
సాక్షి, అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశాలు, స్కాలర్‌షిప్‌లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది.
పేద కుటుంబాల ఆదాయన్ని బియ్యం కార్డు ద్వారా నిర్థారించవచ్చని, ఆ కార్డును చూపించినప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆదాయ ధృవీకరణ పత్రాలు అడగకూడదని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా పలు శాఖలు ప్రత్యేకంగా వీటిని అడుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు మళ్లీ ప్రత్యేకంగా సర్టీఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది.
ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ ధృవీకరణ పత్రాలు లేని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులందరికీ రెవెన్యూ శాఖ వాటిని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుంది.
ఆ శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాలి. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని నిర్దేశించారు. పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే తీసుకుంటారని తెలిపింది. ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను రియల్ టైమ్‌లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్ సర్వీసుల సాఫ్ట్‌వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టీఫికేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధిత వినియోగం, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్దిష్ట కేసులకు మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీకి ప్రస్తుత విధానం కొనసాగుతుంది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేస్తుంది.
ఆరు దశల ధ్రువీకరణ ఇలా..
ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆరు దశల్లో దరఖాస్తుదారు ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఆధార్ కార్డు, ఇతర వివరాల ద్వారా ఆ వ్యక్తికి ఉన్న భూమి, మున్సిపల్ ఆస్తి, 4 చక్రాల వాహనం ఉందా? ప్రభుత్వ ఉద్యోగమా? ఆదాయపు పన్ను వివరాలు, వారు వినియోగించే విద్యుత్ యూనిట్లను పరిశీలిస్తారు. వీటి ద్వారా వారి ఆరి్థక స్థితిని నిర్ధారిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment