ఆర్డీఓ బాపిరెడ్డి విచారణ
రేగులచెలక (సీఎస్‌పురం), న్యూస్‌లైన్ : తప్పుడు కుల ధ్రువీకరణ పత్రం పొంది ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తిపై ఆర్డీఓ టి.బాపిరెడ్డి గురువారం విచారణ చేపట్టారు. రేగులచెలక గ్రామానికి చెందిన వ్యక్తిగా కక్కా వెంకటరమణయ్య పేరున ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రం పొందిన ఓ వ్యక్తి పూణేలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడు. దీనిపై విచారణ జరిపి నివేదిక పంపించాలంటూ అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు ఆర్డీఓ రేగులచెలక గ్రామంలోని ఆర్‌సీఎం ప్రాథమిక పాఠశాలలో విచారణ చేశారు. గ్రామ పెద్దల సమక్షంలో స్థానిక ఎస్టీ కులానికి చెందిన వ్యక్తులను పిలిపించి విచారణ చేశారు.
కక్కా ఇంటి పేరుగల వారు తమకు తెలిసినంత వరకూ గ్రామంలో ఎవరూ లేరనీ, గతంలో ఇక్కడ ఉండే వారేమో తమకు తెలియదని ఎస్టీలు వివరించారు. గ్రామ పెద్దలు సైతం ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. గ్రామంలో ఉన్న కుక్కా ఇంటి పేరు గల వారిని కూడా ఆర్డీఓ విచారణ చేశారు. అనంతరం ఆర్‌సీఎం ప్రాథమిక పాఠశాలలోని అడ్మిషన్ రిజిస్టర్‌ను పరిశీలించారు. 1976లో కుక్కా వెంకటరమణయ్య (తండ్రి సోమయ్య) పేరుతో 474 సీరియల్ నంబర్‌లో అడ్మిషన్ రాసి ఉంది. 1989లో ఆ సీరియల్ నంబర్‌తో కక్కా వెంకటరమణయ్య పేరుతో స్టడీ సర్టిఫికెట్ పొందినట్లుగా రికార్డులో నమోదై ఉంది. విచారణ వివరాలను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు ఆర్డీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దారు కె.ఏడుకొండలు, ఆర్‌ఐ మధుసూదన్‌రావు, వీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఆర్‌సీఎం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లూర్దు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
పెరికె బలిజకు బీసీ సర్టిఫికెట్ ఇప్పించాలని వినతి
తమ గ్రామంలో ఉన్న పెరికె బలిజ కులస్తులకు బీసీ సర్టిఫికెట్లను ఇప్పించాలని రేగులచెలక గ్రామస్తులు ఆర్డీఓ బాపిరెడ్డికి విన్నవించారు. గ్రామానికి వచ్చిన ఆర్డీఓను గ్రామస్తులు కలిశారు. పెరికె బలిజలకు గతంలో బీసీ సర్టిఫికెట్లు ఇచ్చేవారనీ ఇటీవల బీసీగా ఇవ్వడం లేదని వివరించారు. పెరికె బలిజలకు న్యాయం చేయాలని గ్రామానికి చెందిన బీటెక్ విద్యార్థి చెంచా రమేష్, పలువురు గ్రామస్తులు ఆర్డీఓను వేడుకున్నారు.
ప్రజలకు అందుబాటులో ఉండాలి
వీఆర్‌ఓలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆర్‌డీఓ బాపిరెడ్డి ఆదేశించారు. తహశీల్దారు కార్యాలయంలో గురువారం వీఆర్‌ఓల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి అందే అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సూచించారు.
తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం
Published Fri, May 30 2014 1:53 AM | Last Updated on Sat, Sep 2 2017 8:02 AM
Advertisement