్గరలోని మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారుని చిరునామా, ఆధార్‌కార్డు, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరిది పాత కులధృవీకరణపత్రం ఉంటే, పాఠశాల, కళాశాలల నుంచి ఇచ్చిన టీసీ పత్రాలు జత చేసి దరఖాస్తు చేయాలి. ఆ తర్వాత సంబంధిత పత్రాలన్నింటిపై వీఆర్ఓ, ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దారు, తహసీల్దార్ ధ్రువీకరిస్తారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం నుంచి ఆన్లైన్ అనుమతి ఇస్తారు. అనంతరం మీసేవ ద్వారా సర్టిఫికెట్ చేతికి వస్తుంది. ఈడబ్ల్యూసీ ఈడబ్ల్యూసీ సర్టిఫికెట్ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ సర్టిఫికెట్ (ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత వర్గాలు) ఈ సర్టిఫికెట్ ఓసీ వర్గాలు, బ్రాహ్మణ, రెడ్డి, వైశ్య, నాయుడు (కమ్మ) తదితర ఉన్నత కులాల వారికి అవసరం ఉంది. వీరు మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్ ఉంటే ప్రభుత్వం విద్య కోసం ఉపకార వేతనాలు అందజేస్తుంది. దీని కోసం ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, అడ్రస్ తెలిపే పత్రాలను అందజేయాల్సి ఉంటుంది. ఓబీసీ ఓబీసీ (అదర్ బ్యాక్వర్డ్ సర్టిఫికెట్) సర్టిఫికెట్‌ను పొందేందుకు దరఖాస్తుదారుడు మీసేవ కేంద్రంలో దరఖాస్తు నింపి వాటితో పాటు కులాన్ని సూచించే సాక్ష్యంతో కూడిన పత్రం, ఆదాయ ధ్రువీకరణపత్రం, రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, విద్యార్హత పత్రాలు, ప్రైవేటు ఉద్యోగులైతే వారి వేతన స్లిప్పులు జతపరిచి మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. ఆదాయ ధ్రువీకరణపత్రం ఆదాయ ధ్రువీకరణపత్రం కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తును నింపి దాంతో పాటు ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, గుర్తింపుకార్డు పత్రాలను జతచేయాలి. సంబంధిత పత్రాలన్నీ మీసేవ కేంద్రంలో వారు స్కాన్‌చేసి అనంతరం పత్రాలను తహసీల్దారు కార్యాలయానికి పంపుతారు. అక్కడ వీఆర్ఓ, ఆర్ఐ, డిప్యూటీ తహసీల్దారు కార్యాలయ సిబ్బంది విచారించి అర్హులకు అనుమతిస్తారు. అనంతరం మీసేవ సర్టిఫికెట్ పొందవచ్చు. నివాస ధ్రువీకరణపత్రం నివాస ధ్రువీకరణపత్రం కోసం సమీపంలోని మీసేవ కేంద్రాల్లో లభించే దరఖాస్తు ఫారం నింపి దాంతో పాటు అన్ని విద్యార్హత పత్రాలు, బోనపైడ్, చిరునామా పత్రం, గుర్తింపు కార్డులను జతచేయాలి. తిరిగి వాటిని సంబంధిత తహశీల్దారు కార్యాలయంలో అందజేయాలి. సంబంధిత వీఆర్ఓలు విచారించి అన్నీ సక్రమంగా ఉంటే జారీ చేస్తారు. గ్యాప్ సర్టిఫికెట్ మండల తహసీల్దారు కార్యాలయాల్లో గ్యాప్ సర్టిఫికెట్ లభిస్తుంది. విద్యలో వెనుకబడిన విద్యార్థులు అనారోగ్య కారణాలతో చదవలేనివారు, చదువు మధ్యలో నిలిపివేసిన వారు తిరిగి ఉన్నత విద్య చదవాలనుకునేవారు విధిగా దీనిని అందజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ద్వారా ఉపకార వేతనాలు పొందే వారికి ఇది తప్పనిసరిగా అవసరం. ఈ సర్టిఫికెట్ పొందాలంటే రూ.10 స్టాంప్‌పేపర్‌పై అఫిడవిట్ (చదువులో ఎందుకు గ్యాప్ వచ్చిందో సూచిస్తూ) నోటరీ, ఇద్దరు గెజిటెడ్ అధికారుల సంతకాలతో కూడిన పత్రాలు, విద్యార్హత పత్రాలు, అనారోగ్య కారణాలతో చదువులో గ్యాప్ వస్తే సంబంధిత మెడికల్ పత్రాలు జతచేసి మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. గడువు వివరాలు సర్టిఫికెట్ల మంజూరుకు ప్రభుత్వం నిర్ణీత గడువు ఇచ్చింది. కుల ధ్రువీకరణపత్రం 30 రోజులు, ఆదాయ ధ్రువీకరణపత్రం ఏడు రోజులు, నివాస ధ్రువీకరణపత్రం ఏడు రోజులు, ఈడబ్ల్యూసీ సర్టిఫికెట్ ఏడు రోజులు, ఓబీసీ సర్టిఫికెట్ 7 రోజులు, గ్యాప్ సర్టిఫికెట్‌ను ఏడు రోజుల్లో పొందవచ్చు. ఎవరినీ ఆశ్రయించాల్సిన పనిలేదు ధ్రువీకరణపత్రాల కోసం నేరుగా మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి. దళారులను ఆశ్రయించొద్దు. అన్నీ అవసరమైన పత్రాలు జతచేస్తే నిర్ణీత కాలవ్యవధిలో అందుతాయి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాల కోసం వెళ్లిన వారు పాత పత్రాలు లేదా కుటుంబ సభ్యుల్లో ఎవరివైనా ఉంటే వాటిని జతచేయాలి. విచారణలో అధికారులకు చాలా సులువుగా ఉంటుంది. సకాలంలో సర్టిఫికెట్ త్వరితగతిన చేతికి అందుతుంది. -
టిక్కెట్ ఇస్తే ఆందోళనకు దిగుతా..
సాక్షి, కొరాపుట్: కులధ్రువీకరణ పత్రాన్ని మాజీ ఎమ్మెల్యే రఘురాం పడాల్ అక్రమ మార్గంలో పొందారని బీఎస్పీ జిల్లా మాజీ అధ్యక్షుడు సోమనాథ్ ఖొరా ఆరోపించారు. ఇదే విషయమై ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో ఆయనకు కులధ్రువీకరణ పత్రం ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారని, అయితే ప్రస్తుతం ఆయనకు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో గతంలో సెమిలిగుడ తహసీల్దార్ కార్యాలయం తిరస్కరించిన కాపీని విలేకరుల ముందు ప్రదర్శించారు. కొరాపుట్ విధానసభ నుంచి ఎమ్మెల్యే టిక్కెట్‌ను ఆశిస్తున్నందు వల్లే రఘురాం కుల ధ్రువీకరణ పత్రాన్ని సంపాదించారని పేర్కొన్నారు. ఒకవేళ కొరాపుట్ ఎమ్మెల్యే సీటును ఆయనకు కేటాయిస్తే తాను ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు. కొరాపుట్ జిల్లా ఓటరుగా తాను ఆయనను విచారణ చేసేందుకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. -
కుల ధ్రువీకరణ పత్రం కోసం చెట్టెక్కాడు..
శ్రీకాకుళం, వంగర: కుల ధ్రువీకరణ పత్రం మంజూరులో జాప్యం చేస్తుండటంతో విసిగిపోయిన ఓ నిరుద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వంగర ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. తలగాం గ్రామానికి చెందిన గుడివాడ సురేష్ 15 రోజులు క్రితం కుల ధ్రువీకరణ పత్రం కోసం మీ–సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 21న(గురువారం) కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ ఉండటం, సర్టిఫికెట్ రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో సహనం కోల్పోయి వంగర ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉన్న మర్రి చెట్టుపైక్కాడు. తక్షణమే సర్టిఫికెట్ మంజూరు చేయకపోతే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని అధికారులను బెదిరించాడు. దీంతో హెచ్‌సీ చిన్నారావు, కానిస్టేబుల్ నరేంద్ర, డీటీ బలివాడ గోవిందరావు, మండల పరిషత్ సూపరింటెండెంట్ త్రినాథులు, ఏఎస్ఓ ఉమామహేశ్వరరావులు స్పందించి సర్టిఫికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువకుడు చెట్టు దిగి కిందకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో సమావేశంలో ఉన్న తహసీల్దార్ రమాదేవికి సమస్య వివరించగా తక్షణమే డిజిటల్ సైన్ చేసి ధ్రువీకరణ పత్రం అందజేశారు. -
హనుమంతుడి కులపత్రం ఇవ్వండి
వారణాసి: హనుమంతుడు దళితుడంటూ మొదలైన చర్చ కొత్త మలుపు తిరిగింది. అంజనీపుత్రుడి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాలంటూ సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత శివపాల్ యాదవ్‌కు చెందిన పార్టీ నేతలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. వారంలోగా సర్టిఫికెట్ ఇవ్వకుంటే ధర్నా చేపడతామని హెచ్చరించారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌తో విభేదాల కారణంగా ములాయం సోదరుడైన శివపాల్ యాదవ్ అక్టోబర్‌లో ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ(పీఎస్‌పీఎల్)(లోహియా) స్థాపించారు. ఆ పార్టీ వారణాసి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు హరీశ్ మిశ్రా శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘దైవ స్వరూపుడైన ఆంజనేయుడి కుల ధ్రువీకరణ పత్రం కోసం వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో దరఖాస్తు చేశాం. హనుమంతుడు దళితుడంటూ సీఎం యోగి వ్యాఖ్యలు చేయడం ద్వారా ఆయన్ను స్వార్థపూరిత కుల రాజకీయాల్లోకి లాగారు. అందుకే హనుమంతుడి కుల సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేశాం’ అని తెలిపారు. దరఖాస్తులో హనుమాన్ తల్లిదండ్రులను మహారాజ్ కేసరి, అంజనాదేవీగాను ఆయన నివాసం ప్రముఖ సంకట్ మోచన్ ఆలయంగాను పేర్కొన్నారు. కులానికి సంబంధించిన కాలమ్‌లో దళితుడిగా, పుట్టిన తేదీని అనంతుడనీ, వయస్సును అమరుడు అని పేర్కొన్నారు. హనుమంతుడు దళితుడైనందున దేశ వ్యాప్తంగా ఉన్న హనుమాన్ ఆలయాలను స్వాధీనం చేసుకుని, దళితులనే పూజారులుగా నియమించుకోవాలంటూ భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ దళితులకు శుక్రవారం పిలుపునిచ్చారు. -
వేటు పడింది
మంచిర్యాలసిటీ : అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినందుకు మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న నెన్నెలకు చెందిన రంగు రామాగౌడ్ ఉదంతంలో తొలి వికెట్ పడింది. రామాగౌడ్‌పై అట్రాసిటీ కేసు పెట్టిన పల్ల మహేష్ అనే వ్యక్తికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం జారీ చేసినందుకు నెన్నెల తహసీల్దార్ సత్యనారాయణను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న రాజలింగును నెన్నెల తహసీల్దార్‌గా బదిలీ చేశారు. అట్రాసిటీ కేసు విషయంలో తనకు న్యాయం జరగడం లేదనే మనస్తాపంతో ఈ నెల 22న కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో రామాగౌడ్ క్రిమిసంహారక మందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అదే రోజు సాయంత్రం మృతి చెందాడు. పల్ల మహేష్ ఎస్టీ కాకున్నా తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో అట్రాసిటీ కేసు పెట్టాడని, తనకు న్యాయం చేయాలని ఆయన ప్రజావాణిలో రెండుసార్లు ఫిర్యాదు చేయడం, అధికారులు సరిగా పట్టించుకోకపోవడం వల్లే రామాగౌడ్ ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఉదంతంపై బెల్లంపల్లి సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్‌రాజ్‌ను కలెక్టర్ కర్ణన్ విచారణ అధికారిగా నియమించారు.సబ్ కలెక్టర్ బుధవారం నెన్నెలకు వెళ్లి రామాగౌడ్ కుటుంబసభ్యులను విచారించారు. పల్ల మహేష్‌కు సంబంధించిన వివరాలు సేకరించారు. రామాగౌడ్‌పై ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నట్లు సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్ ప్రాథమిక విచారణలోనే తేలింది. కుల ధ్రువీకరణ పత్రానికి సంబంధించి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ కూడా ఎస్టీగా సర్టిఫై చేయకుండా ఏకంగా తహసీల్దార్ సత్యనారాయణ సంతకం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. కొలావర్ కులానికి చెందిన వ్యక్తిగా మహేష్‌ను తహసీల్దార్ నేరుగా సర్టిఫై చేశారు. ఈ కుల ధ్రువీకరణ పత్రం కారణంగానే అట్రాసిటీ కేసు నమోదు కావడం, రామాగౌడ్ ఆత్మహత్య చేసుకోవడంతో ప్రాథమిక విచారణలో తహసీల్దార్‌పై మొదటి వేటు పడింది. ఎస్సై కేసు నమోదు చేయగానే విచారణాధికారిగా ఏసీపీ వాస్తవాలను విచారించకుండానే రామాగౌడ్‌పై కేసును నిర్ధారించడం, దానికి తహసీల్దార్ ఇచ్చిన కుల ధ్రువీకరణ పత్రాన్ని ప్రామాణికంగా తీసుకోవడంతో పోలీస్‌శాఖ తీరుపై కూడా విచారణ చేపట్టే అవకాశం ఉంది. దీంతో ఆ శాఖలో ప్రకంపనలు మొదలయ్యాయి. నిబంధనల మేరకు పోలీసులు కేసు పెట్టారా, ఒత్తిళ్లతోనే కేసు నమోదైందా అనేది తేలితే ఆ శాఖపై కూడా చర్యలు తప్పవనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. -
విద్యా వ్యవస్థ కుళ్లిపోయింది...చచ్చిపోతా!
పాల్ఘర్: విద్యా వ్యవస్థలోని లోటుపాట్లు, జాప్యంతో విరక్తి చెందిన మహారాష్ట్ర యువతి తన ప్రాణాలు తీసుకోవడానికి అనుమతించాలని రాష్ట్ర విద్యా మంత్రి వినోద్ తావ్డేను అనుమతి కోరుతూ లేఖ రాసింది. పాల్ఘర్కు చెందిన ఆ యువతిని కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వనందుకు బీఫార్మసీ కాలేజీ యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదు. చివరకు సర్టిఫికెట్ తెస్తే ఆలస్యమైందంటూ కోర్సును మళ్లీ మొదటి నుంచి చదవాలని యూనివర్సిటీ సూచించడంతో ఆవేదనతో లేఖ రాసింది. -
కాపు రుణాలు కంటితుడుపే!
కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు అందించే సంక్షేమ రుణాలు కంటి తుడుపుగా మారుతున్నాయి. జిల్లాలో సుమారుగా 20 వేల కుటుంబాలకు చెందిన కాపు, తెలగ, బలిజ కులస్తులు ఉండగా, కేవలం 786 యూనిట్లు మాత్రమే లక్ష్యంగా తీసుకున్నారు. ఎన్నికల హామీ మేరకు ఆ కులాలకు రుణాలు కల్పించేందుకు ప్రత్యేక కమిషన్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసినా, వారిక ఈ సంస్థ వల్ల ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. నిబంధనాలతోపాటు.. జన్మభూమి కమిటీల జోక్యంతో లబ్ధిదారుల ఎంపికలో రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. శ్రీకాకుళం పాతబస్టాండ్ : తెల్ల కార్డు కలిగి, గ్రామీణ ప్రాంతాలవారికి వార్షిక ఆదాయం రూ.60 వేలు, పట్టణ ప్రాంతాలవారికి రూ.75 వేల కంటే తక్కువ ఉన్నవారు కాపు రుణాలకు అర్హులు. 21నుంచి 45 సంవత్సరాల మధ్య వయ స్సు కలిగి ఉండి, కుల ధ్రువ పత్రం తప్పని సరి. యూనిటుమొత్తం రూ.2 లక్షలు కాగా, బ్యాంకు రుణం రూ.లక్ష, ప్రభుత్వం సబ్సిడీ రూ.లక్ష ఉంటుంది. మండలాని 16 యూనిట్లే... కాపు కార్పొరేషన్ ద్వారా మండలానికి కేవలం 16 యూనిట్లు కేటాయించారు. కొన్ని మండలాల్లో ఈ కులాలు తక్కువగా ఉన్నప్పటికీ, అర్బన్ ప్రాంతాల్లోనూ, ఎల్ఎన్ పేట, జి.సిగడాం, ఆర్ ఆమదాలవలస, రణస్టలం, లావేరు, పాలకొండ, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. వారికి ఈ రుణాలు అందే పరిస్థితి కన్పిండం లేదు. రాజకీయ ప్రమేయంతో మరింత ఇబ్బందిగా మారుతోంది. 4,587 దరఖాస్తులు ఈ రుణాలకు ఈ నెల 20తో గడువు ముగియగా, ఇప్పటి వరకు జిల్లాలో ఆన్లైన్లో 4,587 మంది దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఏడు మండలాల్లో కేవలం 66 యూనిట్లకు మండల కమిటీలు సిఫారసు చేశాయి. ఎచ్చెర్ల ఒకటి, జి.సిగడాం-6, ఇచ్ఛాపురం అర్బన్-16, ఇచ్ఛాపురం రూరల్ -14, ఎల్ఎన్ పేట-25, రేగిడి -4, సారవకోట-3, మిగిలినవి రాజకీయ కారణాలతో అడ్డంకిగా మారుతున్నాయి. సిఫారసులు వస్తే అనుమతులిస్తాం మండల, పురపాలక సంఘాల నుంచి కమిటీ తీర్మానంతో కాపు రుణాల కోసం సిఫారసులు వస్తే, ఆ దరఖాస్తులను పరిశీలించి రుణం అనుమతుల మంజూరుకు చర్యలు తీసుకుంటామని బీసీ కార్పొరేషన్ ఈడీ బి. శ్రీహరిరావు తెలిపారు. జిల్లాకు రూ.7.86 కోట్లే... జిల్లాకు రాయితీ రుణంగా రూ.7.86 కోట్లు కేటాయించారు. వీటితో 50 శాతం సబ్సిడీపై 786 యూనిట్ల మంజూరుకు లక్ష్యాంగా తీసుకున్నారు. అయితే ఆన్లైన్ దరఖాస్తుదారుల్లో అధికంగా బీసీ కాపులే ఉన్నారు. ఇక ఒంటరి కులానికి చెందిన వారు జిల్లాలో లేరు. అక్కడక్కడ కాపులు, తెలగాలు ఉన్నారు. ఇక బలిజ కులస్తులు జి.సిగడాం, వంగర మండలాల్లో ఉన్నారు. తెలగ కులస్తులు రణస్థలం, పాతపట్నం, శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉన్నారు. వాస్తవమైన ఓసీ కాపు, తెలగ కులస్తులకు చెందిన కుటుంబాలు సుమారుగా 20వేల వరకు ఉన్నాయి. -
మరో 47 నకిలీ సర్టిఫికెట్లు!
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు జిల్లాలో నకిలీ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపుతోంది. ఇప్పటికే ఏడు నకిలీ కుల సర్టిఫికెట్ల వ్యవహారంలో పలువురు అరెస్టు కాగా.. ఇదే తరహా లో మరో 47 కుల ధ్రువీకరణ పత్రాలు కల్లూ రు మండలం కేంద్రం నుంచే జారీ అయినట్లు గుర్తించారు. దీంతో వీటిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ వీసీ లేఖ రాసిన సం గతి తెలి సిందే. రెండు రోజుల్లో నివేదిక అందనుంది. ఇతర జిల్లాల వారు కూడా కల్లూరు మండలం నుంచి సర్టిఫికెట్లు తీసుకున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇవన్నీ కల్లూరు తహసీల్దార్‌గా శివరాముడు పనిచేసిన సమయంలోనే జారీ కావడం గమనార్హం. ఇప్పటికే ఆయనపై కేసు నమోదు కాగా అజ్ఞాతంలో ఉన్నారు. 12 మంది డీసీలతో విచారణ బోగస్ కుల సర్టిఫికెట్ల వ్యవహారంలో ఇప్పటికే పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అరెస్టై కటకటాల వెనక్కి వెళ్లారు. తాజాగా మరో 47 సర్టిఫికెట్లపై సమగ్ర విచారణ జరపాలని కలెక్టర్‌కు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ లేఖ రాశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ మొత్తం 12 మంది డిప్యూటీ కలెక్టర్ల(డీసీ)ను విచారణ అధికారులుగా నియమించి రెండు రోజుల్లో నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పలువురు డీసీలు గురువారం రాత్రే విచారణ ప్రారంభించారు. నకిలీల్లో ఎక్కువ మంది బీసీ-బీ సర్టిఫికెట్లపైనే ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. -
రెన్యూవల్ కష్టాలు
ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యూవల్ దరఖాస్తుకు నేడు ఆఖరు లేనిపోని నిబంధనలు, తక్కువ గడువు ఇచ్చిన ప్రభుత్వం దరఖాస్తుకు దూరమైన వేలాదిమంది విద్యార్థులు బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రెన్యూవల్ చేసుకునేందుకు ఈ నెల 10వ తేదీ ఆఖరు కావడంతో విద్యార్థులు ఇబ్బందులుపడాల్సి వస్తోంది. కుల, ఆదాయ, స్థానికత ధ్రువీకరణ పత్రాల కోసం అవస్థలు పడుతున్నారు. రెన్యూవల్‌కు ప్రభుత్వం అక్టోబర్ 28 నుంచి నవంబర్ 10 వరకు మాత్రమే గడువు ఇచ్చింది. కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీ సేవా కేంద్రాల్లో కనీసం 15 రోజుల సమయం పడుతుంది. కాగా ప్రభుత్వం ఇచ్చిన సమయం కేవలం 14 రోజులు మాత్రమే. ఈ 14 రోజుల్లోనూ రెండు ఆదివారాలు, ఒక రెండో శనివారం, మొహర్రం పండుగ సెలవులు వచ్చాయి. ఇక మిగిలిన పది రోజుల్లో విద్యార్థులు ప్రభుత్వం కోరిన విధంగా అన్ని ధ్రువీకరణ పత్రాలతో ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది సందిగ్ధం. అలాగే ఫీజురీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులంతా జూన్ 2 తర్వాత మీ సేవా కేంద్రాల్లో పొందిన కుల, ఆదాయ, స్థానికత తదితర ధ్రువీకరణ పత్రాలను మాత్రమే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. విద్యార్థుల ఆధార్‌తో పాటు తల్లిదండ్రుల ఆధార్‌కార్డులనూ అప్లోడ్ చేయాలనే నిబంధనా ఉంది. దీంతో అనేక మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకోలేక దూరం కానున్నారు. రీయింబర్స్మెంట్ తేదీల ప్రతిపాదనలను గత నెల 27న ప్రభుత్వం అన్ని కళాశాలలకు పంపించింది. ఈ పాస్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. అయితేఈ నోటీసులను సరైన సమయంలో విద్యార్థుల దృష్టికి తీసుకుపోవడంలో అనేక కళాశాలలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని ఆరోపణలున్నాయి. దీంతో జిల్లాలో మొత్తం 64,172 మంది రెన్యూవల్ విద్యార్థులకుగాను ఇప్పటి వరకు 12,661 మంది మాత్రమే రెన్యూవల్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. కాస్త గడువు పెంచి, నిబంధనలు సడలిస్తే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. గడువు పెంచాలి ఫీజు రీయింబర్స్మెంట్ రెన్యూవల్ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచాలి. దరఖాస్తు చేసుకునేందుకు అనేక నిబంధనలు విధించి అతి తక్కువ సమయం ఇస్తే ఎలా. విద్యార్థులకు అన్యాయం చేసేందుకే ప్రభుత్వం ఈ విధమైన కుట్రలను పన్నుతోంది. - మహ్మద్ఫ్రీ బీటెక్, ద్వితీయ సంవత్సరం ఉన్నత విద్యను దూరం చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసేందుకు ఇలాంటి ప్లాన్లు చేస్తోంది. అతి తక్కువ వ్యవధిలో దరఖాస్తు చేసుకోమంటే ఎలా సాధ్యమవుతుంది. అనేక మందికి ఆధార్‌కార్డులు లేక పోయినా, ఫీజుకు ఆధార్ లింకు పెట్టడం బాధాకరం. - జీవీ నాగేంద్ర, బీటెక్ ఫైనలియర్ నిబంధనలను సడలించాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం నిబంధనలను సడలించాలి. ముఖ్యంగా ఫీజుకు ఆధార్ లింకును తొలగించాలి. అలాగే జూన్ 2 తర్వాత మీ సేవా కేంద్రాల్లో తీసుకున్న కుల, ఆదాయ, స్థానికత సర్టిఫికెట్ల విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచించాలి. - జీ శివశంకర్, బీటెక్ ఫైనలియర్ -
కళంకితురాలికి కేబినెట్ పదవా?
ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ గిరిజన ఎమ్మెల్యేలు హైదరాబాద్: తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఎన్నికల్లో పోటీచేసి గెలుపొందిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టేందుకు జరుగుతున్న ప్రయత్నాలు సబబు కావని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు ఆక్షేపించారు. ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, రాజన్నదొర, రాజేశ్వరిలు మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ బి.ఉదయలక్ష్మిని కలసి ఆ మేరకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ... ఎంపీ గీత అసలు ఎస్టీ కాదని, అలాంటప్పుడు ఆమెను పదవి నుంచి తొలగించి తగిన చర్యలు చేపట్టాల్సింది పోయి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధతో జాతీయ ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా నియమించేందుకు కేంద్రానికి సిఫార్సు చేయాలని చూడడం సిగ్గుచేటని విమర్శించారు. సాధారణ ఎంపీగా ఉండేదానికన్నా కేబినెట్ ర్యాంకు హోదాను పొందితే ప్రజా ధనాన్ని దోచుకోవచ్చనే దుర్బుద్ధితోనే కొత్తపల్లి గీత టీడీపీతో కుమ్మకైందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది వ్యక్తిగత లబ్ధికోసమే ఆమె తెలుగుదేశం పంచన చేరారని వారు దుయ్యబట్టారు. -
తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం
ఆర్డీఓ బాపిరెడ్డి విచారణ రేగులచెలక (సీఎస్‌పురం), న్యూస్‌లైన్ : తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం పొంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపై ఆర్డీఓ టి.బాపిరెడ్డి గురువారం విచారణ చేపట్టారు. రేగులచెలక గ్రామానికి చెందిన వ్యక్తిగా కక్కా వెంకటరమణయ్య పేరున ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం పొందిన ఓ వ్యక్తి పూణేలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. దీనిపై విచారణ జరిపి నివేదిక పంపించాలంటూ అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు ఆర్డీఓ రేగులచెలక గ్రామంలోని ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలలో విచారణ చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో స్థానిక ఎస్టీ కులానికి చెందిన వ్యక్తులను పిలిపించి విచారణ చేశారు. కక్కా ఇంటి పేరుగల వారు తమకు తెలిసినంత వరకూ గ్రామంలో ఎవరూ లేరనీ, గతంలో ఇక్కడ ఉండే వారేమో తమకు తెలియదని ఎస్టీలు వివరించారు. గ్రామ పెద్దలు సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. గ్రామంలో ఉన్న కుక్కా ఇంటి పేరు గల వారిని కూడా ఆర్డీఓ విచారణ చేశారు. అనంతరం ఆర్సీఎం ప్రాథమిక పాఠశాలలోని అడ్మిషన్ రిజిస్టర్‌ను పరిశీలించారు. 1976లో కుక్కా వెంకటరమణయ్య (తండ్రి సోమయ్య) పేరుతో 474 సీరియల్ నంబర్లో అడ్మిషన్ రాసి ఉంది. 1989లో ఆ సీరియల్ నంబర్‌తో కక్కా వెంకటరమణయ్య పేరుతో స్టడీ సర్టిఫికెట్ పొందినట్లుగా రికార్డులో నమోదై ఉంది. విచారణ వివరాలను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కె.ఏడుకొండలు, ఆర్ఐ మధుసూదన్‌రావు, వీఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్సీఎం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లూర్దు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పెరికె బలిజకు బీసీ సర్టిఫికెట్ ఇప్పించాలని వినతి తమ గ్రామంలో ఉన్న పెరికె బలిజ కులస్తులకు బీసీ సర్టిఫికెట్లను ఇప్పించాలని రేగులచెలక గ్రామస్తులు ఆర్డీఓ బాపిరెడ్డికి విన్నవించారు. గ్రామానికి వచ్చిన ఆర్డీఓను గ్రామస్తులు కలిశారు. పెరికె బలిజలకు గతంలో బీసీ సర్టిఫికెట్లు ఇచ్చేవారనీ ఇటీవల బీసీగా ఇవ్వడం లేదని వివరించారు. పెరికె బలిజలకు న్యాయం చేయాలని గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి చెంచా రమేష్, పలువురు గ్రామస్తులు ఆర్డీఓను వేడుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాలి వీఆర్ఓలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్డీఓ బాపిరెడ్డి ఆదేశించారు. తహశీల్దారు కార్యాలయంలో గురువారం వీఆర్ఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు. -
దొరకునా ‘మీసేవ’ ?
=నిరంతరం సర్వర్ల్ల డౌన్ =సమయపాలన లేదు =విద్యుత్‌కోతలతో అంతరాయం =అధిక చార్జీల వసూలు =సేవల్లో జాప్యం =కొన్నిచోట్ల విద్యుత్ బిల్లులు కట్టించుకోని నిర్వాహకులు =దరఖాస్తుదారులకు తిప్పలు జిల్లాలోని మీ-సేవ కేంద్రాలు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని కేంద్రాల్లో నిర్ణీత చార్జీల కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. కంప్యూటర్ పరిజ్ఞానం లేని ఆపరేటర్ల కారణంగా దరఖాస్తుదారులకు అవస్థలు తప్పడం లేదు. సర్టిఫికెట్ల కోసం నెలల తరబడి తిరుగుతున్న వారూ ఉన్నారు. ఇదేనా మీ-సేవ కేంద్రాల పనితీరు అంటూ జనం మండిపడుతున్నారు. సాక్షి, చిత్తూరు: ఈ సేవ పేరును మీ-సేవగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మార్చారు. జిల్లాలో 186 మీ-సేవ కేంద్రాలు ఉన్నాయి. కొత్తగా 81 కేంద్రాలకు ప్రతిపాదనలు పంపారు. మొత్తం 20 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 225 రకాల సేవలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తామని అధికారులు ఘనంగా ప్రకటించారు. తక్కువ రోజుల్లోనే సర్టిఫికెట్ల జారీ, ఇక కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేదంటూ ఊదరగొట్టారు. అయితే 30 లోపు సేవలు మాత్రమే ప్రజలకు అందుతున్నాయి. ఈ సేవలూ సర్వర్ సమస్య కారణంగా నెలలో పదిహేను రోజులు అందడం లేదు. ఈ పరిస్థితి మండల కేంద్రాల్లో మరింత ఎక్కువగా ఉంది. చాలాచోట్ల మీసేవ నిర్వాహకులు నిర్ణీత మొత్తం కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. మదనపల్లెలో 14 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. చాలా వాటిల్లో సమయపాలన పాటించడం లేదు. దరఖాస్తులను ఆయా విభాగాలకు పంపడంలో జాప్యం జరుగుతోంది. కొన్ని కేంద్రాలకు మీసేవ అనే బోర్డులూ లేవు. చాలా చోట్ల ఏఏ సేవలు పొందవచ్చో తెలిపే సూచికబోర్డులు లేవు. విద్యుత్‌బిల్లులు చెల్లించినా నిర్ణీత సమయంలో ఆన్లైన్ కాకపోవడంతో సర్వీసు కట్ చేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గంలో మీ-సేవా కేంద్రాల పనితీరుపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ల బ్రేక్, విద్యుత్ కోతల కారణంగా సకాలంలో సేవలు అందడం లేదు. పలమనేరు నియోజకవర్గంలో 17మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 25 సేవలు మాత్రమే అందుతున్నాయి. ఏఏ సేవలకు ఎంత చార్జీ అనే వివరాలు ఎక్కడా లేవు. బెరైడ్డిపల్లె మండలంలో ప్రతి కులానికీ అఫిడవిట్ కావాలని అడుగుతున్నారు. కులం సర్టిఫికెట్‌కు చార్జీ 30 రూపాయలు. అయితే అఫిడవిట్ కోసం పలమనేరుకు వచ్చి వెళ్లేందుకు రూ.400 వరకు ఖర్చవుతోంది. మీసేవ కేంద్రం నిర్వాహకులు సమయపాలన పాటించడం లేదు. సర్వర్లు అప్పుడప్పుడూ మొరాయిస్తున్నాయి. నిర్ణీత చార్జీలు వసూలు చేయడం లేదు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆరు మీసేవ కేంద్రాలు ఉన్నాయి. వీటిని కంప్యూటర్ పరిజ్ఞానం లేనివారు నిర్వహిస్తున్నారు. నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల జారీ జరగడం లేదు. చిన్న సర్టిఫికెట్ కోసమూ నెలల తరబడి తిరుగుతున్న వారున్నారు. దీనిపై నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వడం లేదు. నగరి నియోజకవర్గంలో ఏడు మీసేవ కేంద్రాలు నిర్వహిస్తున్నారు. కులం, ఆదాయం, ఓటరు కార్డు సేవలు మాత్రం అందుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖ సేవలు, మున్సిపల్ ఇంటిపన్ను కట్టించుకోవడం లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో 12 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ అధికారులు, రిజిస్ట్రేషన్‌శాఖ అధికారులు సంబంధిత సర్టిఫికెట్ల జారీలో జాప్యం చేస్తున్నారు. కొన్ని కేంద్రాల్లో నిర్ణీత చార్జీ కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. కరకంబాడి, పాపనాయుడుపేట మీసేవ కేంద్రాలు విద్యుత్‌కోతల వల్ల పని చేయడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కేంద్రాల నిర్వాహకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారు. తిరుపతి నియోజకవర్గంలో తొమ్మిది మీసేవ కేంద్రాలు ఉన్నాయి. సేవలు పూర్తి స్థాయిలో అందడం లేదు. బర్త సర్టిఫికెట్లు, మరికొన్ని రెవెన్యూసేవలు అందడం లేదు. ఒక్కో సర్టిఫికెట్ కోసం నాలుగైదు సార్లు తిప్పించుకుంటున్నారు. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో మీసేవ కేంద్రాల నిర్వహణ సరిగా లేదు. పెనుమూరు, వెదురుకుప్పం, పాలసముద్రం మండలాల్లోని కేంద్రాల్లో విద్యుత్‌చార్జీలు కట్టించుకోవడం లేదు. చంద్రగిరి నియోజకవర్గంలో 12 కేం ద్రాలు ఉన్నాయి. చంద్రగిరి కేంద్రంలో బర్త సర్టిఫికెట్ల జారీ, రెవెన్యూ సేవల్లో జాప్యం జరుగుతోంది. పోలీస్‌శాఖ జారీ చేసే ఎఫ్ఐఆర్, ఇతర సర్టిఫికెట్లు మీసేవ ద్వారా అందడం లేదు.