Verification documents
-
జనవరి 1న ‘కొత్త’ శోభ
కర్నూలు(అగ్రికల్చర్): వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద మరోసారి కొత్త పింఛన్ల మంజూరుకు రంగం సిద్ధమైంది. వేలాది మంది అవ్వతాతలు, అక్కచెల్లెమ్మలు, వివిధ వర్గాల వారి జీవితాలకు భరోసానిస్తూ కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. నవరత్నాల్లో భాగంగా ఏడాదికి రెండు సార్లు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని వైఎసార్సీపీ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా రాజకీయాలకు అతీతంగా కొత్త పింఛన్లు మంజూరు చేస్తుండటం విశేషం. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియను జనవరి 1న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. అదే రోజు నుంచి పాత వాటితో పాటు కొత్త పింఛన్ల పంపిణీ మొదలు కానుంది. ఇదిలాఉంటే ప్రస్తుతం రూ.2,750 ఉన్న పెన్షన్ కానుకను జనవరి 1 నుంచి రూ.3వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్త పింఛన్లను కూడ ఇదే మొత్తాన్ని అందించనుండటంతో అవ్వతాతలు, ఇతర అన్ని వర్గాల్లో ఆనందం వ్యక్తమవుతోంది. ఏడాదిలో 38,592 కొత్త పింఛన్లు 2023 సంవత్సరం జనవరి, సెప్టెంబర్ నెలల్లో ప్రభుత్వం కొత్త పింఛన్లు మంజూరు చేసింది. జనవరిలో కర్నూలు జిల్లాకు 8,446, నంద్యాల జిల్లాకు 6,843 చొప్పున ఉమ్మడి జిల్లాకు 15,289 కొత్త పింఛన్లు వచ్చాయి. సెప్టెంబర్ నెలలో రెండు విడతలుగా కర్నూలు జిల్లాకు 12,341, నంద్యాల జిల్లాకు 10,962 చొప్పున ఉమ్మడి జిల్లాకు 23,303 పింఛన్లు మంజూరయ్యాయి. టీడీపీ ప్రభుత్వంలో 2018 డిసెంబర్ నెలలో ఉమ్మడి జిల్లాలో 3,61,563 పింఛన్లు ఉండగా వీటికి పంపిణీ చేసిన నగదు రూ.40.27 కోట్లు మాత్రమే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2023 సెపెంబర్ నెలలో పింఛన్ల సంఖ్య 4,71,561కి చేరుకుంది. టీడీపీ హయాంతో పోలిస్తే 1,09,998 పింఛన్లు పెరిగాయి. ప్రస్తుతం పింఛన్ల రూ.130.76 కోట్లు పంపిణీ చేస్తున్నారు. రాజకీయాలకు అతీతం టీడీపీ పాలనలో పింఛను పొందాలంటే ఓ ప్రహసనమనే చెప్పాలి. ప్రత్యేకంగా కొత్త పింఛన్ల ఊసే ఉండేది కాదు. పింఛను పొందుతున్న వారిలో ఎవరైన మరణిస్తేనే కొత్త పింఛను మంజూరు చేసేవారు. అప్పుడు కూడా జన్మభూమి కమిటీలకు ముడుపులు ఇచ్చుకోవాల్సిందే. అయితే వైఎస్ఆర్సీపీ పాలనలో అర్హతే ప్రామాణికంగా, రాజకీయాలకు అతీతంగా పింఛన్లు మంజూరవుతున్నాయి. ఏడాదికి రెండుసార్లు కొత్త పింఛన్లు మంజూరు చేస్తుండటం విశేషం. ప్రత్యేక టీంలతో వెరిఫికేషన్ కొత్త పింఛన్ల డేటా వెరిఫికేషన్ కోసం డీఆర్డీఏ–వైకేపి సూచనల ప్రకారం గ్రామీణ, అర్బన్ ప్రాంతాల్లో ప్రత్యేక టీంలు ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో మూడు, అర్బన్ ప్రాంతాల్లో ఆరు టీంలు ఏర్పాటు చేశారు. వెరిఫికేషన్ కోసం ప్రత్యేకంగా యాప్‌ను సిద్ధం చేశారు. దరఖాస్తుల వివరాలు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ నుంచి డేటా నేరుగా ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లకు చేరుతోంది. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు మంగళవారం నుంచి వెరిఫికేషన్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ప్రక్రియను నెలాఖరులోపు పూర్తి చేయాల్సి ఉంది. ఉమ్మడి జిల్లాలో 25 వేలకుపైగా కొత్త పింఛన్ల డేటా వెరిఫికేషన్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. వెరిఫికేషన్‌లో ఏమి చేస్తారంటే.. ► కొత్త పింఛన్ల కోసం కొన్ని నెలల క్రితం దరఖాస్తులు అప్లోడ్ అయ్యాయి. ► అందువల్ల వెరిఫికేషన్‌లో దరఖాస్తుదారు బతికే ఉన్నారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తారు. ►గ్రామం/పట్టణంలో నివాసం ఉంటున్నారా... లేదా? పింఛను పొందడానికి అర్హతను తెలుసుకుంటారు. ► వికలాంగులు అయితే సదరం సరి్టఫికెట్ తప్పనిసరి. ► ఇతర పింఛన్లకు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు. -
మరింత సులభంగా ఆదాయ ధ్రువీకరణ పత్రాలు
సాక్షి, అమరావతి: ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీని రాష్ట్ర ప్రభుత్వం మరింత సులభతరం చేసింది. విద్యా సంస్థల్లోకి ప్రవేశాలు, స్కాలర్షిప్లు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం రాసే పరీక్షల్లో ఫీజు మినహాయింపు, సంక్షేమ పథకాల కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి కావడంతో వాటన్నింటికీ గ్రామ, వార్డు సచివాలయాల్లో చేసే ఆరు దశల ధృవీకరణ సరిపోతుందని స్పష్టం చేసింది. ఈమేరకు తాజాగా రెవెన్యూ శాఖ జీవో జారీ చేసింది. పేద కుటుంబాల ఆదాయన్ని బియ్యం కార్డు ద్వారా నిర్థారించవచ్చని, ఆ కార్డును చూపించినప్పుడు ప్రభుత్వ సంస్థలు ఆదాయ ధృవీకరణ పత్రాలు అడగకూడదని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినా పలు శాఖలు ప్రత్యేకంగా వీటిని అడుగుతున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఆరు దశల ధ్రువీకరణ అమలవుతున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు మళ్లీ ప్రత్యేకంగా సర్టీఫికెట్ సమర్పించాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ సమస్య పరిష్కారానికి రెవెన్యూ శాఖ అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది. ఆదాయ ధృవీకరణ పత్రాలు లేని పదో తరగతి, ఇంటర్ విద్యార్థులందరికీ రెవెన్యూ శాఖ వాటిని ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు సంబంధిత శాఖలు ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అడగకూడదు. గ్రామ, వార్డు సచివాలయాలు జారే చేసే ధృవీకరణ పత్రం వీటికి సరిపోతుంది. ఆ శాఖలు సచివాలయాల ద్వారా ధ్రువీకరణ పత్రాలను తెప్పించుకుని పని పూర్తి చేయాలి. ఇందుకోసం మూడు రోజుల సమయాన్ని నిర్దేశించారు. పోస్ట్ మెట్రిక్యులేషన్ స్కాలర్‌షిప్‌లకు కూడా ఆరు దశల ధ్రువీకరణ పత్రాన్నే తీసుకుంటారని తెలిపింది. ఆరు దశల ధ్రువీకరణ ప్రక్రియను రియల్ టైమ్‌లో పూర్తి చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల శాఖ సాఫ్ట్‌వేర్‌ను ఆయా సంక్షేమ పథకాలు, సిటిజన్ సర్వీసుల సాఫ్ట్వేర్లతో అనుసంధానం చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఈడబ్ల్యూఎస్ సర్టీఫికేషన్, ఇతర కేంద్ర ప్రభుత్వ సంబంధిత వినియోగం, జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం వంటి నిర్దిష్ట కేసులకు మాత్రం ఆదాయ ధృవీకరణ పత్రాలను జారీకి ప్రస్తుత విధానం కొనసాగుతుంది. ఏ అవసరం కోసం ఆదాయ ధ్రువీకరణ పత్రం కోరుతున్నారో, అందుకోసం మాత్రమే పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జారీ చేస్తుంది. ఆరు దశల ధ్రువీకరణ ఇలా.. ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయడానికి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఆరు దశల్లో దరఖాస్తుదారు ఆర్థిక స్థితిని అంచనా వేస్తారు. ఆధార్ కార్డు, ఇతర వివరాల ద్వారా ఆ వ్యక్తికి ఉన్న భూమి, మున్సిపల్ ఆస్తి, 4 చక్రాల వాహనం ఉందా? ప్రభుత్వ ఉద్యోగమా? ఆదాయపు పన్ను వివరాలు, వారు వినియోగించే విద్యుత్ యూనిట్లను పరిశీలిస్తారు. వీటి ద్వారా వారి ఆరి్థక స్థితిని నిర్ధారిస్తారు. -
ఓటుపై వేటు
ఓటు ప్రతి పౌరుడి ప్రజాస్వామ్య హక్కు. అలాంటి హక్కును అధికారులు, అధికార పార్టీ హననం చేస్తోన్నాయి. ఓటు వజ్రాయుధం అని, ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని ప్రచారం చేస్తున్న అధికారులు నమోదైన ఓట్లను ఇష్టారాజ్యంగా తొలగిస్తున్నారు. జిల్లాలో ఓట్ల తొలగింపు ప్రక్రియను చూస్తే అధికార యంత్రాంగం టీడీపీ ప్రభుత్వానికి సాగిలపడి తమవంతు సహకారం అందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. అధికార టీడీపీ రానున్న ఎన్నికల్లో మళ్లీ గెలవడానికి అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని అన్ని అడ్డదార్లు తొక్కుతోంది. ఓటుపై వేటుతో కుటిల నీతికి పాల్పడుతోంది. ఎన్నికల కమిషన్ పర్యవేక్షణలో పనిచేసే అధికారులను ఉపయోగించుకుంటోంది. జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపుతో టీడీపీ రాజకీయ అవినీతికి పాల్పడుతోంది. అది కూడా ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా బలం ఉండి 2014 ఎన్నికల్లో మంచి మెజార్టీ సాధించిన నియోజకవర్గాల్లోనే అత్యధిక ఓట్లు తొలగించారు. ఒకటి కాదు రెండు కాదు జిల్లాలో ఏకంగా 2.50 లక్షల పైచిలుకు ఓట్లు తొలగించి అధికార పార్టీ నీచ రాజకీయాలకు తెరలేపింది. ముఖ్యంగా నెల్లూరు నగరం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లోనే 1.73 లక్షల ఓట్లు తొలగించడం గమనార్హం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఓటర్ల నమోదు, చేర్పులు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తిగా గందరగోళంగా సాగింది. 2015 నాటికి సిద్ధం చేసిన తుది ఓట్లర్ల జాబితాతో పోలిస్తే 2018 మార్చిలో ప్రకటించిన తుది జాబితాకు భారీగా వ్యత్యాసం ఉంది. డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లు, స్థానికంగా ఉండటం లేదనే రకరకాల సాకులతో జిల్లాలో భారీగా ఓట్లు తగ్గించారు. గతంలో వైఎస్సార్సీపీకి చెందిన నెల్లూరు నగర ఎమ్మెల్యే పి. అనీల్ కుమార్ యాదవ్, పార్టీకి చెందిన జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, వామపక్షాల ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యంతో సహా పదుల సంఖ్యలో ప్రముఖల ఓట్లు గల్లంతు అయ్యాయి. ఈ క్రమంలో అప్పట్లో నిరసన వ్యక్తం చేసి కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాలు ఇచ్చిన క్రమంలో ప్రముఖుల ఓట్లు తిరిగి జాబితాలో చేరాయి. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2014 ఎన్నికల్లో 10 అసెంబ్లీ నియోజకర్గాలు, రెండు పార్లమెంట్ స్థానాలకు గానూ 7 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంట్ స్థానాల్లో వైఎస్సార్సీపీ గెలుపొందింది. తాజాగా ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన తుది జాబితాలో కోవూరు, కావలి, సర్వేపల్లి నియోజకవర్గాల్లో స్వల్పంగా ఓట్లు పెరగ్గా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో వేలల్లో తగ్గిపోయాయి. దీనిపై గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేశాయి. 9 లక్షల జనాభాకు 3.33 లక్షల ఓటర్లు వాస్తవానికి నెల్లూరు నగరం, నెల్లూరురూరల్ నియోజకవర్గ పరిధిలో కలుపుకుని జనాభా 9 లక్షల పైచిలుకే ఉంటుంది. ఇది అధికారిక లెక్క. ఈ క్రమంలో 9 లక్షల జనాభా ఉంటే సగటున 60 శాతం జనాభాను ప్రామాణికంగా తీసుకుంటే 5 లక్షల ఓట్లు ఉండాలి. కానీ ఇందుకు భిన్నంగా రెండు నియోజకవర్గాల్లో కలిపి 3.33 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నారు. 2015 నాటి తుది జాబితాలో నెల్లూరు నగరంలో 2,44,563 మంది ఓటర్లు ఉండగా, 2018 మార్చి తుది జాబితాలో 1,54,920 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగిలిన 89,643 ఓట్లను తొలగించారు. అది కూడా వైఎస్సార్సీపీకి పట్టు ఉన్న డివిజన్లలోనే భారీగా ఓట్లు పోవటం గమనార్హం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 2015లో 2,62,743 ఓట్లు ఉండగా 2018 మార్చి నాటికి 1,78,503 ఓట్లు మాత్రమే ఉన్నట్లు తుది జాబితా ప్రకటించారు. ఇక్కడ 84,240 ఓట్లు తొలగించారు. జిల్లా వ్యాప్తంగా గత ఏడాది నుంచి ఓటర్ల నమోదు, తొలగింపు ప్రక్రియ నిర్వహించి ఈ ఏడాది మార్చి నాటికి తుది జాబితా ప్రకటించారు. ఈ క్రమంలో బూత్‌లెవల్ ఆఫీసర్లకు సమగ్ర అవగాహన లేకపోవటం, నగరంలో కొన్ని డోర్ నంబర్లు చిరునామాలు సక్రమంగా లేక గందరగోళంగా ఉండటం, అద్దె ఇల్లు మారే వారు ఉండటం తదితర కారణాలతో భారీగా ఓటర్లను తొలగించారు. అధికారులకు చిరునామా లభించకపోతే ఓటు గల్లంతయినట్లే. నగరంలో, రూరల్‌లో బీఎల్ఓలకు ప్రాంతాలు కేటాయించారు. బీఎల్ఓలకు కేటాయించిన ప్రాంతాలపై అవగాహన లేకపోవడంతో ఇది మా ప్రాంతం కిందకు రాదని, ఆ ప్రాంతం మా పరిధిలో లేదని ఇంటింటికి పరిశీలన సరిగా నిర్వహించలేదు. ప్రాంతాలపై అవగాహన లేని కారణంగా లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ఆధార్, ఫోన్ నంబర్లతో ఓట్ల అనుసంధానం డబుల్ ఎంట్రీలు, బోగస్ ఓట్లకు చెక్ పెట్టేందుకు ఎన్నికల కమిషన్ ప్రతి ఓటును ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసింది. ఈ ప్రక్రియతో వీటికి చె క్ పెట్టే అవకాశం ఉంది. అడ్రస్‌ల మార్పులతో ఓట్ల ను తొలగిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ఓట్లను ఆధార్, ఫోన్ నంబర్లతో అనుసంధానం చేసినప్పుడు అందులోనే ఫోన్ నంబర్లు ఉంటాయి. అడ్రస్‌లు మారినప్పుడు ఆ ఓటును ఎక్కడికి మార్పు చేయాలనేది బీఎల్ఓలు గుర్తించి, మార్పులు చేర్పులు చేయొచ్చు. ఇందుకు భిన్నంగా అడ్రస్ మారితే.. ఓట్లు అడ్రస్ లేకుండా తొలగిస్తున్నారు. టార్గెట్ వైఎస్సార్ సీపీ కక్ష కట్టి తొలగిస్తున్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుల ఓట్లను కక్ష కట్టి తొలగించారు. గడిచిన కాలంలో ఎన్నడూ లేని విధంగా మా నియోజకవర్గంలో 84 వేల ఓట్లు తొలగించారు. ఇది దేనికి సంకేతం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి నీచ రాజకీయాలు సరికావు. అధికారులు మరోసారి పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించాలి. నియోజకవర్గంలోని ఓటర్లు అందరూ కూడా ఒక్కసారి మీ ఓటు హక్కు నమోదు వివరాలను సరిచూసుకోవాలి. – కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే జిల్లాలో భారీగా ఓట్ల తొలగింపు రాజకీయాలు సరికాదు ఓటు అనేది ప్రజాస్వామ్యం ద్వారా 18 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికీ లభించే హక్కు. దానిని కూడా రాజకీయం చేసి భారీగా ఓట్లు తొలగించటం దారుణం. 2014 ఎన్నికల సమయంలో నగర నియోజకవర్గంలో 2.41 లక్షల ఓట్లు ఉంటే ఈ ఏడాది మార్చిలో ప్రకటించిన జాబితాలో 1.54 లక్షలు ఉన్నాయి. మా నియోజకవర్గంలో అత్యధికంగా 89 వేల పైచిలుకు ఓట్లు తొలగించారు. ముఖ్యంగా పార్టీకి బలం ఉన్న డివిజన్లలో ఓట్లు తొలగించారు. దీనిపై పోరాటం చేస్తాం. – డాక్టర్ పి.అనిల్ కుమార్‌యాదవ్, నగర ఎమ్మెల్యే ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం గ్రామాల్లో లేని వారు, డబుల్ ఎంట్రీలు ఉన్న ఓట్లు తొలగించడం జరిగింది. ఓటు నమోదుకు త్వరలో అవకాశం కల్పిస్తాం. అర్హులైన వారి ఓట్లు నమోదు చేస్తాం. 18 ఏళ్లు నిండిన అందరు ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెలలో ఓటర్ల జాబితా ప్రచురిస్తాం. అ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత నుంచి ఓటు నమోదు చేపడతాం. ఓటు హక్కు కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. లేదా బీఎల్ఓ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటు హక్కు నమోదు ప్రక్రియ నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ప్రజలందరూ ఓటర్ల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో పరిశీలించుకుని లేకపోతే దరఖాస్తులు చేసుకోవచ్చు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకుంటాం. – నాగేశ్వరరావు, డీఆర్ఓ -
అవస్థలెన్నో...!
తహశీల్దార్ కార్యాలయం... ఇక్కడికి నిత్యం వందల సంఖ్యలో అర్జీ దారులు వస్తుంటారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కాళ్లరిగేలా తిరిగే వారు కొందరైతే....తన సమస్య ఎలా పరిష్కారమవుతుందో తెలియక సిబ్బంది కాళ్లావేళ్లా పడేవారు మరికొందరు. అందులోనూ జిల్లా కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం పరిస్థితి అయితే మరి చెప్పనక్కరలేదు. నిత్యం పట్టాదారు పాసుపుస్తకాలు, రేషన్ కార్డులు, మీ సేవలో సర్టిఫికెట్లకు అప్రూవల్, భూముల వివాదాలు , రేషన్ కార్డులో పేర్ల నమోదు, మరణ ధ్రువీకరణ పత్రాలు అన్నింటికీ ఇక్కడికే రావాలి. సిబ్బంది రేపు రా.., మాపు రా.. అని పలుమార్లు తిప్పుతున్నా... పనైతే చాలురా భగవంతుడా అంటూ తిరుగుతూనే ఉంటారు. ఈ అవస్థలను పరిష్కరించేందుకు, ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు స్వయంగా ఆర్డీఓ జే. వెంకటరావు రంగంలోకి దిగారు. సాక్షి వీఐపీ రిపోర్టర్‌గా మారారు. తహశీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు వచ్చిన సందర్శకులను ప్రశ్నించారు. వారి సమస్యలు అడిగి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావును ఆదేశించారు. అంతే కాకుండా రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో వేచి ఉన్న వివిధ కోర్టు కేసుల కక్షిదారులను ప్రశ్నించి వారి కేసుల విచారణకు, సత్వర పరిష్కారానికి చొరవ చూపించారు. శనివారం సందర్శకులతో ఆర్డీఓ సంభాషణ ఇలా సాగింది... పింఛన్లు, పట్టాదారు పాసు పుస్తకాలు, రేషన్‌కార్డులు, గ్యాస్కనెక్షన్ ఇలా పలు సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు గ్రామ కంఠం భూముల రిజిస్ట్రేషన్, ధ్రువీకరణ పత్రాల జారీ ఇలా అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాను. పింఛన్లు పార్టీ పరంగా నిలిపివేయడం ఉండదు, తగిన ఆధారులు చూపితే అర్హులందరికీ తప్పని సరిగా పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటాం. స్థానిక తహశీల్దార్ కోరాడ శ్రీనివాసరావుతో చర్చించి పరిష్కారం చూపుతాను. నా దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలు వేరే అధికారులు పరిష్కరించవలసి ఉంది. వారికి సమాచారం అందజేసి ఆ సమస్యలకు పరిష్కారమార్గాన్ని కనుగొంటాం. ఒక వేళ ఏ కారణం చేతనైనా సమస్య పరిష్కారం కాకపోతే వెంటనే ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి నన్ను కలవచ్చు. ఆర్డీఓ: మీ పేరేంటి..? సందర్శకుడు: నా పేరు పతివాడ రామారావు. మాది 24వ వార్డు ఆర్డీఓ : ఎందుకొచ్చారు..?నీ సమస్య ఏమిటి..? పతివాడ రామారావు: నాకు వృద్ధాప్య పింఛను వచ్చేది. రెండు వందల నుంచి వెయ్యి రూపాయలకు పెన్షన్ పెంచాక అసలు రావడం లేదు. పార్టీ ప్రకారంగా నా పెన్షన్ తొలగించారు. ఆర్డీఓ: అలాంటిదేమీ ఉండదు. అర్హత ఉంటే తప్పనిసరిగా పింఛను వచ్చేలా సిఫార్సు చేస్తాం. పతివాడ రామారావు: నాకు వయస్సు ధ్రువీకరణ పత్రాలన్నీ ఉన్నాయి. రేషన్ కార్డులో తప్పులున్నాయన్న సాకుతో పింఛను తొలగించారు. ఆర్డీఓ : మీ దరఖాస్తు, అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వండి. మీ ఇంటికి వచ్చి విచారణ చేసి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం. పతివాడ రామారావు: కృతజ్ఙతలు సార్! ఆర్డీఓ : మీ పేరేంటి? ఏంటి మీ సమస్య! సందర్శకురాలు: అయ్యా! నా పేరు మొండి కామేశ్వరి. నాకు వితంతువు పింఛను ఇవ్వడం లేదు. ఆర్డీఓ: ఎందుక పింఛన్ నిలిపేశారు ? కామేశ్వరి: భర్త మరణ ధ్రువీకరణ పత్రం తెమ్మంటున్నారు. ఎన్నో ఏళ్ల కిందట చనిపోయిన భర్త ధ్రువీకరణ పత్రాన్ని ఇప్పుడెలా తెచ్చేది.? ఆర్డీఓ: మరేం పర్వాలేదు. నీ అడ్రస్‌కు తహశీల్దార్ వ స్తారు. అక్కడ విచారణ చేసి మీకు ధ్రువీకరణ పత్రం ఇస్తారు. మీరు ఇంటివద్దే ఉండండి. కామేశ్వరి: నేను ఇంటి వద్దనే ఎలా ఉంటాను? పొలం పనికి వెళ్లిపోతాను. ఎన్ని సార్లు వచ్చినా నాకు పిం ఛను ఇవ్వడం లేదు. ఆర్డీఓ: తప్పనిసరిగా మీకు పింఛను ఇస్తారు ఆర్డీఓ: మీ పేరు? సందర్శకుడు: నా పేరు సూర్యనారాయణ. మాది బొంకుల దిబ్బ. ఆర్డీఓ: మీ సమస్య ఏంటి ? సూర్యనారాయణ: నా భార్య పేరున గ్యాస్ కనెక్షన్ ఉంది. నా భార్య ఇప్పుడు లేదు. నాకు గ్యాస్ కనెక్షన్ కావాలి. ఆర్డీఓ: ప్రస్తుతం దీపం గ్యాస్ కనెన్షన్లు డ్వాక్రామహిళల పేరున ఇస్తున్నారు. మీ పేరున ఇవ్వరు. మీ పేరున దరఖాస్తు చేసుకుంటే ఉన్నతాధికారులను సం ప్రదించి గ్యాస్ కనెక్షన్ ఇవ్వవచ్చే లేదో పరిశీలిస్తాం. లేకుంటే మీరు ప్రైవేటుగా గ్యాస్ కనెక్షన్‌ను కొనుగోలు చేసుకోవాలి. ఆర్డీఓ: మీ పేరేంటి? ఎందుకొచ్చావు? సందర్శకుడు: నా పేరు అప్పల రామయ్య. నా రేషన్ కార్డులో అప్పస్వామి, ఆధార్‌కార్డులో అప్పలరామ య్య అని కరెక్ట్‌గా పడింది. అయితే రేషన్ కార్డులో పే రు తప్పుగా పడిందని విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం లేదు. పేరు మార్పించేందుకు వచ్చాను. ఆర్డీఓ: పక్కనే తహశీల్దార్‌తో... మీరు ఈ అడ్రస్‌కు వెళ్లి విచారణ చేయండి! రెండు పేర్లూ ఒకరివే అయితే ఏ పేరు ఖరారు చేయాలో నిర్ణయించి ధ్రువీకరణ పత్రం ఇచ్చేయండి! అప్పలరామయ్య: వస్తానయ్యా! ఆర్డీఓ: మీ సమస్య ఏంటి ? సందర్శకుడు: సార్! నా పేరు మీసాల శంకరరావు. మేం గ్రామ కంఠమని తెలియక ఓ ఇల్లు కొన్నాం. దా నిని రిజిస్ట్రేషన్ చేయడం కుదరదన్నారు. ఆర్డీఓ: ఏవేని ఆస్తులు, భూములు కొన్నప్పుడు అవి ఎవరి పేరున ఉన్నాయో ముందుగా ఒకటికి రెండుసా ర్లు విచారించి కొనుగోలు చేయాలి. అనంతరం దా నిని వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీసాల శంకరరావు: ఇటీవల గ్రామకంఠం భూముల ను కూడా రిజిస్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఇచ్చారని పేపర్లో చదివాం సార్ ! ఆర్డీఓ: అవును..! జీఓ నంబర్ 100 ను రద్దు చేశారని ప్రకటనలు వచ్చాయి. కానీ దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఇంకా రాలేదు. వస్తే అమలు చేస్తాం. ఆర్డీఓ: మీ పేరేంటి? ఎందుకొచ్చారు? సందర్శకుడు: నా పేరు అడపా నారాయణరావు. రేషన్ కార్డులో పేరు మార్పు కోసం వచ్చాను. ఆర్డీఓ: ఏంటి సమస్య? నారాయణరావు: రేషన్ కార్డులో పేరు మార్పు కోసం రెండు నెలలుగా తిరుగుతున్నాను. ఇక్కడకొస్తే పరి ష్కారం కావడం లేదు. ఆర్డీఓ: తహశీల్దార్గారూ! ఏమిటీ సమస్య..? తహశీల్దార్ శ్రీనివాసరావు: సార్! రేషన్ కార్డుల్లో స భ్యుల పేర్ల చేర్పులో కొన్ని సాంకేతిక సమస్యలున్నా యి. వాటిపై స్పష్టత రావాల్సి ఉంది. ఆర్డీఓ: కేఆర్సీ డిప్యూటీ కలెక్టర్ శ్రీలత గారిని అడిగి పరిష్కారం కనుగొనండి! ఇతని సమస్యను పరిష్కరించి చేర్పులకు అవకాశమివ్వండి! నారాయణ రావు: థ్యాంక్యూ సార్ ఆర్డీఓ: మీరెవరు? ఎందుకొచ్చారు? సందర్శకుడు: నా పేరు పకీర్ రావు సార్! నేను తోటపాలెంలో ఉంటున్నాను. నాకు ఓటు హక్కు స్థల మార్పిడికోసం వచ్చాను. ఆర్డీఓ: దీనికి దరఖాస్తు చేశారా? ఫకీర్రావు: ఫారం 8లో దరఖాస్తు చేశాను. ఆర్డీఓ: ఒకే నియోజకవర్గంలో ట్రాన్స్ఫర్ కావాలంటే ఫారం 8 కాదు. ఫారం 8ఏ లో దరఖాస్తు చేయాలి. దీనికి సంబంధించి మరో సారి దరఖాస్తు చేయండి. ఇంకేమయినా సమస్యలున్నాయా? ఫకీర్ రావు: ఓటరు నమోదు శిబిరాలను దూరంగా పెడుతున్నారు. శిబిరాలు ఎక్కడున్నాయో కూడా చా లా మందికి తెలియడం లేదు. ఆర్డీఓ: ప్రతీ కేంద్రంలో బూత్‌లెవెల్ అధికారి ఉండే విధంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించాం. మీరు ఆన్‌లైన్‌లోనూ నిత్యం దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగైతే మీరిచ్చిన అడ్రసుకు బృందం వచ్చి ధ్రువీకరించుకుంటుంది. అనంతరం మీకు ఓటరు కార్డు ఇస్తారు. ఆర్డీఓ: మీరెవరు? ఎందుకొచ్చారు.? సందర్శకుడు: అయ్యా! నాపేరు అప్పారావు. పట్టణంలోని గ్యాస్ ఏజెన్సీలు ఆధార్ నంబర్‌లేని గ్యాస్ కనెక్షన్ మార్పిడి కోసం అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలి. ఆర్డీఓ : తహశీల్దార్ గారూ మీరు ఈ విషయమై పరి శీలన చేసి చర్యలు తీసుకోండి! ఏమ్మా..? మీరెందుకు వచ్చారు. ఏ కాలనీ మీది? సందర్శకురాలు: మాది వైఎస్సార్ నగర్ కాలనీ. నా పేరు జగదీశ్వరి.. ఆర్డీఓ: సమస్య ఏమైనా ఉందా? జగదీశ్వరి: సార్! మా కాలనీలో వీధిలైట్లు వెలగడం లేదు. రహదారులు కూడా సరిగా లేవు. ఆర్డీఓ: దీనిపై మున్సిపల్ కమిషనర్‌తో మాట్లాడాలి. ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు? మీ పేరేటి? సందర్శకుడు: అయ్యా నాపేరు పాసి అప్పారావు. మా అమ్మ ఆదిలక్ష్మి డెత్ సర్టిఫికెట్ కోసం వచ్చాను సార్! ఆర్డీఓ:ఏమైంది.? తహశీల్దార్ : విచారణలో ఉంది. ఆర్డీఓ: నీ పేరంటయ్యా? ఎందుకొచ్చావు? సందర్శకుడు: నా పేరు కె. రాములు బాబుగారూ! నేను వీటీ అగ్రహారం తలయారీని. ఆర్డీఓ: సమస్య ఏమిటీ? రాములు: మూడు నెలలుగా జీతాల్లేవు బాబూ! ఆర్డీఓ: మీ వేతనాలు పెరిగాక బడ్జెట్ రూపంలో ఇస్తున్నారు. నిన్ననే చూశాను. మీ బడ్జెట్ వచ్చింది. రాములు : అయ్యా! మూడు నెలలు జీతాల్లేకపోతే మే మెలా బతకాలి? బిల్లు గుమస్తా పెట్టడం లేదు. ఆర్డీఓ: నీకేం పరవాలేదు. బిల్లు గుమస్తా తప్పు లేదు. జీతాలు వచ్చేశాయి. ఇచ్చేస్తాం. ఆర్డీఓ కార్యాలయంలో.... ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు. ? మీపేరు? సందర్శకుడు: నా పేరు పూసపాటి వెంకటపతిరాజు. మాది డెంకాడ. పట్టాదారు పాసు పుస్తకాల కోసం వ చ్చాను. మా అన్నదమ్ములతో పాటు నాకు కూడా వా టా వస్తుంది. ఆ వాటా పుస్తకాలు ఇవ్వాలి. ఆర్డీఓ: అంటే మీరు కోర్టు పనిమీద వచ్చారా? వెంకటపతిరాజు: అవును సార్! ఆర్డీఓ: మీరు కూర్చోండి వాయిదాకు పిలుస్తాం. విచారణ చేస్తాను. ఆర్డీఓ: మీరెందుకు వచ్చారు? ( ఓ బృందంతో..) సందర్శకుల బృందం: అయ్యా! మేం గరివిడి ఫేకర్ కార్మికులం. మా సమస్య కోర్టులో ఉంది. ఆర్డీఓ: మీ కేసు కూడా ఈ రోజే విచారిస్తాం. ఆర్డీఓ: మీది ఏ ఊరమ్మా? ఎందుకొచ్చావు? సందర్శకురాలు: అయ్యా ! నాపేరు వల్లి బంగారమ్మ మాది కోడూరు గ్రామం. ఆర్డీఓ: ఏంటి సమస్య? బంగారమ్మ: అయ్యా! 30 ఏళ్లుగా ఉన్న నా భూమి వేరొకరి పేరున ఉన్నది. అందుకే వచ్చాను. ఆర్డీఓ: మీ అందరి కేసులూ విచారిస్తాం. సత్వర న్యా యం అందిస్తాం. -
సాక్షి ఆసరా
సమస్యల పరిష్కారమేలక్ష్యంగా ‘సాక్షి జనపథం’ గాజు కళ్లు.. ముడుతలు పడిన ఒళ్లు... 80 ఏళ్ల వయసులో ఆసరాకోసం అల్లాడుతున్న అవ్వాతాతలకు... ‘సాక్షి’ ఆసరానిచ్చింది. బుధవారం మంచిర్యాల పట్టణంలోని మారుమూల ప్రాంతమైన రంగపేటలో ‘సాక్షిజనపథం’ కార్యక్రమాన్ని నిర్వహించింది. హాజరైన ఎమ్మెల్యే దివాకర్‌రావు అప్పటికప్పుడు ఆరుగురు లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేయించారు. దీంతో లబ్ధిదారుల్లో ఆనందం మిన్నంటింది. సాక్షి, మంచిర్యాల/మంచిర్యాల టౌన్/మంచిర్యాల రూరల్ : ‘బాంఛెన్..! నా పెనిమిటి సచ్చిపోయి పన్నెండేళ్లు దాటినయ్... గిన్నేళ్లు ఎంత మొత్తుకున్నా సార్లు నాకు ‘వితంతు’ పింఛన్ ఇయ్యలే. నన్ను పట్టించునేటోళ్లు లేరు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తలే. మీరు దేవుళ్ల మా వాడకొచ్చిండ్రు. నాకు న్యాయం చేయుండ్రి..’ అం టూ అంతులేని ఆవేదన వెల్లబుచ్చిన రేఖల పోశక్కకు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అప్పటికప్పుడే పెన్షన్ మంజూరు చేశారు. ఏళ్ల నుంచి పెన్షన్ పొందని వితంతు.. వికలాంగు లు.. వృద్ధులు ఆరుగురికి కొత్తగా పెన్షన్లు మం జూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంచి ర్యాల మండలం రంగపేట గ్రామంలో ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన జనపథం కార్యక్రమంలో పింఛన్ లబ్ధిదారులు పాల్గొని సమస్య లు విన్నవించారు. కార్యక్రమం గురించి విష యం తెలియగానే బాధిత పెన్షన్‌దారులు పెద్దమొత్తంలో అక్కడికి చేరుకున్నారు. వీరిలో 17 మంది పెన్షన్లు రాలేదని చెప్పగా.. తాజా జాబితా చూసిన అధికారులు 11 మందికి పెన్షన్లు మంజూరైనట్లు ప్రకటించారు. త్వరలోనే పెన్షన్ డబ్బులు అంద జేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఆరుగురికి ఎమ్మెల్యే దివాకర్ చొరవతో పెన్షన మంజూరయ్యింది. ‘సాక్షి’ నిర్వహించిన కార్యక్రమంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ‘ఏళ్ల నుంచి పరిష్కారం కాని మా సమస్య ‘సాక్షి’ రావడంతో తీరింది’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు. సాక్షికే చెల్లింది.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు మాట్లాడుతూ పండుటాకులకు వచ్చేదం తా పండుగ రోజులేనని, ప్రతి అవ్వకు, తాతకు, భర్తను కోల్పోయిన ఆడపడుచులకు, అంగవైకల్యంతో బాధపడుతున్న వారందరికీ తెలంగాణ రాష్ట్రంలో ‘ఆసరా’ లభిస్తుందని భరోసా ఇచ్చా రు. వాస్తవాలను వెలికి తీసి ప్రజలను చైతన్యపరుస్తున్న ‘సాక్షి’ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించ డం అభినందనీయమని ప్రశంసించారు. ‘సాక్షి’ నిర్వహించిన ‘జనపథం’ పెన్షన్రాదనే ఆందోళన చెందుతున్న వారిలో ఆశ కల్పించిందని ఆయన చెప్పారు. ‘ఈ కార్యక్రమంలో నాతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులనూ పిలవడంతో వెంటనే అర్హులైన పలువురికి న్యాయం చేయగలిగా’ అని సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వమూ అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలనే కృతనిశ్చయంతో ఉందని, ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఎవరూ ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మామిడి శెట్టి వసుంధర, ైవె స్‌చైర్మన్ నల్ల శంకర్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పెంట రాజయ్య, కౌన్సిలర్ పల్ల రాజన్న, కో-ఆప్షన్ సభ్యుడు తోట తిరుపతి పాల్గొన్నారు. పింఛన్ జాబితాలో పేర్లు నమోదు.. రంగపేట 27వ వార్డులోని 14వ బ్లాక్‌లో ఆసరా లేక అల్లాడుత్ను పండుటాకులకు ‘సాక్షి’ జనపథం ఊతకర్ర అయ్యింది. సాంకేతిక సమస్యతో అర్హత లిస్టు నుంచి తొలగించిన ఇద్దరు వృద్ధులు, ఇద్దరు వితంతువులు, ఇద్దరు వికలాంగులు మొత్తంగా ఆరుగురి పేర్లను మంచిర్యాల ఎమ్మెల్యేల దివాకర్ రావు స్థానిక మున్సిపల్ అధికారులతో మాట్లాడి జాబితాలో నమోదు చేయించారు. గతంలో కంటే ఎక్కువే.. రంగపేటలో మొత్తం 300 మంది పింఛన్ల కో సం దరఖాస్తు చేసుకున్నారు. ఒకే ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే వారిలో భర్తకు తొలగించి, భా ర్యకు మాత్రమే వృద్ధాప్య పింఛన్ అందించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామాల్లో రూ. 1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు పైగా ఆదాయం ఉన్నా, ఏడున్నర ఎకరాల మె ట్టభూమి, మూడున్నర ఎకరాల తరి భూమి ఉ న్నవారిని కూడా ప్రభుత్వం ఫించను మంజూ రుకు పరిగణలోకి తీసుకోలేదు. మొత్తం 300 మందికి గాను 199 మంది తొలి జాబితాకు అర్హత సాధించారు. అధికారులు మంగళవారం వరకు ఇచ్చిన తుది జాబితాలో మరో 40 మంది అర్హులుగా తేలారు. మరో ఆరుగురిని అప్పటికప్పుడే తుది జాబితాలో చేర్చారు. దీంతో మొత్తంగా 245 మంది అక్కడ అర్హులుగా గుర్తించారు. మరో పది మంది పింఛన్లకు అర్హులైనా.. ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో వారి వివరాలను కూడా జనపథంలో భాగంగా అధికారులు సేకరించారు. వారికి పంఛన్ అందేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. -
నిరుద్యోగులకు చుక్కలు
నిడదవోలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రాలు నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. శాశ్వత కుల, స్థిరనివాస, పుట్టిన ప్రదేశం ధ్రువీకరణ పత్రాలలో ఖాళీలను నక్షత్రాలతో పూరించడంతో రక్షణ శాఖలో ఉద్యోగాల కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులను ఆ శాఖ బుట్టదాఖలా చేస్తోంది. దీంతో నిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. బడిలో చేరింది మొదలుకుని ఉన్నతవిద్యను అభ్యసించాలన్నా, ఉద్యోగాలను పొందాలన్నా ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం అవసరం. వీటికోసం పదేపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమయాన్ని, వ్యయాన్ని నివారించేందుకుగాను ప్రభుత్వం శాశ్వత ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తోంది. గతంలో వీటిని ప్రభుత్వ అధికారులే లబ్ధిదారులకు నేరుగా అందించగా ప్రస్తుతం మీ సేవ ద్వారా అందిస్తున్నారు. 2012కి ముందు ప్రభుత్వం జారీచేసిన ధ్రువీకరణ పత్రాలలో అన్ని విభాగాలను అక్షరాలతో పూరించి లబ్ధిదారులకు అందించేవారు. 2013లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నూతన నిబంధనలను అనుసరించి ధ్రువీకరణ పత్రాల్లో అక్షరాలకు బదులుగా నక్షత్రాలు దర్శనమిస్తున్నాయి. రక్షణశాఖలైన ఆర్మీ, నేవీ, సీఆర్పీఎఫ్ వంటి విభాగాలలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు దరఖాస్తుతోపాటు జతచేసిన ఈ ధ్రువీకరణ పత్రాల్లో నక్షత్రాలు ఉండడంతో ఆ శాఖ నిరాకరిస్తుంది. నక్షత్రాలకు బదులుగా అక్షరాలు ఉండాల్సిందేనని చెబుతోంది. దీంతో ఉద్యోగావకాశాలను కోల్పోతున్నామని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్షత్రాలు లేకుండా పూర్తిస్థాయిలో అక్షరాలతో పూరించిన ధ్రువీకరణ పత్రాలను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తహసిల్దార్ పెంటపాటి శ్రీనివాసరావును వివరణ ఇస్తూ పూర్తిస్థాయి సమాచారం అందించకపోవడం వల్లే నిబంధనలకు అనుగుణంగా నక్షత్రాలతో నింపిన ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయన్నారు. పూర్తిస్థాయి సమాచారం నిర్ధరణకు నకళ్లను జతపరిస్తే అక్షరాలతో పూరించిన ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలోనే ధ్రువీకరణ పత్రం అవసరాన్ని తెలిపినట్లయితే దానికి అనుగుణంగానే పత్రాలను జారీచేయడం జరుగుతుందని చెప్పారు.