ఉద్యోగాల పేరుతో సైబర్ వల
లింక్‌లను క్లిక్ చేస్తే అంతే సంగతులు
వివిధ చార్జీల పేరు డబ్బు వసూళ్లు
బాధితుల్లో చదువుకునే వారే ఎక్కువ
పార్ట్‌టైం ఉద్యోగాల పేరుతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో నిరుద్యోగులు పెరగడంతో వారిని లక్ష్యంగా చేసుకుంటూ నిండాముంచుతున్నారు. ఇంట్లో కూర్చొని ఉద్యోగం చేయొచ్చు.. పార్ట్‌టైమ్ జాబ్ అయినా మంచి జీతం వస్తుందని నమ్మిస్తూ నట్టేట ముంచుతున్నారు.
రామగిరి మండలం గరిమేకపల్లికి చెందిన 29 ఏళ్ల నిరుద్యోగి ఉద్యోగాల వేటలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ‘పార్ట్‌టైమ్ ఉద్యోగం’ పేరుతో వచ్చిన ఆన్‌లైన్ లింక్ క్లిక్ చేశాడు. ఫార్మాలిటీ ప్రకారం పదే పదే నగదు చెల్లింపులు చేస్తూ మొత్తం రూ.80 వేలు కోల్పోయాడు. నెల రోజులుగా ఈ తతంగం జరుగుతూనే ఉంది.
అప్రూవల్ వస్తుందని.. రిజి్రస్టేషన్, వెరిఫికేషన్.. ఇలా పలు కారణాలతో డబ్బులు తీసుకున్నారు. నెల రోజులు గడిచినా ఉద్యోగం మాత్రం రాలేదు. తర్వాత అంతకు ముందు టచ్‌లోకి వచ్చిన సెల్‌ఫోన్ నంబర్లన్నీ స్విచాఫ్ వచ్చాయి. దీంతో మోసపోయినట్లు తెలుసుకుని లబోదిబోమంటున్నాడు.
ధర్మవరం మండలం రేగాటిపల్లికి చెందిన ఓ బీటెక్ విద్యార్థిని ఇంటి వద్దనే ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతో సామాజిక మాధ్యమాల ద్వారా ఉద్యోగం వెతుకుతూ.. సైబర్ నేరగాళ్ల వలకు చిక్కింది. ఫొటోలు, మార్కుల జాబితాలు పంపింది. ఆ తర్వాత రూ.20 వేలు అడ్వాన్స్‌గా కూడా ఇచ్చింది. అయితే ఆ తర్వాత ఉద్యోగం ఇస్తున్నట్లు చెప్పారు. కేవలం రెండు నెలల పాటు నెలకు రూ.15 వేలు చొప్పున జీతం ఇచ్చారు. ఆ తర్వాత ప్రమోషన్ ఇస్తామని మరో రూ.50 వేలు తీసుకుని ఫోన్ స్విచాఫ్ చేసుకున్నారు.
సాక్షి, పుట్టపర్తి: కష్టపడకుండా డబ్బులు రావు. అలా వచ్చినా నిలబడవు.. ఈ విషయం తెలియక చాలా మంది సైబర్ నేరగాళ్ల వలలో చిక్కి అప్పులు చేసి మరీ డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అమాయకులనే లక్ష్యంగా చేసుకుని గూగుల్ లింక్ క్లిక్ చేస్తే ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉంటాయని నమ్మిస్తూ వాట్సాప్, ఫేస్‌బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో లెక్క లేనన్ని లింక్‌లు నిత్యం వస్తుంటాయి.
ఏ ఒక్క లింక్ క్లిక్ చేసినా.. ఆ తర్వాత ఫోన్ మన చేతిలో ఉన్నా.. ఆపరేటింగ్ సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలు, ఫోన్ పే, గూగుల్ పే తదితర నగదు లావాదేవీల యాప్‌ల ద్వారా నగదు కాజేస్తున్నారు. పలు కోణాల్లో ప్రజలను టార్గెట్ చేస్తూ బ్యాంకు ఖాతాల్లో నగదు దోచేస్తున్నారు. రోజుకో చోట సైబర్ నేరం బయట పడుతున్నా.. బలి అవుతున్న వారి సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
తెలిసీ తెలియక సామాజిక మాధ్యమాలను వినియోగించడం తెలీక కొందరు బలి అవుతుండగా.. డబ్బుపై అత్యాశతో ఇంకొందరు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారు. ఆఖరికి కేటుగాళ్ల బారిన పడిన తర్వాత పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయితే వారిలో కూడా కొందరు బయటికి చెప్పకుండా నష్టపోయినట్లు తెలుసుకుని మౌనంగా ఉండిపోతున్నారు.
అప్రమత్తత అవసరం
సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ఉద్యోగ ప్రకటనలు చూసి ఎవరూ మోసపోవద్దు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పార్ట్ టైమ్ ఉద్యోగాల పేరుతో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి.
ఎలాంటి పరిస్థితుల్లోనూ లింక్‌లను క్లిక్ చేయకూడదు. చదువుకున్న వారే ఎక్కువగా మోసపోతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఉద్యోగ ప్రకటనలు, రీచార్జ్ ఆఫర్లు తదితర వాటిని ఎవరూ నమ్మొద్దు. – వి.రత్న, ఎస్పీ, సత్యసాయి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment