
న్యూఢిల్లీ: వేరే మతంలోకి మారిన దళితులకు ఎస్సీ హోదా ఇవ్వాలా వద్దా అనే విషయాన్ని తేల్చేందుకు కేంద్రం సమాయత్తమైంది. ఇందుకోసం కేంద్రప్రభుత్వం అధ్యయనం చేయనుంది. ఇందుకోసం మాజీ సీజేఐ కేజీ బాలకృష్ణన్ నేతృత్వంలో ఒక కమిషన్‌ను ఏర్పాటుచేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల్లో పేర్కొన్న మతాల్లోకి కాకుండా వేరే మతాల్లోకి మారిన వారికీ ఎస్సీ హోదా ఇవ్వొచ్చా లేదా అనే విషయాన్ని ఈ కమిషన్ తేల్చనుంది.
మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రవీందర్ కుమార్ జైన్, యునివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ సభ్యురాలు సుష్మా యాదవ్‌లతో ఈ త్రిసభ్య కమిషన్‌ను కొలువుతీరుస్తూ కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ గురువారం ఒక నోటిఫికేషన్ విడుదలచేసింది. రాజ్యాంగంలోకి 341 ఆర్టికల్ ప్రకారం గతంలో పలు సందర్భాల్లో జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను, ప్రస్తుత పరిస్థితులను కమిషన్ పరిశీలించనుంది. వేరే మతం వారికి ఎస్సీ హోదా ఇస్తే ఇప్పటికే ఎస్సీ హోదా లబ్ధిపొందుతున్న వారి ఆచారాలు, సంస్కృతి, సంప్రదాయాలు, సామాజిక వివక్ష, పేదరికం వంటి అంశాలపై ఏ మేరకు ప్రభావం పడుతుంది అనే అంశాలనూ కూలంకషంగా కమిషన్ అధ్యయనం చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment