సాక్షి, అమరావతి: పదో తరగతి విద్యార్థులు అడక్కుండానే.. వారికి కుల ధ్రువీకరణ సర్టీఫికెట్లు జారీచేసే కొత్త విధానానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవల్ని అందించే క్రమంలో ఎక్కడా, ఎప్పుడూ లేనివిధంగా సరికొత్తగా రాష్ట్రంలో ఈ విధానాన్ని తీసుకువచ్చారు. సాధారణంగా పదో తరగతి పూర్తయిన విద్యార్థులు.. ఇంటర్, ఆపై చదువుల కోసం తప్పనిసరిగా కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది.
అంతకుముందు కుల ధ్రువీకరణ సర్టిఫికెట్లు తీసుకున్నా.. పదో తరగతి ఉత్తీర్ణులయ్యాక తాజా సర్టిఫికెట్ తీసుకోవడం తప్పనిసరి. దీంతో విద్యా సంవత్సరం ప్రారంభంలో ఈ సర్టిఫికెట్ల కోసం గతంలో మీసేవ, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ విద్యార్థులు తిరిగేవారు. దీంతో ఆయా కార్యాలయాలు విద్యార్థులతో కిటకిటలాడేవి.
దీనిని గమనించిన ప్రభుత్వం విద్యార్థులు అడక్కుండానే కుల ధ్రువీకరణ పత్రాల జారీని చేపట్టింది. ఇందుకోసం ఈ సంవత్సరం పదో తరగతి పరీక్షలు రాసిన 10 లక్షల మంది విద్యార్థుల వివరాల డేటాను విద్యా శాఖ ద్వారా తీసుకున్నారు. ఆ డేటా మొత్తాన్ని గ్రామ, వార్డు సచివాలయం డేటాబేస్‌కు అనుసంధానించారు.
వీఆర్వోల ద్వారా తనిఖీ చేయించి..
సేకరించిన డేటాను రెవెన్యూ శాఖ గ్రామాల వారీగా విభజించి గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో పనిచేసే వీఆర్వో లాగిన్‌లకు పంపించింది. వీఆర్వోలు తమ పరిధిలోని పదో తరగతి విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వారి కుల ధ్రువీకరణను పరిశీలించి నివేదికలు రూపొందించారు. విద్యార్థితోపాటు వారి కుటుంబ సభ్యులందరి సామాజిక వర్గాన్ని కూడా నిర్ధారించారు. అంటే ఒక్కో కుటుంబానికి నలుగురు సభ్యుల లెక్కన దాదాపు 40 లక్షల మంది సామాజిక వర్గాన్ని ధ్రువీకరించారు.
ఈ సర్టిఫికెట్లు వీఆర్వో లాగిన్ నుంచి తహసీల్దార్లకు పంపించారు. అక్కడి నుంచి సర్టీఫికెట్లు జారీ చేస్తున్నారు. ఇప్పుడు పదో తరగతి విద్యార్థి ఎవరైనా తమ పరిధిలోని గ్రామ, వార్డు సచివాలయానికి వెళ్లి.. వెంటనే తమ కుల ధ్రువీకరణ పత్రం పొందే అవకాశం కల్పించారు.
దరఖాస్తులతో పని లేదు
గతంలో మాదిరిగా విద్యార్థులు కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా.. వెరిఫికేషన్ చేయాల్సిన పని లేకుండా నేరుగా విద్యార్థులకు సర్టీఫికెట్లు జారీ చేస్తారు. ప్రస్తుతం సేకరించిన 40 లక్షల మంది వివరాలు గ్రామ, వార్డు సచివాలయ డేటాబేస్‌లో నిక్షిప్తమై ఉంటాయి.
భవిష్యత్‌లో 40 లక్షల మందిలో ఎవరికైనా కుల ధ్రువీకరణ పత్రం కావాల్సి వస్తే.. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండానే తక్షణం జారీ చేస్తారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా పల్లె ముంగిటకు వచ్చిన పరిపాలన, సాంకేతికతను అనుసంధానించి సర్టిఫికెట్ల జారీని ప్రభుత్వం సులభతరం చేసింది. తద్వారా 10 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చిపెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment