నిరుద్యోగులకు చుక్కలు
Published Fri, Jan 3 2014 3:57 AM | Last Updated on Sat, Sep 2 2017 2:13 AM
నిడదవోలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ధ్రువీకరణ పత్రాలు నిరుద్యోగులకు చుక్కలు చూపిస్తున్నాయి. శాశ్వత కుల, స్థిరనివాస, పుట్టిన ప్రదేశం ధ్రువీకరణ పత్రాలలో ఖాళీలను నక్షత్రాలతో పూరించడంతో రక్షణ శాఖలో ఉద్యోగాల కోసం అభ్యర్థులు చేసుకున్న దరఖాస్తులను ఆ శాఖ బుట్టదాఖలా చేస్తోంది. దీంతో నిరుద్యోగులు గగ్గోలు పెడుతున్నారు. బడిలో చేరింది మొదలుకుని ఉన్నతవిద్యను అభ్యసించాలన్నా, ఉద్యోగాలను పొందాలన్నా ప్రభుత్వ ధ్రువీకరణ పత్రం అవసరం. వీటికోసం పదేపదే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సమయాన్ని, వ్యయాన్ని నివారించేందుకుగాను ప్రభుత్వం శాశ్వత ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తోంది. గతంలో వీటిని ప్రభుత్వ అధికారులే లబ్ధిదారులకు నేరుగా అందించగా ప్రస్తుతం మీ సేవ ద్వారా అందిస్తున్నారు. 2012కి ముందు ప్రభుత్వం జారీచేసిన ధ్రువీకరణ పత్రాలలో అన్ని విభాగాలను అక్షరాలతో పూరించి లబ్ధిదారులకు అందించేవారు. 2013లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన నూతన నిబంధనలను అనుసరించి ధ్రువీకరణ పత్రాల్లో అక్షరాలకు బదులుగా నక్షత్రాలు దర్శనమిస్తున్నాయి. రక్షణశాఖలైన ఆర్మీ, నేవీ, సీఆర్‌పీఎఫ్ వంటి విభాగాలలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు దరఖాస్తుతోపాటు జతచేసిన ఈ ధ్రువీకరణ పత్రాల్లో నక్షత్రాలు ఉండడంతో ఆ శాఖ నిరాకరిస్తుంది.
నక్షత్రాలకు బదులుగా అక్షరాలు ఉండాల్సిందేనని చెబుతోంది. దీంతో ఉద్యోగావకాశాలను కోల్పోతున్నామని పలువురు నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నక్షత్రాలు లేకుండా పూర్తిస్థాయిలో అక్షరాలతో పూరించిన ధ్రువీకరణ పత్రాలను అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. దీనిపై తహసిల్దార్ పెంటపాటి శ్రీనివాసరావును వివరణ ఇస్తూ పూర్తిస్థాయి సమాచారం అందించకపోవడం వల్లే నిబంధనలకు అనుగుణంగా నక్షత్రాలతో నింపిన ధ్రువీకరణ పత్రాలు జారీ అవుతున్నాయన్నారు. పూర్తిస్థాయి సమాచారం నిర్ధరణకు నకళ్లను జతపరిస్తే అక్షరాలతో పూరించిన ధ్రువీకరణ పత్రాలను జారీ చేస్తామన్నారు. దరఖాస్తు చేసుకునే సమయంలోనే ధ్రువీకరణ పత్రం అవసరాన్ని తెలిపినట్లయితే దానికి అనుగుణంగానే పత్రాలను జారీచేయడం జరుగుతుందని చెప్పారు.
Advertisement