
చెట్టెక్కిన యువకుడు, (ఇన్‌సెట్లో)గుడివాడ సురేష్
శ్రీకాకుళం, వంగర: కుల ధ్రువీకరణ పత్రం మంజూరులో జాప్యం చేస్తుండటంతో విసిగిపోయిన ఓ నిరుద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వంగర ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో బుధవారం చోటుచేసుకుంది. తలగాం గ్రామానికి చెందిన గుడివాడ సురేష్ 15 రోజులు క్రితం కుల ధ్రువీకరణ పత్రం కోసం మీ–సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ నెల 21న(గురువారం) కానిస్టేబుల్ ఫిజికల్ టెస్ట్ ఉండటం, సర్టిఫికెట్ రాకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో సహనం కోల్పోయి వంగర ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉన్న మర్రి చెట్టుపైక్కాడు. తక్షణమే సర్టిఫికెట్ మంజూరు చేయకపోతే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని అధికారులను బెదిరించాడు. దీంతో హెచ్‌సీ చిన్నారావు, కానిస్టేబుల్ నరేంద్ర, డీటీ బలివాడ గోవిందరావు, మండల పరిషత్ సూపరింటెండెంట్ త్రినాథులు, ఏఎస్‌ఓ ఉమామహేశ్వరరావులు స్పందించి సర్టిఫికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు. అనంతరం యువకుడు చెట్టు దిగి కిందకు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో సమావేశంలో ఉన్న తహసీల్దార్ రమాదేవికి సమస్య వివరించగా తక్షణమే డిజిటల్ సైన్ చేసి ధ్రువీకరణ పత్రం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment