
సాక్షి, అమరావతి: ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాల జారీకి వచ్చే నెల నుంచి కొత్త విధానం అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ఆయా శాఖల ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనుంది. కుల ధ్రువీకరణ పత్రం ఒకసారి తీసుకుంటే అది శాశ్వతమని, అలాగే తాజా ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ శాఖలు, సంస్థలు లబ్ధిదారులను ఒత్తిడి చేయకూడదని, ఆరు దశల నిర్ధారణ ప్రక్రియను వినియోగించాలని ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది.
కుల ధ్రువీకరణలకు సంబంధించిన సమాచారం మొత్తాన్ని సంక్షేమ శాఖలు అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. వీటిపై మండల, జిల్లా స్థాయి అధికారులకు ఈ నెల 26వ తేదీలోపు శిక్షణ ఇవ్వాలని సూచించింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏపీ సేవ ద్వారా ఈ ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియను అమలు చేసేందుకు, విధివిధానాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడం, తల్లిదండ్రులు, తోబుట్టుల వివరాల ఆధారంగా కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేసేందుకు పౌర సరఫరాల శాఖ డేటాబేస్‌ను అనుసంధానించడం వంటి పనులన్నీ ఈ నెల 19వ తేదీకల్లా పూర్తి చేయాలని నిర్ణయించారు.
అలాగే ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీకి సంబంధించి ఆరు దశల నిర్థారణ ప్రక్రియ విధానాన్ని సంక్షేమ, ఇతర శాఖలు చేసుకునేందుకు వీలుగా గ్రామ, వార్డు సచివాలయ డేటాబేస్‌తో అనుసంధానించే ప్రక్రియను ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని షెడ్యూల్ రూపొందించారు. 30వ తేదీలోపు ఆయా శాఖల మండల, జిల్లా స్థాయి అధికారులు, అలాగే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు వేర్వేరుగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేయాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment